మొన్న ప్రకటించిన పద్మ అవార్డు లలో ఫాదర్ కార్లోస్ వాలెస్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. స్పెయిన్ దేశానికి చెందిన ఈ జెస్యూట్ ప్రీస్ట్ 5 దశాబ్దాలకు పైగా భారత దేశంలో ఉండి గణిత శాస్త్రంలో ఎంతో కృషి చేశారు. గుజరాతి భాష, సాహిత్యాలలో కూడా ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది.
1925 సెప్టెంబర్ 4 న కార్లోస్ వాలెస్ స్పెయిన్ లో జన్మించారు. ఇంజనీర్ అయిన ఆయన తండ్రి కార్లోస్ కు పది సంవత్సరాల వయసులోనే చనిపోయారు. అయినా ఆయన ప్రభావం కార్లోస్ పై ఎంతో ఉంది. “మా నాన్న నా మీద ఎంతో నమ్మకం ఉంచేవారు” అని గుర్తు చేసుకునేవారు కార్లోస్. స్పెయిన్ లోని అంతర్యుద్ధంలో ఆయన కుటుంబం సర్వస్వం పోగొట్టుకుంది. జెస్యూట్స్ కొత్తగా ప్రారంభించిన ఒక స్కూల్ లో కార్లోస్ తల్లి, ఆమె సోదరి ఆశ్రయం పొందారు. కార్లోస్ కి, అతని సోదరుడికి అదే పాఠశాలలో ఉండి చదువుకునేందుకు స్కాలర్షిప్ లభించింది. పదిహేను సంవత్సరాల వయసులో కార్లోస్ నోవియట్ గా జెస్యూట్ మత స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన ‘ది ఆర్ట్ ఆఫ్ ఛూజింగ్’ అనే తన తొలి పుస్తకాన్ని రాశారు. అందులో దేవుని కోసం, సేవ కోసం కుటుంబ జీవితాన్ని ఎలా త్యజించిదీ అవలోకనం చేశారు. తూర్పు దేశాలకు వెళ్లాలనే ఆయన కోరికపై ఆయనను భారతదేశానికి పంపారు. అహ్మదాబాద్ లో సెయింట్ జేవియర్ కళాశాలను స్థాపించడంలో సహాయం అందించాలనేది ఆయనకు అప్పగించబడిన పని. ఆ విధంగా 1949 లో భారతదేశానికి బయలు దేరిన కార్లోస్ కు తర్వాత ఎన్నో సంవత్సరాలు అదే తన ఆవాసంగా మారిపోయింది. “నేను సంపూర్ణ యవ్వనంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. మా నాన్నగారు నాకు ఏ పనీ సగంలో విడిచిపెట్టవద్దు” అని చెప్పేవారు అని కార్లోస్ అనేవారు.
ఇక్కడకి వచ్చిన దగ్గర నుండే ఇదే తన సొంత ఇల్లుగా అనిపించేదని, తాను పూర్వ జన్మలో భారతీయుడినే అని ఇక్కడి తన స్నేహితులు అనేవారనీ రాశారు కార్లోస్. ఇక్కడే 1953 లో మద్రాస్ యూనివర్సిటీ నుండి గణితంలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన భాష స్పానిష్ కాబట్టి ఇక్కడ గణితం ఇంగ్లీష్ మాధ్యమంలో నేర్చుకోవడంతో రెండింటిలోనూ ప్రావీణ్యత సాధించారు.
అయితే ఆయన గుజరాత్ లో ఉండేవారు కాబట్టి అక్కడి ప్రజలకు చేరువై తాను ఏదైనా బోధన చేయగలగాలంటే స్థానిక భాష వచ్చి ఉండాలని ఆయన భావించారు. “ఇంగ్లీష్ ద్వారా గణితం బోధించవచ్చు. కానీ వారి హృదయాలకు చేరువ కాలేము. ఎవరికైనా దగ్గర కావాలంటే వారి స్థానిక భాష వచ్చినప్పుడే సాధ్యమవుతుంది” అని కార్లోస్ ఒకసారి రాశారు. ఆయన గుజరాతీ భాష కొంత నేర్చుకున్నారు కానీ అది సరిపోదు అనిపించింది. దానితో గుజరాత్ లోని వల్లభ్ విద్యానగర్ యూనివర్సిటీ లో చేరి ఒక ఏడాది పాటు హాస్టల్ లో ఉంటూ తోటి గుజరాతీ విద్యార్థులతో కలిసి వారి భాష, సంస్కృతి తెలుసుకుని ఆ భాషపై పట్టు సాధించారు. తర్వాత నాలుగు సంవత్సరాలు పూణే లో థియోలాజికల్ స్టడీస్ చేశారు. అక్కడ కూడా ప్రతిరోజూ రెండు గంటల పాటు గుజరాతీలో రాయడం సాధన చేసేవారు. 1958 లో కార్లోస్ వాలెస్ కు మతగురువు హోదా లభించింది. అప్పుడు ఆయన తల్లి మొదటిసారిగా భారతదేశానికి వచ్చారు.

బాంబే నుండి గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన 1960 లోనే కార్లోస్ అహ్మదాబాద్ లోని సెయింట్ జేవియర్ కళాశాలలో గణితం బోధించడం ప్రారంభించారు. బాంబే నుండి రైల్ లో వెళ్తుంటే ఆయనకీ సీట్ దొరకక గేట్ కు దగ్గరగా నిలబడ్డప్పుడు ఒక చెప్పు పొరపాటున బయటపడిపోతే వెంటనే రెండవ చెప్పు కూడా బయటకు విసిరి అది ఎవరికైనా దొరికితే దాని జత చెప్పు కూడా ఉంటే ఉపయోగం కదా అన్నారట తన పక్కన ఉన్నవారితో.
అప్పటి వరకు విద్యార్థిగా ఉన్న ఆయన ఇప్పుడు ఒక అధ్యాపకుడిగా ఎంతో మనసు పెట్టి పని చేశారు. అందరూ పాటించే బోధనా పద్దతులనే అనుసరిస్తూ సులువైన దారిలో ప్రయాణించలేదు ఆయన. గణితం బోధించడానికి ఎన్నో వినూత్న పద్ధతులు కనిపెట్టడమే కాక గణిత అంశాలను వివరించేందుకు ఎన్నో గుజరాతీ పదాలను సృజించారు. కేవలం గణితం బోధించి విద్యార్థుల మెదళ్ళు నింపితే సరిపోదు, వారి జీవితానికి అవసరమైన తరగతి గదికి బయట విషయాలపై కూడా చర్చ చేసి వారి హృదయాలను చేరుకోవాలి అనుకునేవారాయన. గుజరాతీలో మొదటిగా ఒక చిన్న పుస్తకం రాశారు. అటువంటి పుస్తకాన్ని ఎవరూ చదవరు అని ప్రచురణకర్తలు ఎవరూ ప్రచురించేందుకు ముందుకు రాలేదు. దానితో ఆయన తల్లి పంపిన కొద్దిపాటి డబ్బుతో ఆయనే స్వయంగా ఆ పుస్తకాన్ని ప్రచురించారు. సదాచార్ అనే ఆ పుస్తకం మూడు భాషలలో 20 సార్లు పునర్ముద్రణ పొందింది.
ఆ విధంగా ఒక గణిత ఉపాధ్యాయుడిగా, ఒక గుజరాతీ రచయితగా ఆయన రెండు పడవల ప్రయాణం మొదలయ్యింది. గుజరాతీ దినపత్రికలు, మ్యాగజైన్ లలో ఆయన విస్తృతంగా రాయడం ప్రారంభించారు. “టు ది న్యూ జనరేషన్’ పేరుతో ఆయన గుజరాతీ సమాచార్ పత్రిక ఆదివారం అనుబంధంలో యువత, కుటుంబం, మతం, మనస్తత్వ శాస్త్రం, ఇతర సామాజిక సమస్యలపై కాలమ్ రాసేవారు. వాటిని పాత తరం వారే ముందుగా చదువుతారు అనేది ఆయన నమ్మకం. ఆయన రచనలు ఎంతో జనాదరణ పొంది తర్వాత రోజుల్లో పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి. అయితే తన అసలు సబ్జెక్టు అయిన గణితాన్ని మాత్రం ఆయన విడువలేదు. తన సహోద్యోగులతో కలిసి గుజరాతీలో వరుసగా ఎన్నో గణిత టెక్స్ట్ పుస్తకాలను రాశారు. రాబోయే తరాల గుజరాతీ విద్యార్థులంతా అందుకు కార్లోస్ ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
అయితే ఫాదర్ వాలెస్ తన రచనల ద్వారా మాత్రమే గుజరాతీలకు చేరువ కాలేదు. ఒక సంచీ భుజానికి తగిలించుకుని సైకిల్ తొక్కుకుంటూ నగరం అంతా తిరిగే ఆయన గురించి అక్కడ తెలియని వారు లేరు. అహ్మదాబాద్లో ఎక్కడ ఎవరు ఉంటారు, వారి జీవితం, వారి స్వభావాలు, మనస్తత్వాలు, నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. పాత నగరంలోని ఎన్నో కుటుంబాలతో కలిసి ఆయన నివసించారు. “ఏదో ఒక ఇంటిలో వారితో కలిసి ఉంటూ, రెండు పూటలా వారు తినే శాకాహారాన్ని, పడుకోవడానికి ఒక పాత చాపను పంచుకుంటూ, వారి ఆశీర్వాదాలు పొందుతూ, వారి బాధలు తెలుసుకుంటూ జీవించాను. అక్కడి నుండి సైకిల్ తొక్కుకుంటూ కళాశాలకు వెళ్లి బోధన చేయడం, తిరిగి అక్కడికి చేరుకోవడం, కొన్నాళ్ళకి మరొక ఇంటి తలుపు తట్టడం ఇలా దాదాపు పది సంవత్సరాలు జీవించగలిగాను అంటే అది భారతదేశంలో మాత్రమే సాధ్యం” అని రాసారు ఆయన.
అలా 22 సంవత్సరాల పాటు ఆ నగరంలో గడిపిన ఆయన ఇక శేష జీవితం అక్కడే అనుకున్నారు. అయితే విధి మరోలా తలచింది. 90 ఏళ్ళ ఆయన తల్లి ఆ వయసులో తన కొడుకుతో ఉండాలని కోరుకుంది. రెండవ ఆలోచన లేకుండా మాడ్రిడ్ కు చేరుకొని తన 101 వ ఏట ఆమె మరణించే వరకూ అక్కడే ఉన్నారు. తర్వాత ఇంగ్లీష్ లో, స్పానిష్ లో, గుజరాతీలో తన రచనలను కొనసాగిస్తూ విస్తృతంగా ప్రయాణాలు చేశారు. 1999 లో తన 74 ఏళ్ళ వయసులో ఒక కంప్యూటర్ కొనుక్కుని స్పానిష్ లో ఒక వెబ్సైటు ను కూడా ప్రారంభించారు.
ఆ తర్వాత ఫాదర్ వాలెస్ మాడ్రిడ్ లోనే నివసించినప్పటికీ 2015 లో ఒకసారి తిరిగి అహ్మదాబాద్ వచ్చారు. అక్కడి ప్రజలు ఆయనను ఎంతో ప్రేమతో స్వాగతించి ఆదరించారు. 2020 నవంబర్ 9 న ఫాదర్ వాలెస్ మాడ్రిడ్ లో కన్ను మూసారు.
ఆయన మరణం తర్వాత అయినా ఆయన చేసిన కృషిని, ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకుని ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం నిజంగా హర్షణీయం.
Translated from Mamata’s piece
Great information about great mathematician.
LikeLike
He is truly inspiring!
LikeLike