గర్భిణీలు, బాలింతల కోసం పోషకాహార కేంద్రాలు
గర్భిణీలు, బాలింతలకు సరైన పోషకాహారం యొక్క అవసరం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మహిళలలో పోషకాహార లోపాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంగన్వాడీ ల ద్వారా ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ అంగన్వాడీలలో ఇచ్చే ఆహార పదార్ధాలను మహిళలు తీసుకువెళ్ళడం, ఇంటిలోని కుటుంబ సభ్యులందరితో పంచుకుంటున్నారనేది మేము క్షేత్ర స్థాయిలో గమనించిన అంశం. బహుశా పిల్లలు, మగవారు తిన్నాక మిగిలిన కొద్ది మొత్తం వారు తీసుకుంటుండవచ్చు. ఇంట్లో ఎవరికీ పెట్టకుండా కోడళ్ళు తమకు ఇచ్చిన ఆహారాన్ని దాచుకుని తినడం ఇంకా చాలా కుటుంబాలలో ఆమోదయోగ్యమైన విషయం కాదు. దీనితో వారికోసం ఉద్దేశించి ఇచ్చిన పోషకాహారం నిజానికి వారికి అందడం లేదు.
కొన్ని రాష్ట్రాలలో ఈ అనుభవాలను చూసాక, మేము జి.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్ లో ఈ కార్యక్రమాన్ని మరొక విధంగా అమలు చేసి చూద్దామనే ఆలోచన చేసాము. పోషకాహారాన్ని మహిళల ఇంటికి పంపే బదులుగా మహిళలే ఒక చోటకి చేరి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుందనేదే ఆ ఆలోచన. ఈ ఆలోచనతో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని గర్భిణీలు, బాలింతలకు అనువుగా ఉండే ప్రదేశాలలో వారికోసం పోషకాహార కేంద్రాలను ప్రారంభించాము. ప్రతిరోజూ నిర్దేశించిన సమయానికి ఒక అరగంట సమయం గడిపేలా వారంతా కేంద్రానికి రావాల్సి ఉంటుంది. పోషకాహారంపై పనిచేసే ఒక జాతీయ స్థాయి సంస్థ సహాయంతో ఏ రోజు ఏ ఆహారం ఇవ్వాలి అని ఒక మెనూ తయారుచేశాము. ఇక్కడ మేము ఇచ్చేది పూర్తి భోజనం కాదు. కానీ సహజంగా మహిళలలో ఎటువంటి పోషకాలు లోపిస్తాయో వాటిని అందించేందుకు తగిన అదనపు ఆహారం ఈ కేంద్రాలలో ఇవ్వడం జరుగుతుంది. ఆయా సీజన్ లలో దొరికే ఆహార పదార్ధాలకు తగినట్లు ఎక్కువ వంట చేయవల్సిన అవసరం లేకుండా ఉండేలా ఈ మెనూ రూపొందించాము. ఈ కేంద్రాలకు వచ్చే మహిళలు అంగన్వాడీ నుండి కూడా తమకు రావాల్సిన రేషన్ ను తీసుకోవచ్చు.

రిజిస్టర్ చేసుకున్న మహిళలు ప్రతిరోజూ ఈ కేంద్రాలకు వస్తారు. ఒక చిన్న కిట్టి పార్టీ లాగా ఉంటుందక్కడ. వారంతా కలిసి తింటారు. ముచ్చట్లు చెప్పుకుంటారు. గర్భిణీలుగా, బాలింతలుగా తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. అప్పుడప్పుడు టీకాలు వేయించుకోవాల్సిన అవసరం గురించి, కుటుంబ నియంత్రణ గురించి, ఇతర ఆరోగ్య, పోషకాహార అంశాల గురించి అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తలతో అవగాహన సదస్సులు నిర్వహించడం, ఆహారం, బిడ్డల సంరక్షణకు సంబంధించి చిన్న చిన్న ఆటలు ఆడించడం, పరిశుభ్రత, ఆరోగ్య అంశాలపై డాక్యుమెంటరీ ల వంటివి చూపించడం వంటి అనేక కార్యక్రమాలు ఈ కేంద్రాలలో నిర్వహిస్తారు. వారి బరువు, హిమోగ్లోబిన్ శాతం, డాక్టర్ ఇచ్చిన సలహాలు అన్నీ రికార్డు చేయడం జరుగుతుంది. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు.
ఈ కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి దాదాపు ఒక దశాబ్దం అయింది. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న మహిళలు వందకి వంద శాతం ఆసుపత్రులలోనే ప్రసవం చేయించుకుంటుండగా బిడ్డల సగటు బరువు 2.5 కేజీల కన్నా అధికంగా ఉంటుంది. మరి ఖర్చు ఎంత అంటారా? రోజుకు ఒక్కో మహిళకు కేవలం పదిహేను రూపాయలు. గర్భిణీగా మూడవ నెల ప్రారంభం అయినప్పటి నుండి ప్రసవం తర్వాత ఆరవ నెల వరకు మొత్తం మీద ఒక్కో మహిళకు 12 నెలల పాటు సహాయం అందించడం జరుగుతుంది. ప్రసవం అయిన వెంటనే కేంద్రానికి రాలేని మహిళలకు ఆహారాన్ని ఇంటికి పంపిస్తారు. మొత్తం మీద వారి ఆరోగ్యం కోసం, వారి బిడ్డల ఎదుగుదలకు బలమైన పునాది వేయడం కోసం ఒక్కో మహిళ మీద 5500 రూపాయిల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఏ సంస్థ అయినా తేలికగా అమలు చేయగలిగిన కార్యక్రమం. ఆసక్తి ఉన్న వారు వ్యక్తిగతంగా కూడా ఈ సహాయం చేయవచ్చు.
దేశం మొత్తం మీద చూస్తే స్వచ్చంద సంస్థలు అమలు చేస్తున్న ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒకరితో ఒకరు పంచుకోవడం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, వాటిని మరింత పెద్ద స్థాయిలో అమలు చేయడం ఇప్పుడు ఎంతో కీలకం.
Translated by Bharathi Kode from Meena’s piece
Hgood intiative madam.
LikeLike