ఈ ఏడాది లేడీ విత్ ది లాంప్ గా మనందరికీ తెలిసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ద్విశత జయంతి సంవత్సరం. ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరు వినగానే మన పుస్తకాలలో చదువుకున్నట్లు చేతిలో ఒక దీపం పట్టుకుని యుద్ధంలో గాయపడిన, జ్వరంతో బాధపడుతున్న సైనికులకు సేవలందించిన ఒక సేవామూర్తి రూపం మాత్రమే మన కళ్ళ ముందు మెదులుతుంది.
ఆమె ఈ అరుదైన సేవలందించింది అనడంలో సందేహం ఏమీ లేదు. ఆమె దీపం పట్టుకుని రాత్రనక, పగలనక సైనికుల క్యాంపులలో తిరిగి వారికి ఎనలేని సేవ చేసింది. అయితే ఆమె అంతకు మించి చేసిన సేవ మాత్రం ఎక్కువ గుర్తింపుకు నోచుకోలేదు.
ఆమె అద్భుతమైన గణాంకవేత్త. 1860 లో స్టాటిస్టికల్ సొసైటీ కి ఎంపికయిన మొదటి మహిళా ఫెలో.
ఆమె పనిచేసే యుద్ధ ప్రాంతపు ఆసుపత్రిలో మరణాలను కూడా సరిగా నమోదు చేయని సందర్భంలో ఆమె ఎంతో శ్రమకోర్చి వివిధ గణాంకాలను సేకరించి, వాటిని విశ్లేషించడం వలన పరిస్థితిని సరిగా అర్ధం చేసుకుని మరణాలను తగ్గించగలిగారు. ఉదాహరణకు ఆమె బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఇతర గణాంకవేత్తలతో కలిసి ఆ ఆసుపత్రిలో సంభవించిన 18000 మరణాలలో 16000 వరకు యుద్ధంలో గాయపడటం వలన సంభవించినవి కావని, పారిశుధ్య వసతులు సరిగా లేక వివిధ వ్యాధులు వ్యాపించి వాటి వలన సంభవించినవే అని గణాంకాలతో సహా నిరూపించారు. అప్లైడ్ స్టాటిస్టికల్ పద్దతులను ఉపయోగించి సరైన పారిశుధ్య వసతులు కల్పించడం ఎంత అవసరమో సోదాహరణంగా వివరించగలిగారు. దీని వలన ఎన్నో జీవితాలు కాపాడబడ్డాయి (ఈ ఏడాది నోబెల్ బహుమతి వచ్చిన ఎవిడెన్స్ బేస్డ్ పాలసీస్ కు ఇది తొలి ఉదాహరణగా చెప్పుకోవచ్చు)

అప్పటి వ్యవస్థలను కదిలించి సంస్థాగతమైన మార్పులు సాధించగలిగింది ఫ్లోరెన్స్. ఈ మార్పులు సాధించడానికి తన ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వాలతో పోరాటం చేస్తూనే ఉంది. మార్పు ఎంత అవసరమో అధికారులకు చెప్పి ఒప్పించడం అంత సులువు కాదని ఆమెకు తెలుసు. బహుశా అందుకే గణాంక శాస్త్రంలోనే పెద్ద మలుపుగా చెప్పుకోదగిన ఇన్ఫోగ్రాఫిక్స్ ను తొలిసారిగా రూపొందించింది. ఆమె రూపొందించిన ఇన్ఫోగ్రాఫిక్స్ లో అన్నిటికన్నా పేరు పొందింది “కాక్స్ కోమ్బ్” డయాగ్రమ్. ఇవి సాధారణ ప్రజలు కూడా సులువుగా అర్ధం చేసుకోగలిగినవి. ఈ కాక్స్ కోమ్బ్ అనేది గణాంకశాస్త్రంలో ఉపయోగించే “పై చార్ట్” ల వంటిదే కానీ మరింత లోతుగా సమాచారాన్ని విశదపరుస్తుంది. పై చార్ట్ లో ఒక్కొక్క భాగం యొక్క పరిమాణం ఆ డేటా పాయింట్ యొక్క మొత్తాన్ని సూచిస్తుంది. అయితే ఈ కాక్స్ కోమ్బ్ లో కేంద్రం నుండి ఒక్కొక్క భాగం యొక్క పొడవు వివిధ స్థాయిలలో ఉండి సమాచారాన్ని వివిధ పొరలుగా విశదపరుస్తుంది. నైటింగేల్ ఈ చార్ట్ ను ఇలా విభిన్నంగా అమర్చడం వలన వివిధ స్థాయిలలో ఉన్న సంక్లిష్ట సమాచారాన్నిఒకే చార్ట్ పై వివరంగా చూపించగలిగింది. క్రిమియన్ యుద్ధ సమయంలో ఆమె తయారు చేసిన కాక్స్ కోమ్బ్ డయాగ్రమ్ ఒక ఏడాదిలోని 12 నెలలను సూచించే విధంగా 12 భాగాలుగా ఉండి ప్రతి భాగంలోనూ రంగు వేయబడిన భాగం ఆ నెలలో సంభవించిన మరణాలను సూచించేలా రూపొందించబడింది. ఆమె ఉపయోగించిన వివిధ రంగులు ఆ మరణాలకు గల వివిధ కారణాలను సూచించేలా ఉన్నాయి.
ఆమె కనుక ఇప్పుడు జీవించి ఉన్నట్లయితే ఇప్పటి కోవిద్ వ్యాప్తికి కూడా గణాంకాల విశ్లేషణ జరిపి వాటి ఆధారంగా వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టడానికి పరిష్కార మార్గాలు సూచించగలిగే వారని చాలా మంది నమ్మకం. అయితే ఇటువంటి నమ్మకాలు, ఆశల వలన ఒనగూరేదేమీ లేదు. ఇటువంటి మార్గదర్శకులు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ఇప్పటి తరంపై ఉన్నది.
తాను సేకరించిన గణాంకాలు, సమాచారం ఆధారంగా మన దేశంలో పరిశుభ్రమైన త్రాగునీరు, కరువు భత్యం, మెరుగైన పారిశుధ్య వసతులు కల్పించవలసిన అవసరం గురించి ఆమె చేసిన కృషికి కూడా మనం ఆమెకు ధన్యవాదాలు తెలుపుకోవాలి.
*https://thisisstatistics.org/florence-nightingale-the-lady-with-the-data/
Translated by Bharathi Kode from Meena’s piece ‘The Lady With the Graph’