ఏదైనా బటన్ ఊడిపోయిందా? చెప్పుల స్ట్రాప్ తెగిపోయిందా? ఆ అత్యవసర సందర్భాలలో వెంటనే మనకి గుర్తొచ్చేది ఒక్కటే. పిల్లల బట్టలకి కర్చీఫ్ తగిలించాలన్నా, కట్టుకున్న చీర పల్లు, కుచ్చిళ్ళు కుదురుగా ఉండాలన్నా, స్కూల్ బ్యాడ్జి తగిలించుకోవాలన్నా అన్నిటికీ ఉపయోగపడే ఏకైక సాధనం మనం పిన్నీసు అని పిలుచుకునే సేఫ్టీ పిన్. మన దైనందిన జీవితాలను కొంచెం సులభతరం చేసిన అనేక వస్తువులలో ఎన్నింటి గురించో మనం గొప్పగా విని ఉంటాము కానీ ప్రతి రోజూ ఉపయోగపడే ఈ చిన్న వస్తువు గురించి, దాని చరిత్ర గురించి బహుశా మనం ఎక్కడా చదివి ఉండము.
సేఫ్టీ పిన్ ను సృష్టించిన వాల్టర్ హంట్ ఎంతో సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. 1796 లో న్యూయార్క్ లోని లూయిస్ కౌంటీ అనే ప్రాంతంలో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 13 మంది సంతానంలో అతను పెద్దవాడు. ఒక చిన్న ఒకటే తరగతి గది ఉన్న పాఠశాలలో చదువు ప్రారంభించిన హంట్ కౌమార దశలోనే చదువు మానుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. 3R (రీడింగ్, రైటింగ్, అరథమెటిక్) నైపుణ్యాలపై హంట్ కు అంత ఆసక్తి లేదు కానీ అతని బుద్ధి ఎంతో చురుకుగా కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉండేది. యంత్రాలకు సంబంధించిన విషయాలంటే అతనికి మరీ ఎక్కువ ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తి వల్లనే తన కుటుంబ సభ్యులలో అనేక మంది పని చేసే ఒక బట్టల మిల్లులోని ఫ్లాక్స్ స్పిన్నింగ్ మెషీన్ ను మరింత సమర్ధవంతంగా పని చేసేలా మెరుగుపరచగలిగాడు. అతను మెరుగుపరిచి వినూత్నంగా తయారు చేసిన ఆ నూతన యంత్రంపై ఆ స్పిన్నింగ్ మిల్లు యజమాని పేటెంట్ పొందాడు. అందులో హంట్ కు ఏ మాత్రం భాగమూ, గుర్తింపు ఇవ్వలేదు. దానితో హంట్ మరింత మెరుగైన ఫ్లాక్స్ స్పిన్నింగ్ మెషీన్ ను తయారు చేసి ఈ సారి తానే స్వయంగా పేటెంట్ పొందాడు. అయితే ఆ యంత్రాన్ని పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రాలేదు. చివరకి తన కుటుంబ పోషణ కష్టంగా మారిన సమయంలో ఆ పేటెంట్ ను వేరొకరికి అమ్మి తాను న్యూయార్క్ నగరానికి తన మకాం మార్చాడు.
అవి మోటార్ కార్ కూడా ఇంకా కనిపెట్టబడని రోజులు. అప్పట్లో ప్రయాణాలకు ఎక్కువగా గుర్రపు బండ్లు వాడేవారు. ఒకరోజు అతను రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక గుర్రపు బండి ఒక చిన్న పిల్లని గుద్దుకోవడం చూసాడు. ఆ బండికి ఎయిర్ హారన్ ఉంది కానీ రౌతు తన రెండు చేతులతో కళ్ళేన్ని పట్టుకుని ఉండడం వలన అడ్డం వచ్చిన ఆ పాపని హెచ్చరించేందుకు హారన్ ఉపయోగించలేకపోయాడు. దానిని గమనించిన హంట్ ఒక ప్రత్యేకమైన హారన్ తయారు చేసాడు. దానిని గుర్రపు రౌతు తన కాలితో ఉపయోగించవచ్చు. 1827 లో ఈ పరికరంపై అతను పేటెంట్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సారి కూడా ఈ పరికరం తయారు చేసేందుకు ఎవరూ పెట్టుబడి పెట్టకపోవడంతో ఈ పేటెంట్ ను కూడా తాను అమ్మేశాడు. తాను రూపొందించిన వస్తువులను పెద్ద ఎత్తున తయారుచేసి వాటి నుండి లాభాలు పొందే అవకాశం అతనికి ఎప్పుడూ కలగలేదు.
అతని జీవితమంతా అలాగే గడిచింది. వినూత్న ఆవిష్కరణలు చేయడం, కుటుంబ పోషణ కోసం వాటి పేటెంట్ హక్కులు వేరే వారికి అమ్మివేయడం లేదా ఉత్పత్తులపై రాయల్టీ పొందడం మాత్రమే అతను చేయగలిగాడు. అదృష్టవశాత్తూ అతను ఒక దాని వెంట ఒకటి వినూత్న వస్తువులు రూపొందిస్తూనే ఉన్నాడు.

అలా అతను 1849 లో పేటెంట్ ను అమ్మివేసిన వస్తువే మనం ప్రతి నిత్యం వాడే సేఫ్టీ పిన్. దాన్ని కూడా అతను డబ్బు కోసం ఎంతో అవసరం ఉన్న సమయంలో రూపొందించి పేటెంట్ అమ్మివేశాడు. అప్పుడు అతనికి 15 డాలర్ల అప్పు ఉంది. మరుసటి రోజు అతను ఆ అప్పు తీర్చాల్సి ఉంది. చేతిలో డబ్బు లేదు. అటువంటి సందర్భాలలో అతను సహజంగా చేసే పని ఏదో ఒక కొత్త వస్తువు తయారు చేసి పేటెంట్ అమ్మివేయడం. ఆ రోజు కూడా అలాగే చేతిలో చిన్న వైర్ ముక్క పట్టుకుని దానితో రేపు తెల్లారేపాటికి ఏమి కొత్త వస్తువు తయారు చేయగలనా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ వైర్ చూస్తే అతనికి పిన్ను లాగా కనిపించింది. ఆ రోజుల్లో పిన్ను అంటే అంచు కొంచెం పదునుగా ఉండి పొడవుగా ఉన్న లోహపు ముక్క. అయితే అది వినియోగించుకునే వారికి గుచ్చుకుంటూ ఉండేది. అలా కాకుండా వాడేవారికి ఏ ప్రమాదమూ లేకుండా భద్రంగా ఉండే పిన్ను ను ఎలా తయారు చేయవచ్చా అని ఆలోచించాడు. ఒక మూడు గంటలు గడిచేసరికి ఒక ఆలోచన వచ్చి ఒక ఇత్తడి వైర్ ను తీసుకుని మధ్యలో కాయిల్ లాగా చుట్టి పైన గుచ్చుకోకుండా ఉండేలా షీల్డ్ రూపొందించి మొత్తానికి మనం ఇప్పుడు వాడుతున్న రూపంలో సేఫ్టీ పిన్ తయారుచేసాడు. అతను దానికి ‘డ్రెస్ పిన్’ అని పేరు పెట్టాడు.
పేటెంట్ దరఖాస్తులో అతను వివరించిన దాని ప్రకారం ఈ పిన్ ఒకే వైర్ తో తయారుచేయబడి, ఒక స్ప్రింగ్, ఒక క్లాస్ప్ ని కలిగి ఉండి వినియోగించేవారికి ఎంత మాత్రమూ హాని కలిగించదు. ఈ పేటెంట్ ను అతను 400 డాలర్లకి అమ్మి వేసాడు. ఇప్పటికి దాదాపుగా 175 ఏళ్లుగా కొన్ని ట్రిలియన్ సేఫ్టీ పిన్నులు తయారు చేయబడినప్పటికీ వాటి అమ్మకపు విలువలో ఒక్క రూపాయి కూడా అతనికి దక్కలేదు.
ఈ డ్రెస్ పిన్ అనేది హంట్ తయారు చేసిన అనేకానేక ఉత్పత్తులలో ఒకటి మాత్రమే. దానికన్నా ముందు 1834 లో అతను ప్రపంచంలోనే మొదటి సారిగా ఐ-పాయింటెడ్ సూదితో ఉన్న కుట్టు మెషీన్ లు రూపొందించాడు. అయితే దీని వలన చాలామంది నిరుద్యోగులయ్యే అవకాశం ఉందని అతని కూతురు అతనిని హెచ్చరించింది. దానితో ఆ మెషీన్ ని పక్కన పెట్టి చెక్కతో ఒక కుట్టు మెషిన్ మోడల్ తయారు చేసి దానిని ఒక కంపెనీ కి అమ్మేశాడు. ఆ కంపెనీ దానిని మెటల్ తో సరికొత్తగా తయారుచేసింది. చరిత్రలో ఆ మెషీన్ ఐసాక్ సింగర్ యొక్క ఆవిష్కరణగా నిలిచిపోయింది. ఈ రోజు మన ఇంటింటా కనిపించే సింగర్ కుట్టు మెషీన్ ల కంపెనీ యజమాని అతనే. అతని పేరుతో పేటెంట్ పొందిన ఆ మెషీన్ అసలైన రూపకర్త మన హంట్.
హంట్ నిరంతరం వినూత్న ఆవిష్కరణలు చేయాలని, అవి రోజువారీ జీవితంలో ఉపయోగపడేవిగా ఉండాలని పరితపించేవాడు. చెట్లు తేలికగా కొట్టేందుకు ఉపయోగపడే రంపం, బెల్ట్ లు మరియు సస్పెండర్ లకు తగిలించే స్ప్రింగ్, పడవలు సముద్రంలో వెళ్ళేటప్పుడు కింద ఉన్న మంచును కోసుకుంటూ వెళ్లేందుకు ఉపయోగపడే యంత్రం వంటి ఆవిష్కరణలు ఎన్నో చేసాడు. మేకులు తయారు చేసే యంత్రం, కత్తి పదును పెట్టుకునేందుకు ఉపయోగపడే సాధనం, ఇంకు స్టాండ్, ఫౌంటెన్ పెన్, పేపర్ షర్ట్ కాలర్లు, తక్కువ ఖర్చుతో వెలిగే దీపాలు వంటి ఎన్నో ఆవిష్కరణలు అతనివే. అతను తయారుచేసిన రిపీటింగ్ గన్, కాట్రిడ్జ్ లను తర్వాత కాలంలో స్మిత్ మరియు వెసన్ లు తమవిగా వెలుగులోకి తెచ్చారు. ఇంటి సీలింగ్ పై నుండి కిందకి నడవడానికి ఉపయోగపడేలా బూట్లకు అతికించే ఒక ప్రత్యేక సాధనం కూడా హంట్ రూపొందించాడు. దీనిని 1937 నుండి సర్కస్ లలో ప్రదర్శనలకు వాడుతున్నారు.
1859 లో తన 62 ఏళ్ళ వయసులో వాల్టర్ హంట్ మరణించాడు. అప్పటికి అతని వయసు ఎంతో అన్ని ఆవిష్కరణలు అతని ఖాతాలో ఉన్నాయి. తన జీవితమంతా వినూత్న వస్తువులను రూపొందించడం, వాటి పేటెంట్ లు అమ్మివేయడం తప్ప రాయల్టీల రూపంలో అతను ఒక్క రూపాయి కూడా పొందలేదు. అతనికి అంటూ దక్కిన ఒకే ఒక గుర్తింపు ఏప్రిల్ 10 ని ఇంటర్నేషనల్ సేఫ్టీ పిన్ డే గా ప్రకటించడమే. ఏప్రిల్ 10 సేఫ్టీ పిన్ ఆవిష్కరణపై అతనికి పేటెంట్ లభించిన రోజు.
అత్యవసర సమయాలలో ఉపయోగపడే ఆప్తమిత్రుడి లాంటి సేఫ్టీ పిన్ ను మనకి అందించినందుకు వాల్టర్ హంట్ కు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
–From a piece by Mamata.