మార్చ్ నెల చివరి వారంలో లక్నో లోని ఆర్మీ మెడికల్ కార్ప్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ సందర్భంగా జరిగిన సైనిక పెరేడ్ లో మార్చింగ్ బ్యాండ్ కు హవాల్దార్ మున్నా నాయకత్వం వహించారని దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ వార్త అంత ప్రముఖంగా రావడానికి కారణం హవాల్దార్ మున్నా మనిషి కాదు, మేక కావడం. మున్నా ఈ రెజిమెంట్ లో నాన్-కమిషన్డ్ ఆఫీసర్ గా ఎంతోకాలంగా సేవలందిస్తున్నారు. ఆయన మొదటివారు కాదు. 1950 నుండి ఈ రెజిమెంట్ లో మున్నా పేరుతో ఒక మేక హవాల్దార్ గా ఉండడం ఆనవాయితీగా వస్తుంది. అందమైన మార్వారీ జాతి మేకలు ఈ హవాల్దార్ పదవికి ఎంపిక చేయబడతాయి.

ఇలా ఆర్మీ రెజిమెంట్ లలో జంతువులను మస్కట్ లుగా నియమించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాలలో అమలులో ఉంది. బహుశా ఇది బ్రిటిష్ వారినుండి అలవడిన సంప్రదాయం కావొచ్చు. ప్రస్తుతం బ్రిటిష్ ఆర్మీ లో మేకలు, గుర్రాలతో పాటు తొమ్మిది రకాల జంతువులు మస్కట్ లుగా వివిధ రాంక్ లలో ఉన్నాయి.
స్పానిష్ సైనిక దళంలో ‘ఓడిన్’ అనే మేక, రాయల్ ఆస్ట్రేలియన్ రెజిమెంట్ 5 వ దళానికి బెంగాల్ టైగర్ ‘క్విన్టాస్ దుర్గ’ మస్కట్ లుగా ఉన్నాయి. “చెస్టీ XV ” అనే ఇంగ్లీష్ బుల్ డాగ్ అమెరికన్ మెరైన్ కార్ప్స్ యొక్క చిహ్నం. శ్రీలంక లో అత్యంత పురాతనమైన రెజిమెంట్ అయిన శ్రీలంకన్ లైట్ ఇంఫాన్ట్రీ కి ఏనుగు చిహ్నంగా ఉంది. ఈ సంప్రదాయం అక్కడ 1961 నుండి అమలులో ఉండగా శ్రీలంక చరిత్రలో ప్రాముఖ్యత కలిగిన ఏనుగు ‘కందుల’ పేరు ని ఈ చిహ్నానికి ఇవ్వడం జరిగింది. ‘బ్రిగేడియర్ సర్ నీల్స్ ఓలావ్’ అనే పెంగ్విన్ నార్వే కింగ్స్ గార్డ్ రెజిమెంట్ యొక్క చిహ్నం. కెనడియన్ ఆర్మీ మస్కట్ అయిన ఆడ ధృవపు ఎలుగుబంటి టొరంటో లోని జూ లో అధికారిక గౌరవాన్ని అందుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ నావెల్ అకాడమీ లో ‘బిల్’ అనే మేక మస్కట్ గా ఉంది.
అనేక దేశాల సైనిక దళాలలో వివిధ జంతువులు అధికారిక, అనధికారిక హోదాలలో ఉన్నాయి. అధికారిక మస్కట్ లకు ర్యాంక్ ఉంటుంది. వాటి నిర్వహణా ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. మానవ సైనికులకు ఉన్నట్లే వాటికి కూడా ప్రమోషన్ లు, డిమోషన్ లు ఉంటాయి.
కారణమేమిటో సరిగ్గా తెలియదు కానీ అనేక ఆర్మీ లలో మేకలే మస్కట్ లుగా ఉన్నాయి. బహుశా ఆర్మీ మస్కట్ లుగా గౌరవం పొందిన మొదటి జంతువు మేకే కావచ్చు. రాయల్ వెల్ష్ ఫుసిలైర్స్ లో 1770 లలో అమెరికన్ స్వాతంత్ర పోరాట కాలం నుండి మేకలు మస్కట్ లుగా ఉన్నాయి. 1775 లో జరిగిన ప్రముఖ బంకర్ హిల్ యుద్ధ సమయంలో ఒక మేక దారితప్పి యుద్ధ భూమిలోకి ప్రవేశించింది. దానిని అనుసరిస్తూ వెళ్ళిన బ్రిటిష్ సేనలు అమెరికన్ సైన్యంపై విజయం సాధించాయి. అప్పటి నుండి బ్రిటిష్ రాయల్ వెల్ష్ సేనలో మేకకి గౌరవ స్థానం ఉంది.
అయితే మేకలు అంత క్రమశిక్షణ కలిగిన జంతువులు కావు. లాన్స్ కార్పోరల్ విలియం బిల్లీ విండ్సర్ అనే మేక రాయల్ వెల్ష్ మొదటి బెటాలియన్ మస్కట్. 2006 లో బ్రిటన్ రాణి ముందు జరుగుతున్న పెరేడ్ లో తన రెజిమెంట్ కు నాయకత్వం వహిస్తూ అదుపు తప్పి పక్కకి పరిగెత్తడమే కాక తన ముందు మార్చింగ్ చేస్తున్న సైనికుల్ని తలతో పొడవడానికి ప్రయత్నించడంతో దానికి డిమోషన్ లభించింది.
ఇది రాస్తుంటే నాకు మరొక మేక గుర్తు వచ్చింది. అది ఏ ఆర్మీ లో భాగం కాదు. అహ్మదాబాద్ లోని వస్త్రపుర్ ప్రాంతంలోని ఒక రోడ్డు దాని నివాసం. ఈ రోడ్ చాలా ఇరుకుగా, గతుకులతో ఉండేది. ఎన్నో షాప్ లు, పార్క్ చేయబడిన వాహనాలు, చిరు వ్యాపారుల బండ్లు, గుడులు, మనుషులతో విపరీతమైన రద్దీగా ఉండే ఈ రోడ్ కు మరొక వైపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్, ఇస్రో కాలనీ వంటి ప్రముఖ ప్రాంతాలు ఉండేవి.
ఈ రోడ్ మొత్తాన్ని ఒక పెద్ద మేక పరిపాలిస్తుండేది. దానికి ఎప్పుడు పడుకోవాలి అనిపిస్తే అప్పుడు రోడ్ మధ్యలో దర్జాగా విశ్రమించేది. ట్రాఫిక్ అంతా పక్కకి తప్పుకుని వెళ్లాల్సిందే. అది నడుచుకుంటూ వెళ్లి ఎవరైనా దారిని పోయే వారిని పొడవాలని నిర్ణయించుకుంటే వారు తప్పించుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే. అక్కడి దుకాణదారులు అంతా దానికి ఆహారం పెట్టి పోషిస్తుండేవారు. తనకి ఏ కూరగాయలు, పండ్లు తినాలనిపిస్తే అక్కడి తోపుడు బండ్ల మీద పడి వాటిని తినేసేది. స్వీట్లు తినాలనిపిస్తే మార్కెట్ లో ఉన్న స్వీట్ షాప్ ముందుకు వెళ్లి నిలబడేది. పండగల రోజుల్లో దానికి దండలు వేసి, బొట్లు పెట్టి అలంకరించేవారు. అక్కడ పాన్ షాప్ ల వాళ్ళు దాని నోట్లో బీడీ పెట్టి వెలిగించే వాళ్ళు. అక్కడ ఆ మేక గారికి దక్కని గౌరవం లేదు.
ఆ రోడ్డు కే ఎంతో శోభని, పేరుని తెచ్చిపెట్టిన ఆ మేక దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది. అది ఆర్మీ మస్కట్ కాదు కాబట్టి దాని స్థానంలో మరొక మేక రాలేదు కానీ ఆ రోడ్ కాస్త విశాలంగా, ప్రయాణానికి అనువుగా మారింది.
From a piece by Meena