కొన్ని రోజుల క్రితం నా మేనకోడలు, భారతదేశంలో ‘సంకోఫా’ మాదిరిగానే మనకు ఒక భావన లేదా చిహ్నం ఉందా అని అడిగింది. ఇది నాకు క్రొత్త పదం. నేను వెంటనే దీని గురించి మరింత తెలుసుకోవాలనుకున్నాను. కొంత పరిశోధనతో ఎంతో అర్ధవంతమైన సంకోఫా భావన గురించి తెలుసుకున్నాను.
సంకోఫా భావన పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలోని అకాన్ ప్రజల రాజు ఆదింకెరా నుండి తీసుకోబడింది. సంకోఫా అనే పదం అకాన్ భాషలోని మూడు పదాల నుండి ఉద్భవించింది: శాన్ (తిరిగి), కో (వెళ్ళు), ఫా (చూడండి, వెతకండి మరియు తీసుకోండి). దీనిని యధాతధంగా అనువదిస్తే “తిరిగి వెళ్ళి చూడండి” అని అర్ధం వస్తుంది. అకాన్ మాండలికంలో ఈ భావన “సే వో ఫి ఫి నా వోసాన్ కోఫా ఎ యెంకి” అని వ్యక్తీకరించబడింది. దీని అర్థం “తిరిగి వెళ్లి మీరు మరచిపోయిన వాటిని పొందడం నిషిద్ధం కాదు” అని.
భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునేందుకు గతం మార్గదర్శనం చేస్తుందనే అకాన్ ప్రజల బలమైన నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. కాలంతో పాటు ముందుకు సాగడం, కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల అకాన్ ప్రజలకు విశ్వాసం ఉన్నప్పటికీ గతం నుండి నేర్చుకున్న వివేకమే బలమైన భవిష్యత్తుకి పునాది అని కూడా వారు సూచిస్తారు.
ఈ సంకోఫా అనే భావనకు ప్రతీకగా వారు ఒక పౌరాణిక పక్షి రూపాన్ని ఉపయోగిస్తారు. దాని పాదాలు నేలపై దృఢంగా ఆనించి (లేదా ముందుకు సాగుతున్నట్లు సూచించేలా ఎగురుతున్నట్లుగా) ఉండి తల మాత్రం వెనుకకి తిరిగి (గతాన్ని చూస్తున్నట్లు) ఉంటుంది.
సంకోఫా పక్షిని ఎప్పుడూ నోటిలో గుడ్డుతో చూపిస్తారు. ఒక్కోసారి వెనుకకి తిరిగి గుడ్డు ని నోటితో తీస్తున్నట్లుగా కూడా చూపిస్తుంటారు. ఈ గుడ్డు అనేది గతం నుండి పొందిన విజ్ఞానానికి లేదా ఆ విజ్ఞానం వలన లబ్ది పొందే భవిష్యత్తు తరానికి ప్రతీకగా వారు భావిస్తారు. ఈ విధంగా, భవిష్యత్ ప్రణాళికలకు గతం ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందనే అకాన్ ప్రజల నమ్మకాన్ని ఈ పక్షి దృశ్యాత్మకంగా చూపిస్తుంది.
గతకాలపు అనుభవాలను అవలోకనం చేసుకుని, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను గ్రహించడానికి ఎంతో ప్రయత్నం అవసరం అనేది వెనుక ఉన్న గుడ్డును మెడని చాచి పక్షి అందుకున్నట్లుగా చూపించడం వెనుక ఉన్న ఉద్దేశం.
జీవితంలో మనం ముందుకు సాగాలంటే మన మూలాలకు తిరిగి వెళ్లాలని సంకోఫా మనకు బోధిస్తుంది. దాని అర్ధం గతంలోనే ఉండిపొమ్మని కాదు. గడిచిపోయిన కాలం మనకు అందిస్తున్న పాఠాలను, జ్ఞానాన్ని ప్రస్తుత జీవనానికి అన్వయించుకోవడం ద్వారా భవిష్యత్తు వైపు ప్రయాణించమని దాని అర్ధం. గతకాలంలో మనం చేసిన మంచి చెడులే మన ప్రస్తుత పరిస్థితిని నిర్దేశిస్తాయి. మనం చేసిన లేదా మనకు ఎదురైన మంచి పనుల నుండే కాకుండా గతంలో మనం చేసిన చెడు నుండి, తప్పుల నుండి కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని సంకోఫా సూచిస్తుంది. ఈ అవలోకనం వలన గతంలో చేసిన తప్పులు మనం తిరిగి చేయకుండా ఉంటాము.

గతానికి, గత చరిత్రకు, పెద్దలకు, పూర్వీకులకు ఇవ్వవలసిన గౌరవాన్ని సంకోఫా మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచంలోని అన్ని పురాతన సంస్కృతులు కూడా పెద్దలను గౌరవించే సాంప్రదాయాన్ని పాటిస్తూ వారిని గత కాలపు జ్ఞానాన్ని, అనుభవాలను తర్వాత తరాలకు అందించే జ్ఞాన బాండాగారాలుగా భావిస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఈ పెద్దల సహజ విజ్ఞానాన్ని చాదస్తం పేరుతో కొట్టిపడేసే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. గూగుల్ గురు లో సమస్త సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు ఏదైనా పాత విషయాల గురించి తెలుసుకోవాలంటే తాతలను, మామ్మలను అడగడం ఎందుకు? అయితే ఈ పారంపర్య జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే ప్రయత్నం ఇటీవల ఒకటి జరిగింది.
2007 జులై లో నెల్సన్ మండేలా తన 89 వ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలోని దీర్ఘకాల సంక్షోభాలను పరిష్కరించడానికి, యుద్ధాలను నివారించి, శాంతిని పెంపొందించడానికి గానూ కొత్త మార్గాలను కనుగొనటానికి అంకితమైన పెద్దల మండలిని ఏర్పాటు చేశారు. మండేలా మాటలలో చెప్పాలంటే ఈ వృద్దులు భయం నెలకొని ఉన్న చోట ధైర్యాన్ని నింపుతారు, సంఘర్షణ ఉన్న చోట శాంతి నెలకొల్పుతారు; నిరాశా నిస్పృహల స్థానంలో ఆశని నింపుతారు.
ఈ పెద్దలంతా అంతర్జాతీయంగా గౌరవాన్ని, గుర్తింపును, విశ్వాసాన్ని చూరగొన్న నాయకులు. వారు ఇప్పుడు ప్రభుత్వంతో, మరే ఇతర లాభాపేక్ష గల సంస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
ఈ పెద్దల మండలిలో భారత దేశం నుండి ఈలా భట్; ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్; మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్; సౌత్ ఆఫ్రికా కు చెందిన విశ్రాంత ఆర్చిబిషప్ డెస్మండ్ టూటూ ముఖ్య సభ్యులుగా ఉన్నారు. మాజీ నార్వే ప్రైమ్ మినిస్టర్ గ్రో హార్లెమ్; బాలల హక్కులపై పని చేస్తున్న మండేలా సతీమణి గ్రాసా మాచెల్; మాజీ ఐరిష్ ప్రెసిడెంట్ మేరీ రాబిన్సన్; మైక్రో-క్రెడిట్ ఉద్యమ రూపశిల్పి, గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు అయినా ముహమ్మద్ యూనిస్ లు ఇందులో ఇతర సభ్యులుగా ఉన్నారు.
సంఘర్షణ, గందరగోళాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి మార్గదర్శకత్వం చేయడానికి ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన, అవసరమైన ప్రయత్నం.
అయితే ఈ నాటి ప్రపంచం గతాన్ని చూసే పద్దతిలో ఒక ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకునే దాని కన్నా గతం నుండి తమకు అనుకూలమైన వాటిని వెలికి తీసి ప్రస్తుత రాజకీయ అజెండాలకు, మత వాతావరణానికి తగినట్లు ఆ భావాలను శాశ్వతంగా కొనసాగేలా చూడడానికి ప్రయత్నం జరుగుతుంది. మరొకవైపు కొన్ని అంశాలలో అసలు చరిత్ర అంతటినీ తుడిచిపెట్టి మళ్ళీ కొత్త భావాలను పునర్నిర్మించే ప్రయత్నం జరుగుతుంది.
మన అహంకారపు భావజాలాలతో గతం మనకి అందించే అమూల్యమైన పాఠాలను విస్మరించకూడదనీ, మన గత అడుగులను తరచి చూసుకుంటూ అవసరమైన చోటల్లా మన దారులను మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలనీ సంకోఫా మనకు గుర్తుచేస్తుంది. ఒక పాత సామెతలో ప్రస్తావించినట్లు, చరిత్రను మర్చిపోయిన వారు దానినే పునరావృతం చేస్తుంటారు.
వెనక్కి తిరిగి మన మూలలను తరచి చూసుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. సంకోఫా అనే ఈ చిన్న పదం ఇంత లోతైన భావనను సూచిస్తుంది.
ఈ పదాన్ని నాకు పరిచయం చేసిన సుపర్ణకు కృతజ్ఞతలు.
From a piece by Mamata.