మొన్న ఏప్రిల్ 26 న 20 వ శతాబ్దపు అరుదైన గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాస రామానుజన్ 101 వ వర్ధంతి. అనుకోకుండా అదే రోజుకు నేను డేవిడ్ లీవిట్ రాసిన “ది ఇండియన్ క్లర్క్” అనే పుస్తకాన్ని చదవడం పూర్తి చేసాను. ఆ తర్వాత “ది మాన్ హూ న్యూ ఇన్ఫినిటీ” అనే సినిమా కూడా చూసాను.
పుస్తకానికి వచ్చేసరికి ఎన్నో చోట్ల ప్రధాన వస్తువు నుండి విషయం పక్కదోవ పట్టినట్లు అనిపించినా గణిత మేధావి రామానుజన్ నుండి మాత్రం దృష్టి మరల్చలేదు. దక్షిణ భారత దేశంలోని ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిల్లవాడు 1910 ప్రాంతంలో ఏ మాత్రం సంసిద్ధంగా లేకుండానే ఇంగ్లాండ్ ప్రయాణానికి బయలుదేరడం ఎంతో హృద్యంగా వివరించబడింది. గణితంలో అద్భుతమైన మేధావిగా ప్రపంచ ఖ్యాతి పొందిన రామానుజన్ యువకుడిగా ఎంతో బలహీనంగా, ఒంటరిగా, బెరుకుగా, మూడీ గా ఉండేవాడు. ఆరోగ్యంగా ఉండడానికి తగినంత ఆహారం తీసుకునేవాడు కాదు. తాను పూర్తి శాకాహారి కావడంతో తన ఆహారం తానే తయారుచేసుకునేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయిన సందర్భంలో వంట చేసుకునేందుకు సరుకులు, పండ్లు, కూరగాయలు దొరికేవి కావు. దీనికి తోడు అక్కడి చలి వాతావరణం అలవాటు లేకపోవడం అతని ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి 32 ఏళ్ళ చిన్న వయసులోనే అకాలమరణానికి కారణమయింది.
బంధుమిత్రులకు, భార్యకు దూరంగా తనది కాని కొత్త ప్రాంతంలో అతనెంతో ఒంటరితనాన్ని అనుభవించి ఉంటాడు.
శరీరం, హృదయం, ఆత్మ దిగులుతో కృశిస్తున్నా అతని మెదడు మాత్రం ఉత్సాహంతో పరుగులు తీసింది. అతనిని ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి కి రప్పించిన ప్రొఫెసర్ హార్డీ తో ఎన్నో మేధోపరమైన చర్చలు జరిపేవాడు. గణితంలో తన మేధాశక్తికి కారణమైన అంశాలను గుర్తించడం పట్ల రామానుజన్ కి ఉన్న వ్యతిరేకత వలన వారిద్దరికీ తరచూ వాదన జరిగేది. తన మేధోశక్తికి కారణం నామగిరి దేవత అనుగ్రహమే అనే అతని వాదన హార్డీకి ఆగ్రహం తెప్పించేది.
మొత్తం 37 పబ్లిష్ చేయబడిన పేపర్లు, మూడు నోట్ పుస్తకాలలో ఆయన రూపొందించిన గణిత సూత్రాల సమాచారం అంతా పొందుపరచబడి ఉంది. మరొక నోట్ పుస్తకం 1976 లో దొరికింది. అందులో దాదాపు 4000 గణిత సూత్రాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలతో నిరూపించబడి లేవు. ఆయన మరణం తర్వాత ఈ శతాబ్ద కాలంలో అవి అన్నీ నిరూపించబడ్డాయి. ఇప్పటికీ ఎంతో మంది గణిత శాస్త్రవేత్తలకు రామానుజన్ గణిత సూత్రాలే స్ఫూర్తినిస్తున్నాయి.
ఇవన్నీ ఆ పుస్తకం నుండి గ్రహించిన విషయాలు.

ఇక సినిమా విషయానికి వస్తే రామానుజన్ గా దేవ్ పటేల్ నటించడం నన్నెంతో అసంతృప్తికి గురిచేసింది. పొట్టిగా, పీలగా, బలహీనంగా కనిపించే రామానుజన్ పాత్రలో పొడవుగా, దృఢంగా ఉన్న పటేల్ అసలు ఇమడలేకపోయాడు. నటుడు ఎంత గొప్పవాడైనా శారీరకంగా కూడా ఇద్దరికీ సారూప్యత ఉండడం అవసరం అనిపించింది. గాంధీ సినిమాలో బెన్ కింగ్స్లే నటన గాంధీ పాత్రకు ఎంత ప్రాణం పోసిందో అతని రూపం కూడా అంతగా న్యాయం చేసిందని చెప్పాలి. దానితో పాటు ఒక శతాబ్దం క్రితం తమిళనాడులోని జీవన విధానం పట్ల కూడా మరింత దృష్టి పెట్టి ఉండవలసింది అనిపించింది.
పుస్తకం, సినిమా రెండు కూడా సాధారణ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ గణితాన్ని చొప్పించకుండా రూపొందించినప్పటికీ కాస్తో కూస్తో పుస్తకమే గణితాన్ని తగినంతగా చర్చించింది అని చెప్పాలి. రామానుజన్ భార్య, తల్లిల మధ్య ఉన్న అత్తాకోడళ్ల వివాదాలను పుస్తకం, సినిమా రెండింటిలో చిత్రించినప్పటికీ సినిమాలో తల్లిపాత్ర పట్ల కొంత ఎక్కువ సానుభూతి వ్యక్తం చేసినట్లు అనిపించింది.
మొత్తం మీద ఒక గణిత మేధావి జీవితాన్ని, తన స్వల్ప జీవితకాలంలో ఆయన సాధించిన అసమాన విజయాలను అర్ధం చేసుకునేందుకు ఈ రెండూ ఉపయోగపడతాయి. మన సమయానికి తగిన విలువ అని ఖచ్చితంగా చెప్పగలను.
అయితే ఈ పుస్తకం కన్నా రాబర్ట్ కనిగళ్ రాసిన ‘ది మాన్ హూ న్యూ ఇన్ఫినిటీ” మరింత లోతైన పుస్తకం. ‘రామానుజన్’ పేరుతోనే మరొక సినిమా కూడా ఉంది. దానిని నేను ఇంకా చూడలేదు.
–Based on a piece by Meena