పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఈ ఏప్రిల్ ఒకటి అత్యంత ముఖ్యమైన రోజు. ఎంతో అప్రమత్తంగా గడపాల్సిన రోజు కూడా. భుజం మీద ఏమైనా పడుతున్నాయా చూసుకోవడం, ఏవైనా కవర్లు, ఎన్వలప్ లు కనపడితే జాగ్రత్తగా తెరవడం, స్నేహితులను, కుటుంబ సభ్యులను ఎలా ఫూల్స్ ని చేయాలా అని ప్రణాళికలు వేసుకోవడంతో రోజు గడిచిపోయేది. మన ప్రయత్నాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఏప్రిల్ ఫూల్ అనే అరుపులు మాత్రం భలే సరదాగా ఉండేవి.

మిగతా ప్రత్యేక దినాల్లాగా ఈ రోజు ఏ ప్రాంతానికో, సంస్కృతికో, మతానికో సంబంధించినది కాదు. కాస్తంత చిలిపి ఆలోచనలు ఉండి ఉల్లాసంగా, ఆనందంగా గడపాలని కోరుకునేవారందరూ ఈ రోజును సరదాగా గడుపుతూ, అందరినీ ఆటపట్టిస్తూ గడిపేస్తారు. ఎన్నో ఏళ్ళ నుండి ఇలా అందరూ వేడుకగా జరుపుకునే ఈ రోజుకి ఎంతో సుదీర్ఘమైన, కొంత అస్పష్టమైన చరిత్ర ఉంది. ఎన్నో దేశాలలో ఈ రోజును ఫూల్స్ డే గా జరుపుకునే ఆనవాయితీ ఉన్నప్పటికీ అసలు ఇదెక్కడ మొదలయ్యింది అనేదానిపై అంత స్పష్టత లేదు.
16 వ శతాబ్దంలో యూరప్ లో ఫ్రాన్స్ దేశం జూలియన్ క్యాలెండర్ నుండి జార్జియన్ క్యాలెండర్ కు మారినప్పుడు ఈ ఆనవాయితీ మొదలయిందని కొందరి చరిత్రకారుల ఊహ. జూలియన్ క్యాలెండర్ ప్రకారం స్ప్రింగ్ ఈక్వినాక్స్ మొదలయ్యే మొదటి రోజైన ఏప్రిల్ ఒకటిని నూతన సంవత్సర ప్రారంభంగా భావించేవారు. అయితే 1582 నుండి జార్జియన్ క్యాలెండర్ ను అనుసరించడం ప్రారంభించాక జనవరి ఒకటిని నూతన సంవత్సర ప్రారంభంగా భావించడం మొదలుపెట్టారు. ఈ మార్పును అందరూ గ్రహించి అనుసరించడం మొదలుపెట్టడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది అని చరిత్ర చెబుతుంది. ఎవరైతే ఈ మార్పు గురించి తెలుసుకోలేకపోయారో, తెలుసుకున్నా మార్పుకు సిద్ధపడకుండా మార్చ్, ఏప్రిల్ లలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారో వారిని ఆటపట్టిస్తూ ఏప్రిల్ ఫూల్స్ అనడం ప్రారంభమయ్యింది అని తెలుస్తుంది. ఇటువంటి వారిని ఆటపట్టించేందుకు గానూ వారి వీపులకు కాగితంతో తయారు చేసిన చేప బొమ్మలను (వాటిని ఏప్రిల్ ఫిష్ అనేవారు) అతికించేవారు. ఈ ఏప్రిల్ ఫిష్ అనేవి తేలికగా దొరికిపోయి చిన్ని చేపలు. అమాయకంగా కనిపించే వ్యక్తులను వీటితో పోలుస్తారు.
ఇంకొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఫూల్స్ డే అనేది ఇంకా ముందే గ్రీకో-రోమన్ పండుగ అయిన హిలేరియా పండుగ జరుపుకునే రోజులనుండే ప్రారంభమయ్యింది. హిలేరియా పండుగ గ్రీకుల దేవతలకు తల్లి అయిన సైబెలె యొక్క గౌరవార్ధం జరుపుకునే పండుగ. ఆ రోజున జాతరలు, ఇంద్రజాల ప్రదర్శనలు, హాస్య ప్రదర్శనలు జరుపుకోవడం వారి ఆనవాయితీ. నిజానికి శీతాకాలం ముగిసి వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో పండుగ జరుపుకోవడం దాదాపు అన్ని సంస్కృతులలోనూ ఉంది. ఆ పండుగలలో భాగంగా ఆ ఒక్క రోజూ అందరూ సంప్రదాయాలను పక్కన పెట్టి పెద్ద, చిన్న తేడా లేకుండా ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడం, సరదాగా గడపడం జరిగేది. పిల్లలు తల్లితండ్రులను, పనివారు తమ యజమానులు ఆటపట్టించడానికి ఆరోజున అనుమతి ఉంది. సహజంగా ఆమోదయోగ్యం కానీ కొన్ని మానవ ప్రవర్తనలను (అబద్ధం ఆడడం, మోసం చేయడం, ఆటపట్టించడం) ఆ ఒక్క రోజూ ఆమోదించడం ద్వారా మనుషుల్లో ఆ ప్రవర్తనలను ప్రదర్శించడం పట్ల ఉన్న కోరిక కొంతవరకు తీరినట్లు భావించేవారని కొందరు ఆంత్రోపాలజిస్ట్ ల అభిప్రాయం.
18 వ శతాబ్దంలో ఈ ఏప్రిల్ ఫూల్స్ డే సంప్రదాయం బ్రిటన్ లో మొదలయ్యింది. తర్వాత కాలంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించారు. స్కాట్లాండ్, ఐర్లాండ్ లలో ఎవరో ఒకరికి ఇచ్చి ఒక సీల్డ్ కవర్ ను తాము ఎవరినైతే ఫూల్ చేయాలనుకున్నారో వారికి పంపించేవారు. అందులో ఎవరో ఆపదలో ఉన్నారని సహాయం కావాలనే సందేశం ఉండేది. దానికి చివర ‘Dinna laugh, dinna smile. Hunt the gowk another mile’ అని ఉండేది. దాని అర్ధం నవ్వుకుని ఊరుకోవద్దు. దీనిని మరొకరికి పంపు అని. ప్రతి ఒక్కరూ ఇటువంటి సందేశం అందగానే నవ్వుకుని ఎవరికైనా ఇచ్చి దానిని మరొకరికి పంపేవారు.
కాలం గడిచేకొద్దీ ఈ ఏప్రిల్ ఫూల్స్ డే సంప్రదాయం ప్రపంచమంతటా వ్యాపించి రకరకాల వినూత్న ధోరణులు మొదలయ్యాయి. స్నేహితులనో, కుటుంబ సభ్యులనో సరదాగా ఆటపట్టించే స్థాయిని దాటి పత్రికలు, రేడియోలు, టెలివిజన్ లలో కూడా పాఠకులను, ప్రేక్షకులను ఫూల్స్ చేసేందుకు తప్పుడు సమాచారాలని ఇచ్చే స్థాయికి చేరుకుంది.
ఇటువంటి వాటిలో అందరికీ బాగా గుర్తు ఉండిపోయేది బిబిసి ఛానల్ చేసిన ప్రాంక్. టెలివిజన్ రంగంలో బిబిసి కి ఉన్న పేరు ప్రఖ్యాతులు మనకి తెలియనివి కావు. 1957 ఏప్రిల్ ఒకటైన బిబిసి లో వార్తలు అందించే పనోరమా షోలో స్విట్జర్లాండ్ లో స్పాగెట్టి (నూడుల్స్ లాగా ఉండి ఇటాలియన్లు ఆహారంగా తీసుకునే పాస్తా) చెట్లు పండిస్తున్నట్లు, ఆ చెట్ల నుండి స్పాగెట్టి ని కోస్తున్నట్లు మూడు నిమిషాల వీడియో ను ప్రసారం చేసింది. ప్రేక్షకులు ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో మంది బిబిసి కి వారు చెట్లకి స్పాగెట్టి ఎలా పెంచుతున్నారు అని అడుగుతూ ఉత్తరాలు కూడా రాశారు. బిబిసి కొంతమందికి “ఒక స్పాగెట్టి తీగని ఒక టమోటో సాస్ డబ్బాలో వేసి ఎదురు చూడండి” అని సరదాగా ప్రత్యుత్తరం కూడా పంపింది.
1962 లో అప్పటికింకా కలర్ టివి లు రాని కాలంలో స్వీడన్ లోని ఒక నేషనల్ ఛానల్ లో సాంకేతిక విభాగంలోని ఒక వ్యక్తి నైలాన్ సాక్స్ లను కొంచెం సాగదీసి వాటిలో నుండి టెలివిజన్ ప్రసారాలను చూస్తే అవన్నీ రంగులలో కనిపిస్తాయని ప్రకటించాడు. అది నిజం అనుకుని ఎంతో మంది తమ సాక్స్ లు పాడు చేసుకుని మరీ ప్రయత్నించి చూసారు.
పక్కనే ఉన్న జర్మన్లు కూడా తక్కువ తినలేదు. 1994 లో జర్మనీలోని ఒక రేడియో స్టేషన్ నుండి ఒక ప్రకటన వెలువడింది. అది ఉడతలు జతకట్టే సమయం అనీ, ఆ ప్రాంతంలో రోజూ జాగింగ్ చేసేవారు గంటకి పది కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో జాగింగ్ చేస్తే వాటికి ఇబ్బంది కలిగించకుండా ఉంటారనేది ఆ ప్రకటన సారాంశం. 2004 లో ఒక బెర్లిన్ పత్రికలో అమెరికన్ ఎంబసీ ఫ్రెంచ్ ఎంబసీ ఒకే వీధిలో ఉండడం ఇష్టం లేక అమెరికన్ ఎంబసీని వేరే చోటుకి మారుస్తున్నారు అని వార్త వచ్చింది. అది కూడా ప్రజలను ఫూల్స్ చేసేందుకు ఆ పత్రిక ఇచ్చిన తప్పుడు వార్తే.
సమాచార సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చిన ఈ కాలంలో ఈ ప్రాంక్ లు కూడా మరింత ఆధునికతను, సాంకేతికతను సంతరించుకున్నాయి. గూగుల్ లాంటి సంస్థ కూడా అత్యంత అనుభవజ్ఞులైన తమ సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రతి ఏటా ప్రాంక్స్ తయారు చేస్తుంది. 2004 ఏప్రిల్ ఒకటిన గూగుల్ జిమెయిల్ యొక్క ట్రయిల్ వెర్షన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించగానే అందరూ అది కూడా జోక్ అనుకునేంతగా గూగుల్ ఏప్రిల్ ఒకటి ప్రాంక్స్ ప్రజలకు గుర్తుండిపోయాయి. అయితే 2020 లో కోవిద్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దానితో పోరాడుతున్న ప్రజల గౌరవార్ధం గూగుల్ ఎటువంటి ప్రాంక్ లు, జోక్ లు విడుదల చేయలేదు. ఈ సంవత్సరం కూడా గూగుల్ అదే కొనసాగించింది.
ఒకప్పుడు ఈ తప్పుడు వార్తలు, ఆటపట్టించడాలు అన్నీ ఏడాదికి ఒకసారి చేసే పనులు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇరవై నాలుగు గంటలు వార్తలు, గాసిప్ లు, రూమర్లు ప్రచారమవుతూనే ఉంటే ఏది అసలు, ఏది నకిలీ అని కనిపెట్టడం ఎంతో కష్టమవుతుంది. ఈ రోజుల్లో మనం ఫూల్స్ కావడానికి ఏప్రిల్ ఒకటి వరకూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు.
–Based on a piece by Mamata