1970, 80 లలో యువతకు అత్యధికంగా స్ఫూర్తినిచ్చిన ఉద్యమాలలో చిప్కో ఒకటి. ఈ ఉద్యమం యువతకు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగేలా చేయడమే కాదు శాంతియుతంగా ఉద్యమాలు నడిపే విధానాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది.
గాంధేయవాదం, సర్వోదయ ఉద్యమాలచే స్ఫూర్తి పొందిన సుందరలాల్ బహుగుణ, చండీప్రసాద్ భట్ ఈ చిప్కో ఉద్యమాన్ని ముందుండి నడిపిన కార్యశీలురు. పర్యావరణ వినాశనానికి ప్రజల సంక్షేమం, జీవనోపాధులకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకున్న తొలి ఉద్యమంగా చిప్కోని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉన్న తెహ్రి గరవాల్ ప్రాంతంలోని ప్రజలను సర్వోదయ పద్ధతులకు అనుగుణంగా సమీకరించడంతో పాటు వారి జీవనోపాధులు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో అంశాలపై బహుగుణ అనేక దశాబ్దాల పాటు పని చేశారు.
ఆ దశాబ్దాల తరబడి సాగిన కృషే చిప్కో ఉద్యమానికి బీజాలు వేసింది.
చిప్కో ఉద్యమ ప్రస్థానం 1970 వర్ష ఋతువులో ప్రారంభమయ్యింది. అలకనంద తో పాటు ఇతర హిమాలయా నదులన్నీ పోటెత్తి ఆ పక్కన లోయలోని గ్రామాలన్నింటినీ వరద నీటితో ముంచెత్తాయి. ఊర్లన్నీ నీటిలో మునిగి ఎంతో విధ్వంసం జరిగింది. కొండ వాలులలో ఉన్న వృక్షాలను కొట్టి వేసుకుంటూ పోవడమే ఈ ఉత్పాతానికి కారణం అయింది అని అక్కడి ప్రజలందరికీ స్పష్టంగా అర్ధమయ్యింది. అప్పటికి ఎన్నో సంవత్సరాల నుండి అటవీ కాంట్రాక్టర్ లు ఆ ప్రాంతంలోని చెట్లని నరికి కలపని నగరాలకు తరలిస్తున్నారు. దానితో కొండవాలులన్నీ పెళుసుగా మారి, నీటి ప్రవాహాన్ని ఆపలేక వరదలకు కారణమవుతున్నాయి. ఇంతే కాకుండా చెట్లని నరికేందుకు కాంట్రాక్టర్లకు అనుమతి నివ్వడం వలన తమ ఆహారం కోసం, వంట చెరకు కోసం, వైద్యం కోసం, కలప కోసం అడవిపై ఆధారపడి జీవించే స్థానికులకు ఆ చెట్లపై ఏ హక్కు లేకుండా పోయింది. అక్కడి అడవి అంతా ఓక్ చెట్లతో నిండి ఉంది. స్థానికులకు ఆ చెట్లతో ఎంతో అనుబంధం ఉంది. ఆ చెట్ల ఉత్పత్తులను వివిధ ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన ఉంది. అయితే కాంట్రాక్టర్లు ఆ చెట్లను నాశనం చేయడంతో పాటు చిర్ పైన్ చెట్లను అక్కడ పెంచడం మొదలుపెట్టారు. ఈ పైన్ చెట్లు అక్కడి వాతావరణానికి తగినవి కావు. స్థానికులకు వాటివలన ఉపయోగమూ లేదు. అయితే పైన్ కలపకి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్లు వాటిని పెంచడం ప్రారంభించారు. ఇవన్నీ కూడా అక్కడి స్థానికులలో అసహనానికి కారణమయ్యాయి.
1973 మార్చ్ లో ఒక ఉదయాన తొలిసారిగా ఉద్యమానికి అగ్గి రగులుకుంది. అలహాబాద్ లోని ఒక క్రీడా ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ కి సంబంధించిన మనుషులు చమోలీ జిల్లాలోని గోపేశ్వర్ గ్రామానికి వచ్చారు. అక్కడి చెట్లను నరికి క్రికెట్ బాట్ ల తయారీ చేయాలనేది వారి ఉద్దేశం.
గ్రామస్థులు ఆ చెట్లని ధ్వంసం చేసేటందుకు ఎంతమాత్రమూ సిద్ధంగా లేరు. ఆ చెట్లు నరికేందుకు వచ్చిన మనుషులను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అయితే వారికి చెట్లని నరకమని ఆదేశాలు ఉండడంతో వారు వెనక్కి వెళ్లేందుకు తిరస్కరించారు. గ్రామస్థులంతా కలిసి అప్పటికప్పుడు ఆలోచించుకుని తమ ప్రాణాలు పోయినా సరే ఒక్క చెట్టుని కూడా తాకనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. చిప్కో, చిప్కో (చెట్లని కౌగలించుకోండి) అని అరుచుకుంటూ ముందుకు నడిచారు. చెట్లను చుట్టుకుని వదలలేదు. ఏమి చేయాలో తెలియని ఫ్యాక్టరీ మనుషులు ఒక్క చెట్టుని కూడా నరకకుండానే తిరిగి వెళ్లిపోయారు.
ఆ పోరాటంలో వారు స్థానికులు విజయం సాధించారు. కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు నెలల తర్వాత గోపేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ ఫతా గ్రామం దగ్గర అడవిలో చెట్లను కొట్టేందుకు అటవీ అధికారుల నుండి కాంట్రాక్టర్లు అనుమతి సంపాదించారు.

ఈ వార్త గోపేశ్వర్ కు చేరింది. జనం మండిపడ్డారు. మొత్తం గ్రామంలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అంతా కలిసి ఒక ఉరేగింపులాగా ఫతా బాట పట్టారు. తప్పెట్లు, తాళాలు మోగిస్తూ దారిలోని అందరి దృష్టిని ఆకర్షించారు. “నన్ను నరకండి, చెట్టును మాత్రం నరకొద్దు” అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ ఫతా కు చేరుకున్నారు. దారిలో అనేక గ్రామాల ప్రజలు వారితో జత కలిశారు. వారందరి నోటి నుండి వెలువడిన ‘చిప్కో’ నినాదం ఆ అటవీ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.
చెట్ల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్న అంత పెద్ద జనసందోహాన్ని చూసిన కాంట్రాక్టర్ల మనుషులు తిరిగి ఉట్టి చేతులతో వెళ్ళక తప్పలేదు.
తమ అడవిని, పర్యావరణాన్ని తాము కాపాడుకోగలమనే నమ్మకం స్థానికులలో బలపడింది.
అయితే కాంట్రాక్టర్లు కూడా తమ పధకాలు తాము రచిస్తూనే ఉన్నారు. లాభాల పంట కురిపించే చెట్లను అంత తేలికగా వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. ఒకసారి రేని గ్రామంలో మగవారు అంతా ఊరిలో లేరని తెలుసుకున్న కాంట్రాక్టర్లు ఇదే అదనుగా తమ మనుషులను చెట్లు కొట్టుకురమ్మని పంపారు. ఆ వార్త ఊరంతా తెలిసింది. గౌరా దేవి ఆధ్వర్యంలో ఊరిలోని మహిళలు, పిల్లలు ఊరేగింపుగా అడవి వైపు నడిచారు. ఈ మహిళలు తమనేమి చేయగలరులే అని వచ్చిన వారు ధీమాగా ఉన్నారు. వారి ఊహ తప్పని వెంటనే తెలిసింది. తాము అంతా చెట్లని కౌగలించుకుని ఉంటామని, ఒక్క చెట్టుని కూడా ముట్టుకోనివ్వమని గౌరా దేవి స్పష్టంగా చెప్పింది. “ముందు మమ్మల్ని నరకండి. అప్పుడే మా తల్లి లాంటి ఈ అడవి జోలికి వెళ్ళండి” అని మహిళలంతా ఎదురు నిలబడ్డారు.
మరొకసారి కాంట్రాక్టర్ల మనుషులు ఉట్టి చేతులతో తిరుగు ప్రయాణమయ్యారు.
వారిని ఉట్టి చేతులతో పంపించడమే కాదు. మహిళలంతా కలిసి అసలా కాంట్రాక్టర్ల మనుషులు అడవిలోకి ఎటు నుండి వస్తున్నారు అని ఆలోచన చేశారు. వారు అడవిని చేరుకుంటున్న మార్గాన్ని కనిపెట్టారు. కొండవాలులో ఉన్న ఒక దారి గుండా వారు అడవికి వస్తున్నారు. కొండచరియలు విరిగి పడినప్పుడు ఆ దారి మధ్యలో విరిగిపోతే ఆ విరిగిన దారిని ఒక పెద్ద సిమెంట్ రాయి సహాయంతో కాంట్రాక్టర్లు దాటుతున్నారు. అది ఒక్కటే ఊరి వారి కంట పడకుండా అడవిలోకి రావడానికి కాంట్రాక్టర్లకు ఉన్న మార్గం. మహిళలంతా కలిసి చర్చించారు. ఒక బలమైన దుంగ సహాయంతో వారందరి బలం ఉపయోగించి ఆ సిమెంట్ రాయిని లోయలోకి తోసేశారు. ఇక ఆ దారిలోనుండి కాంట్రాక్టర్లు అడవిలోకి రాలేరు!
అలా మొదలైన చిప్కో ఉద్యమం ఆ ప్రాంతంలోనే కాదు దేశంలోనూ, ప్రపంచంలోనూ అనేకమందిలో పర్యావరణ స్పృహ పెరిగేలా చేసింది.
సుందరలాల్ బహుగుణ హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కిలోమీటర్లు కాలినడకన తిరిగి ఈ ఉద్యమం పట్ల అన్ని ఊర్లలోని ప్రజలలో విస్తృతంగా చైతన్యం తేగలిగారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో మాట్లాడి 1980 నుండి దాదాపు 15 సంవత్సరాల పాటు పచ్చని చెట్లను నరకకుండా ఆదేశాలు తేగలిగారు. తెహ్రి డామ్ కు వ్యతిరేకంగా కూడా బహుగుణ గాంధేయమార్గంలో అనేక శాంతియుత ఉద్యమాలు నిర్వహించారు.
ప్రజా సంక్షేమం కోసం తాను నమ్మిన మార్గంలో రాజీ లేకుండా నడిచిన అరుదైన వ్యక్తిత్వం బహుగుణది. అటువంటి వ్యక్తులు తమ వారసత్వంగా మనకి అందించిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అనేదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న!
— Based on a piece by Meena
ఈ తరం వారికి తెలియని వివరాలతో , వివరణ లతో, మంచి ఆర్టికల్ రాశారు . థాంక్స్ .
మేము స్కూల్ లో ఉన్నప్ప్పుడు ( 80 ల దశకం లో ) సాంఘిక శాస్త్రం లో జి కె లో ఈ ప్రశ్న తప్పని సరిగా వచ్చేది .
” చిప్ కో ఉద్యమ వ్యవస్థాపకులు ఎవరు ? ” అని . లేదా , 5 మార్కుల ప్రశ్న గా వచ్చేది .
LikeLiked by 1 person