బట్టల హ్యాంగర్/కరవాలం చరిత్ర: Handy Hangers

బట్టల షాపింగ్ కి వెళ్ళినప్పుడు అతి సాధారణంగా కనిపించే వస్తువు హ్యాంగర్.

ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, భారత్ లో తయారు చేయబడిన హ్యాంగర్ ఉండే ఆస్కారం 12% ఉందని మీకు తెలుసా!.. 

హ్యాంగర్ లు అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది కాగా మొదటి రెండు స్థానాలలో చైనా, వియాత్నాంలు ఉన్నాయి. ప్రతీ ఏడాది భారత్ సుమారు 11.1 వేల ఎగుమతులు ప్రముఖంగా అమెరిక, జర్మనీ, మరియు స్వీడన్ దేశాలకు చేస్తుంది.

ఐతే ఇంతలా మనను చుట్టేసిన ఈ హ్యాంగర్ల సృష్టికి ఎన్నో కథలు మరెన్నో మూలాలు చెప్పుకుంటారు. అందులో కొన్ని;

అమెరికా దేశం మూడవ అధ్యక్షుడు తన బట్టలని ఒక వరుసలో అమర్చుకునేందుకు గాను నేటి హ్యాంగర్ ను పోలినటువంటి పరికరం వాడేవారని వినికిడి, ఐతే దీన్ని నిరూపించడానికి పెద్దగా ఆధారాలు లేవు. కొన్ని కథనాల ప్రకారం, హ్యాంగర్ ల ఆవిష్కరణ 1869 సంవత్సరంలోని వ్యక్తి  ఒ.ఎ నార్త్ (A O North) కి చెందుతుంది. అలాగే మరికొందరు 1903 లో ఎజె పార్క్ హౌస్ దీని ఆవిష్కరణకు మూలం అని నమ్ముతారు. దాని వెనుకాల కథ క్లుప్తంగా, ఒక రోజు ఉదయం పార్క్ తన పనికి వచ్చీ రాగానే కోట్ తగిలించుకునే కొక్కాలు ఏవి ఖాళీ లేకపోవడం చూసి, చిరాకుగా పక్కన పడున్న తీగని ప్రస్తుతం వాడకంలో ఉన్న హ్యాంగర్ ఆకారంలోకి అమర్చుకొని తన కోట్ తగిలించుకున్నాడని వినికిడి.

చెక్క, ప్లాస్టిక్, కార్డ్ బోర్డ్, ట్యూబ్, ఇలా వివిధ రకాలుగా హ్యాంగర్స్ అందుబాటులో ఉన్నాయి. ఐతే పర్యావరణ కోణం దిశగా నేడు పునరుత్పత్తి/రీసైకల్ చేయబడిన హ్యాంగర్స్ వైపు దృష్టి మరులుతుంది. ఖరీదైన బట్టల కోసం సాటిన్ హ్యాంగర్లు అలాగే లగ్జరీ మరియు కస్టం/ అవసరానికి అణుగునంగా చేయబడిన వర్గంలో రకరకాల హ్యాంగర్స్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి.  

ప్రాథమికంగా చూసుకుంటే, హ్యాంగర్ అనే పరికరం మనుషుల భుజాలను పోలి ఉండి; మన బట్టలు, కోట్స్, స్కర్ట్స్ ముడత పడకుండా ఉండడానికి వాడే వస్తువు. హ్యాంగర్ల కింద భాగం ప్యాంట్స్/స్కర్ట్స్ తగిలించడానికి తయారుచేయబడింది. ఐతే మొదటి రకం హ్యాంగార్స్ లో ప్యాంట్స్/స్కర్ట్స్ వేలాడదీయడానికి అనువుగా క్లాంప్స్/బిగింపులు ఉండేవి.

20వ శతాబ్దం మొదలు నుంచి వైద్య-లాయర్ వృ త్తులలో ఉన్నవారికి హ్యాంగర్స్ యొక్క అవసరం బాగా పెరిగింది. వారి బట్టలు చక్కగా పెట్టుకోవడానికి హ్యాంగర్ లు ఒక సులభమైన పరికరం లా వారికి చిక్కాయి.

కొంత సమయంలోనే హ్యాంగర్స్ ప్రతి అవసరానికి తగట్టు రకరకాల విధాలుగా అందుబాటులోకి వచ్చాయి. సులువుగా మడత పెట్టి విహారాలకు తీసుకు వెళ్ళే వీలుగా- స్కార్ఫ్ హ్యాంగర్స్, బ్లాంకట్ హ్యంగెర్స్, టై హ్యాంగెర్స్ మొదలగు విధంగా పరిణామం చెందాయి.

మనం గమనించినట్టైతే హ్యాంగర్స్ పరిమితి కేవలం ఇంటి వరకే కాకుండా రీటైల్ (వ్యాపరాల) రంగంలో ఇంకా విస్తృతంగా ఉంది. అక్కడికే ఆగకుండా, వస్తువుల బ్రాండ్ వృద్ధి లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఈ హ్యాంగర్.       

హ్యాంగర్స్ ఉత్పత్తి సంస్థల్లో ‘మైనెట్టీ’ (Mainetti) ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ సంస్థ కథ 1950 లలో ఇటలి దేశంలో మొదలైంది. కథ సారాంశం, రోమియొ మైనెట్టి అనే ఒక తెలివైన కుర్రవాడు రేసింగ్ కారు నడిపే యజమాని దగ్గర పని చేసేవాడు. యజమాని తండ్రి, వస్త్ర రంగంలో మహా ఉద్ధండుడు మార్జొట్టో కార్పరేషన్ వ్యవస్థాపకుడు. ఆ సంస్థ రెడీ-మేడ్ సూట్ లను ఉత్పత్తి చేయడం ప్రారంభించిన రోజులవి. అందులో భాగం గానే అవి నలగకుండా ఉండడానికి గాను హ్యాంగర్ల వాడకం పెంపొందించిందా సంస్థ. చెక్కతో తయారుచేయబడిన ఆ హ్యాంగర్ల ఖరీదు, బరువు రెండు అధికంగా ఉన్న పరిస్థితిని అప్పటికి గమనిస్తూ వస్తున్న రోమియొ వాళ్ళ అన్న మారియొ. గతంలో తనకు ప్లాస్టిక్ కంపని లో ఉన్న అనుభవాన్ని మేళవించి రొమియో తో కలిసి ప్లాస్టిక్ హ్యంగర్ల తయారీని నెలకొల్పారు.

అలా మొదలైన వారి ప్రయాణం యూకే, ఫ్రాన్స్, కెనడా, మరియు నెదర్ల్యాండ్స్ వంటి దేశాలకు చేరింది. వారు గుర్తించిన అంతరం, అందించిన నాణ్యత ఆ రంగాన్నే ఒక కొత్త వెలుగు తో నింపింది. ప్రస్తుతం 6 ఖండాలు, 90 స్థానాలలో విస్తరించి, భారత్ లో కూడా ప్రముఖమైన ఉత్పత్తి కేంద్రం నెలకొల్పింది.

లోహాల వెల్డింగ్ మొదలుకుని డ్రైనేజి శుబ్రపరుచుకునే వరకు, మొక్కలు పెట్టుకునే సాధనం నుంచి పిల్లల స్కూల్ ప్రాజెక్ట్ వరకు. ఇలా బట్టల హ్యాంగర్స్ వాడకం ఏన్నో ఆవిష్కరణలకి స్థావరం అయ్యింది. మరోవైపు ఇదే హ్యాంగర్ కార్ దొంగతనాలకి, అబార్షన్ లకి ఒక ముఖ్య వస్తువు అవ్వడం భాధాకరం, ఒక సమర్ధించరాని నిజం. 

కాగా ఈ చరిత్ర పుటల్లో మన ముడత పడిన బట్టలకూ ఒక హ్యాంగర్ ఎల్ల వేళలా తోడై ఉంటుందని కోరుకుంటూ!

ఈ పూట పూర్తి పర్యావరణ స్పృహతో ఒక మంచి హ్యాంగర్ కొందామా మరి?

  • మీన (Based on a piece by Meena)

సృజనాత్మక విద్య

నేటి విద్యా-విధానాల గురించి సుదీర్ఘమైన ఆలోచన కొనసాగించగా, నాకు సార్ కెన్ రాబిన్సన్ గుర్తుకు వచ్చారు. వారి గురించి పరిచయం లేని వారి కోసం.

రాబిన్సన్ బాగా పేరు గడించిన సమకాలీనమైన(contemporary) విద్యాతత్వావేత్తల్లో ఒకరు. వారు బ్రిటన్ దేశంలో జన్మించారు. ఒక టీచర్, రచయిత మరియు నేటి విద్యా విధానల గురించి తనదైన శైలిలో ప్రసంగించగల ఒక గొప్ప వక్త. చిత్రంగా విద్య పట్ల దూరదృష్టిలో(vision) వీరికి మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఎన్నో దగ్గర పోలికలు కనిపిస్తాయి.     

రాబిన్సన్, ప్రస్తుత విద్యావిధానాల్ని వ్యతిరేకిస్తూ. విద్య ఒక పారిశ్రామిక నమూనాగా మారిన తీరు గురించి. కేవలం సరళ రేఖకి(linearity), అనుగున్యానికి(conformity) కట్టుబడి ‘బ్యాచింగ్’ (batching) పద్ధతిలో తయారయ్యే సరుకుగా అమలవుతున్న పరిస్థితుల గురించి ఎన్నో వేదికల్లో విరివిగా చర్చించటం జరిగింది. వారి మాటల్లో: “మనల్ని మనం ఈ ఫాస్ట్ ఫుడ్ (చిరుతిండి వ్యాపారాన్ని తలపించే) విద్యా నమూనాకి ఎప్పుడో అమ్ముకున్నాము. ఫాస్ట్ ఫుడ్ (చిరుతిళ్లు) మన భౌతిక దేహాల్ని ఏ విధంగా బలహీనపరుస్తుందో అదే రీతిలో ఈ ఫాస్ట్ ఫుడ్ విద్య మన ఆత్మల్ని, శక్తిని నిర్వీర్యం చేస్తుంది” అని వ్యక్తపరిచారు.

రాబిన్ పెద్ద పాఠశాలలను పిల్లలలోని సృజనాత్మకతని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, వారి ఇష్టాలకు స్పందించకుండా కేవలం ప్రమాణీకరించబడిన పరీక్షా పద్ధతుల్ని తమదైన పద్ధతుల్లో ధ్రువీకరించి, కళలు మరియు మానవీయ శాస్త్రాలకి తావు ఇవ్వకుండ, బహిరంగంగా గణితము మరియు విజ్ఞానం దిశగా నడిపించే వ్యవస్థలుగా చూస్తారు.    

అలా కాకుండా పాఠశాలల దృష్టి కేవలం పాఠ్యప్రణాళికను మెరుగుపరుచుకునే వైపే కాకుండా ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి పెంపొందించే నిపుణులుగా తయారవ్వడానికి మద్దతు ఇవ్వగలగాలని, కెన్ రాబిన్సన్ బలంగా విశ్వసిస్తారు. వ్యక్తీకరించబడిన లర్నింగ్ (personalized learning) వాతావరణం సృష్టించి చిన్న గ్రూపులుగా విద్యను అందించడం పిల్లల్లో విసుగును దూరం చేస్తుందని, అలాంటి వ్యవస్థ ఆచరణీయమైనదని, కెన్ ఖచ్చితత్వంతో చెప్తారు.

సుమారు 100 ఏళ్ళకి ముందు ఠాగూర్, మంచి ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు నిర్వచనాన్ని  ఇలా రాసారు “ఒక మంచి గురువు కేవలం విద్యార్థులు సమాచారాన్ని సేకరించి సమ్మిళితం చేసుకునే దిశగా కాకుండ పిల్లల మనుసుని జాగృతి చేసి వారు పరస్పరం స్వయం అభివృద్ధి బాటలో అడుగులేసేవైపు స్పూర్థి నింపుతారు/డు” అని గుర్తుచేసారు కెన్.

రాబిన్సన్ విద్యా విధానాల్లో సృజనాత్మకతని పెంపొందించే వాతావరణాన్ని నడిపే వ్యవస్థల్ని సృష్టించే దిశగా నడవడం తన జీవిత ధ్యేయంగా మలుచుకున్నారు. అదే విషయ జ్ఞానాన్ని పంచుతూ తన దృష్టిలో సృజనాత్మకత అంటే ఎమిటో, వారి పుస్తకం ‘క్రియేటివ్ స్కూల్స్’ లో రాయడం జరిగింది.

సృజనకు, ఊహ మూలము. మన ఇంద్రియాలకు కూడ అందని దృష్టి మన మనసులకు అందించే శక్తి ఊహలకి ఉంది.

సృజన అనేది ఆ ఊహ శక్తిని తరిచి లేపడమే. దానినే అనువర్తిత కల్పన (applied imagination) అంటారు. ఆవిష్కర్ణ అంటే కొత్త ఆలోచనల్ని అమలుచేయడం. సృజన గురించి ఏన్నో అవాస్తవాలు వ్యాపించి ఉన్నాయి. అందులో కొన్ని: ప్రత్యేకమైన వారే సృజన కలిగి ఉంటారు, సృజన కేవలం కళలకి సంబంధించిందని, మూడవది సృజనని ఎవరూ నేర్పించలేరు, నాల్గవది సృజన ఒక నిరోధించలేని ‘స్వీయ-వ్యక్తీకరణ’.

నిజం ఏమిటంటే ఈ పైన చర్చించిన వాటిలో ఏ ఒక్కటీ నిజం కాదు. సృజన మన మానవ నైజంలోని ఎన్నో శక్తులనుంచి పెంపొందుతుంది. సృజన మన జీవితంలోని ప్రతీ కోణంలో భాగం: విఙానం, కళలు, గణితం, సాంకేతికం, వంటకాలు, రాజకీయాలు, వ్యాపారం, ఇలా అన్నిటిలోను. అలాగే ఎన్నో మానవ సామర్ధ్యాలలాగనే సృజనను అలవరుచుకొని, సాన పెట్టి మెరుగుపరుచుకోవచ్చు. అలా చేయడానికి నైపుణ్యాలు, జ్ఞానం, కొత్త ఆలోచనలని ఆహ్వానించి పాండిత్యాన్ని పెంచుకోవడం అవసరం.   

సృజన కొత్త ఆలోచనలలో ఉంటుంది. అదనంగా లాభమున్నా కూడ సృజన ఎల్లపుడూ అందరికి నూతనంగా ఉండవలసిన పని లేదు, కాని తమ పనిలో నిమగ్నమైన వారికి అదితప్పనిసరి. ఒక సిద్ధాంతం, ఒక రూపకల్పన, ఒక కవిత అలా ఏదైనా కావచ్చు, సృజనా పాటివం మనం పని చేసే వాటిలో క్లిష్తమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉంటుంది.  సృజన ఎన్నో సాధారణ దశలు దాటుతుంది. కొన్ని సార్లు మనం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిస్తాము. అది ఒక క్రియాశీల ప్రక్రియలో భాగము, కొత్త పరిచయాలు, విభాగాలు, రూపకాలు, సారూప్యాల పైన ఆధారపడి ఉంటుంది.    సృజనాత్మకంగా ఉండటమంటే కేవలం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు, ఊహశక్తిని తట్టడమే కాదు. అది ఒక నిరంతర ప్రక్రియ. మెరుగుపరచడం, పరీక్షించడం, దృష్టిని కేంద్రీకరించడం అందులో అతి ముఖ్యమైన భాగాలు. ఏదైన పని నిర్వహించేటపుడు  ఒరిజినల్ ఆలోచనలు ఆ పని వెళ్ళే దిశను ముందస్తుగా ఊహించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోగలగటం సృజనలో భాగమే. సృజనకు క్రమశిక్షణ, నియంత్రణ వ్యతిరేకం కాదు. చెప్పాలంటే ఏ రంగంలో అయినా సృజనకి వాస్తవ జ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యం చాలా అవసరం.

అలాంటి సృజనను పెంపొందించడం గురువులకు కత్తి మీద సాము వంటిదే. వాస్తవానికి దానికి సృజనాత్మకమైన పని చేయడానికి కావాల్సిన విషయ జ్ఞానం, లోతుపాట్లు తెలిసుండాలి. వాస్తవికంగా సృజనను నడిపేవి రెండు ముఖ్యాంశాలు, ఒకటి ఆవిష్కరణల పట్ల తీవ్ర ఆసక్తి, రెండు చేసే పని పట్ల అభిరుచి. విద్యార్థులకి నేర్చుకోవాలనే ప్రేరణ కలిగితే వారికి వారే నైపుణ్యాలు పెంచుకునే దిశగా నడుస్తారు. అలా సాగుతున్న కొద్దీ ఆ దిశలో వారి ఆశయాలు పెంపొందుతాయి అలాగే ఆ పనిలో పాండిత్యం కూడ మెరుగుచెందుతుంది. ఈ ప్రక్రియకి నిదర్శనం ఫుట్ బాల్ క్రీడ నుంచి రసాయన శాస్త్రం వరకు ఎన్నో రంగాల్లో చూడవచ్చు. మనం గుర్తించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మనిషి జీవనం ఒక యాంత్రికమైన ప్రక్రియ కాదు. ఒక జీవక్రియ. మానవ అభివృద్ధి ఫలితాలని మనం అంచనా వేయలేము. మనం చేయగలిగిందల్లా ఒక రైతులా తమ వంతు కృషిగా అందరూ మెరుగుపడగల పరిస్థితుల్ని సృష్టించడం.

ఠాగూర్ అలాంటి కలనే ఒకటి కన్నారు, అది సాకారం కావాలని కోరుకున్నారు. దాని గురించి రాస్తూ: “విధానాలలో నిమగ్నమైపోకండి. మీలోని ఇన్స్టింక్ట్స్ ని (మీలోని సహజ భావాల్ని/గట్) మీ జీవనానికి మార్గదర్శకాలు అవ్వనివ్వండి. ఏ ఇద్దరు పిల్లలూ ఒకలా ఉండరు. అది గ్రహించి సముద్రపు దిబ్బల/రీఫ్స్ మధ్యలో ఎలా పయనిస్తామో అలాగే ప్రతి పిల్లవాడిని తరిచి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి”.

మనల్ని మలచిన ప్రతీ గురువును గుర్తు చేసుకుంటూ.

-మమత

గుడ్ గర్ల్ సిండ్రోమ్

గత కొన్ని సంవత్సరాలుగా నేను మహిళలకు సంబంధించిన ఎన్నో సదస్సులలో, సభలలో మాట్లాడాను. ఎంతో మంది యువతులకు గైడ్  గా వ్యవహరించాను. నా  టీం లో కూడా ఎంతోమంది ఆడవాళ్ళతో పనిచేసాను.

ఎక్కడ ఏ స్త్రీతో మాట్లాడినా నేను ఇచ్చే సందేశం ఒకటే “మంచి అమ్మాయిగా ఉండాల్సిన పనిలేదు” అని. ఇలా చెప్పడం వెనుక నా ఉద్దేశం ఏమిటంటే: నీ కుటుంబం, నీ సమాజం నువ్వు  ఉండాలని అనుకుంటుందో దానికి పరిమితమవ్వాల్సిన పనిలేదు; ఈ పని నీది అని ఎవరో నీ నెత్తిమీద రుద్దినంతమాత్రాన ఆ పనిని నువ్వు చేయనవసరం లేదు; అందరిపట్లా విధేయత చూపించాల్సిన అవసరం లేదు; నీకు ఏది సరైనది అని తోస్తే, ఏది నీకు మంచిది అని బలంగా అనిపిస్తే దాని కోసం పోరాడు, అవిధేయత చూపించు, ప్రశ్నించు.

అయితే ఈ విషయాన్ని నేను సరిగా వారికి అర్ధమయ్యేలా చెప్పలేకపోయాను. చాలా సందర్భాలలో ఇది ఎలా అర్ధమయ్యేదంటే నేనేదో అమ్మాయిలను చెడగొడుతున్నట్లు, ప్రతిదానికీ తిరగబడమని వారికి చెబుతున్నట్లు ఉండేది. బహుశా నేను ఇలా చెప్పకూడదేమో అని ఆలోచించడం మొదలుపెట్టాను.

అయితే “గుడ్ గర్ల్ సిండ్రోమ్” అనే పదం ఎక్కడో నా కంటపడేవరకూ ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాను. దీని గురించి మరింత లోతుగా చదవడం మొదలుపెట్టాకే ఇదేదో ఒక పదం మాత్రమే కాదనీ, ఒక పరిశోధన చేయడానికి తగిన అతిపెద్ద సబ్జెక్టు అనీ అర్ధమయ్యింది.

2011 లో బెవర్లీ ఎంగెల్స్ రాసిన “ది నైస్ గర్ల్ సిండ్రోమ్” అనే పుస్తకం ఈ పదాన్ని సరిగ్గా వివరించగలుగుతుంది. దీని అర్ధం ఏమిటో నా మాటల్లో చెప్పేబదులు ఎంగెల్స్ ఏమి చెప్పిందో చెబుతాను.

“ఒక మంచి అమ్మాయి తన గురించి తాను ఏమనుకుంటుంది అనే దానికన్నా ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారు అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. తన స్వంత భావోద్వేగాల కన్నా ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇస్తుంది”

“మంచి అమ్మాయిలు చెప్పిన మాట వింటారు. వారికి ఏది చేయమని  చెబితే అది చేస్తారు. ఎవరితో అయినా వాదన పెట్టుకునే బదులు వారు చెప్పిందేదో చేసేస్తే పోతుంది అనుకుంటారు. విధి ఎలా ఉంటే  అలా జరగనీ అనుకుంటారు. వారు నమ్మిన వాటికోసం గట్టిగా నిలబడేందుకు కూడా భయపడతారు. ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచాలి అనుకుంటారు. వారి  మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేందుకు కూడా భయపడతారు. దానితో మంచి అమ్మాయిలు ఎంతో నటించాల్సి వస్తుంది”

  • బెవర్లీ ఎంగెల్స్ 2011 లో రాసిన నైస్ గర్ల్ సిండ్రోమ్  పుస్తకం నుండి 

ఈ మంచి అమ్మాయిల లక్షణాలు ఇలా ఉంటాయి: ఇతరులు తాము ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి భిన్నంగా ఉండాలంటే భయం, తమ మనసులో ఉన్నది చెబితే ఇతరులు ఎక్కడ బాధపడతారో అనే భయం; అన్నిటిలో రాణించాలనే కోరిక; ఘర్షణలకు దూరంగా ఉండడం; నియమాలన్నిటినీ ప్రశ్నించకుండా పాటించడం. వారికి ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినా తిరస్కరించేందుకు భయపడతారు.

IWD

ఇది నిజమో కాదో ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ విధంగా మంచి అమ్మాయిలం అనిపించుకోవాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది అనిపిస్తుంది. అరవైలలో పుట్టిన నాలాంటి మహిళలం మా  వస్త్రాలు, కేశాలంకరణ విషయాలలో మా తల్లులతో దాదాపు యుద్ధాలు చేసాం; ప్రొఫెషనల్ చదువులు చదివి ఉద్యోగాలు చేసేందుకు గొంతులు పోయేలా పోట్లాడాం; ఎవరిని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే విషయాలపై కూడా యుద్ధాలే చేసాం; వైవాహిక బంధంలోనూ గౌరవాన్ని పొందేందుకు తగాదాలు పెట్టుకున్నాం. ఇవన్నీ మమ్మల్ని బలంగా మార్చాయి. అలా బలాన్ని సంపాదించుకుంటూనే మా దారులను మేము మలుచుకున్నాం.

అయితే మేము కూడా మాకన్నా ముందు తరం మహిళలు చూపించిన స్ఫూర్తినే అందిపుచ్చుకున్నాం. వారే అసలైన మార్గదర్శకులు. మొట్టమొదటి తరపు ఇంజినీర్లు, మొదటి డాక్టర్లు, పరదాలు దాటి మొదటి సారి బయటకి వచ్చిన మహిళలు, ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు, కుటుంబంతో, సమాజంతో పోరాడి మరీ తమ స్వంత దారులు ఏర్పాటు చేసుకున్న ఆ  నలభైలు,యాభైలలో పుట్టిన మా ముందు తరపు మహిళలు ఇచ్చిన స్ఫూర్తి ఇంతా అంతా కాదు. వారి ధైర్యసాహసాలతో పోలిస్తే మాకు సగం కూడా లేవు. అయినా వారు చూపించిన బాటలోనే ముందుకు సాగాము.

ఈ రోజున ఇవన్నీ అత్యంత సాధారణమైన విషయాలు కావచ్చు. ఈనాటి అమ్మాయిలు వీటికోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. మాలాగా వారికోసం వారు దృఢంగా నిలబడాల్సిన సందర్భాలు లేకపోవచ్చు. అందుకే సమాజం వారికి చూపించిన దారిలో నడవడమే తప్ప వారికంటూ కొత్త దారులు ఏర్పాటు చేసుకోవాలి అనుకునే స్ఫూర్తి ఈ తరం అమ్మాయిలలో కొరవడింది అనిపిస్తుంది. అప్పట్లో మేము కొత్త దారులలో నడిచినందుకు చెడ్డవారిమి అనిపించుకున్నాం. అయితే ఈ రోజు ఆ దారిలో నడవమనే సమాజం సూచిస్తుంది. ఆ దారులలో నడిచిన వారినే మంచివారు అంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కొత్త తరపు అమ్మాయిలు కూడా కొత్త దారులు కనుగొనాలనీ, నూతన శిఖరాలు అందుకోవాలనీ నా ఆకాంక్ష.

బహుశా ప్రతి తరం ఇలా తమ తరవాతి తరం వారిని విమర్శించడం అనేది అత్యంత పురాతనమైన విషయం కావచ్చు. అయినప్పటికీ ఇదే నా ఆకాంక్ష

–Translated by Bharathi Kode, based on a piece by Meena Raghunathan

నూలు నేసిన చరిత్ర (Fabrics for Freedom, Khadi and Beyond’)

దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఖద్దర్ కి ఉన్న విశిష్టత మనందరికి తెలిసిందే!

ఖాదీ ధరించడం కేవలం బ్రిటిషర్ల దిగుమతులని  ధిక్కరించడానికి జరిగిన  స్వేచ్చా  పోరాటం మాత్రమే కాదు. కొన్ని లక్షలమంది జీవనోపాధికి, ఆర్ధిక స్వాతంత్ర్యానికి, ఒక దృఢమైన చిహ్నం.  

దివ్య జోషి మాటల్లో: ‘ఖాదీని గాంధీజీ ఈ దేశ జాతీయవాదనికి, సమానత్వానికి మరియు స్వాలంబనకు ప్రతీకగా నిలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని పాటించి ఈ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఖాదీ పాత్ర ముఖ్యమైనదని అని వారు బలంగా విశ్వసించారు. ఒకప్పుడు పేదరికానికి మరియు వెనకబాటుతనానికి ప్రతీకగా నిలిచిన రాట్నాన్ని స్వాలంబనకు, అహింసకు చిరస్మరణీయమైన గుర్తుగా మలిచారు గాంధీజీ.’

ఐతే! స్వాతంత్ర్య సాధనలో వస్త్రాలు నూలడం-నేయడం కేంద్ర భాగమై జరిగిన పోరాటాలు భారత్ లోనే కాకుండ మరెన్నో దేశ చరిత్రలలో కనిపిస్తుంది. అలా, బ్రిటిష్ ని ఎదురిస్తూ, వస్త్రాన్ని ఆయుధంగా మలచుకున్న ఉద్యమ చరిత్రల్లో అమెరికాది కూడా ఒకటి.        

  అమెరికాతో సహా తాము పాలించిన కాలనీలను బ్రిటన్ దేశం ప్రధానంగా తమ ముడి పదార్ధాల సరఫరాదారులుగా భావించారు. పత్తి ఇతరాత్రా ముడి సరుకుని తమ దేశానికి ఎగుమతి చేసుకుని, తయారైన బట్టలను రెట్టింపు పన్నులతో మళ్ళీ అవే కాలనీలలో విక్రయించేవారు. ఈ ప్రక్రియను ధిక్కరిస్తు బ్రిటన్ కు వ్యతిరేకంగా అమెరికా కాలనీ ప్రజలు 1760-1770 మధ్య కాలంలో తమ దేశభక్తిని చాటుతూ చరఖా/రాట్నం సహయంతో, ఒక శక్తిగా కదిలి వారి వస్త్రాల్న్ని వారే తయారు చేసుకోవడం జరిగింది. విధిగా ఇదే రాట్నం 20వ శతాబ్దం భారత దేశ స్వాతంత్ర్య చరిత్రలోను కీలకమైన పాత్ర పోషించింది.

అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో కీలకంగా నిలిచిన రాట్నం/స్పిన్నింగ్ ఉద్యమాల్ని మహిళలు ముందుండి నడిపించారు. ఆ ఉద్యమానికి ఊపిరి పోస్తూ బ్రిటిష్ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి మహిళ తమ ఇళ్లలోనే నూలు నూయడం, వస్త్రాల్ని నేయడం జరిగింది. ఆ విధంగా నేసిన వస్త్రాలు ‘హోంస్పన్’ గా ప్రసిద్ధి చెందాయి. అలా హోంస్పన్ వస్త్రాలు ధరించడం దేశభక్తికి చిహ్నంగా నిలిచింది.

కొన్ని కాలనీలలో మహిళలు, సామాజిక నిరసన వ్యక్తపరుస్తూ, కలిసి రాట్నాలు ఏర్పరుచుకొని నూలే వారు. అలా ఏర్పరుచుకున్న సామూహిక ప్రదేశాలు ‘స్పిన్నింగ్ బీస్’ గా ప్రసిద్ధి చెందాయి. మార్చి 1768 లో మొదలుకొని 32 నెలల పాటు హార్ప్స్వెల్ నుంచి, మైనె నుంచి, హంటింగ్టన్, లాంగ్ ఐలండ్ వంటి కాలనీలలో విస్తృతంగా 60 స్పిన్నింగ్ మీటింగ్స్ జరుపుకున్నారని ప్రసిద్ధి.

అమెరికా సమాజంలో ఈ స్పిన్నింగ్ బీస్ సృష్టి-ప్రేరణలో, రాజకీయ అసమ్మతివాదుల సంఘం ‘డోటర్ ఆఫ్ లిబర్టీ’ కీలకమైన పాత్ర పోషించింది. ఒకవైపు బ్రిటిష్ వారు తమ దేశంలోకి దిగుమతి చేసే వస్తువులు ముఖ్యంగా టీ, బట్టలు మొదలగు వాటి సంఘ బహిష్కరణను ప్రొత్సహించడం మరోవైపు ప్రత్యామ్నయాలని గుర్తించి సొంతంగా తయారుచేసుకునే భాద్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించింది.

అమెరికాలో ధ్వనించిన తీరుగనే భారత దేశంలో కూడా స్వాతంత్ర్య సమరయోధుల ప్రచారాల్లో, ర్యాలీలలో, పిలుపులో స్పిన్నింగ్ అనేది పోరాట స్ఫూర్తి రగిలించడంలో  కేంద్ర అంశంగా నిలిచింది. హోంస్పన్ వస్త్రాలలో జరుగుతున్న ప్రతి చిన్న అభివృద్దిని, పురోగతులను పత్రికలు నివేదించేవి. అలానే స్పిన్నింగ్ పాఠశాలలు స్థాపించబడ్డాయి, వాటి ద్వారా బాగా/ఎక్కువ మొత్తాలలో నేసేవారిని గుర్తించి పురస్కారాలు అందించడం చేసేవారు. అలా ప్రేరణతో చిన్నా-పెద్దా  తేడా  లేకుండా ప్రతి ఒక్కరూ వస్త్రాలు నెయ్యడానికి ముందుకు రావడం జరిగింది, అదే విషయాన్ని గుర్తిస్తూ న్యూపొర్ట్ కి చెందిన 70 ఏళ్ళ ముసలావిడ తన జీవింతంలోనే మొదటిసారి రాట్నం తిప్పడం నేర్చుకొని వస్త్రాన్ని నేసిందని అప్పటి పత్రికలు నివేదికలు ఇచ్చాయి.

పోరాట స్ఫూర్తి ని మరింత రగిలిస్తూ 1769 సమయంలోనే ఏన్నో స్పిన్నింగ్ పోటీలు విధిగా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న సభ్యులు పోటా-పోటీగా గెలిచారని అప్పటి నివేదికలు తెలియజేసాయి.

వీటన్నిటి పర్యావసానం, అమెరికాకు బ్రిటిష్ చేసే దిగుమతులు తీవ్రంగా పడిపొయాయి, ఒక సంస్థ ప్రచూరించిన లెక్క ప్రకారం 1769 ముందు సంవత్సరంతో పోలిస్తే ఆ ఏడు దిగుమతులు 4,20,000 నుంచి 2,08,000 పౌండ్ కి పడిపోయాయి.

 ఆ విధంగా ఈ ప్రపంచంలోని ఏన్నో  దేశాల్లో ‘స్వదేశీ’ అనేది సామ్రాజ్యవాదుల నిరంకుశ పాలన పట్ల తిరుగుబాటుకు ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది.

ఇదే స్ఫూర్తి 150 ఏళ్ళ తరువాత, భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో కనిపిస్తుంది. అదే మన ఆత్మ విశ్వాసం, మనోబలం, గుర్తింపుగా నిలిచింది, నిలుస్తుంది.

-మీన

ఇలాబెన్ భట్ (1933 – 2022) 

గాంధేయ వాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, ఉమెన్ వరల్డ్ బ్యాంక్ సహ-స్థాపకురాలు, గుజరాత్  విద్యాపీఠం గౌరవాధ్యక్షురాలు, గాంధీ ఆశ్రమ ట్రస్టీ, రామన్ మెగసెసే – ది రైట్ లైవ్లీహూడ్, పద్మ విభూషణ్  వంటి ఎన్నో విలక్షణ పురస్కారాల గ్రహీత. అన్నింటికీ మించి తనదైన నిరాడంబరతకు, అసాధరణ స్ఫూర్తికి చెరగని ప్రతీక. డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసేవారికి ఎంతో సుపరిచితమైన పేరు. 

ఇలా తో ఒక్కసారి మాట్లాడిన ఎవరైనా ఇట్టే మంత్రముగ్ధులు అవుతారు. ఆమె వ్యక్తిత్వంలోని సరళత, ముక్కుసూటితనం, పని పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి ఇందుకు ప్రధాన కారణాలు. అసంఘటిత రంగంలోని మహిళల ఆర్థిక సాధికారతకై వారు చేసిన కృషి, పాటించిన నిబద్ధత ఆమెను ఆ దిశలో నడిచిన ఒక అనంతమైన తారగా ఎల్లపుడు నిలబెడతాయి. ఒక మృదుభాషి ఈ ప్రపంచంలో నింపిన వెలుగుకి తెచ్చిన మార్పుకి ఇంకో పేరే ఇలా.   

ఇలా తో సంభాషణల  సారాన్ని, వి రఘునాథన్ గారు వారి పుస్తకం “డోంట్ స్ప్రింట్ ది మారథాన్” లో చర్చించటం జరిగింది. అందులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనందరి కోసం;

Ela Bhatt

‘ఇలా తన స్కూల్లో కాని, కాలేజీలో కాని మొదటి ర్యాంకు విద్యార్థి ఏమి కాదు, ఒక 10 పర్సెంటైల్ విద్యార్థుల్లో ఒకరిగా నిలిచేవారామె. కేవలం మార్కుల కోసం చదివే మార్గంలో తనను ఎవరు నడపాలనుకొలేదు కూడా. ఇలా భాషా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఆమె తండ్రి వేసవి సెలవుల్లో చదవడానికి వివిధ రకాల పుస్తకాలు ఇష్టంగా కొనిపెట్టేవారు, వాటిని తను అంతే ఆసక్తిగా చదివేవారు. తనలో విలక్షణంగా కనిపించే విలువలు-సిద్ధాంతాలకు రూపురేఖ, కేవలం తన హైలీ ప్రిన్సిపల్డ్ నాన్న నుంచే కాకుండ అప్పుడు నెలకొన్న జాతీయవాద వాతావరణం నుంచి ఆమె గ్రహించారు. బ్రిటిష్ పాలనా చెరలనుండి విముక్తి కోసం పోరాడుతూ గెలుపు కోసం వేచి చూస్తున్న హృదయాలలో గాంధీజీ బోధన, సందేశాలకి, జీవనశైలికి, పిలుపుకి స్పందిస్తున్న భారత దేశ నీడలో పెరిగారు ఇలా.  

చిన్నతనంలోనే ఇలా న్యాయ-అన్యాయాల పట్ల విచక్షణ కలిగిఉండి  వెనుకబడిన వారి పై జరిగే దోపిడిని సహించేది కాదు.

మహిళా ఉద్యమాల్లో తన తల్లి పోషించిన పాత్ర చిన్నారి ఇలా మనసులో బలంగా నిలిచిపొయింది. మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె నేరుగా గ్రహించారు. మహిళలు దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడుతున్నపటికీ వ్యవస్థలో ఎదుర్కొంటున్న  వేతన మరియు ఎన్నో రకాల అసమానతల్ని పరిశీలిస్తూ వచ్చింది. వ్యవసాయ రంగం లో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నా వారిని రైతులుగా గుర్తించకుండా, రుణాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోటు పాట్లని గమనిస్తూ వచ్చింది.

అసమానతల పట్ల నిత్యం అవగాహన కలిగి ఉండే దృష్టికోణం దానికి బలంగా ముడిపడున్న తన వ్యక్తిత్వం, భవిష్యత్తు రెండూ తన తల్లిదండ్రుల నుంచి అలవడి ఉంటాయి. ఇలా వ్యక్తిత్వాన్ని చూసిన ఎవరికైనా తెలుసు వారు నిర్భలులకు ఒక దృఢమైన గొంతుక అని.’

ఇలా లోని వినయం, సున్నితతత్వం చూపే ఒక చిన్ని ఉదాహరణ వారు రచించిన పుస్తకం ‘వి ఆర్ పూర్, బట్ సో మెనీ లోని పరిచయ వాక్యాలలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తన వాక్యాలలో: 

“స్వయం ఉపాధి పనులు చేసే పేద మహిళల జీవితాల గురించి రాసే క్రమంలో నేను ఎంతో కొంత అహంకారాన్ని ప్రదర్శించాను. నేను వారి గురించిన రాసిన విషయాలను చదవలేని మహిళల గురించి ఈ పుస్తకం రాసాను. అదే కాక నాకున్న అవగాహన చాలా పరిమితమైనది, అది నేను ఉన్న ఆర్ధిక-సామాజిక వర్గాల నుంచి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను రాసిన మహిళల కోసం పూర్తిగా మాట్లాడుతున్నానని ఎన్నటికీ చెప్పలేను, ఎందుకంటే నేను నా కోసమే మాట్లాడగలను.” స్వయం ఉపాధితో జీవనం గడిపే మహిళల కోసం తన జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను, ప్రశంసలను అందుకున్న ఇలా ఈ విధంగా మాట్లాడటం ఆమెలోని వినమ్రతకు నిదర్శనం..    

ఆమె ఒక నిరంతర స్ఫూర్తి.

ఓం శాంతి.

– మీనా 

Based on a piece by Meena Raghunathan

తొలితరం మహిళా ఇంజనీర్: లలిత: Engineer A. Lalitha

దేశంలోని అత్యున్నత ఇంజనీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి అయిన సెప్టెంబర్ 15 ను ఇంజనీరింగ్ డే గా దేశమంతటా ఘనంగా జరుపుకున్నారు. దేశంలో ఇంజనీరింగ్ విద్య, ఇంజనీరింగ్ రంగంలో ఎంతో కృషి చేసిన విశ్వేశ్వరయ్య వరదలను అరికట్టే నిర్మాణాలకు రూపకల్పన చేయడం, డాం లు రిసర్వాయిర్ ల నిర్మాణం చేయడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజనీరింగ్ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఆయన ప్రారంభించిన గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతం యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గా పిలువబడుతుంది.

ఈ రోజు దేశంలో వేల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల నుండి ప్రతి ఏటా వందలు, వేల సంఖ్యలో యువతీ యువకులు బయటకి వస్తున్నారు. ఆడపిల్లలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం ఈ రోజుల్లో వింత కాదు కానీ కొన్నేళ్ల క్రితం వరకూ అది ఆడపిల్లలకు సంబంధించిన రంగం కాదు. ఏ ఆడపిల్లా నడవడానికి సాహసించని ఈ దారిలో నడిచిన తొలితరం అమ్మాయిలలో ఎ. లలిత ఒకరు. ఈ ఇంజనీరింగ్ డే ఆమెను గుర్తు చేసుకోవడానికి సరైన సందర్భం.

1919 ఆగస్టు 27 న ఒక మధ్యతరగతి తెలుగు కుటుంబంలో ఏడుగురు పిల్లలలో ఒకరిగా లలిత జన్మించారు. ఆమె తండ్రి ఇంజనీర్. కొంత విశాల దృక్పధం కలిగిన వాడైనప్పటికీ పిల్లల పెంపకం విషయంలో సమాజ కట్టుబాట్లను మీరడానికి ధైర్యం చేసేవాడు కాదు. ఆ కుటుంబంలో అబ్బాయిలు అంతా ఉన్నత చదువులకు వెళితే అమ్మాయిలకు మాత్రం ప్రాధమిక స్థాయి వరకు చదువుకోగానే పెళ్ళిళ్ళు చేసేసేవారు. లలితకు కూడా 15 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. కాకపోతే ఆమె పెళ్ళి తర్వాత కూడా పదవ తరగతి వరకు చదువుకునేందుకు ఆమె తండ్రి ఏర్పాట్లు చేశారు.

అయితే దురదృష్టవశాత్తూ ఆమె వివాహ జీవితం ఎంతో కాలం సాగలేదు. ఆమెకు 18 సంవత్సరాల వయసులో భర్త మరణించారు. అప్పటికే ఆమెకు చిన్న పాప ఉంది. నాలుగు నెలల పాపతో చిన్న వయసులోనే విధవగా మారిందామె. ఆ రోజుల్లో విధవల పట్ల సమాజం ఎంతో వివక్ష చూపించేది. అయితే లలితలోని పోరాట గుణం ఆమె ఎన్నో అడ్డంకులను అధిగమించేలా చేసింది.

పుట్టింటికి తిరిగి వచ్చిన ఆమె పెద్ద చదువులు చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలి అనుకుంది. ఆమె తండ్రి అందుకు మద్దతు ఇచ్చారు. మద్రాస్ లోని క్వీన్ మేరీ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది లలిత. ఆ తరువాత ఇక ఆమె వెనుకడుగు వేయలేదు.

ఆ రోజుల్లో స్త్రీలు చాలామంది మెడిసిన్ చదువుతున్నారు. అయితే ఆ మెడికల్ రంగంలోకి వెళితే తాను తన కూతురికి తగిన సమయం ఇవ్వలేనేమో అని లలిత అనుకుంది. తన కుటుంబంలో అనేకమంది ఇంజినీర్లు ఉండడంతో తాను కూడా ఇంజనీర్ అయితే అనే ఆలోచన వచ్చింది. అయితే అప్పటికి మనదేశంలో ఇంజనీరింగ్ విద్య ఇంకా తొలిదశలోనే ఉంది. మహిళలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం అనేది అసలు కలలో కూడా ఊహించని విషయం. ఏ యూనివర్సిటీ మహిళలకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చేది కాదు. ఈ విషయంలో మళ్ళీ ఆమె తండ్రి పప్పు సుబ్బారావు ఆమెకు సహకరించారు. గుండీ లోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ కేసీ చాకో ను ఒప్పించి ఆమెకు ఇంజనీరింగ్ లో ప్రవేశం కల్పించారు. డైరెక్టర్, ఇన్స్ట్రుక్షన్ కు కూడా దరఖాస్తు పంపి అనుమతి తీసుకున్నారు. ఆ విధంగా ఆ కాలేజీ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చారు. లలిత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ ను ఎంపిక చేసుకున్నారు.

ఆ విధంగా వందలాది మంది అబ్బాయిలు మాత్రమే ఉన్న కళాశాలలో ఒకే ఒక్క మహిళా విద్యార్థిగా లలిత చేరారు. అయితే ఆమెకు అది ఎప్పుడూ అసౌకర్యంగా అనిపించలేదు. ఆమెకోసం ఒక ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆమె కూతురిని తన అన్న ఇంటిలో వదిలి వచ్చారు. ప్రతి వారాంతం వెళ్లి కూతురిని చూసుకుని వచ్చేవారు. ఆమె కళాశాల జీవితం, విద్యాభ్యాసం మొదట బాగానే ఉన్నా కొన్నిరోజులకి తాను అక్కడ ఒంటరిదానిని అనే భావన ఆమెలో మొదలయ్యింది. అదే సమయంలో ఆమె తండ్రి మరింత మంది మహిళలకు ఇంజనీరింగ్ లో ప్రవేశం ఇవ్వమని కళాశాల అధికారులను ఒప్పించారు. కళాశాల వారిచ్చిన ప్రకటన చూసి తర్వాత ఏడాది సివిల్ ఇంజనీరింగ్ లో లీలమ్మ జార్జ్, పికె త్రెసియా అనే మరో ఇద్దరు మహిళలు చేరారు.

అప్పటి నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ విద్య నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ ఒక సంవత్సరం పాటు ప్రాక్టికల్ విద్యను అభ్యసించవలసి ఉంటుంది. లలిత జమల్పూర్ రైల్వే వర్కుషాప్ లో తన ఏడాది అప్రెంటిస్ షిప్ ను పూర్తి చేసుకుని 1943 లో ఇంజనీరింగ్ పట్టా పొందింది. ఆ తర్వాత ఏడాది అప్రెంటిస్ షిప్ నిబంధన ఎత్తివేయడంతో ఆమె జూనియర్ మహిళా ఇంజినీర్లు  ఇద్దరూ కూడా అదే ఏడాది పట్టా పొందారు.

అప్పటికే ఎన్నో అవరోధాలను దాటుకుంటూ వచ్చిన లలిత ఇక ప్రొఫెషనల్ గా కొత్త జీవితం ప్రారంభించింది. అయితే తన కుమార్తె శ్యామల తన మొదటి ప్రాధాన్యతగా భావించిన లలిత ఆమె సంరక్షణకు ఇబ్బందికలగని విధంగా ఉండే ఉద్యోగం కోసం వేట ప్రారంభించింది. సిమ్లా లోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజషన్స్ ఆఫ్ ఇండియా లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందింది. రెండేళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాక తన తండ్రికి పరిశోధనలలో సహాయం చేసేందుకు గానూ చెన్నై కు మారింది. ఆ పరిశోధనలు తన మేధస్సును పెంపొందించుకునేందుకు ఉపయోగపడ్డాయి కానీ ఆర్ధిక ఒత్తిడుల కారణంగా వాటిని మధ్యలో వదిలి మళ్ళీ ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టింది. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వారి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేందుకు కలకత్తా వెళ్ళింది. మళ్ళీ ఆమె కూతురి సంరక్షణ బాధ్యత వాళ్ళ అన్న తీసుకున్నారు.

అక్కడ తాను నేర్చుకున్న విద్యనంతా పనిలో ప్రదర్శించే అవకాశం లలితకు కలిగింది. భాక్రానంగల్ ప్రాజెక్ట్ తో సహా అనేక భారీ ప్రాజెక్ట్ లకు ఆమె పని చేశారు. ట్రాన్స్మిషన్  లైన్లు, సబ్ స్టేషన్ లేఔట్, రక్షణ పరికరాలు డిజైన్ చేయడం లలిత పని. ఆమె మేధస్సు, శక్తీ సామర్ధ్యాలు ఈ సమయంలో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.

1953 లో లండన్ కు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆమెను అసోసియేట్ మెంబెర్ గా తన కౌన్సిల్ లోకి ఆహ్వానించారు. చక్కని చీరకట్టులో లండన్ లోని ఫ్యాక్టరీ ని సందర్శించిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 1964 లో న్యూయార్క్ లో జరిగిన తొలి ఇంజినీర్లు, శాస్త్రవేత్తల అంతర్జాతీయ సదస్సుకు కూడా ఆమెకు ఆహ్వానం అందింది. ఇటువంటి సదస్సుకు హాజరయిన తొలి భారతీయ మహిళా ఇంజనీర్ ఆమె. ఆ తర్వాత కాలంలో ఆమె ఎన్నో మహిళా ఇంజినీర్ల సంస్థలలో సభ్యురాలిగా కొనసాగారు. లండన్ లోని విమెన్ ఇంజనీరింగ్ సొసైటీ లో కూడా 1965 లో సభ్యత్వం పొందారు.

1977 లో పదవీ విరమణ చేసేవరకు లలిత అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ అసోసియేట్స్ (తర్వాత కాలంలో దీనిని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ టేకోవర్ చేసింది) లోనే కొనసాగారు. మహిళలకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగాలలోకి బాట వేసిన తొలి తరం మహిళలలో లలిత ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆమె కూతురు శ్యామల కూడా తల్లి లాగానే సైన్స్, మాథెమాటిక్స్ చదువుకుని మాథెమాటిక్స్ టీచింగ్ లో స్థిరపడ్డారు. తన తల్లి జీవితం, పని నుండి తాను ఏమి నేర్చుకున్నదో శ్యామల ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు. “ఆమె జీవితం నుండి నేను నేర్చుకున్నది అంతులేని ఓర్పు. ఊరికే మాటలు చెప్పడం కాకుండా నాణ్యమైన పని చేయడంపై దృష్టి. ఇతరులు మన జీవితంలోకి ఏదో ఒక కారణంతోనే వస్తారు, ఆ వచ్చిన ప్రయోజనం నెరవేరగానే మన జీవితం నుండి వెళ్ళిపోతారు అనే వారు ఆమె” .

రిటైర్ అయిన కొద్దికాలానికే 1979 లో తన అరవై ఏళ్ళ వయసులో అనారోగ్యంతో లలిత మరణించారు. ఈ రోజున ఎంతో మంది అమ్మాయిలు ఇంజనీరింగ్ కెరీర్ చేపడుతున్నప్పటికీ అందుకు దారి వేసిన ఇటువంటి మహిళల దీక్ష, పట్టుదల గురించి చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తల్లిగా తన బాధ్యతలను ఒంటి చేత్తో లాగుతూనే అటు చదువులో ప్రతిభను కనపరచడమే కాకుండా ఉద్యోగ జీవితంలోనూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందిన లలితను ఈ సందర్భంలో స్మరించుకోవడం ఎంతైనా అవసరం.

Based on a piece by Mamata

జవాజా ప్రాజెక్ట్

అకాడెమిక్ సంస్థల పట్ల తరచుగా వినిపించే ఒక ఫిర్యాదు ఏమిటంటే ఆ సంస్థలు సాధారణ ప్రజా జీవితానికి దూరంగా ఉండి సామాజిక వాస్తవాలను అర్ధం చేసుకోలేవు. అందువల్లనే సామాజిక సమస్యలకు ఈ సంస్థలు సూచించే పరిష్కారాలు కూడా ఎంతో డొల్లగా ఉంటాయి అని.

Jawaja bag
A prized Jawaja bag

అయితే అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కలిసి అమలు చేసిన జవాజా ప్రాజెక్ట్ మాత్రం ఇందుకు ఒక మినహాయింపు అనే చెప్పాలి.

1975 లో ఐఐఎం, అహ్మదాబాద్ తొలి ఫుల్ టైం డైరెక్టర్ అయిన రవి మత్తయి భారతదేశం ఎదుర్కుంటున్న పేదరిక సమస్యను కార్పొరేట్ మేనేజ్మెంట్ సూత్రాలను ఉపయోగించి ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకునేందుకు ఒక చిన్న ప్రయోగం మొదలుపెట్టారు. అప్పటికే ఆయన డైరెక్టర్ గా పదవి నుండి తప్పుకుని ఉండడంతో తన పూర్తి సమయాన్ని ఈ ప్రాజెక్ట్ కు కేటాయించారు.

రాజస్థాన్ లోని కరువు పీడిత జిల్లా అయిన జవాజాను ఈ ప్రయోగానికి వేదికగా ఎంచుకున్నారు.మొత్తం 200 గ్రామాలు, 80000 జనాభా. బీడు భూములు, నీటి కరువు తో పాటు ఇతర భౌతిక వనరులేమీ లేని ఈ జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. అందరి దృష్టిలో ఏ వనరులూ లేని ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యం. కానీ రవి మత్తాయి దృష్టి అందుకు భిన్నమైంది. ఆయన దృష్టిలో మానవ వనరులను మించిన వనరు లేదు.    

ఆ ప్రాంతాన్ని అర్ధం చేసుకునే క్రమంలో అక్కడ దాదాపు మూడువందల ఏళ్లుగా తోళ్ళతో హస్తకళా ఉత్పత్తులు చేసే సంప్రదాయం ఉన్నదని తెలిసింది. అక్కడి ప్రజలకు నేతపనిలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యాలను ఉపయోగించి వారికి సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే ప్రొఫెసర్ మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను రంగంలోనికి తీసుకువచ్చారు. జవాజా ప్రజల జీవనోపాధులపై పని చేసి వారి సాధికారత వైపు కృషి చేయాలనేది ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం. ఈ ప్రయత్నంలో మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు చెందిన అశోక్ ఛటర్జీ తో పాటు రెండు సంస్థలకు చెందిన అనేకమంది ఇతర సిబ్బందితో కలిసి పనిచేశారు. 

హస్తకళాకారులకు సమకాలీన సంస్కృతికి తగిన డిజైన్ లను, నిర్వహణా నైపుణ్యాలను అందివ్వడం, అందుకు అవసరమైన సంస్థలతో వారిని కలపడం ఈ ప్రాజెక్ట్ చేసిన ముఖ్యమైన పని. ఈ ప్రాజెక్ట్ కొన్ని ముఖ్యమైన విలువల ఆధారంగా నిర్వహించబడింది. పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనేవి వాటిలో ముందు వరసలో నిలిచే విలువలు. అక్కడి ప్రజలు ఈ సంస్థలకు చెందిన నిపుణుల నుండి కొత్త విషయాలను నేర్చుకోవడం ఒక ఎత్తైతే ఆ నిపుణులకు కూడా తమ నైపుణ్యాలను సామాజిక సమస్యల పరిష్కారాలకు వినియోగించేందుకు ఒక అవకాశం దొరికింది. ఆ హస్తకళాకారులు తయారుచేసే వస్తువుల విలువగొలుసు లో వీలైనంత ఎక్కువభాగంపై ఆ కళాకారులు, ప్రజలకే నియంత్రణ ఉండేలా చేయడం ఈ ప్రాజెక్ట్ లోని మరొక ముఖ్యమైన అంశం. మారుతున్న మార్కెట్ ప్రాధాన్యతలకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తులను తయారుచేయడం, వాటికి సంబంధించిన ఉత్పత్తి మరియు మార్కెట్ అంశాలలో ఆ కళాకారులకే అధికారం ఉండేలా చూడడం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగింది. కళాకారులంతా ఎవరికి వారు వ్యక్తిగతంగా కాకుండా బృందంగా కలిసి పనిచేయడం ద్వారా ప్రాజెక్ట్ కు మరింత బలం చేకూరింది.

జవాజా బ్యాగ్:

మొదట తోళ్లతో స్కూల్ బాగ్స్, ఫ్లోర్ మాట్ లు వంటి సాధారణ, సంప్రదాయ ఉత్పత్తులతో ప్రారంభించినా చిన్నగా ఆఫీస్ లకు అవసరమైన వస్తువులు, వినూత్నమైన బ్యాగ్లు, ఖరీదైన అలంకరణ వస్తువుల వైపు ప్రాజెక్ట్ మలుపు తిరిగింది.

ఈ ప్రక్రియలో ఎదుర్కున్న సమస్యలు తక్కువేమీ కాదు. పాత నైపుణ్యాలతో, సాంకేతిక పరికరాలు, పనిముట్లతో అధునాతన ఉత్పత్తులు తయారుచేయాల్సి రావడం ఒక సమస్య అయితే వాటి నాణ్యతను నియంత్రించడం మరొక ముఖ్యమైన సమస్య. 

కొత్త డిజైన్ లకు వచ్చేసరికి ముందుగా కమ్యూనిటీ లోనుండి కొంతమందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారితో మిగిలిన వారికి శిక్షణ ఇప్పించాలి అనుకున్నారు కానీ అది అంతగా విజయవంతం కాలేదు. నాణ్యత నియంత్రణకు వచ్చేసరికి, మొదటగా ఈ క్వాలిటీ కంట్రోల్ ను ఆయా సంస్థలకు చెందిన నిపుణులు నిర్వహించినా తర్వాత కాలంలో కళాకారుల బృందాలే ఆ బాధ్యత తీసుకుంటాయి అనేది ప్రాజెక్ట్ ఉద్దేశం. అది కూడా అనుకున్నంత వేగంగా సాగలేదు. కొత్త ఉత్పత్తులను రూపొందించేందుకు, వాటికి తగిన ముడి పదార్ధాలు కొనుగోలు చేసేందుకు తగిన నిధులు, వనరుల కొరత అయితే నిరంతరం ఉండేది.

ఇన్ని సమస్యల మధ్య అమలు జరిగినా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ విజయం సాధించడమే కాదు సుస్థిరంగా కొనసాగింది కూడా.

ఈ ప్రాజెక్ట్ సాధించిన విజయాలలో మొదటిది ఆర్టిసన్స్ యలయన్సు ఆఫ్ జవాజా అనే స్వయంప్రతిపత్తి గల సంస్థను, దాని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం. ప్రాజెక్ట్ కు సంబంధించిన ముడిపదార్ధాలు కొనుగోలు, బ్యాంకు వ్యవహారాలు, ఆర్ధిక లావాదేవీలు, సాంకేతిక అంశాలు, మార్కెటింగ్ విషయాలు అన్నీ ఈ సంస్థలే స్వయంగా నిర్వహించుకునేవి. ఈ సంస్థలు ఈ నాటికీ ఎంతో చురుకుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వినూత్న ఉత్పత్తులను తయారుచేస్తూ, మార్కెట్ చేస్తున్నాయి. ఈ సంస్థల ఉత్పత్తులకు సంబంధిత మార్కెట్లలో ఎంతో విలువ ఉంది.

ఇక రెండవ విజయం అభివృద్ధి రంగంపైన ఈ ప్రాజెక్ట్ చూపించిన ప్రభావం. ఈ గ్రాస్ రూట్ సంస్థ నుండి నేర్చుకున్న పాఠాల నుండే రూరల్ మానేజ్మెంట్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ ఉండాలి అనే ఆలోచనకు తద్వారా ఆనంద్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మానేజ్మెంట్ ఏర్పాటుకు బీజం పడింది. ఈ సంస్థకు రవి మతాయి తో పాటు ఐఐఎం, అహ్మదాబాద్ కు చెందిన మరొక ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ కమల చౌదరి, డాక్టర్ మిచెల్ హల్సే లు ఒక రూపాన్ని ఇచ్చారు. 

పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనే విలువల ఆధారంగా ప్రజా సంస్థలను నిర్వహించడం, వారి జీవనోపాధులకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం ద్వారా జవాజా ప్రయోగం అభివృద్ధి రంగంలో ఒక నూతన ఆలోచనా దృక్పధాన్ని ప్రవేశపెట్టి ఎంతో ప్రభావవంతమైన ప్రయోగంగా నిలిచిపోయింది.

ఇటువంటి ప్రయత్నాల గురించి మరింత మంది తెలుసుకోవాలి, అర్ధం చేసుకోవాలి, చర్చ చేయాలి.

–Based on a piece by Meena

యుద్ధం-శాంతి: War and Peace

మరొక యుద్ధం మొదలయ్యింది. ఆఫ్ఘనిస్థాన్ దృశ్యాలు ఇంకా కళ్ళముందు నుండి పూర్తిగా చెదరకముందే ఉక్రెయిన్ నుండి హృదయవిదారకమైన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు తమ బలాబలాలు తేల్చుకునేందుకు తలపడతుండగా మనలాంటి సాధారణ ప్రజలు మాత్రం తమ జీవితాలు తల్లకిందులై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలుముకున్న పొగ, ధూళి వెనుక అనిశ్చితితో, భయంతో బిక్కచచ్చిపోయిన మనుషులు కనిపిస్తున్నారు. వారిది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ.

ఇటువంటి నిరాశానిస్పృహలు అలుముకున్న సందర్భాలలోనే మనకు ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు, గొంతులు అవసరమవుతాయి. అయితే అటువంటి రెండు శక్తివంతమైన గొంతులను ఇటీవల కాలంలో కోల్పోవడం మన దురదృష్టం. వాటిలో ఒకటి ఆర్చిబిషప్ డెస్మండ్ టూటూ ది. ఆయన డిసెంబర్ 2021 లో మరణించారు. మరొకరు పోయిన నెలలో తన 95 వ ఏట మరణించిన థిచ్ న్హాట్ హాన్.

థిచ్ వియత్నాంకు చెందిన బౌద్ధ భిక్షువు. రచయిత, కవి, గురువు, శాంతిదూత. మధ్య వియత్నాంలోని హ్యూ పట్టణంలో 1926 అక్టోబర్ 11 న జన్మించిన ఆయన అసలు పేరు న్యూయెన్ దిన్ లాంగ్. పదహారేళ్ళ ప్రాయంలోనే ఒక జెన్ ఆశ్రమంలో భిక్షువుగా చేరారు. 1949 లో సన్యాసం స్వీకరించాక తన పేరు థిచ్ న్హాట్ హాన్ గా మార్చుకున్నారు. తర్వాత ఆయన థాయ్ అనే పేరుతో ప్రపంచప్రసిద్ధి చెందారు థాయ్ అంటే గురువు అని అర్ధం.

1950 లలో తన యుక్త వయసులోనే థిచ్ వియత్నాం లో బౌద్ధాన్ని పునరుద్ధరించే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సైగన్ యూనివర్సిటీ లో లౌకికత మీద అధ్యయనం చేసిన మొదటి భిక్షువులలో ఆయన ఒకరు. సైకిల్ తొక్కిన మొదటి ఆరుగురు భిక్షువులలో కూడా థిచ్ ఒకరు.  

1950 ల మధ్యలో వియత్నాం యుద్ధ సమయంలో తమ ధ్యాన మందిరాలలో ధ్యానం చేసుకుంటూ తమదైన సన్యాస జీవితాన్ని ఆచరించాలా లేక యుద్ధంలో, బాంబు దాడులలో దెబ్బతిని బాధపడుతున్నవారికి ఆపన్నహస్తం అందించాలా అనేది అక్కడి భిక్షువులు, సన్యాసినులు ఎదుర్కున్న అతి పెద్ద సమస్య. థిచ్ ఈ రెండు పనులూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు బౌద్ధమత ఆచారాలను ఎంతో లోతుగా అవగాహన చేసుకుని ఆ ఆచారాలకి అనుగుణంగా జీవనం గడుపుతూనే మరొకవైపు తన దేశం, అక్కడి ప్రజలపై యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకు తనవైన ప్రయత్నాలు ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ యూత్ అండ్ సోషల్ సర్వీస్ పేరుతో సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక సంస్థను స్థాపించారు. అందులో యువ భిక్షువులతో సహా దాదాపు 10000 మంది స్వచ్చంద కార్యకర్తలు తమ సేవలందించారు. వీరంతా యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి గాయపడిన వారికి సేవలందివ్వడమే కాకుండా శరణార్ధులకు పునరావాస వసతుల ఏర్పాట్లు, వారికోసం పాఠశాలలు, ఆసుపత్రులు వంటివి ఏర్పాటు చేశారు. ఇందులో యువత కేవలం సామాజిక కార్యకర్తలు మాత్రమే కాదు.బౌద్ధ సూత్రాలైన అహింస, కరుణ లను శ్రద్ధగా ఆచరించే అభ్యాసకులు కూడా.

1961 లో అమెరికా లోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ లో తులనాత్మక మత అంశాలపై బోధించేందుకు థిచ్ అమెరికా కు వెళ్లారు. ఆ తరువాత ఏడాది  బుద్ధిజం పై పరిశోధన, బోధన చేసేందుకు  కొలంబియా యూనివర్సిటీ కు వెళ్లారు. 1963 లో అమెరికా-వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా బౌద్ధులు చేస్తున్న ఉద్యమంలో భాగస్వామ్యాలయ్యేందుకు గానూ ఆయన వియత్నాం తిరిగి వచ్చారు. అప్పటికే ఎంతో మంది బౌద్ధ సన్యాసులు ఈ ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకుని ఉండడంతో ఈ ఉద్యమం ప్రపంచ దేశాలన్నిటి దృష్టినీ ఆకర్షించింది. ఆయన మరొక సారి అమెరికాలో, యూరప్ లో పర్యటించి వియత్నాంలో నెలకొని ఉన్న భయానక పరిస్థితుల గురించి వివరించి అక్కడ శాంతి నెలకొల్పవసిందిగా కోరారు. 1960 ల మధ్యలో వియత్నాం యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఆయన మానవ హక్కుల నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ ను కలిసి ఈ ఘర్ణణ వాతావరణానికి వ్యతిరేకంగా మాట్లాడవలసిందిగా ఆయనను ఒప్పించారు.

1964 లో థిచ్ ఒక బౌద్ధుల వారపత్రికలో యుద్ధానికి వ్యతిరేకంగా ఒక కవిత రాశారు. దానిలో కొంతభాగం ఇలా ఉంది.

ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారంతా సాక్షులుగా ఉండండి.

నేను ఈ యుద్ధాన్ని అంగీకరించలేను

ఎప్పటికీ, ఏనాటికీ

నేను మరణించేలోగా ఈ మాట కొన్ని వేల సార్లు చెప్పవలసి రావచ్చు

తన జంటపక్షి కోసం మరణానికైనా సిద్ధపడే పక్షి లాంటి వాడిని నేను

విరిగిన ముక్కు నుండి రక్తం ఓడుతున్నా ఇలా అరుస్తూనే ఉంటాను

“జాగ్రత్త, వెనుకకు తిరుగు

వాంఛ,  హింస, ద్వేషం, దురాశ అనే అసలైన శత్రువులతో పోరాడు.

ఈ కవిత ఆయనకు యుద్ధ వ్యతిరేక కవి అనే పేరుతో పాటు కమ్యూనిస్ట్ భావజాలంగల వ్యక్తి అనే ముద్ర కూడా తీసుకువచ్చింది. ఆయన ఇలా అమెరికా, యూరప్ లలో తన గళాన్ని వినిపిస్తూ మరొక వైపు అటు ఉత్తర, దక్షిణ వియత్నాంల మధ్య జరుగుతున్నా ఘర్షణలో ఏ వర్గం వైపు నిలబడకపోవడంతో అటు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, ఇటు కమ్యూనిస్ట్ లు కానీ ప్రభుత్వాలు కూడా ఆయనకు 39 సంవత్సరాల పాటు  దేశ బహిష్కరణను విధించాయి. దానికి స్పందిస్తూ ఆయన ఇలా అన్నారు “నేను పాశ్చాత్త్య దేశాలలో ఎక్కువకాలం ఉండాలనుకోలేదు. వారు నన్ను వివిధ అంశాలపై ప్రసంగించేందుకు ఆహ్వానించారు. నేను దానిని యుద్ధానికి వ్యతిరేకంగా నా గొంతు వినిపించేందుకు అవకాశంగా మలుచుకున్నాను. లేకుంటే వియత్నాం కు బయట ఉన్న ప్రజలకు వియత్నాం ప్రజల ఆకాంక్షలు అర్ధం కావు. వియత్నంలో బౌద్ధులం అత్యధిక సంఖ్యలో ఉన్నాం. మేము యుద్ధం జరుపుతున్న ఏ ఒక్క వర్గం వైపూ నిలబడే వారిమి కాదు. మాకు కావాల్సింది యుద్ధంలో గెలవడం కాదు. యుద్ధం జరగకుండా ఉండడం. అందుకే వియత్నంలో యుద్ధం జరుపుతున్న ఏ ఒక్క వర్గానికీ నా మాటలు రుచించలేదు. అందుకే నన్ను నా ఇంటికి రాకుండా నిషేధించారు”

తన దేశ బహిష్కరణ కాలంలోనే థిచ్ అనేక దేశాలు పర్యటించి యుద్ధం, హింసలకు వ్యతిరేకంగా తన గళం విప్పి ప్రపంచ శాంతిదూతగా మారారు. ఏడు భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన విస్తృతంగా రాశారు కూడా. అంతేకాక మైండ్ఫుల్ నెస్ ఆర్ట్, శాంతియుత జీవన విధానాలపై కూడా ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడమే కాక ఎన్నో వ్యాసాలు రాశారు. 1970 లో యూనివర్సిటీ అఫ్ సోర్బోన్, పారిస్ లో బుద్ధిజం పై ఉపన్యాసకులు, పరిశోధకులుగా పనిచేశారు. 1975 లో పారిస్ లో స్వీట్ పొటాటో కమ్యూనిటీ ని స్థాపించారు. తర్వాత 1982 లో ఫ్రాన్స్ లోని నైరుతి భాగంలో ఒక విశాలమైన భూభాగంలో ఒక బౌద్ధ ఆరామాన్ని స్థాపించారు. ప్లమ్ విలేజ్ అని పిలవబడే ఈ ఆరామంలో దాదాపు 200 మంది బౌద్దులు నివసించేవారు. అంతేకాక ప్రతిఏటా ప్రపంచంలోని నలుమూలలనుండి ఎనిమిది వేల మందికిపైగా ఈ ఆరామానికి మైండ్ ఫుల్ లివింగ్ కు సంబంధించిన అంశాలు నేర్చుకునేందుకు వచ్చేవారు.

2005 లో వియత్నాం లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆయనను దేశంలో ప్రవేశించేందుకు, ప్రయాణించేందుకు, బోధన చేసేందుకు అనుమతి ఇచ్చింది. తన యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన కొనసాగిస్తూనే వచ్చారు. 2014 లో తన 88 వ ఏట వచ్చిన గుండె నొప్పి కారణంగా శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైనప్పటికీ ఆయన తన నిర్మలమైన వ్యక్తిత్వంతో అందరికీ స్ఫూర్తినిస్తూనే వచ్చారు. 2022 జనవరి 22 న తన 95 ఏళ్ళ వయసులో వియత్నాం లోని హ్యూ ప్రాంతంలో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు.

యుద్ధమేఘాలు అలుముకుని ఉన్న ఈ సమయంలో ఆయనే కనుక ఉండి ఉంటే మరొక యుద్ధాన్ని చూసి ఎంతో దుఃఖించి ఉండేవారు. అన్ని సమస్యలకు యుద్ధం మాత్రమే పరిష్కారం కాదనీ, నమ్మకం, సహానుభూతి, సోదరభావం అనే మార్గాల ద్వారా కూడా పరిష్కారాలు సాధించవచ్చనీ ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసేవారు. ఆయన మాటలను ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుందాం “చెడు ఆలోచనలను, అభిప్రాయాలను క్షిపణులు, తుపాకులు, బాంబులు నాశనం చేయలేవని మనకు తెలుసు. ప్రేమపూర్వకమైన సంభాషణ, సహానుభూతితో అవతలి వారి ఆలోచనలను వినడం ద్వారా మాత్రమే చెడు ఆలోచనలను సరిచేసుకోగలము. కానీ ఈ పద్ధతిపై మన నాయకులెవరికీ శిక్షణ లేదు. అందుకే వారు తీవ్రవాదాన్ని అణచడానికి ఆయుధాలపై ఆధారపడతారు”

ఈ సందర్భంలో ఆయన మరొక మాటను కూడా గుర్తు చేసుకోవాలి. “ఆశ అన్నిటికన్నా ముఖ్యం. అది ఉండడం వలన ప్రస్తుతం ఎంత కఠినంగా ఉన్నా భరించగలం. భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ ఉన్నప్పుడే ఈ రోజు ఎదురైన కష్టాన్ని ఓర్చుకునేందుకు సిద్ధపడతాం”

భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో. …

–Based on a piece by Mamata

.

వసంత పంచమి: Basant Panchami

శిశిరం ముగిసి వసంతం మొదలయ్యే మాఘ మాసం ఐదవ రోజున మనం వసంత పంచమి పండుగను జరుపుకుంటాం. వేసవి మొదలవడానికి సుమారు నలభై రోజుల ముందుగా, హోళీ పండుగ కన్నా ముందుగా వచ్చే పండుగ ఇది.  

Basant Panchami

పసుపు ఈ పండుగకు సంబంధించిన రంగు. అందుకు తగిన కారణం లేకపోలేదు. ఎన్నో రకాల పసుపు రంగు పూలు పూసే సమయం ఇది. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో ఈ సమయంలో పూసే ఆవ పూలు ఆ ప్రాంతం మొత్తాన్ని కొన్ని నెలలపాటు బంగారు రంగులోకి మారుస్తాయి. దేశంలోని అనేకప్రాంతాలలో ఈ పండుగ నాడు సరస్వతీ దేవిని పూజిస్తారు. పసుపు సరస్వతి దేవికి సంబంధించిన రంగు కూడా.

రుతువులు మారే కాలాన్ని సూచించడమే కాకుండా ఈ పండుగకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో నాకు ఇష్టమైనది కవి కాళిదాసుకు సంబంధించిన కథ. ఆ కథ తెలియని వారి కోసం క్లుప్తంగా ఇక్కడ చెబుతాను. ఉత్తరభారతదేశంలో ఒక రాజ్యానికి చెందిన యువరాణి ఎంతో తెలివైనది. పొడుపుకథల పోటీలో తనను ఓడించిన వాడినే వివాహం చేసుకుంటానని షరతు పెట్టింది. ఎంతోమంది యువకులు ముందుకు రావడం, వారిని ఆమె తిరస్కరించడం జరిగాయి. వారిలో ఆ దేశ ముఖ్యమంత్రి కుమారుడు కూడా ఉన్నాడు. యువరాణి తనను తిరస్కరించడంతో అహం దెబ్బతిన్న ముఖ్యమంత్రి కుమారుడు, తనలా తిరస్కరించబడిన మరికొందరితో కలిసి ఆమెకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. తమకన్నా తెలివైన స్త్రీ ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆ రాజ్యంలో అందరికన్నా తెలివితక్కువ యువకుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్లకు ఒక గొర్రెలు కాసుకునే కుర్రవాడు ఒక చెట్టుపై ఎక్కి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ కనిపించాడు. దానితో పాటు తానూ పడిపోతాననే గ్రహింపు లేని అతనికన్నా తెలివితక్కువ వాడు ఉండడు అనుకుని అనేక ప్రయత్నాల ద్వారా ఇతను ఎంతో తెలివైన వాడు అని యువరాణిని నమ్మించారు. యువరాణి అతనిని వివాహమాడింది కానీ ఆ రహస్యం ఎంతోకాలం దాగలేదు. అతను మందబుద్ధి కలవాడని గ్రహించిన యువరాణి అతనిని ఇంటి నుండి తరిమివేసింది. అతను ఎంతో బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై అక్కడ ఉన్న నదిలో స్నానమాచరించమని అతనికి చెప్పింది. అంతే, ఆ తర్వాత అద్భుతం జరిగింది. నదీ స్నానం చేసి వణుకుతూ బయటకి వచ్చిన అతని నోటినుండి అప్రయత్నంగా దేవిని స్తుతిస్తూ శ్యామలా దండకం వెలువడింది! అపార భాషా సంపద, జ్ఞానం, తెలివి, కవిత్వం అతనికి వశమయ్యాయి. ఆ కాళిదాసే తర్వాత కాలంలో అభిఙ్ఞానశాకుంతలం, కుమారసంభవం, రితుసంహార, మేఘదూత వంటి కావ్యాలను రచించాడు. మాఘమాసంలో ఐదవ రోజున సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై జ్ఞానాన్ని ప్రసాదించింది కాబట్టి అటువంటి జ్ఞానసంపదలు తమకు కూడా అందించమని భక్తులంతా సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. కొంతమంది ఇది సరస్వతీ దేవి జన్మదినం అనికూడా అంటారు.

రెండవది శివపార్వతులకు సంబంధించిన కథ. శివుని ప్రియమైన భార్య సతీదేవి మరణించింది. దానితో ఆయనను తీవ్రమైన దుఃఖం, కోపం ఆవరించాయి. దానితో ప్రపంచాన్ని, దానికి సంబంధించిన తన బాధ్యతలను విస్మరించి ధ్యానంలో మునిగిపోయాడు. అయితే జననమరణ చక్రం సాఫీగా తిరగాలంటే ప్రపంచానికి శివుని అవసరం ఉంది. అప్పట్లో కల్లోలం సృష్టిస్తున్న ఒక రాక్షసుడిని అంతం చేయాలంటే శివునికి పుట్టిన బిడ్డ వలన మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఆయన అవసరం మరింత ఉంది. సతి అప్పటికే హిమాలయ రాజుకు పుత్రికగా పార్వతి రూపంలో పునర్జన్మించి ఉంది. కానీ ఆయనను ఎవరూ ధ్యానం నుండి మరల్చలేకపోయారు. అప్పుడే దేవతలంతా కలిసి కామదేవుడిని పంపారు. ఆయన విసిరిన మన్మధ బాణానికి శివుడు కళ్ళు విప్పాడు. కానీ ఆయన అత్యంత క్రోధంతో మూడవ కన్ను కూడా తెరవడంతో కామదేవుడు అక్కడికక్కడే భస్మమయిపోయాడు. అయితే అనుకున్నది జరిగింది. శివుడు పార్వతిని చూడడం ఆమెతో ప్రేమలో పడటం కూడా జరిగింది. మన్మధుని భార్య రతి దుఃఖంతో 40 రోజులు కఠోర తపస్సు చేసింది. దానితో కరుణించిన శివుడు ఏడాదికి ఒకరోజు కాముడు తన శరీరాన్ని ధరిస్తాడని వరం ఇస్తాడు. ఆ రోజే వసంత పంచమి.

దక్షిణ భారతం కన్నా ఉత్తర, తూర్పు భారతదేశంలో వసంత పంచమిని ఎంతో ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. కనీసం నాకు తెలిసిన మా తమిళ కుటుంబాలలో ఈ పండుగను జరుపుకోవడం చూడలేదు. కానీ నా బెంగాలీ స్నేహితుల ఇళ్లల్లో ఎన్నో సార్లు వసంత పంచమి వేడుకలకు వెళ్లి ఉండటాన వారెంత శ్రద్ధగా ఈ పండుగను జరుపుకుంటారో తెలిసింది. మంచి పుసుపు వస్త్రాలు ధరించే అవకాశం వచ్చింది.

మనవెన్ని సంప్రదాయాలు, వేడుకలు, కథలో కదా. ఇవే మన జీవితాలకు మరిన్ని రంగులద్ది ఆసక్తికరంగా మార్చేవి.

–Based on a piece by Meena

అరుదైన సంగీతోత్సవం ‘త్యాగరాజ ఆరాధనోత్సవం’: Thyagaraja Aradhana

తమిళనాడు లోని తిరువాయూర్ లో ప్రతి ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. త్యాగరాజ స్వామి వర్ధంతి ని పురస్కరించుకుని ఆ మహా సంగీతకారుని గౌరవార్ధం జరిగే ఈ ఉత్సవాలు ఈ ఏడాది జనవరి 22 న జరగనున్నాయి.

కర్ణాటక సంగీత విద్వాంసుడైన త్యాగరాజ స్వామి (1767-1847) ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరితం అనే రెండు సంగీత నాటకాలతో పాటు దాదాపు 25000 పాటలకు స్వరకల్పన చేసినట్లు చెబుతారు. అయితే వాటికి సంబంధించిన రికార్డులు సరిగా లేకపోవడంతో ఆయన స్వరకల్పన చేసిన పాటలు ఎన్ని అనే దానిపై ఖచ్చితమైన అంచనా లేదు. ఇప్పుడు మనకు అందులో లభిస్తున్నవి కేవలం ఏడు వందల పాటలు మాత్రమే. తాళపత్ర గ్రంధాలలో పొందుపరచిన ఎన్నో పాటలు ప్రకృతి వైపరీత్యాలకు, కాల ప్రభావానికి లోనై కాలగర్భంలో కలిసిపోయాయి.

త్యాగరాజ స్వామి కృతులన్నీ రాముల వారి పై భక్తితో రూపొందించనవే. అప్పటి తంజావూర్ రాజుగారు త్యాగరాజుల సంగీత ప్రతిభను గురించి విని తన ఆస్థానానికి రమ్మని కబురు పంపినట్లు చెబుతారు. అయితే ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాక తన స్పందనగా  ‘నిధి చాల సుఖమా’ అనే పాటను కూడా రచించారు.

ఇక మళ్ళీ ఆరాధనోత్సవాల విషయానికి వద్దాం. సన్యాసం తీసుకున్న కొన్నాళ్ళకు 1847 లో త్యాగరాజస్వామి తనువు చాలించారు. కావేరీ నది ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి. అక్కడ ఒక చిన్న స్మారకచిహ్నాన్ని నిర్మించారు కానీ అది కొంతకాలానికే నిర్లక్ష్యానికి గురయ్యింది. 1903 లో ప్రముఖ సంగీత విద్వాంసులు, త్యాగరాజస్వామి శిష్యులు అయినా ఉమయాలపురం కృష్ణ భాగవతార్, సుందర భాగవత తిరువాయూర్ కు వెళ్లారు. అక్కడ శిధిలావస్థలో ఉన్న స్మృతి చిహ్నాన్ని చూసి వారిద్దరూ బాధపడి ఇక నుండి ప్రతి ఏటా తమ గురువైన త్యాగరాజస్వామి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. దానివలన ఆయనను గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన సమాధి కూడా సంరక్షించబడుతుందని వారి ఆశ.

ఆ తర్వాత ఏడాది నుండే అంటే 1904 నుండే ఈ ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి. 1905 లో ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలు, పేదలకు అన్న సంతర్పణలతో రోజులతరబడి ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్ దీని వెనుక ఉన్న చోదకశక్తులయితే వారికి ఈ ఉత్సవాలు జరిపేందుకు తగిన అంగబలం, అర్ధబలం ఉన్న ఎంతో మంది చేయూతనందించారు. తిళైస్థానం నరసింహ భాగవతార్, తిళైస్థానం పంజూ భాగవతార్ అందులో ముఖ్యులు. అయితే తర్వాత కాలంలో ఈ అన్నదమ్ములిద్దరికీ మనస్పర్థలు వచ్చి 1906 లో ఎవరికి వారే విడివిడిగా ఆరాధనోత్సవాలు నిర్వహించారు. తర్వాత కాలంలో పెద్దలు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చి ఒక ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం ఇద్దరిలో చిన్నవాడు, అతని బృందం వర్ధంతి రోజుకు ఐదు రోజుల ముందు ఉత్సవాలు ప్రారంభించి వర్ధంతి రోజు వరకు జరపాలి. పెద్దవాడైన నరసింహ, అతని బృందం వర్ధంతి రోజుతో ప్రారంభించి తర్వాత నాలుగు రోజులపాటు ఉత్సవాలు కొనసాగించాలి.

తర్వాత కొన్నాళ్ళకు ఆ మనస్పర్థలు పూర్తిగా తొలగిపోయి రెండు బృందాలూ ఒక్కటయ్యాయి. అయితే ఒక విషయంలో మాత్రం ఈ రెండు బృందాలూ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాయి. ఈ ఆరాధనోత్సవాలలో స్త్రీలు ప్రదర్శనలు చేయకూడదు అనేది వారి నియమం. అప్పట్లో సాధారణంగా దేవదాసీ స్త్రీలు మాత్రమే బహిరంగ సంగీత, నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇటువంటి పవిత్ర ఉత్సవంలో వారు పాల్గొనకూడదని ఆ అన్నదమ్ములు, అప్పటి సమాజ పెద్దలు విధించిన నియమం.

అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ ఎంతో పేరున్న సంగీత విద్వాంసురాలు. ఆమెకు ఎంతో పేరు, పరపతి ఉన్నాయి. ఆమెకు త్యాగరాజ స్వామి అంటే ఎంతో అభిమానం. తన ప్రతిభ అంతా ఆయన వరమే అని ఆమె నమ్మకం. ఎన్నో సంగీత సభలలో ఆయన కృతులు పాడటం వల్లనే ఆమెకు అంత గుర్తింపు లభించింది. అయితే స్త్రీ కావడం వలన ఆమెకు త్యాగరాజ ఆరాధనలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

1921 లో నాగరత్నమ్మ తనకున్న అపారమైన సంపదను స్వామి వారికోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఆయన సమాధి చుట్టూ ఉన్న భూమిని కొని అందులో ఒక ఆలయాన్ని నిర్మించి దాని ముందు త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఆలయం 1926 నాటికి  పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది.    

ఆరాధనోత్సవాలు నిర్వహించే బృందం ఆమె తన స్వంత ఖర్చుతో ఇవన్నీ చేస్తుంటే సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ ఉత్సవాలలో ప్రదర్శనకు వచ్చేటప్పటికి ఆమెకు అనుమతి ఇవ్వలేదు. దీనిని అవమానంగా భావించిన ఆమె ఆ గుడికి దగ్గరలో తన స్వంతంగా ఆరాధనోత్సవాలను నిర్వహించాలని అనుకుంది. ఇందులో ఎంతో మంది మహిళా కళాకారులకు ప్రదర్శనకు అనుమతి లభించి ఆ ఉత్సవాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. గతంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్న బృందం ఆ ఆలయం దగ్గర ఉత్సవాలు నిర్వహించకూడదనీ, అది తాను స్వయంగా నిర్మించిన ఆలయం అనీ ఆమె న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమె కోరికను తిరస్కరించింది కానీ కొన్ని నియమిత గంటల పాటు ఆమె బృందం, మిగిలిన గంటలు మిగిలిన రెండు బృందాలు ఆరాధనను నిర్వహించవచ్చు అని తీర్పు ఇచ్చింది.  

ఆ సమయంలో ఎస్. వై. కృష్ణస్వామి అనే ఇండియన్ సివిల్ సర్వెంట్ అధికారి ముందుకువచ్చి ఈ మూడు బృందాల మధ్య సంధి కుదిర్చారు. 1941 నుండి ఈ మూడు శత్రు బృందాలు ఒక్కటయ్యాయి. స్త్రీలు కూడా ఆ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం సాధించడం ద్వారా నాగరత్నమ్మ విజయం సాధించారు.

ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా త్యాగరాజ స్వామి ఐదు కృతులను పంచరత్నాల పేరుతో సామూహికంగా ఆలపించే సంప్రదాయ ప్రదర్శనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందరూ కలిసి ఎంపిక చేసిన ఐదు కృతులను ఒకే గొంతుతో ఆలపించడం ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి. యూట్యూబ్ లో చూడండి.

–Based on a piece by Meena