ఏడాది క్రితం కరోనా, లాక్ డౌన్ ప్రజల జీవితాలలో ఎటువంటి ప్రభావం చూపించాయి అర్ధం చేసుకునే క్రమంలో నా సహోద్యోగులతో ఒక చర్చా కార్యక్రమం నిర్వహించుకున్నాం. బడి ఈడు పిల్లల మీద కోవిద్ చూపించిన ప్రభావాన్ని గురించి మేము అర్ధం చేసుకున్న విషయాలను ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేసాం. వాటిలో కొన్ని ఇవి.
- చదువుకు సుదీర్ఘ విరామం రావడం వలన నేర్చుకున్న విషయాలను మర్చిపోవడం
- విద్యావకాశాలను అందుకోవడంలో అసమానతలు – ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ లెర్నింగ్ సదుపాయాలు లేకపోవడం
- ఇంటి దగ్గర చదువుకు తల్లితండ్రుల సహకారంలో ఉన్న సమస్యలు
- ఇతర పిల్లలు, పెద్దవారితో కలిసే అవకాశం లేకపోవడం
- వినూత్న విద్యా బోధనా పద్ధతులకు, సాంకేతిక అంశాలకు అలవాటు పడటంలో ఉన్న సమస్యలు
- తగినంత బోధన, వనరులు లేకపోవడం
- బయటకి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకునేందుకు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనేందుకు అవకాశం లేకపోవడం
- పిల్లలలో ఉండే అసాధారణమైన శక్తికి తగిన పనులు లేకపోవడం
- సరైన నిర్మాణం, క్రమశిక్షణ లేని బోధనా వ్యవస్థ
- మధ్యాహ్న భోజనం అందకపోవడం వలన పెరిగిన పోషకాహార లోపాలు
- ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించినా సామాజిక దూరం, సరైన పరిశుభ్రత పాటించేందుకు తగినన్ని మౌలిక వసతుల లేమి
- పెద్ద ఎత్తున వలస కార్మికులు సొంతూర్లకు వెళ్లిన కారణంగా, తగ్గిన ఆదాయాల వలన ప్రైవేట్ పాఠశాలల నుండి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు మార్చిన కారణంగా ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన భారం
- పాఠ్యపుస్తకాల అందుబాటు లో ఉన్న సమస్యలకు తోడు విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం వలన ఉత్పన్నమైన సమస్యలు
- విద్యా సంవత్సరం లో, పరీక్షా విధానాలలో వచ్చిన మార్పులు
- అనేక కారణాల వలన కొంతమంది పిల్లలు చదువు మధ్యలో మానుకోవడం, పెరిగిన బాల కార్మికుల, బాల్య వివాహాల సంఖ్య
- భయం, ఆందోళన
- ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన తల్లితండ్రులు ఎదుర్కునే మానసిక ఒత్తిడి
- ఆరోగ్యసేవలు అందుబాటులో లేకపోవడం
ఇలా అనేక రకాల సమస్యలను అందరూ గుర్తించడం జరిగినా ఈ ఏడాది కాలంలో వీటిని ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికలు రూపొందలేదనేది వాస్తవం.
బడులు ప్రారంభించాలా? వద్దా?
తరగతుల నిర్వహణ మొదలుపెట్టాలా? వద్దా?
పరీక్షలు నిర్వహించాలా? లేదా?
ఇటువంటి స్వల్పకాలిక సమస్యలే తప్ప ఏడాది పాటు బడులు మూసి ఉంచడం వలన ఉత్పన్నమవుతున్న దీర్ఘకాలిక సమస్యల పట్ల పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.

నిజానికి విధాన రూపకర్తల అసలు బాధ్యత ఈ సమస్యల అన్నిటినీ అర్ధం చేసుకుని భవిష్యత్తు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో, వినూత్న ప్రపంచానికి పిల్లలను ఎలా సంసిద్ధులను చేయాలో ఆలోచించడం. ఈ నేపథ్యంలోనే యునెస్కో ‘కోవిద్ అనంతర ప్రపంచంలో విద్యా వ్యవస్థ: 9 ఆలోచనలు” పేరుతో ఒక నివేదిక ప్రచురించింది. భవిష్యత్తు విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని నిర్దేశించే ఆలోచనలు అని వీటిని అనలేము కానీ పైన చెప్పుకున్న సమస్యల సాధన దిశగా ఈ సూచనలు కొంతవరకూ పనిచేసే అవకాశం ఉంది. ఆ తొమ్మిది ఆలోచనలు ఇలా ఉన్నాయి.
1. ప్రజా సంక్షేమ సాధనకి విద్య ఒక ఉత్తమ మార్గంగా గ్రహించి విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. అసమానతలను నిర్మూలించేందుకు విద్య ఒక్కటే మార్గం
2. విద్యా హక్కు యొక్క నిర్వచనాన్ని మరింత విస్తరించాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం, సమాచారం, జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ నిర్వచనంలో భాగం కావాలి.
3. ఉపాధ్యాయ వృత్తికి మరింత గౌరవం పెరగాలి. ఉపాధ్యాయుల మధ్య అనుసంధానం జరగాలి. క్షేత్ర స్థాయి విద్యావేత్తలకి తగినంత స్వతంత్ర ప్రతిపత్తి, ఒకరితో ఒకరు కలిసి పనిచేసేందుకు తగిన వెసులుబాటు ఇవ్వాలి
4. విద్యార్థులు, యువత, పిల్లల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి, వారి హక్కులను కాపాడాలి. విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలని విద్యార్థులు, యువత కోరుకుంటున్నారో అర్ధం చేసుకుని దానికి తగిన వ్యవస్థ నిర్మాణం చేపట్టాలి.
5. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల వలన బడి వాతావరణం పిల్లలకు అందించే సామాజిక వేదికలను కోల్పోకుండా చూడాలి. ఎంత టెక్నాలజీ ఆధారిత తరగతులు నిర్వహిస్తున్నా బడి ఉండాల్సిందే. సంప్రదాయ తరగతి గదికి భిన్నంగా ఎన్నో కొత్త వేదికలు రూపొందుతూ ఉండవచ్చు. కానీ బడి అనే వ్యవస్థలో పిల్లలు అందరూ కలిసి ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉండాలి.
6. ఓపెన్ సోర్స్ టెక్నాలజీలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తేవాలి. విద్య నేర్చుకునేందుకు తగిన స్థలం, వాతావరణం లేకుండా, విద్యార్థులు, గురువుల మధ్య మానవ సంబంధం లేకుండా రెడీ మేడ్ గా లభించే సమాచారం వలన విద్యావికాసం జరగదు. ప్రైవేట్ కంపెనీల నియంత్రణలో ఉన్న డిజిటల్ కంటెంట్, ప్లాట్ఫారం ల మీద విద్యా వ్యవస్థ ఆధారపడటం సమంజసం కాదు.
7. శాస్త్రీయ అక్షరాస్యత (సైంటిఫిక్ లిటరసీ) విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి
8. ప్రభుత్వ విద్యా వ్యవస్థకి స్థానికంగా, అంతర్జాతీయంగా సమకూరుతున్న ఆర్ధిక వనరులను నిలబెట్టుకోవాలి. దశాబ్దాలుగా సాధించిన ప్రగతి ఈ పాండెమిక్ వలన ఎన్నో మెట్లు కిందకి దిగజారింది
9. ప్రస్తుత అసమానతలను తొలగించాలంటే అంతర్జాతీయ స్థాయి సమన్వయం, సహకారం అవసరం.
(సేకరణ:: https://en.unesco.org/sites/default/files/education_in_a_post-covid-world )
గత ఏడాది కాలంలో ప్రపంచం ఎంతో మారింది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవలసిన సమయం ఆసన్నమయింది. భవిష్యత్తు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో ఆలోచించాల్సిన తరుణం ఇదే, ఇప్పుడే.
–Based on a piece by Meena