నేను ఇటీవల ఒక అందమైన కవిత చదివాను. ఆ కవిత రాసిన కవయిత్రి మరియా సబీనా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఆమె ఈ కాలపు ఆధునిక కవయిత్రి అయి ఉంటుంది అనుకుని ఆమె గురించి పరిశోధన చేసినప్పుడు నాకు ఒక అద్భుతమైన జీవిత కథ దొరికింది.
మరియా సబీనా మగ్దలీనా గార్షియా అనే ఈ కవయిత్రి దాదాపు ఒక శతాబ్దం క్రితం మజాటెక్ అనే ఆదివాసీ తెగలో జన్మించింది. దక్షిణ మెక్సికో లోని ఆక్సకా ప్రాంతంలో ఈ తెగ నివసించేది. ఈ ప్రాంతంలో ఉన్న సియర్రా పర్వత శ్రేణులలో ఉన్న హుఔట్ల డె జిమెనేజ్ అనే మారుమూల గ్రామంలోనే మరియా తన జీవితమంతా నివసించింది. సంప్రదాయ వైద్యం చేసే వృత్తిలో ఉండి ఆత్మలతో సంభాషించగలిగే ప్రత్యేక శక్తి కలిగిన కుటుంబంలో మరియా జన్మించింది. అనేక ఆదివాసీ తెగలలో ఇటువంటి స్థానిక వైద్యులకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుంది. ఈ వైద్యులకు ఈ ప్రపంచపు జీవులతోనే కాక, దేవలోకపు శక్తులతో కూడా సంభాషించే శక్తి ఉంటుందని, వారు శారీరక, ఆత్మిక సమస్యలను నయం చేయగలుగుతారని, భవిష్యత్తుని కూడా అంచనా వేయగలుగుతారనీ ఆ తెగ వారి నమ్మకం.
మజాటెక్ తెగ వారి వైద్య విధానంలో ‘హోలీ చిల్డ్రన్’ అని పిలవబడే పుట్టగొడుగులకు ప్రత్యేక స్థానం ఉంది. చిత్త భ్రాంతిని కలిగించే ఈ పుట్టగొడుగుల సహాయంతో దైవ శక్తితో సంభాషణ సాధ్యమని వారి నమ్మకం. మరియా కి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన అక్కతో కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా ఈ పుట్టగొడుగులు కనిపిస్తే వాళ్లిద్దరూ వాటిని తినేశారని చెబుతారు. అవి తిన్న వెంటనే ఆ అమ్మాయిలిద్దరూ చిత్త భ్రాంతికి లోనయ్యారు. మరియాకు ఏదో అలౌకికమైన గొంతు వినపడింది. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆమె మామయ్యకి ఏ చెట్టు మూలికలు ఉపయోగిస్తే నయమవుతుందో ఆ గొంతు చెప్పింది. ఆ మూలికలు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆ అశరీర వాణి ద్వారా విన్న మరియా ఆ సూచనలను అనుసరించి వైద్యం చేయగానే ఆయనకి వ్యాధి నయమయింది.

అప్పటి నుండి ఆ ఊరివాళ్ళు ఆ అమ్మాయిని సబియా (తెలివైన స్త్రీ) అని పిలవడం ప్రారంభించారు. మజాటెక్ తెగకు చెందిన పురాతన ఆచారాలు, వైద్య విధానాలకు సంబంధించిన జ్ఞానం మరియా కు సహజంగానే అబ్బింది. సియర్రా మజాటెక్ పర్వత శ్రేణులలో మాత్రమే దొరికే ప్రత్యేక వృక్ష మూలికలతో వారు చేసే ప్రత్యేక వైద్యం మరియా కు ఎవరూ నేర్పకుండానే వచ్చింది. దానితో వారు వెలాడా అని పిలుచుకునే ప్రత్యేక స్వస్థత కార్యక్రమాలకు ఆ మ్యాజిక్ మష్రూమ్ లు వాడడం, తర్వాత వైద్యం చేయడం మరియా జీవితకాలం కొనసాగింది. శారీరక సమస్యల వైద్యం కోసమే కాక ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం కూడా అనేక మంది స్థానికులు మరియా దగ్గరకి వస్తుండేవారు. చిత్త భ్రాంతిని కలిగించే తన మ్యాజిక్ మష్రూమ్ లను తీసుకోవడం ద్వారా అలౌకిక శక్తి పొంది మరియా వారికి వైద్యం చేసేది. ఆ పుట్టగొడుగులు తనకి ఏ వైద్యం చేయాలో సూచిస్తాయని చెప్పేది మరియా. రోగి లోపలికి తొంగిచూసి వారికి చేయవలసిన వైద్యాన్ని నిర్ధారిస్తానని ఆమె చెప్పేది.
మరియా చేసే స్వస్థత పద్దతిలో పుట్టగొడుగులు తినడం, మంత్రాలు చదవడం, చుట్ట తాగడం, మెస్కేల్ అని పిలిచే ఒక చెట్టు భాగాలను తినడం, ఔషధ మొక్కల నుండి తీసిన లేపనాలు వాడడం ముఖ్యమైన భాగాలు. పెద్దగా నవ్వడం కూడా ఈ చికిత్సా పద్దతిలో భాగం. ఈ స్వస్థత కార్యక్రమాలన్నీ రాత్రి పూటే జరిగేవి. ఈ ప్రత్యేక వైద్యులకు నక్షత్రాలే దిశానిర్దేశం చేస్తాయని వారి నమ్మకం. వెలాడా స్వస్థత కార్యక్రమాలను కేవలం రోగులకు చికిత్స చేయడం కోసమే మరియా ఉపయోగించేది.
మరియా సబీనా అనే అద్భుతమైన మహిళ తన మారుమూల గిరిజన గ్రామంలో అలాగే పుట్టగొడుగుల సహాయంతో వైద్యం చేసుకుంటూ బయటి ప్రపంచానికి తెలియకుండానే చనిపోయేదేమో. కానీ విధి ఆమె కథకి ముగింపు వేరే విధంగా రాసి ఉంచింది.
1950 ల తొలినాళ్లలో అమెరికాకు చెందిన రాబర్ట్ గోర్డాన్ వాసన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వారిద్దరికీ ఎత్నో బోటనీ పట్ల, ముఖ్యంగా చిత్త భ్రాంతిని కలిగించే మొక్కలపట్ల, ఆదివాసీల ఆచార వ్యవహారాలలో వాటి వినియోగం పట్ల ఆసక్తి ఉంది. వారిద్దరూ మజాటెక్ సియర్రా పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు హుఔట్ల ప్రాంతానికి చెందిన ఈ వైద్యురాలి గురించి విన్నారు. 1955 ప్రాంతంలో వారు మరియా నివసించే ఆ మారుమూల గ్రామానికి చేరుకున్నారు. మరియా సబీనా దగ్గర వైద్యం కోసం వచ్చామని చెప్పారు. ఒక వైద్యురాలిగా మరియా తన సహాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడూ తిరస్కరించలేదు. అప్పటికే ఆమెకు అరవై సంవత్సరాలు. ఆమె చేసే స్వస్థత కార్యక్రమాల గురించి ఆ ప్రాంతంలో తప్ప బయట ప్రపంచానికి ఏ మాత్రమూ తెలియదు. తన పుట్టగొడుగులను ఉపయోగించి ఈ విదేశీయుల కోసం మరియా ఎన్నో వెలాడా స్వస్థత కార్యక్రమాలను నిర్వహించింది. వారు వాటినన్నింటినీ ఫోటోలు, వీడియోలు తీశారు. సైలోసైబ్ మెక్సికనా అని పిలవబడే ఆ పుట్టగొడుగుల మొక్కలను కూడా తమతో కొన్ని తీసుకుని వెళ్ళారు. దీనిని తర్వాత కాలంలో యూరప్ లో విస్తృతంగా పెంచారు. దీని సహాయంతోనే 1958 లో ఆల్బర్ట్ హాఫ్మన్ LSD (Lysergic acid diethylamide) అని పిలవబడే చిత్త భ్రాంతిని కలిగించే ఔషధాన్ని రూపొందించాడు.
1957 లో మరియా తో, ఆమె మ్యాజిక్ మష్రూమ్ లతో వాసన్ కి కలిగిన అనుభవాల గురించి లైఫ్ మ్యాగజైన్ ఒక వ్యాసం ప్రచురించింది. మరియా సబీనా గురించి ప్రపంచమంతా తెలిసింది. ప్రపంచం నలుమూలల నుండీ ఎంతో మంది ఆమెని కలవడానికి వచ్చారు. 1960 ల ప్రాంతంలో హుఔట్ల డె జిమెనేజ్ అనే ఆ మారుమూల గ్రామానికి యాత్రికులు, కళాకారులు, మేధావులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రముఖులు (జాన్ లెన్నాన్, వాల్ట్ డిస్నీ, ఆల్డస్ హాక్స్లీ, కార్లోస్ కాష్ఠనేడా వీరిలో కొందరు) బారులు తీరి వచ్చారు. అయితే వీరిలో చాలా మందికి ఆ మ్యాజిక్ మష్రూమ్ లను తిని మత్తులో మునిగిపోయి ఆనందం పొందాలనే కోరిక తప్ప స్థానిక సంప్రదాయాల పట్ల, సంస్కృతి పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. ఆ పుట్టగొడుగుల కోసం పెరిగిన డిమాండ్ వలన ఆ పర్వత ప్రాంతపు జీవ వైవిధ్యం అంతా దెబ్బతింది.
ఈ అనవసరమైన ప్రచారం ఆ ప్రాంతపు సామాజిక పరిస్థితులను మార్చివేసింది. పురాతన మజాటెక్ సంప్రదాయం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి మరియానే కారణం అని, తమ సంప్రదాయాన్ని ఆమె తన స్వలాభం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తుందని హుఔట్ల డె జిమెనేజ్ గ్రామ ప్రజలంతా ఆమెని నిందించారు. ఆమె మీద దాడి చేశారు. ఆమె ఇంటిని తగలబెట్టారు. ఆమెని డ్రగ్ డీలర్ అని పోలీసులు నేరం మోపారు. ఆమె తెగ వారంతా కలిసి చివరికి ఆమెని తెగ నుండి వెలివేశారు.
అయితే అదంతా తన విధి అని, తనకు ఇలా రాసిపెట్టి ఉన్నదని ఆమె అనుకుందే తప్ప ఎవరినీ నిందించలేదు. అయితే తన వెలాడా స్వస్థత కార్యక్రమాన్ని ఒక విదేశీయుని కోసం చేయడం వలన దాని పవిత్రత దెబ్బతిన్నది అని ఆమె తర్వాత కాలంలో బాధ పడింది. తాను హోలీ చిల్డ్రన్ అని పవిత్రంగా భావించే తన పుట్టగొడుగులను ఇతరులు తమ ఆనందం కోసం డ్రగ్ లాగా వినియోగించడం ఆమెని ఎంతో బాధపెట్టింది. ఎప్పుడైతే విదేశీయులు ఇక్కడకి వచ్చారో అప్పటి నుండి ఆ పుట్టగొడుగులు తమ పవిత్రతను, శక్తిని కోల్పోయాయని, వారు అంతా నాశనం చేశారని ఆమె అనుకుంది. తన జీవితం ఇలా అయిపోయినందుకు, తన పేరుతో ఇతరులు లాభాలు పొంది తనను ఈ స్థితికి తెచ్చినందుకు ఎంతో దుఃఖించింది. తన చివరి రోజులలో ఆమె దుర్భర దారిద్య్రంలో పోషకాహార లేమితో బాధపడింది. 1985 లో తన 91 సంవత్సరాల వయసులో మరియా మరణించింది.
ఒక సమయంలో ఆమెని నిందించినా హుఔట్ల ప్రాంత ప్రజలు ఆమెని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తారు. మెక్సికోలోని గొప్ప కవులలో ఒకరిగా ఆమెకి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉన్నాయి. ఆమెకి చదవడం, రాయడం రాదు. ఆమె కవితలన్నీ తన స్థానిక భాషలో ఆశువుగా చెప్పినవే. అవి తన మాటలు కావనీ తన హోలీ చిల్డ్రన్ (పుట్టగొడుగులు) తన ద్వారా మాట్లాడుతున్నాయనీ ఆమె అనేది. పుట్టగొడుగులు తన చుట్టూ పిల్లల్లాగా నాట్యం చేస్తాయనీ, పాటలు పాడతాయనీ ఆమె చెబుతుండేది. స్థానికులకు అన్ని సమస్యలకు ఆమే దిక్కు. ఆమె కూడా వారికి ఎంతో గౌరవంతో చికిత్స చేసేది. ఆమె శ్లోకాలు, కవితలు మజాటెక్ భాష నుండి మొదట ఇంగ్లీష్ లోకి, తర్వాత స్పానిష్ భాషలోకి అనువాదం చేయబడ్డాయి.
నాకు ఇంత అద్భుతమైన జీవిత చరిత్రను పరిచయం చేసిన ఆ కవిత ఇది.
సూర్యుని కాంతి, చంద్రుని కిరణాలతో
నదులు, జలపాతాల శబ్దాలతో
సముద్రపు హోరుతో, పక్షుల కిలకిలలతో
నిన్ను నువ్వు నయం చేసుకో
పుదీనాతో, వేప మరియు యూకలిప్టస్‌తో
నిన్ను నువ్వు నయం చేసుకో
పువ్వులతో నీ జీవితాన్ని తీయగా మార్చుకో
కోకో బీన్ ను, దాల్చిన చెక్కను ఆస్వాదించు
నీ తేనీటిలో చక్కర బదులుగా ప్రేమని కలుపు
నక్షత్రాలను చూస్తూ దానిని ఆస్వాదించు
గాలి ఇచ్చే ముద్దులతో వర్షపు కౌగిలింతలతో సేదతీరు
నీ నగ్న పాదాలతో నేలంతా పరిగెత్తి బలాన్ని పుంజుకో
నీ అంతరాత్మ ప్రబోధాన్ని విని తెలివి పెంచుకో
మూడవ కంటితో ప్రపంచాన్ని చూడు
పాటలు పాడు, నృత్యం చెయ్యి, జీవితాన్ని ఆనందంగా గడుపు
ప్రేమతో నిన్ను నువ్వు నయం చేసుకో
నీకు నువ్వే మందు అని ఎప్పుడూ గుర్తు ఉంచుకో
ప్రస్తుతం మనం ఉన్న ఈ కరోనా సంక్షోభ సమయంలో మరియా సబీనా మాటలు ఎంత ఊరటనిస్తున్నాయో కదా!
–From a piece by Mamata