పట్టణాలలో మనం చూసే పే అండ్ యూజ్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలోని కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకున్నాను. అవి నిజంగా ఎంతో ఆసక్తికరమైనవి. అయితే వాటి గురించి మరొక సందర్భంలో మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో పే అండ్ యూజ్ టాయిలెట్ల నిర్మాణం గురించి ఆలోచన చేసినప్పుడు మేము చేసిన ఒక సర్వే గురించిన వివరాలు తెలియచేస్తాను.
ఈ సర్వే నిర్వహించి దాదాపు దశాబ్దం గడిచింది. అయినా ఈ సర్వే ద్వారా మేము తెలుసుకున్న సమస్యలు ఇప్పటికీ దాదాపు అలాగే ఉండడం విచారకరం.
దాదాపు 400 మంది మహిళలతో నిర్వహించిన ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
- దాదాపు నాలుగింట ఒక వంతు మందికి మహిళలకోసం పే అండ్ యూజ్ టాయిలెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న విషయమే తెలియదు.
- బయటకు వెళ్ళినప్పుడు టాయిలెట్ కు వెళ్ళవలసిన అవసరం వచ్చినా ఆపుకుని ఇంటికి చేరే వరకూ ఎదురు చూస్తామని దాదాపు సగం మంది మహిళలు తెలియచేసారు.
- పేద మహిళలు, ప్రతిరోజూ బయట పనికి వెళ్ళే మహిళల కన్నా ధనికులైన మహిళలు, గృహిణులు, విద్యార్థినులు ఈ టాయిలెట్ లను చాలా తక్కువగా వినియోగిస్తున్నారు.
- ఈ టాయిలెట్లు వినియోగించిన వారిలో 64.2 శాతం మంది తమకు చాలా అసౌకర్య అనుభవం ఎదురైందని చెప్పారు. వారు పేర్కొన్న అసౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి.
అసౌకర్య కారణం | పేర్కొన్న మహిళల శాతం |
అపరిశుభ్రత | 92.5 |
తగినన్ని నీరు లేకపోవడం | 69.2 |
దుర్గంధం | 62.8 |
కేర్ టేకర్ గా మగవారు ఉండడం | 57 |
మగవారి, ఆడవారి టాయిలెట్లు ఒకే చోట ఉండడం | 53 |
అభద్రతా భావం | 36.4 |
ఈ సమస్యలను పేర్కొన్న మహిళలంతా కొన్ని విలువైన సూచనలు కూడా చేశారు.
- మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉండాలి అని 53% మహిళలు చెప్పారు
- టాయిలెట్ల ను నిర్వహించే కేర్ టేకర్ కు మర్యాదపూర్వకంగా ప్రవర్తించేలా తగిన శిక్షణ ఉండాలని, వారు చదువుకుని ఉండి, మధ్య వయసులో ఉన్నవారైతే బాగుంటుందనీ 57% మంది మహిళలు అభిప్రాయపడ్డారు
- టాయిలెట్లలో సానిటరీ నాప్కిన్ల వంటివి పారవేయడానికి డస్ట్ బిన్లు, మహిళలు తీసుకువెళ్ళే వస్తువులు పెట్టుకోవడానికి చిన్న అరలు, మగ్గు, బకెట్లు, మంచి వెలుతురు ఉండాలని అనేక మంది మహిళల అభిప్రాయం
- రకరకాల నేపధ్యాల నుండి వచ్చిన వారి అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ టాయిలెట్లు, వెస్ట్రన్ టాయిలెట్లు రెండూ ఉండాలనేది మరొక అభిప్రాయం.
- భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి
- సరైన నిర్వహణ, ఎప్పటికప్పడు శుభ్రం చేస్తుండడంతో పాటు సమగ్ర పర్యవేక్షణ ఉండాలి
- కొన్ని చోట్ల టాయిలెట్ల చుట్టూ ఉండే కొద్దిపాటి స్థలాన్ని మగవారు టాయిలెట్ల లాగా ఉపయోగిస్తున్నారు. దానివలన దుర్వాసన తో పాటు టాయిలెట్లో కి అడుగుపెట్టడానికి కూడా మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది
- చాలా చోట్ల “మగవారి”, “ఆడవారి” టాయిలెట్ల ను సూచించే గుర్తులు సరిగా సూచించబడి లేవు. దానివలన కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
దశాబ్దం క్రితం మేము ఈ సర్వే నిర్వహించినప్పటికన్నా ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ల సంఖ్యా బాగా పెరిగింది. వాటి నిర్వహణ కూడా మెరుగయ్యింది. అయినా ఇంకా చాలా విషయాలలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ మెరుగుపడవల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ని సమస్యలపై దృష్టి పెట్టి పని చేస్తే కానీ మన టాయిలెట్లు మెరుగుపడి మహిళల ఇబ్బందులు తీరే అవకాశం లేదు.
–From a piece by Meena