గతవారం బ్లాగ్ లో కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో బడి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండనుంది అని కొంత చర్చ చేసాం. కోట్లాది మంది పిల్లలు, ఉపాధ్యాయులు అప్పటివరకు పెద్దగా పరిచయం లేని డిజిటల్ బోధన, లెర్నింగ్ వైపుకు మళ్ళవలసిన అవసరం ఏర్పడింది. పిల్లలు ఇంటి దగ్గర నుండే నేర్చుకోవాల్సి రావడంతో తల్లితండ్రులు కూడా అదనపు బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. పిల్లలు ఇంటి వద్ద నుండే నేర్చుకునేందుకు ఉన్న మార్గాలేమిటి, ఏ పద్ధతిలో వారు మెరుగ్గా నేర్చుకోగలుగుతారు అనే విషయాలపై విస్తృతమైన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఈ హోమ్ స్కూలింగ్ పద్ధతే బాగుందని కూడా అభిప్రాయ పడుతున్నారు.
పాఠశాల వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోని రోజుల్లోనే కొంతమంది తల్లిదండ్రులు ఈ హోమ్ స్కూలింగ్ తో ప్రయోగాలు చేశారు. రకరకాల వినూత్న బోధనా విధానాలను ఉపయోగించారు. వాటిలో ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఇక్కడ ఇస్తున్నాను.
ఇది 1847 నాటి కథ. ఏడేళ్ల ఆల్ అనే పిల్లవాడు కేవలం మూడు నెలలు మాత్రమే బడికి వెళ్ళాక ఒక రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. చేతిలో టీచర్ ఇచ్చిన చిన్న కాగితం ఉంది. అందులో ఈ పిల్లవాడికి ఆలోచించే శక్తి లేదని, చదువులో ఎంతమాత్రం శ్రద్ధ లేదనీ, బడి నుండి పంపివేస్తున్నామని సమాచారం ఉంది. ఆల్ తల్లి నాన్సీ కి తన కొడుకు పట్ల బడి ఇచ్చిన తీర్పు పట్ల ఎంతో బాధ కలిగింది. అది ఆమె సవాలుగా తీసుకుని తన కొడుకుకి తానే ఇంటి దగ్గరే చదువు చెప్పాలని నిర్ణయించుకుంది. తన కొడుకుకి ఎంతో బెరుకు అని, మొహమాటస్థుడని ఆమెకి తెలుసు. అతనికి ఏమైనా వినికిడి లోపం ఉందేమో, దాని వలననే బడిలో చెప్పే విషయాలను గ్రహించలేకపోతున్నాడేమో అనుకుంది. ఒకప్పుడు ఆమె టీచర్ కావడంతో తన పిల్లవాడిని అర్ధం చేసుకుని అంచనా వేసే ప్రయత్నం చేసింది. అతనికి సాంప్రదాయ బోధనా పద్ధతిలో చదువు చెప్పడం విసుగు తెప్పిస్తుందని ఆమె అర్ధం చేసుకుంది. తన కొడుకులో ఉన్న కుతూహలాన్నీ, పుస్తక పఠనం పట్ల ఉన్న ప్రేమని ప్రోత్సహిస్తూ అతను స్వతంత్రంగా ఆలోచించేందుకు, ప్రయోగాలు చేసేందుకు, కొత్త కొత్త పనులను ప్రయత్నించేందుకు అవకాశం కల్పించింది.
ఆ పిల్లవాడికి యంత్ర సంబంధమైన విషయాలన్నా, వాటికి సంబంధించిన ప్రయోగాలన్నా చెప్పలేనంత ఆసక్తి. అతనికి తొమ్మిదేళ్ళ వయసులో వాళ్ళ అమ్మ రసాయన మూలకాలతో వివిధ రకాల ప్రయోగాల వివరాలు ఉన్న ఒక పుస్తకం ఇచ్చింది. ఆల్ ఆ పుస్తకాన్ని వదలకుండా చదివాడు. తన పాకెట్ మనీ ఖర్చు పెట్టి వీడి చివర ఉన్న ఫార్మసీ స్టోర్ నుండి తనకి కావలసిన రసాయన పదార్ధాలను కొనుక్కుని ప్రయోగాలు చేసేవాడు. తనకి పదేళ్ల వయసులో తమ ఇంటి బేస్మెంట్ లో ఒక చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని గంటల తరబడి అందులోనే గడిపేవాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాహిత్యం, చరిత్ర కూడా విస్తృతంగా చదివాడు. అలా కేవలం మూడు నెలలు మాత్రమే బడి ముఖం చూసిన పిల్లవాడు తన జీవితాంతం నేర్చుకుంటేనే ఉండేందుకు పునాదులు ఏర్పడ్డాయి.
అలా ఆల్ అని పిలవబడే థామస్ ఆల్వా ఎడిసన్ తన వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తిగా ఎదిగాడు. లైట్ బల్బ్, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా లను ఆవిష్కరించడంతో పాటు టెలిగ్రాఫ్, టెలిఫోన్ ఆవిష్కరణలను కూడా ఎంతో మెరుగుపరిచాడు. తన 84 ఏళ్ళ జీవితంలో 1093 పేటెంట్ లను పొందాడు. కేవలం ఆవిష్కర్తగా మిగిలిపోకుండా తాను కనిపెట్టిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసి విజయవంతమైన వ్యాపారవేత్త గానూ మారాడు.

ఎడిసన్ కు 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అతని తల్లి నాన్సీ మరణించింది. కానీ ఆమె తన జీవితాంతం తనకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఎడిసన్ చెప్పుకునేవారు. “నన్ను ఇలా రూపుదిద్దింది ఆమే. నాపైన అమ్మకు అపారమైన విస్వాసం ఉండేది. ఆమెకోసమే నేను జీవించాలని, ఆమెని ఎప్పుడూ నిరాశపరచకూడదు అనీ అనిపిస్తుంది” అని ఒక సందర్భంలో ఎడిసన్ అన్నారు.
ఇంటి వద్దే చదువు చెప్పే తల్లితండ్రులందరూ నాన్సీ ఎడిసన్ లు కాలేరు. అలాగే ఇంటి వద్ద చదువుకున్న పిల్లలందరూ థామస్ ఆల్వా ఎడిసన్ లు కాలేరు. ఈ కథలో నాకు అన్నిటికన్నా ఆసక్తి కలిగించిన అంశం విద్యా విధానం పట్ల ఎడిసన్ కు ఉన్న దృక్పథం. అది అతని కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది ఈనాటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోయే ఆలోచనా దృక్పధం.
తన కాలంలో ఉన్న విద్యా వ్యవస్థను ఎడిసన్ ఇలా విమర్శించారు. “ఇప్పటి విద్యా వ్యవస్థ మనోవికాసానికి అవకాశం ఇవ్వదు. అది బుద్ధిని ఒక మూసలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. బడిలో చెప్పిన దానిని పిల్లవాడు ఒప్పుకుని తీరాలి అని నేర్పిస్తుంది. వారి సృజనాత్మక ఆలోచనలకు, ప్రశ్నించే తత్వానికి అవకాశం ఇవ్వదు. పరిశీలన ద్వారా నేర్చుకోవడం కన్నా బట్టీ పట్టి నేర్చుకునేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. తమ జీవితాలతో సంబంధం లేని విషయాలను బట్టీ కొట్టడమే తప్ప స్వంత ఆలోచనలకు తావు లేదు. దాని వలన భయం, భయం నుండి అజ్ఞానం పుట్టుకొస్తాయి”
ఎడిసన్ ది తీరని జ్ఞాన తృష్ణ. కేవలం పుస్తకాలలో ఉన్నదానిని అనుసరించడం కాకుండా తాను స్వయంగా పరిశోధించి విషయాలను తెలుసుకోవాలి అనుకునేవాడు. తన జీవితమంతా తాను చేసిన ప్రయోగాలను, పరిశీలనలను, తన ఆలోచనలను వివరంగా తన ప్రయోగశాలలోని నోటు పుస్తకాలలో రాసుకునేవారు. తాను ఒక వ్యాపారవేత్తగా ఎదిగాక కూడా తన కార్పొరేట్ ఆఫీస్ ను తన లైబ్రరీ లో ఏర్పాటు చేసుకున్నారు అంటే ఆయనకి అధ్యయనం అంటే ఎంత మక్కువో అర్ధం అవుతుంది. తన చిన్నతనంలో మొదలైన వినికిడి సమస్య తనతో పాటే పెరిగినా దానిని ఎప్పుడూ ఆయన సమస్యగా అనుకోలేదు. ఇన్ని కొత్త ఉత్పత్తులను కనిపెట్టిన మీరు ఒక వినికిడి యంత్రాన్ని ఎందుకు కనిపెట్టలేదు అని ఒకసారి ఆయనని ఎవరో అడిగారు. బయటి శబ్దాలు వినపడకపోవడం మంచిదే కదా నా ప్రయోగాల మీద ఎక్కువ ధ్యాస కుదురుతుంది అన్నారు ఎడిసన్.
తాను ఎన్నో ప్రయోగశాలలు ఏర్పాటు చేసి, ఎంతో మంది సిబ్బందిని నియమించుకున్నాక కూడా తానే స్వయంగా పరిశోధనలు చేసుకునేందుకు ఆసక్తి చూపేవారు. 1890 లలో ఆయన ఒక వినూత్న పరిశోధన మొదలుపెట్టారు. భవనాల నిర్మాణానికి వాడే ఇటుకలు ఓపెన్ గా ఉండే గూడ్స్ రైళ్లలో తరలిస్తున్నప్పుడు వర్షం పడినట్లైతే తేమ ని పీల్చుకుని తడిగా ఉండేవి. ఆ పరిస్థితి లేకుండా వాన నీటిని గ్రహించి తేమ గా ఉండే ఇటుకలు తయారు చేయాలి అనుకున్నారు. రకరకాల పదార్ధాలతో బైండింగ్ సొల్యూషన్ ను తయారు చేసి చూసారు. ఎడిసన్, అతని సహోద్యోగులు దానిని “మక్” అని పిలిచేవారు. దానితో ఆ ప్రయోగంలో భాగస్వామ్యులైన వారందరినీ ఎడిసన్ “మక్కర్స్” అని పిలుస్తుండేవారు. ఇక ఎడిసన్ ప్రయోగశాలల్లో పని చేసే సిబ్బంది అందరికీ ఉమ్మడి పేరుగా “మక్కర్స్” స్థిరపడి పోయింది. వారంతా తర్వాత కాలంలో “ఎడిసన్స్ మక్కర్స్” పేరుతో మరొక సంస్థని కూడా స్థాపించుకున్నారు.
ఒక పేరెంట్ గా కూడా తన పిల్లలను పరిశీలన, పరిశోధన వైపు ప్రోత్సహించాడు. తాను ఏ పుస్తకం చదవాలనుకుంటున్నాడో పిల్లలకి చెప్పి తన విశాలమైన లైబ్రరీలో ఆ పుస్తకం కోసం వెతకమని పిల్లలకి చెప్పేవాడు. ఒక్కోసారి కొన్ని పేజీలు వెతికి పెట్టమని అడిగేవాడు. ఆ విధంగా పిల్లలకు పుస్తకాలతో సమయం గడిపే అవకాశం ఇస్తూ వారిని పుస్తక పఠనం వైపు ప్రోత్సహించాడు.
ప్రస్తుత విద్యా విధానం పట్ల తన అసంతృప్తిని ప్రకటిస్తూనే తనకు మాంటిస్సోరి విద్యా విధానం పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేసాడు. “నాకు మాంటిస్సోరి పద్ధతిలో బోధన అంటే ఇష్టం. అది పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ పద్దతిలో నేర్చుకోవడం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప పిల్లలకు ఇబ్బందిగా ఉండదు. మనిషి సహజాతాలను అర్ధం చేసుకుంటే బోధించే వ్యవస్థ ఇది” అని ఒకచోట రాశారు. 1913 లో మరియా మాంటిస్సోరి తొలిసారి అమెరికా సందర్శించినప్పుడు ఎడిసన్ ఇంట్లోనే బస చేశారు.
ఎడిసన్ ఆవిష్కరణలు ప్రపంచంలో ఎన్నో మార్పులు తెచ్చాయి. సాంకేతిక విప్లవానికి ఆద్యులలో ఆయనను ఒకడిగా చెప్పుకోవచ్చు. కేవలం ప్రయోగాలు, ఫలితాల పట్ల మాత్రమే కాక ఎడిసన్ విద్యా విధానం పట్ల, నేర్చుకునే ప్రక్రియ పట్ల ఎంతో ఆసక్తి చూపించేవారు. తన తల్లి నేర్పిన నాలుగు సూత్రాలను తన జీవితాంతం పాటించారు.
ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దు. దాని నుండి నేర్చుకో. మళ్లీ ప్రయత్నించు.
బుద్ధితో, చేతులతో రెండింటితో నేర్చుకో
విలువైనవన్నీ పుస్తకాలలోనే దొరకవు – ప్రపంచాన్ని పరిశీలించు
నేర్చుకోవడం ఎప్పటికీ ఆపవద్దు. అన్ని రకాల సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యి.
ప్రతి పేరెంట్ కూడా ఈ విధమైన సూత్రాలను తమ పిల్లలకు నేర్పినట్లైతే వారు జీవితాంతం నేర్చుకునే ప్రక్రియని కొనసాగిస్తూనే ఉంటారు.
దాదాపు శతాబ్దం తర్వాత కూడా విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులేమీ రాలేదు. ఈ వ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉండనుంది అనే ప్రశ్న ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమాచార సాంకేతిక యుగంలో విద్యా వ్యవస్థని పునర్వ్యవస్థీకరించాలి అనుకుంటే పిల్లలను “మక్కర్స్” గా ఉండేలా ప్రోత్సహించేందుకు అవకాశం కల్పించాలి. అప్పుడే వారు నేర్చుకోవడంలోని ఆనందాన్ని గ్రహించగలుగుతారు.
–Based on a piece by Mamata