ఏమి తీసుకుంటారు? ఒక సాయంత్రం మా ఇంటికి వచ్చిన స్నేహితులు కిరణ్, జగదీప్ లను మా అమ్మ అడిగింది
వాళ్ళ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఇంటికి వచ్చిన అతిధులకు ఇలా బోర్నవిటా, హార్లిక్స్ వంటి పానీయాలను ఇవ్వడం మనకి దక్షిణ భారతదేశంలో కొంత సహజమే కానీ ఉత్తర భారతదేశంలో అది కొంచెం అసహజంగా కనిపించే విషయమే. చివరకి వారు హార్లిక్స్ కావాలని అడిగి తాగారు. దానిని బాగా ఇష్టపడ్డారు. వారికి అది ఎంతగా నచ్చిందంటే అది మళ్ళీ తాగాలనిపించి ఇంట్లో రోజూ తాగేందుకు వీలుగా ఒక పెద్ద హార్లిక్స్ సీసా కొనుక్కుని ఇంటికి వెళ్ళారు.
ఇటువంటి పానీయాలన్నీ మన చిన్న నాటినుండీ అలవాటుగా తాగుతూ వస్తున్నవే. అవి శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకి ఎంత నమ్మకం అంటే వీటిలో ఏదో ఒకటి మన వంటింట్లోని అలమరలలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అవి పిల్లలకు ఇవ్వడం మాత్రమే కాదు. ఇంట్లోని ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఏదైనా కొంచెం నలతగా ఉన్నా, కాఫీ,టీ లు కాకుండా వేరే ఏదైనా తాగాలనిపించినా వీటినే తాగడం సర్వసాధారణం. అంతేకాకుండా, కొన్ని రాష్ట్రాలలో ఇంటికి వచ్చిన అతిధులకు కూడా ఈ పానీయాలను ఇవ్వడం సాధారణంగా జరిగేదే.
మన జీవితాలలో ఇంతగా భాగమయిపోయిన ఈ పానీయాలు అసలేమిటి?

భారతదేశంలో అన్నిటికిన్నా విరివిగా వినియోగంలో ఉన్నది హార్లిక్స్. హార్లిక్స్ కు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ మనదేశం. ఈ పానీయం యొక్క మూలాలు తెలుసుకోవాలంటే మనం 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1873 లో జేమ్స్ హార్లిక్స్ అనే ఫార్మసిస్ట్ తన సోదరుడు విలియం తో కలిసి చికాగోలో జె&డబ్ల్యు హార్లిక్స్ అనే కంపెనీ ని స్థాపించాడు. ఈ కంపెనీ పేటెంట్ పొందిన మాల్టెడ్ డ్రింక్ ను తయారు చేసేది. మొదట్లో ఇది పసి పిల్లలకు మాత్రమే ఇచ్చే ఆహారంగా మార్కెట్ చేయబడిన తర్వాత కాలంలో ముసలి వారికి, ప్రయాణాలు చేసేవారికి కూడా శక్తి నిచ్చే పానీయంగా మార్కెట్ చేయడం జరిగింది. 20 వ శతాబ్దం మొదట్లో దీనిని ఆహారానికి బదులుగా తీసుకోగలిగిన పానీయంగా ప్రచారం చేశారు. మన దేశం విషయానికి వస్తే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ ఆర్మీ తరపున యూరప్ కి పంపబడిన మన సైనికులు తిరిగి వస్తూ ఈ హార్లిక్స్ ను మనదేశానికి తీసుకు వచ్చారు. పంజాబ్, బెంగాల్, మద్రాస్ రాష్ట్రాల ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడి ఆదరించారు. 1940, 50 లలో ఇది ఇంట్లో ఉండడం ఒక స్టేటస్ సింబల్ గా భావించేవారు.
ఆ తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఒకే ఫ్లేవర్ లో దొరికే హార్లిక్స్ మన జీవితాలలో భాగం అయిపొయింది. ఇప్పుడు ఇలాచీ, కేసర్ బాదం వంటి ఎన్నో ఫ్లేవర్ లలో హార్లిక్స్ లభిస్తుంది. అలాగే ఇప్పుడు వివిధ వయసుల వారికి, వివిధ జెండర్ లకు తగినట్లు వేరు వేరు రకాల హార్లిక్స్ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి.
హార్లిక్స్ లో ఉండే ఒక ప్రత్యేక గుణం ఏమిటంటే ఇది అంత తేలికగా కరగదు. ఎంత ప్రయత్నం అవసరమని! ఒక స్పూన్ తో కొంచెం పొడిని గ్లాస్ లో వేసి వేడి వేడి నీళ్ళు కొంచెం పోసి బాగా కలిపితే కొంచెం కరుగుతుంది. మధ్యమధ్యలో అక్కడక్కడా ఉండలు కనిపిస్తే స్పూన్ ని వెనక్కి తిప్పి ఉండలను గ్లాస్ అంచుకు వేసి నొక్కితేనే అవి పూర్తిగా కరుగుతాయి. అప్పుడు వేడి పాలను పోసుకుని కలుపుకుని తాగాలి. ఇంత చేసినా ఒక్కోసారి గ్లాస్ చివరిలో ఉండలు కనిపిస్తూనే ఉంటాయి.
హార్లిక్స్ వంటి ఇతర పానీయాలతో మరీ ఇంత సమస్య ఉండదు.
హార్లిక్స్ తో పోలిస్తే బోర్నవిటా ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన పానీయం అనే చెప్పాలి దీనిని 1920 లలో ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే మన దేశ మార్కెట్ లోకి 1948 మాత్రమే ఈ పానీయం అడుగుపెట్టింది. ఈ మాల్టెడ్ చాక్లెట్ మిక్స్ ను క్యాడ్బరీ తయారు చేసింది. వారి ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన ఆదర్శగ్రామం బోర్నవిల్లే పేరు మీద దానికి బోర్నవిటా అనే పేరు పెట్టడం జరిగింది. వెన్న తీయని పాలు, తాజా గుడ్లు, మాల్ట్, చాక్లెట్ లతో తయారయిన ఈ పానీయాన్ని ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా మార్కెట్ చేశారు.
ఇక ఓవాల్టిన్ విషయానికి వస్తే ఇది స్విట్జర్లాండ్ లో తయారయ్యింది. అక్కడ దీనిని వోవోమల్టిన్ అని పిలుస్తారు. ఓవం (గుడ్లు), మాల్ట్ అనే రెండు పదాల కలయికతో దానికి ఆ పేరు వచ్చింది. 1909 లో అది యుకె మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది. అక్కడ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో అప్లికేషన్ మీద పేరు తప్పుగా రాయడంతో దానిపేరు ఓవాల్టిన్ గా మారిపోయింది. ఇక ఇంగ్లీష్ మార్కెట్ లో అదే పేరుతో స్థిరపడిపోయింది మొదట్లో మాల్ట్, గుడ్లు, కోకో తో తయారుచేయడిన ఈ ఉత్పత్తి తర్వాత కాలంలో అనేక ఇతర రకాల ఫ్లేవర్ లలో, రుచులలో కూడా లభిస్తుంది. భారతదేశంలో, యుకె లో అమ్ముడయ్యే ఓవాల్టిన్ లో ఇప్పుడు గుడ్లు ఉండడం లేదు.
వీటన్నింటికీ భిన్నంగా కాంప్లెన్ పూర్తిగా మిల్క్ ప్రోటీన్ తో తయారవుతుంది. 1942 లో యుకె లో దీనిని రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు కేవలం కొద్దిపాటి రేషన్ మాత్రమే తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేవారు. దీనితో వారికి తేలికగా తీసుకువెళ్లగలిగేలా, తొందరగా శక్తినివ్వగలిగేలా ఉండే పానీయం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దీనిని తయారు చేయడం జరిగింది. భారత దేశపు మార్కెట్ లో 1964 లో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.
చాలామందికి అంతగా పరిచయం లేని మరొక పానీయం రాగిమాల్ట్. ఇప్పుడైతే నాకు మార్కెట్ లో దొరకడం లేదు. నారింజ రంగులో ఉండే ఈ పానీయం పిల్లలకోసం అని ఉద్దేశించబడినప్పటికీ అందరూ ఇష్టపడేంత తీయగా ఉండేది.
వీటిలో చాలా పానీయాలు ఇప్పుడు అనేక దేశాలలో లభించడం లేదు. ఉదాహరణకు 2008 నుండి యుకె లో బోర్నవిటా ను అమ్మడం లేదు. ఇప్పుడు అందరి అభిప్రాయాలు అభిరుచులు మారిపోవడం, పోషణ పట్ల ప్రజలకు ఉన్న అవగాహనలో వస్తున్న మార్పు, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు, వేగనిజం వంటి కొత్త ధోరణుల మధ్య ఈ పానీయాలు ఎంత కాలం ఇంకా మనుగడలో ఉంటాయో అనిపిస్తుంది.
వెళ్ళి ఇప్పుడే ఒక బాటిల్ తెచ్చుకుందామా?
–From a piece by Meena