స్టార్క్స్ లాగా నేను అంతులేని రాత్రుల గురించే, గడ్డ కట్టించే చలి గురించో భయపడనవసరం లేదు. గోడలు బద్దలు కొట్టుకుని వచ్చే భయంకరమైన జీవుల గురించో, వైట్ వాకర్స్ గురించో కూడా ఆందోళన పడనవసరం లేదు.
కానీ ఈ చలికాలం చర్మాన్ని తేమగా ఎలా ఉంచుకోవాలన్నది మాత్రమే నాకున్న ఆందోళన.
ఈ రోజుల్లో ఏదైనా ఒక షాప్ లోకి వెళ్ళానంటే అక్కడున్న రకరకాల క్రీములు నన్ను అయోమయంలో పడేస్తాయి. మా చిన్నతనంలో ఇలాంటి పరిస్థితి లేదు. అప్పుడు అందుబాటులో ఉన్నది ఒకటే రకం. అది కోల్డ్ క్రీం. ఇంకా చెప్పాలంటే పాండ్స్ కోల్డ్ క్రీం. దానినే ముఖానికి, చేతులకు, కాళ్ళకి బయటకి కనిపించే శరీర భాగాలన్నిటికీ రాసుకునేవాళ్ళం. మరీ చర్మం ఎక్కువగా పొడిబారిపోతే వాసెలిన్ వాడేవాళ్ళం. పగిలిన పెదాలకు కూడా అదే మందు. మా తమిళ కుటుంబాలలో వారానికి ఒకసారి నూనె రాసుకుని స్నానం చేసే ఆచారం ఉంది. నువ్వుల నూనెను చర్మంలోని ప్రతి రంధ్రంలోకి, పొరలోకి ఇంకిపోయేలా నిర్దాక్ష్యణంగా శరీరంపై మర్దన చేసి కొంతసేపు ఆగి శనగపిండి తోనో, శీకాయ పొడితోనో స్నానం చేసేవాళ్ళం.
అమాయకంగా, సాధారణంగా జీవించిన రోజులు అవి. వేరే రకాల క్రీములు, లోషన్లు, కషాయాల గురించి ఏ మాత్రం అవగాహన ఉండేది కాదు. కానీ ఒక్క క్రీం గురించి మాత్రం మా హృదయాలు తపించేవి. అది వాడడం మాకు కలలో మాత్రమే సాధ్యమయ్యేది. నేరుగా దానిని చేతులతో తాకింది చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే. దాని ఖరీదు ఎక్కువా లేక మరేదైనా కారణమా అన్నది నాకు సరిగా జ్ఞాపకం లేదు. లేదంటే బహుశా అది మాయిశ్చరైజింగ్ క్రీం గా కాక కేవలం బ్యూటీ క్రీం గా మాత్రమే చూడబడేదేమో. (ఈ మధ్యనే ఈ ఆఫ్ఘన్ క్రీం ఒక ఫెయిర్ నెస్ క్రీం అని ఎక్కడో చదివాను కానీ ఆ రోజుల్లో దానిని అలా పరిగణించిన జ్ఞాపకం లేదు). అప్పటి మా మధ్య తరగతి కుటుంబాల తల్లులు విధించే రకరకాల ఆంక్షల మధ్యలో నా పసి హృదయం ఆ ఆఫ్ఘన్ స్నో క్రీం కోసం పరితపించిన జ్ఞాపకం మాత్రం పదిలంగా ఉంది.

అది ఇప్పుడు మార్కెట్ లో లభిస్తుందో లేదో నాకు తెలియదు కానీ తెల్లగా మెరుస్తూ, పట్టులా మెత్తగా ఉండే ఆ క్రీం అరుదైన సువాసనతో నీలం రంగు గాజు సీసాలో లభించేది. అప్పట్లో అందుబాటులో ఉన్న కాస్మెటిక్స్ అన్నింటిలో బహుశా ఇదే అత్యంత అరుదైన విదేశీ క్రీం అనుకుంటాను.
ఈ మధ్య ఎందుకో ఈ ఉత్పత్తి గురించి తెలుసుకోవాలనిపించి ఈ క్రీం కి సంబంధించిన అనేక వ్యాసాలు చదివితే ఒక అసాధారణమైన ఆత్మనిర్భర కథ నాకు కనిపించింది.
రాజస్థాన్ కు చెందిన ఇబ్రహీం సుల్తానాలీ పఠాన్వాలా ఇరవై శతాబ్దం తొలినాళ్ళలో బతుకుతెరువు కోసం ముంబైకు వచ్చాడు. ఒక అత్తర్లు తయారు చేసే వ్యక్తి దగ్గర అతనికి పని దొరికింది. అతని దగ్గరే రకరకాల సువాసనలతో అరుదైన అత్తరులు తయారు చేయడం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళకి తానే స్వయంగా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అతని మొదటి ఉత్పత్తి ‘ఒట్టో దునియా’ అనే తల నూనె. అది కొంత విజయవంతం కావడంతో తన స్వంత ఆఫీస్ ను, ల్యాబ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
1909 లో మెస్సర్స్ ఈ.ఎస్.పఠాన్వాలా సంస్థ స్థాపితమయ్యింది. ఈ కంపెనీ తల నూనెలను, అత్తరులను అమ్ముతుండేది. వాటిలో కొన్ని వారు స్వయంగా తయారుచేసినవి. కొన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకున్నవి. అప్పటి భారతీయ ధనిక కుటుంబాలలో, బ్రిటిషర్లలో ఈ సంస్థకి అనేకమంది కస్టమర్లు ఉండేవారు. అయితే ఈ విజయంతో అతను సంతృప్తి చెందలేదు. ఇంకా నేర్చుకోవాలనే తపనతో యూరప్ కు వెళ్ళాడు. అతనికి వచ్చిన ఇంగ్లీష్ అంతంతమాత్రమే. కానీ నిబద్ధత, నేర్చుకోవాలనే తపన అతనికి కొత్త ద్వారాలు తెరిచింది. స్విట్జర్లాండ్ కు చెందిన లియోన్ గివాయుడాన్ తో అతనికి పరిచయం లభించింది. ఆయన సుగంధ రసాయనాల తయారీలో ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉన్న వ్యాపారవేత్త. ఆయన మార్గదర్శకత్వంలో, యూరప్ లో పొందిన శిక్షణతో పఠాన్వాలా స్వయంగా ఒక ఫార్ములా తయారు చేసాడు. తర్వాత కాలంలో అది భారతదేశంలో అత్యంత ప్రముఖమైన కాస్మెటిక్ క్రీముగా ప్రసిద్ధి చెందింది.
అతను భారతదేశానికి తిరిగివచ్చి బైక్కుల్లా లో ఒక ఫ్యాక్టరీ స్థాపించి ఈ క్రీం ను తయారు చేయడం మొదలుపెట్టాడు. సీసాలు జర్మనీ నుండి, లేబుల్స్ జపాన్ నుండి దిగుమతి చేసుకునేవాళ్ళు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్థాన్ రాజు జహీర్ భారతదేశం సందర్శన సందర్భంగా ఇక్కడి ఔత్సాహిక వ్యాపారవేత్తలు కొందరిని కలవాలనుకున్నారు. వారిలో పఠాన్వాలా కూడా ఒకరు. ఆయన ఆ రాజుకు తన ఉత్పత్తులన్నీ కలిపి ప్యాక్ చేసి బహుమతిగా ఇచ్చారు. వాటిలో ఇంకా పేరు కూడా పెట్టని ఈ క్రీం కూడా ఉంది. ఆఫ్ఘన్ రాజు ఆ సీసా మూత తీసి పట్టులా మృదువుగా, తెల్లగా ఉన్న ఆ క్రీం ను చేతిలోకి తీసుకుని దాని పరిమళాన్ని ఆస్వాదించి దీనిని చూస్తే నాకు మా ఆఫ్ఘన్ మంచు గుర్తుకువస్తుంది అన్నారట. పఠాన్వాలా వెంటనే అయితే నేను దీనికి ఆఫ్ఘన్ స్నో అనే పేరు పెట్టుకోవచ్చా అని అడిగితే అందుకు ఆ రాజు అంగీకరించారు. అలా 1919 లో (100 ఏళ్ళు దాటినట్లు) ఆఫ్ఘన్ స్నో క్రీం మార్కెట్లోకి విడుదల చేయబడింది.
అది ఎంతో విజయవంతమైంది కానీ స్వదేశీ ఉద్యమం సమయంలో కొన్ని కష్టాలను ఎదుర్కొంది. దాని సీసా, లేబుల్స్ విదేశాల నుండి దిగుమతి చేయబడినవి కావడంతో ఆ ఉత్పత్తిని కూడా విదేశీ ఉత్పత్తిగా పరిగణించి విదేశీ వస్తు బహిష్కరణ కాలంలో బహిష్కరించబడిన విదేశీ వస్తువుల జాబితాలో ఈ క్రీం ను కూడా ఉంచారు. ఇది పూర్తిగా స్వదేశీ ఉత్పత్తి అని, బైక్కుల్లా లో ఉత్పత్తి జరుగుతుందనీ, దీనిపై బహిష్కరణను నిలిపివేయాలని కోరుతూ పఠాన్వాలా మహాత్మా గాంధీకి స్వయంగా ఉత్తరం రాశారు. ఆఫ్ఘన్ స్నోను బహిష్కరించడం ఒక తప్పిదం అనీ, నిజానికి అంత మంచి ఉత్పత్తి భారతదేశంలో తయారు అవుతున్నందుకు తాను గర్వపడుతున్నానని, తాను ఈ ఉత్పత్తికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని మహాత్మా గాంధీ తన పత్రికలో రాశారు.
ఈ క్రీం గురించిన విశేషాలు తెలుసుకున్నాక ఇది కావాలనే కోరిక మరింత పెరిగింది. నాకు ఒక అద్భుతమైన కథను పరిచయం చేసిన ముదురు నీలం రంగు సీసాలో తేలికగా మృదువుగా మెరిసిపోతున్న తెల్లని మంచు కోసం ఎంత చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నాను.
ఎన్నో అవరోధాలను అధిగమించి, నూతన ఆవిష్కరణలకు తెరతీసి, వందల ఏళ్ళ నాటి జ్ఞాపకాలను మేల్కొలిపే ఉత్పత్తులను రూపొందించిన ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల జీవిత చరిత్రలను చదివి వారు ఎలా విజయం సాధించగలిగారు, సాధించిన దానిని ఎలా నిలుపుకోగలిగారు, ఎందుకు నిలుపుకోలేకపోయారు వంటి విషయాలు తెలుసుకోవాలనే కోరిక కూడా మరింత పెరిగింది.
Translated by Bharathi Kode from Meena’s piece
Interesting read!
LikeLike
ఆసక్తికరమైన అంశం
LikeLike