మొత్తానికి కోవిద్ వాక్సిన్ వచ్చింది. వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది మొదటగా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ వాక్సిన్ రూపకల్పనకు ఎన్నో దేశాలు ఎంతో మంది శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు శ్రమించిన విషయం మనకు తెలుసు. అందులో ఎంతోమంది మహిళలు కూడా ఉన్నారు. ఈ 21 వ శతాబ్దంలో సైన్స్ లో మహిళల పాత్ర గురించి మనం పెద్దగా చర్చించుకోనవసరం లేదు. అన్ని రంగాలలోనూ మహిళలు దూసుకుపోతున్న ఈ కాలంలో వాక్సిన్ ల తయారీలో కూడా మహిళలు ప్రముఖ పాత్రనే పోషించారు. ప్రొఫెసర్ సారా గిల్బర్ట్, డాక్టర్ కిజ్మెకియా కార్బెట్, డాక్టర్ నీతా పటేల్ కోవిద్ వాక్సిన్ తయారీలో ప్రముఖంగా వినిపించిన పేర్లు. నీతా పటేల్ మాటల్లో చెప్పాలంటే సైన్స్ లాబ్ లో చాలా వరకు పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే వాక్సిన్ తయారీలో మహిళల పేర్లు ప్రధానంగా వినిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
అయితే గతంలో పరిస్థితి ఇలా లేదు. మహిళలు వాక్సిన్ ల తయారీలో ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ వారికి ఎప్పుడూ తగినంత గురింపు రాలేదు.
ఇరవై శతాబ్దపు తొలినాళ్లలో పోలియో అతి భయంకరమైన వ్యాధి. అది సోకితే కొందరు చనిపోవడం, మరెంతో మందికి కాళ్ళు చచ్చుబడిపోవడం జరిగేది. ఇప్పటికీ ఈ వ్యాధికి మందు లేదు. వాక్సినేషన్ ద్వారా వ్యాధి సోకకుండా అరికట్టడం మాత్రమే చేయగలం. పోలియో వాక్సిన్ ను కనిపెట్టిన ఘనత జోనస్ సాక్ దే అనడంలో ఏ సందేహమూ లేదు. అయితే ఈ వాక్సిన్ కనిపెట్టడంలో మరొక ఇద్దరు మహిళలు చేసిన కృషి మాత్రం ఏ గుర్తింపుకు నోచుకోలేదు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ ఇసాబెల్ మోర్గాన్ వారిలో ఒకరు. పోలియో కు సంబంధించిన హోస్ట్ ఇమ్మ్యూనిటి ని, వాక్సిన్ రూపకల్పనలో జీవించి ఉన్న వైరస్ కి బదులుగా మరణించిన వైరస్ ను వాడే ప్రక్రియను అర్ధం చేసుకోవడంలో ఆమె చేసిన కృషి ఈ వాక్సిన్ పరిశోధనలను పెద్ద మలుపు తిప్పింది. గుర్తింపుకు నోచుకోని రెండవ మహిళ యేల్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ డొరొతి హోస్టమన్. ఆమె తన బృందంతో కలిసి చేసిన కృషి వల్లనే పోలియో కు చుక్కల మందు కనిపెట్టడం సాధ్యమయ్యింది.

ఈ రోజున మనం అనేక వ్యాధులను నిర్మూలించి ఒక భద్రమైన ప్రపంచంలో జీవిస్తున్నామంటే అందుకు అనేక మంది మహిళలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. డిప్తీరియా కు వాక్సిన్ కనుగొన్న డాక్టర్ అన్నా వెస్సెల్స్ విలియమ్స్; కోరింత దగ్గుకి వాక్సిన్ కనుగొన్న డాక్టర్ పెర్ల్ కెండ్రిక్ మరియు గ్రేస్ ఎల్డరింగ్; మెనింజైటిస్, న్యుమోనియా వాక్సిన్ల తయారీలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ మార్గెరిట్ పిట్మాన్; గర్భాశయ కాన్సర్ కు వాక్సిన్ ల అభివృద్ధికి తోడ్పడిన డాక్టర్ అన్నే సరెవ్స్కి, పిల్లలలో తరచుగా వచ్చే డయేరియా కు కారణమైన రోటా వైరస్ కు వాక్సిన్ తయారు చేసిన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ రూత్ బిషప్ వీరిలో కొందరు మాత్రమే.
అయితే వీరందరికన్నా అద్భుతమైన కథ మరొకటి ఉంది. అది పాశ్చాత్య ప్రపంచానికి రోగనిరోధక శక్తి అనే భావనను తొలిసారిగా పరిచయం చేసిన లేడీ మేరీ మాంటాగ్ కథ. 1689 లో జన్మించిన ఈమె సాధించిన విజయాలు అనేకం. అయితే వాక్సిన్ ల రూపకల్పనలో ఆమె పాత్ర గురించి మాత్రమే ఇక్కడ చర్చించబోతున్నాం. ఆమె చాలా తెలివైన, అందమైన స్త్రీ. అయితే 1715 లో మశూచి సోకి ఆమె అందమైన మొహం అంతా స్ఫోటకపు మచ్చలతో వికారంగా మారింది. దానికి ముందు ఆమె సోదరుడు కూడా మశూచి సోకి చనిపోయాడు.దానితో సహజంగానే ఆమె తన పిల్లలు ఎవరికీ ఈ వ్యాధి సోకకూడదని ఎంతో ఆందోళన పడింది. 1716 లో లేడీ మేరీ భర్త లార్డ్ ఎడ్వర్డ్ మాంటాగ్ కాన్స్టాంటినోపుల్ కు రాయబారిగా నియమించబడ్డారు. అక్కడ ఆమె టర్కిష్ మహిళలతో సన్నిహితంగా ఉండి వారి సంప్రదాయాలు, ఆచారాలను గురించి తెలుసుకున్నారు. వారిలో ఆమె ఒక ఆసక్తికరమైన విషయం గమనించారు. అక్కడ ఎవరైనా పిల్లలకు మశూచి సోకినట్లైతే ఆ కురుపు నుండి కారే రసిక ను తీసి మశూచి సోకని పిల్లల చర్మంపై ఎక్కడైనా గీరి ఆ రసిక ను రాసేవారు (Variolation). అలా చేసిన పిల్లలకు ఎప్పటికీ మశూచి సోకకపోవడం లేడీ మేరీ గమనించారు. ఆ ప్రక్రియపై ఎంతో నమ్మకం కలిగి ఆమె తమ ఎంబసీ సర్జన్ ను అడిగి తన ఐదేళ్ళ కొడుకుకి అదే పద్దతిలో టీకా వేయించారు.
ఆమె ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్ళాక అక్కడ కూడా ఈ పద్దతి గురించి విస్తృతంగా కానీ అక్కడి వైద్య వ్యవస్థ దీనిని అశాస్త్రీయమైన పురాతన విధానమని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలకు తగిన పద్ధతి కాదనీ తిప్పికోట్టింది. వారు వ్యతిరేకించడానికి మరొక ముఖ్య కారణం ఈ పద్దతిని ప్రతిపాదించింది ఒక మహిళ కావడం.
1721 లో ఇంగ్లాండ్ లో మశూచి విజృభించింది. లేడీ మేరీ తన కుమార్తెకు కూడా టర్కిష్ పద్దతిలో టీకా వేయించింది. ఆమె ఈ పద్దతి ఎంత ప్రభావవంతమైనదో చెప్పి వేల్స్ యువరాణిని కూడా తన ఇద్దరు కుమార్తెలకు ఈ టీకా వేయించేందుకు ఒప్పించింది. మనుషులలో వచ్చే మశూచి వైరస్ తో కాకుండా పశువులకు సోకే మశూచి వైరస్ తో మరింత సురక్షితమైన వాక్సిన్ ను జెన్నర్ అనే వ్యక్తి రూపొందించేవరకూ కూడా ఇదే పద్దతిలో మశూచి టీకాలు వేసేవారు. అసలు వ్యాధులు రాకుండా నివారించే టీకాలు కనుగొనవచ్చు అనే ఆలోచనకు బీజం పడింది దీనివల్లనే!
Translated from Meena’s Piece