లాక్ డౌన్ సమయం చాలామందికి ఎంతో ఆందోళన, ఒత్తిడిలను కలిగించింది. అనేక కొత్త అంశాల మీద మనల్ని దృష్టి పెట్టేలా కూడా చేసింది. వాటిలో పేరెంటింగ్ ఒకటి. పిల్లలు, పెద్దలు అందరూ ఇంటికే పరిమితమయిపోవడం మొదట్లో ఆనందంగా ఉన్నా రోజులు గడిచే కొద్దీ అందరిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి వలన కానీ, పిల్లలు చేసే అల్లరిని భరించలేకపోవడం వలన కానీ తల్లితండ్రులు జుట్టు పీక్కునే పరిస్థితికి వచ్చారు. పిల్లలని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి అనేది అందరు తల్లితండ్రులకు సమస్యగా మారింది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ తమకంటూ కాస్త వ్యక్తిగత సమయం, స్థలం ఎలా ఎలా సంపాదించుకోవాలనేది మరొక సమస్య. ఎటునుండి ఎప్పుడు వైరస్ ప్రమాదం పొంచి ఉందో అనే అనిశ్చితితో పాటు ఇంటి బాధ్యతలను ఎవరు ఏవిధంగా పంచుకోవాలి అనేవి కూడా దాదాపు అన్ని కుటుంబాలు ఎదుర్కున్న సమస్యలే.
ఇన్ని అనిశ్చితలు, సమస్యల మధ్య సహజంగానే పెద్ద ఎత్తున కౌన్సిలర్లు, థెరపిస్టులు, సైకాలజిస్టులు, పక్కింటి ఆంటీలు పిల్లల పెంపకం మీద సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. మన పిల్లలకు ఏ లోటూ లేకుండా బాగా చూసుకోవాలి అనే మన తాపత్రయంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య సంబంధం పరస్పర గౌరవం అనే సూత్రంపై ఆధారపడి ఉండాలి అనే ప్రాధమిక విషయాన్ని మనం సహజంగానే విస్మరిస్తుంటాం.
భారతదేశంలో మొట్టమొదటి సారి మోంటెస్సోరి విద్యను పరిచయం చేసిన గిజుభాయ్ బాదేక దాదాపు వందేళ్ల క్రితమే పిల్లల పెంపకంపై తల్లితండ్రులకు ఎన్నో విలువైన సూచనలు చేశారు. గిజుభాయ్ తన జీవితాంతం బాలల హక్కులకై కృషి చేశారు. గుజరాతీ భాషలో పిల్లలకోసం ఎన్నో విలువైన పుస్తకాలు రాశారు. గిజుభాయ్ దృష్టిలో ప్రతి పిల్లవాడికి తనదైన ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. పెద్దవాళ్ళం దానిని గుర్తించి గౌరవించాలి. పిల్లల పట్ల ప్రేమ, నమ్మకం, గౌరవం, స్వేచ్ఛ తో కూడిన దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన తల్లిదండ్రులకు సూచనలు చేశారు. మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఈ కింది ఐదు సూత్రాలు పాటించాలనేది ఆయన అవగాహన.
మీ పిల్లల కోసం మీరు ఒకే ఒక్క పని చేయగలిగితే…
అది ఏమై ఉండాలి?
పిల్లలను ఎప్పుడూ కొట్టవద్దు.
మీ పిల్లల కోసం రెండు పనులు మాత్రమే చేయగలిగితే…
అవి ఏమై ఉండాలి?
పిల్లలను ఎప్పుడూ తిట్టవద్దు
వారిని ఎప్పుడూ అవమానించవద్దు
మీ పిల్లల కోసం మీరు మూడు పనులు మాత్రమే చేయగలిగితే
అవి ఏమై ఉండాలి?
పిల్లలను ఎప్పుడూ భయపెట్టవద్దు
పనులు చేయడానికి లంచాలు ఇవ్వవద్దు
మితిమీరి ఆహారం తినిపించవద్దు
మీ పిల్లల కోసం మీరు నాలుగు పనులు మాత్రమే చేయగలిగితే….
అవి ఏమై ఉండాలి?
పిల్లలకు జ్ఞాన ఉద్బోధలు చేయవద్దు
మీ భావోద్వేగాలను వారి ముందు ప్రదర్శించవద్దు
ప్రతి దానిలో తప్పులు వెతకవద్దు
ప్రతిసారీ వారి మీద అధికారం ప్రదర్శించవద్దు
ఒకవేళ మీరు పిల్లలకోసం ఐదు పనులు చేయాలనుకుంటే…
అవి ఏమై ఉండాలి?
పిల్లలు అడిగినదల్లా చేయకండి. వారు చేయగలిగిన పనులు వారినే చేయనివ్వండి.
పిల్లలు ఏమి చేయాలని కోరుకుంటే అది చేసే స్వేచ్ఛనివ్వండి
పిల్లలు చేసిన పనులను తేలికగా తీసుకోకండి
పిల్లలు ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు జోక్యం చేసుకోకండి
వారు ఏది తయారు చేసినా పారవేయకండి
గత వందేళ్ళలో ప్రపంచం ఎంతో మారింది. ఎంతో పురోగమించింది. కానీ ఈ సూత్రాలు మాత్రం కాలాతీతమైనవి కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు వీటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరింత ఎక్కువగా ఉంది.
గిజుభాయ్ బాదేక 1939 జూన్ 23 న తన 54 సంవత్సరాల వయసులో మరణించారు. అయితే పిల్లలకోసం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం ఆయన ఎంతో అపారమైన సంపదను తన రచనల రూపంలో వదిలి వెళ్లారు.
ఈ వ్యాసకర్త మమత గిజుభాయ్ మనవరాలు. ఆయన గుజరాతీలో రాసిన ఎన్నో రచనలు ఇంగ్లీష్ లోకి అనువదించడం ద్వారా తన తాతగారి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనదైన పద్దతిలో పిల్లలకోసం పని చేస్తున్నారు.
–From a piece by Mamata