మహిళలను ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనమని పిలుపు నివ్వవలసిందిగా కోరి గాంధీజీ ని ఒప్పించిందామె.
జవహర్లాల్ నెహ్రు తో కలిసి ప్రచార కార్యక్రమాలలో పాలుపంచుకుంది.
సర్దార్ పటేల్ తో వాదించి ఆయనని ఒప్పించింది.
కంచి శంకరాచార్యులతో కలిసి ఆలయాలలో ఉన్న బ్యూరోక్రసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశారు.
ఇందిరా గాంధి మీద ఫిర్యాదు చేసింది. (అందుకు ప్రతిఫలం కూడా అనుభవించింది)
తన నాటక బృందంతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.
మొదటి కన్నడ మూకీ సినిమాలో నటించింది
భారతదేశంలో ఎం.ఎల్.ఏ పదవికి పోటీ చేసిన తొలి మహిళ కూడా ఆమే.
పిల్లల భద్రత గురించి, పని ప్రదేశాలలో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి చట్టాల గురించి చర్చకు మొదటిగా తెరలేపింది ఆమే.
ఆరోగ్యం మహిళల హక్కు అని అంతర్జాతీయ స్థాయిలో చర్చించి, ఇళ్ళలో స్త్రీలు చేసే పనికి ఆర్ధిక విలువని లెక్కకట్టడంపై ప్రపంచమంతా దృష్టి పెట్టేలా చేసింది కూడా ఆమే.
ఆమె అంతరించిపోతున్న హస్తకళలకు పునరుజ్జీవనం చేసే ప్రయత్నం చేసింది..
ఈ రోజు దేశ పురోగతిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న అనేక సంస్థలను ఆమె స్థాపించింది.
మొన్న ఏప్రిల్ మూడవ తేదీన ఆమె జయంతి సందర్భంగా స్మరించుకున్న కమలాదేవి చటోపాధ్యాయ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె కు ముందు కాలంలోనూ, ఆమె జీవించిన కాలంలోనూ అంత ప్రతిభ కలిగిన స్త్రీ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది ఎన్నో జన్మలెత్తినా సాధించలేని పనులను ఆమె ఒక్క జీవితకాలంలో సాధించారు.

1903 లో మంగళూరు లో జన్మించిన ఆమెపై అప్పటికే జాతీయవాద ఉద్యమాలలో చురుకుగా పాలుపంచుకుంటున్న తల్లిదండ్రుల ప్రభావం ఎంతో ఉంది. మహాదేవ్ రనడే, రమాబాయి రనడే, గోపాలకృష్ణ గోఖలే, అనిబిసెంట్ వంటి స్వాత్రంత్ర సమరయోధులు వారి కుటుంబానికి స్నేహితులు కావడం ఆమె జీవిత గమనాన్ని నిర్దేశించింది. ఆమె తండ్రి తన చిన్న వయసులోనే మరణించగా ఆమె తల్లి తనను ఎంతో ప్రోత్సహించి ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.
ఆమెకు 14 సంవత్సరాల వయసులో వివాహం జరగగా రెండు సంవత్సరాలకు ఆమె భర్త మరణించారు. తర్వాత హరింద్రనాథ్ చటోపాధ్యాయ ను పునర్వివాహం చేసుకున్నా కొన్ని సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.
ఆమె దేశానికి అందించిన సేవలకు ప్రధానంగా మూడు దశలు ఉన్నాయి.
స్వాతంత్రోద్యమంలో ఆమె పాత్ర: 1923 లో ఆమె ఇంగ్లాండ్ లో ఉండగా గాంధీజీ ప్రారంభించిన సహాయనిరాకరణోద్యమం గురించి విని వెంటనే భారతదేశం తిరిగివచ్చి ఉద్యమంలో పాలుపంచుకున్నారు. సేవాదళ్ లో చేరారు. అఖిల భారత మహిళా సదస్సుకు వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు. ముంబై లో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేందుకు సహకరించారు.
కాందీశీకుల కోసం ఆమె చేసిన సేవలు: దేశ విభజన తర్వాత పాకిస్థాన్ నుండి భారతదేశం చేరుకుంటున్న అనేక మంది దుర్భర పరిస్థితులు చూసి చలించిన ఆమె వారి సమస్యలపై పని చేశారు. స్వయం సహాయం, సహకారం ప్రగతికి మార్గాలని బలంగా నమ్మి కాందిశీకుల పునరావాసం పై పని చేసేందుకు ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్ ను స్థాపించారు. ఫరీదాబాద్ దగ్గర నిర్మించిన టౌన్షిప్ ఆమె ప్రయత్నాలలో ఒకటి. దాదాపు 50000 మంది కాందిశీకులకు అక్కడ గృహాలు నిర్మించడంతో పాటు వారికి నూతన నైపుణ్యాలు నేర్పించడం ద్వారా జీవనోపాధి కల్పించే ప్రయత్నాలు చేశారు.
కళాకారులు, హస్తకళలపై ఆమె చేసిన కృషి: కళలు, హస్తకళల పట్ల ఎంతో అనురక్తి ఉన్న ఆమె దేశంలో ఎన్నో కోట్ల మందికి జీవనోపాధి కల్పించడంలో వాటికి ఉన్న పాత్రని గుర్తించింది. పెద్ద ఎత్తున జరుగుతున్న యాంత్రికీకరణ వలన ఈ కళలు మరుగున పడే అవకాశం ఉన్నదని గుర్తించిన ఆమె వాటిని పునరుజ్జీవింప చేసి తద్వార వారి జీవనోపాధులకు భద్రత కల్పించే ప్రయత్నం చేసింది.
సంగీత నాటక అకాడమీ, సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం, క్రాఫ్ట్స్ కౌన్సిల్, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వంటి ఎన్నో సంస్థలలో ఆమె చురుకైన పాత్ర పోషించారు.
ఆమె గొప్ప రచయిత్రి కూడా ఆమె ఆత్మ కథ ఇన్నర్ రేసెస్స్, ఔటర్ స్పేసేస్, మెమొయిర్స్ చదివితే ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవొచ్చు. జస్లీన్ ధామిజా ప్రేమతో రాసిన కమలాదేవి జీవిత చరిత్ర కూడా ఎంతో గొప్ప పుస్తకం. 200 పేజీలలో నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకం చదివితే అంత చిన్న పుస్తకంలో ఇన్ని విషయాలను కూర్చవచ్చా అని ఆశ్చర్యానికి లోనవుతారు. దాని ధర కూడా కేవలం వంద రూపాయలే.
From a post by Meena