మీ స్కూల్ టైం టేబుల్ లో వారానికి ఒక మూడు రోజులు ఈల వేయడం నేర్పించే తరగతులు ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మనకి ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ విషయం లాగోమేరా లోని పిల్లలకి దైనందిన వాస్తవం. ఈ లాగోమేరా అనేది క్యానరీ ద్వీపాలలో ఒకటి. అట్లాంటిక్ మహాసముద్రంలో అనేక ద్వీప సమూహాలలో ఈ క్యానరీస్ ఒకటి. మొరాకో నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్పెయిన్ కి చెందిన స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగాలలో ఈ క్యానరీస్ ఒకటి. మొదటిగా అక్కడ బెర్బెర్ తెగ ప్రజలు నివసించేవారు. 15, 16 వ శతాబ్దాలలో ఈ ద్వీపాన్ని స్పెయిన్ ఆక్రమించుకుని తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ద్వీప సమూహంలో అత్యంత ప్రత్యేకమైనది లాగోమేరా. అక్కడి ప్రజలు సంభాషించుకునే సిల్బో గొమేరా అనే ఈల భాష ఈ ద్వీపానికి ఉన్న ప్రత్యేకత. అక్కడి ఆదివాసీ తెగ అయిన బెర్బర్లు తమలో తాము సంభాషించుకునేందుకు వాడిన అత్యంత పురాతనమైన భాష ఈ ఈల భాష. తర్వాత కాలంలో స్పెయిన్ తమపై దాడులు జరిపే సందర్భంలో కూడా తమలో తాము రహస్య సంభాషణలు జరుపుకునేందుకు కూడా ఈ భాషనే వాడేవారు.
15 వ శతాబ్దపు చరిత్రకారుల రచనలలో కూడా ఈ ఈల భాషకు సంబంధించిన సమాచారం ఉంది. 16 వ శతాబ్దంలో స్పెయిన్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన స్పానిష్ ప్రజలకు కూడా వీరు ఈ భాష అలవాటు చేశారు. స్పానిష్ భాషలోని ఎన్నో పదాలు కూడా ఈ ఈల భాషలోకి బదిలీ చేయబడ్డాయి.

లోతైన, నిటారుగా ఉన్న లోయలతో నిండిన ఈ ద్వీపంలో ఈల భాషలో మాట్లాడుకోవడమే సరైన సమాచార సాధనం. ఇక్కడి ఇళ్లన్నీ ఒకదాని నుండి ఒకటి ఎంతో దూరంలో నిర్మించబడి ఉంటాయి. మనుషులు ముఖాముఖి కలిసి మాట్లాడుకోవడానికి అవకాశాలు అరుదుగా ఉండే ఈ ప్రాంతంలో ఏవైనా జనన, మరణాల సమాచారం అందరికీ చేరవేయాలన్నా, ఏదైనా విందు, వినోదాలకు ఇతరులను ఆహ్వానించాలన్నా విజిల్ ద్వారా మాత్రమే సమాచారం అందించగలిగేవారు. గాలి వాలు సరిగ్గా ఉన్న సమయంలో ఈ ఈల శబ్దాలు 3 కిలోమీటర్ల వరకూ వినిపిస్తాయి.
ఈల భాషతో బాగా పరిచయం ఉన్న ఈ ద్వీపపు వృద్ధుడు ఒకరు ఇలా వివరించారు. “ఈల వేయడం నేర్చుకోవడం ఇక్కడ ఏదో ఆనందం కోసం చేసే పని కాదు. అది ఇక్కడ మాకు తప్పనిసరి అవసరం. విజిల్ వేయడం నేర్చుకోలేకపోతే ఏ చిన్న మాట చేరవేయాలన్నా నువ్వు మైళ్ళ దూరం నడవాల్సి ఉంటుంది. ఇళ్లన్నీ విసిరివేసినట్లు దూరదూరంగా ఉండి, రోడ్లు, ఫోన్ వంటి సౌకర్యాలు లేని ఇటువంటి ప్రాంతంలో నడవడం కంటే ఈల వేయడం నేర్చుకోవడం చాలా తేలికైన పని.
ఇటువంటి అవసరం నుండి ఉద్భవించిన భాషే ఈ ఈల భాష. దీనిని అధికారికంగా సిల్బో గొమేరో అని పిలుస్తారు. ఈల శబ్దం యొక్క స్థాయి, దీర్ఘాన్ని బట్టి పదాలను గుర్తించగలుగుతారు. పదాలు స్పానిష్ భాషకు సంబంధించినవి. ఆ పదాలు గుర్తించేందుకు తగినట్లు 2 ఈలలతో అచ్చులు, నాలుగు ఈలలతో హల్లులు సృష్టించుకున్నారు. ఒక్కో పదానికి ఒక్కోరకమైన ఈల శబ్దం ఉంటుంది. వాక్యానికి వాక్యానికి మధ్య తేడా తెలిసేలా ఈల మధ్యలో విరామం ఇస్తారు. శబ్దం పెద్దగా వచ్చేందుకు వీలుగా వేలిని పెట్టుకుని ఈల వేస్తారు. దానిలోనూ రకరకాల శైలిలు ఉన్నాయి. కొందరు ఒకటే చేతి యొక్క వేళ్ళు రెండింటిని నోటిలో పెట్టుకుని ఈల వేస్తే మరికొంతమంది ఒక్కో చేతి నుండి ఒక్కో వేలును నోటిలో పెట్టి ఈల వేస్తారు. ఎవరు ఎలా వేసినా ఏ రకమైన ఈల శబ్దానికి ఏ అర్ధం ఉందో అక్కడి ప్రజలందరికీ తెలుసు.
1950 ల వరకు సిల్బో గొమేరో నే ఇక్కడ అధికారిక భాషగా ఉండేది. ఇండ్లలో మాట్లాడుకునే భాష, పిల్లలు నేర్చుకునే భాష ఇదే. వృద్ధ తరం అంతరించి యువతరం ఇతర ప్రాంతాలకు వలస పోవడం, విద్యా సంస్థలలో ఆధునిక స్పానిష్ భాష నేర్పించడం ప్రారంభం అయ్యాక ఇతర ప్రాచీన భాషలలాగే ఈ భాష కూడా ప్రాభవం కోల్పోయి స్పానిష్ ఇక్కడి అధికారిక భాషగా స్థిరపడిపోయింది. 1970, 80 ల నాటికి ఈల భాష వచ్చిన వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. 1990 ల నాటికి కేవలం 50 మందికి మాత్రమే ఈ భాష స్పష్టంగా తెలుసు. ఇప్పటి తరానికి ఈ భాషతో పరిచయం ఉన్నప్పటికీ వారి విద్యాభ్యాసం అంతా స్పానిష్ లో సాగడం వలన స్పానిష్ లో మాత్రమే సంభాషించగలరు. భాషా పరిశోధకుల దృష్టిలో మాత్రమే ఈ ఈల భాష అత్యద్భుతమైన భాషగా నిలిచిపోయింది. ఇక్కడ మాత్రమే కాక ప్రపంచంలో కొన్ని ఇతర ప్రాంతాలలో కూడా వివిధ రకాల ఈల భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గ్రీక్ ద్వీపం అయిన ఈవియా, టర్కీ లోని కుస్కోవ్ పట్టణం ఈల భాష ప్రాచుర్యంలో ఉన్న మరికొన్ని ప్రాంతాలు. అయితే ఇప్పటికీ ఎక్కువమంది ప్రజలు సంభాషిస్తున్న ఈల భాషగా, ఎక్కువ పరిశోధనలు జరుపబడిన భాషగా సిల్బో గోమెర గుర్తింపుపొందింది.
1990 ల చివరిలో సిల్బో భాష మీద స్థానికులలో ఆసక్తి మరింత పెరిగింది. ఈ అంతరించిపోతున్న భాషని ప్రాధమిక విద్యా స్థాయిలో ఒక సబ్జెక్టు గా ప్రవేశ పెట్టడం అందుకు ఒక కారణం. 1999 నుండి ప్రాధమిక, మాధ్యమిక విద్యా ప్రణాళికలో సిల్బో భాష తప్పనిసరిగా అభ్యసించవలసిన సబ్జెక్టుగా ఉంది. ఒకప్పుడు వారి ఇండ్లలో ప్రధాన భాషగా ఉన్న సిల్బో ను ఇప్పుడు అక్కడి పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ గా అభ్యసిస్తున్నారు. స్థానిక భాషలను, సంప్రదాయాలను సంరక్షించుకునేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాలి. అది కూడా సాంకేతిక విప్లవం సమాచార ప్రసార స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చివేస్తున్న ఈ తరుణంలో ఇది నిజంగానే అభినందనీయం ప్రయత్నం.
2009 లో యునెస్కో సిల్బో గోమేరో భాషనీ అత్యంత ఎక్కువమంది మాట్లాడిన అరుదైన, పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ఈల భాషగా గుర్తించి మానవజాతి యొక్క సాంస్కృతిక వారసత్వ అంశాల జాబితాలో ఈ భాషను కూడా చేర్చింది.
సిల్బో గోమేరా ను మాట్లాడే మిగిలిన కొద్ది మంది దృష్టిలో అది వారి ద్వీపానికి చెందిన కవిత్వం. కవిత్వం లానే అది ప్రత్యేకమైనది. అందమైనది. దానికి ఏ ప్రత్యేక ప్రయోజనమూ ఉండవలసిన అవసరం లేదు.
తమ భాషని కాపాడుకునేందుకు ఆ భాషని విద్యా ప్రణాళికలో చేర్చేందుకు ఆ ద్వీపవాసుల కృషి మాత్రం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక పాఠశాల విద్యార్థిని ఇలా చెప్పింది “ఈ భాషని నేర్చుకోవడం అంటే మా పూర్వీకులను గౌరవించడమే. ఈ సాంకేతిక యుగంలో కూడా మా మూలాలను మర్చిపోకుండా ఉండడమే”
కొంతమంది పిల్లలు తమ రహస్య సంభాషణలను జరుపుకునేందుకు వీలుగా కూడా సరదాగా ఈ భాషని నేర్చుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ సమాచార సాధనాలు ప్రపంచంలోని మారు మూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్న ఈ కాలంలో లాగోమేరా లోని పిల్లలు మాత్రం ఒక పక్కన ట్విట్టర్ భాషలో, మరొక పక్క ఈల భాషలో సంభాషించడం కూడా నేర్చుకుంటున్నారు.
–Based on a piece by Mamata.