కరోనా వైరస్ దేశాన్ని పట్టి కుదిపేయడం మొదలుపెట్టాక ఎవరైనా తుమ్మితే సహజంగా వచ్చే స్పందన వాళ్ళని తిట్టుకుని దూరంగా వెళ్ళిపోవడం. అయితే ముందు పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలుసు. ఎవరైనా తుమ్మగానే “చిరంజీవ” అని ఆశీర్వదించడం కరోనా కు ముందు ఉన్న సహజమైన స్పందన. తుమ్మితే చిరంజీవ అనే ఆచారం మన తెలుగు వాళ్లలోనే కాదు, ప్రపంచమంతా ఉన్నదే. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎవరైనా తుమ్మగానే ‘బ్లెస్స్ యు’ అంటారని మనకు తెలియనిది కాదు.
ఈ ఆచారం అసలు ఎలా మొదలయ్యింది అని కొంచెం చరిత్రలోకి చూస్తే అనుకోకుండా అది మరో మహమ్మారి దగ్గరకి వెళ్లి ఆగింది. ప్రపంచమంతా ప్లేగు వ్యాధి ప్రబలిన సమయం అది. నిజానికి ప్లేగ్ ఒకసారి కాదు, అనేక వేవ్స్ లో అనేక సార్లు అనేక దేశాలను, ముఖ్యంగా యూరోపియన్ దేశాలను పట్టి కుదిపేసింది. ఎవరికైనా ప్లేగు వ్యాధి సోకగానే మొదట జలుబు, దగ్గు ప్రారంభం అయ్యేవి. తర్వాత జ్వరం, శ్వాస ఇబ్బందులు, రక్తపు వాంతులు, చర్మం నల్లగా మారిపోవడం వంటి అనేక లక్షణాలు కనపడి దాదాపు ఏడు నుండి పది రోజులలో వ్యాధి సోకిన వ్యక్తులు ప్రాణాలు కోల్పోయేవారు. అసలీ వ్యాధి ఎలా ఇంత తీవ్రంగా ప్రబలింది, దీనికి చికిత్స ఏమిటి అనేదానిపై అవగాహన లేక ప్రజలు స్థానికంగా దొరికిన ఆకులు, మూలికలతో వైద్యం చేసుకుంటూ, వ్యాధిని తగ్గించమని ప్రార్ధనలు చేసుకుంటూ గడిపారు.
యూరప్ లో ఈ మహమ్మారి ప్రబలిన సమయంలో పోప్ కూడా దాని బారిన పడి మరణించడంతో పోప్ గ్రెగొరీ I కొత్త పోప్ అయ్యారు. ఫిబ్రవరి 16, 600 వ సంవత్సరంలో ఎవరైనా తుమ్మిన వెంటనే ఆ చుట్టు పక్కల ఉన్న ప్రజలు ఆ వ్యక్తి కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తూ మూడు పదాలతో కూడిన ఒక ప్రార్ధన చేయవలసిందిగా ప్రజలకు సందేశం ఇచ్చారు. తుమ్ముతూ ఉన్న వ్యక్తి కి ప్రజల దీవెనలు, ప్రార్ధనలు అందినట్లైతే అతను త్వరగా కోలుకుంటాడని ఆయన ఆశించారు. ఇంగ్లీష్ మాట్లాడే దేశాలన్నిటిలో ఎవరైనా తుమ్మగానే “గాడ్ బ్లెస్స్ యు” అని ప్రార్ధించడం అప్పటి నుండి ఆచారంగా మారింది.
యూరోపియన్ దేశాలలో పోప్ సూచనతో ఆచారంగా మారిన ఈ “గాడ్ బ్లెస్స్ యు” ప్రార్ధన అంతకు ముందు నుండే ఎన్నో దేశాలలో అలవాటుగా ఉంది. ఎన్నో ప్రాచీన సంస్కృతులలో తుమ్ములను అశుభ సూచకంగా, దేవుని నుండి వచ్చిన ప్రమాద సంకేతంగా భావించేవారు. తుమ్మగానే వ్యక్తి ఆత్మ అతని నుండి కొంతసేపు బయటకు వెళుతుందని, ఆ కొద్దిసేపటిలో దెయ్యాలు, దుష్ట శక్తులు ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయని అనుకునేవారు. గాడ్ బ్లెస్స్ యు అనడం వలన ఆ దుష్ట శక్తులు ఆ మనిషి దగ్గరకి చేరలేవని, అతని ఆత్మ అతని వద్దకు తిరిగి వస్తుందని నమ్మేవారు. తర్వాత కాలంలో, తుమ్మినప్పుడు వ్యక్తి గుండె కొద్దిసేపు స్పందనలు కోల్పోతుందనీ, గాడ్ బ్లెస్స్ యు అని ప్రార్ధించడం వలన అది తిరిగి కొట్టుకోవడం మొదలుపెడుతుందనే నమ్మకం కూడా కొన్ని సమూహాలలో ఉండేది.
ప్రాచీన గ్రీకులు, ఈజిప్షియన్లు, రోమన్లు తుమ్మడం అంటే దేవుడు భవిష్యత్తు గురించి ఇస్తున్న సందేశం అని భావించేవారు. అది శుభసూచకం అయినా కావొచ్చు. అశుభసూచకం కూడా కావచ్చు. అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. దురదృష్టాన్నీ తీసుకురావచ్చు.
ఇవి యూరోపియన్ దేశాలలో ఉన్న కొన్ని నమ్మకాలు మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఇంకా అనేక నమ్మకాలు ఉండేవి.
ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లలో నవజాత శిశువు మొదటి సారి తుమ్మేవరకూ ఆ బిడ్డ ఇంకా దేవలోకపు పరిధిలోనే ఉన్నట్లు భావించేవారు. పాలినేషియన్ ప్రజలు కూడా అలాగే పసిపిల్లల తుమ్ములో ఏదో దైవ సందేశం ఉందని భావించేవారు. టోంగా లో పసిపిల్లలు తుమ్మితే ఆ కుటుంబానికి ఏదో కీడు జరుగుతుంది అనుకునేవారు. మరోయులలో పిల్లలు తుమ్మితే దానిని ఏదైనా ప్రయాణానికి, లేదా ఏదైనా శుభవార్తకు సూచనగా భావించేవారు.

నావికులు కూడా తుమ్ములను బట్టి తమ ప్రయాణం ఎలా ఉండనుండో అంచనా వేసేవారు. ఓడ బయలుదేరే ముందు సరంగు ఓడ ముందుభాగంలో నిలబడి తుమ్మినట్లైతే ఆ ప్రయాణం సవ్యంగా సాగనుందనీ, వెనక భాగంలో ఉన్నప్పుడు తుమ్మితే ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోయే ప్రమాదం ఉందనీ అనుకునేవారు.
పోలిష్ సంస్కృతిలో తుమ్ము అశుభ సూచకం. ఎవరైనా తుమ్మితే, ఆ సమయంలో వారి అత్తగారు వారి గురించి చెడు ఆలోచనలు చేస్తుంది అనుకునేవారు. తుమ్మిన వ్యక్తి అవివాహితులు అయినట్లయితే వారికి వివాహం అయ్యాక అత్తగారితో సంబంధాలు సరిగ్గా ఉండవు అని భావించేవారు. ఈ నమ్మకం ఇప్పటికీ అక్కడి ప్రజలలో ఉంది. ఇటాలియన్ సంస్కృతిలో పిల్లి కనుక తుమ్మినట్లైతే దాన్ని శుభసూచకం అనుకునేవారు. పెళ్లికూతురు తన వివాహ దినోత్సవాన పిల్లి తుమ్మడం విన్నట్లైతే ఆ వివాహ బంధం కలకాలం సంతోషంగా వర్ధిల్లుతుందని వారి నమ్మకం. అయితే అది మూడు సార్లు వరుసగా తుమ్మితే, ఆ కుటుంబానికంతటికీ జలుబు చేస్తుందని కూడా అనుకునేవారు.
కొన్ని తూర్పు ఆసియా దేశాలలో మీకు తుమ్ము వచ్చింది అంటే మీకు తెలియకుండా ఎవరో ఎక్కడో మీ గురించి మాట్లాడుతున్నారని నమ్మేవారు. ఒకసారి తుమ్మితే మంచి విషయాలు మాట్లాడుతున్నట్లు, రెండు సార్లు తుమ్మితే చెడ్డ విషయాలు మాట్లాడుతున్నట్లు నమ్మకం. వరుసగా మూడు సార్లు తుమ్మితే మీతో ఎవరో ప్రేమలో ఉన్నట్లు లేదా మీరు త్వరలో ప్రేమలో పడబోతున్నట్లు. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ తుమ్ములైతే ఆ కుటుంబానికి లేదా కుటుంబంలో ఎవరో ఒకరికి నష్టం జరగనున్నట్లు.
చైనా లో కూడా తుమ్ముల గురించి ఎన్నో ప్రాచీన గాధలు ఉండేవి. టాంగ్ వంశంలో చక్రవర్తి తల్లి కనుక తుమ్మినట్లైతే రాజప్రాసాదంలోని అధికారులంతా “వాన్ సుయ్” (చిరంజీవ) అనేవారని ఆ వంశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పొందిపరిచిన ఒక పుస్తకంలో రాసి ఉంది. ఇప్పటికీ చైనాలో కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం ఉంది.
తుమ్మిన సమయాన్ని బట్టి కూడా కొన్ని నమ్మకాలు ఉండేవి. తెల్లవారు జామున ఒకటి నుండి మూడు మధ్య తుమ్మితే నిన్ను ఎవరో గుర్తు చేసుకుంటున్నట్లు; మూడు నుండి ఐదు మధ్య తుమ్మితే నిన్నెవరో ఆ రోజు రాత్రి భోజనానికి ఆహ్వానిస్తారు; ఐదు నుండి ఏడు మధ్య తుమ్మితే నీకు త్వరలో అదృష్టం పట్టనుంది అని; 11 నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో తుమ్మితే దూరం నుండి ఎవరో స్నేహితులు నిన్ను కలవడానికి వస్తున్నారని. ఇలా రోజులో మనిషి తుమ్మిన సమయాన్ని బట్టి నమ్మకాలు ఉండేవి.
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభసూచకంగా భావిస్తారు. అలా తుమ్మినప్పుడు బయటకు వెళ్లకుండా ఆగి, కాసేపు కూర్చుని, కొంచెం నీళ్లు తాగి మళ్ళీ బయలుదేరినట్లయితే ఆ అశుభం జరగకుండా ఆగుతుందని నమ్మకం.
ఏదైనా వైరస్ శరీరంలో ప్రవేశించి జలుబునో, ఎలర్జీ నో కలుగచేస్తే తుమ్ములు వస్తాయని ఈ రోజు మనందరికీ తెలుసు. అయినా ఎవరైనా తుమ్మగానే “చిరంజీవ” అనే అలవాటు మాత్రం మనలో ఇంకా అలాగే ఉంది.
–Based on a piece by Mamata