స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ల (SOP) గురించి చాలా మందికి తెలుసు. వస్తుసేవల ఉత్పత్తి రంగంలో ముఖ్యంగా ఫార్మా రంగంలో మొదలైన ఈ SOP పద్ధతులు తర్వాత మిగిలిన రంగాలకు కూడా విస్తరించాయి. ఏదైనా ఒక వస్తువును పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి అన్నీ ఒకే నాణ్యతతో, ఒకే పరిమాణంతో ఒకే విధంగా ఉండాలంటే ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఉత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఉత్పత్తి క్రమాన్ని ఏ పనితో ప్రారంభించాలి, వరుసగా ఏమేమి చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఎవరు ఏ పని చేయాలి వంటి వివరాలన్నీ రాసి పెట్టుకున్న నియమావళినే SOP అంటారు. పెద్ద స్థాయిలో వస్తు, సేవలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఈ SOP లు అత్యవసరం.
అయితే పని ప్రదేశాలలోనే కాక మన దైనందిన జీవితంలో కూడా SOP లు అవసరమని నేను నమ్ముతాను. నాకు ఏది ఎక్కడ పెట్టానో గుర్తు ఉండదు. పనిని ఒక పద్ధతిలో చేసుకోలేను. అయినా కూడా నా జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడుపుకునేందుకు SOP లే నాకు ఉపయోగపడుతున్నాయి. ఏదైనా ఒకటి రెండు సార్లు తప్పుగా చేస్తే వెంటనే ఆ పని చేయడానికి ఒక SOP తయారు చేసుకోవాలి అని నాకు అర్ధమయ్యిపోతుంది.
ఉదాహరణకు:
- ఎప్పుడైనా దూరప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు నేను వెళ్ళవలసిన చోటికి వెళ్ళాక అవసరమైన వస్తువు ఏదో ఒకటి మర్చిపోయి వచ్చానని గుర్తు వస్తుంది. అది జరగకుండా ఉండేందుకు నేను రెండు SOP లు నిర్ణయించుకున్నాను. మొదటిది, ప్రయాణం అనగానే ఖచ్చితంగా అవసరమైన వస్తువులు ఏమిటో ఒక లిస్ట్ రాసి పెట్టుకోవడం. రెండవది, ప్రయాణానికి వారం ముందుగానే సూట్ కేసు కిందకి దించి పెట్టుకుని ఒక్కొక్క వస్తువు అందులో పెట్టుకోవడం. బట్టలు, ఇతర వస్తువులే కాదు, మందులు, దారిలో చదువుకోవడానికి పుస్తకాలు, వాకింగ్ బూట్లు, వెళ్లిన చోట మిత్రులకు ఇచ్చేటందుకు కొన్ని బహుమతులు కూడా.
- తర్వాత రోజు ఆఫీస్ కి చెక్ బుక్ తీసుకువెళ్ళాలి అనుకోండి. లేదా ఏవైనా మందులు తీసుకెళ్ళాలి. వాటిని నేను మర్చిపోయి వెళ్తానని నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకే నా కప్ బోర్డు లో ఒక స్థలం పెట్టుకున్నా. తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలో ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు ఆ కప్ బోర్డు లో పెట్టుకుంటా. ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు, లేదా ప్రయాణం అప్పుడు సూట్ కేసు లో పట్టుకువెళ్లిన బ్రోచర్లు కావచ్చు. ఏవైనా సరే గుర్తు వచ్చినప్పుడు అందులో పెట్టేస్తా. రోజూ ఆఫీస్ కి వెళ్లేముందు ఆ కప్ బోర్డు ఒకసారి చూసుకుని వెళ్లడం ఒక అలవాటుగా పెట్టుకున్నా. దీనికోసం ఒక నాలుగు సార్లు అటూ ఇటూ ఇంట్లో తిరగాల్సి రావచ్చు. కానీ ఇలా చేయడం వలన ఇంతవరకూ ఏదీ మర్చిపోకుండా తీసుకువెళ్తున్నా. ఈ పద్ధతే లేకపోతే తీసుకువెళ్లాల్సిన వస్తువు మర్చిపోయి వెళ్లేందుకు నాకు 75% అవకాశం ఉంది.
- నాకు ఎప్పుడూ కళ్ళజోడు మర్చిపోయే అలవాటు ఉంది. కానీ అవి లేకుండా పని గడవదు. అందుకే నా రీడింగ్ గ్లాస్సెస్ విషయంలో కూడా ఒక SOP పెట్టుకున్నా. నాకున్న హ్యాండ్ బ్యాగ్ లు అన్నిటిలో ఒక జోడు పెట్టుకుంటాను. ట్రావెల్ బాగ్ లో ఒకటి. బెడ్ రూమ్ లో ఒకటి. లివింగ్ రూమ్ లో ఒకటి. మరీ ఎక్కువైనట్లు అనిపిస్తుందా? అదేమీ లేదు. నేను ఒక్కోదాని మీద 250 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టను.
- నా చీరలు, సల్వార్ లు, చుడిదార్ లు అన్నీ రంగుల వారీగా సర్దుకుంటాను. నేను ప్రత్యేకమైన కిట్ బ్యాగ్ లు తయారు చేయించుకున్నా. ఒక రంగుకు దగ్గరగా ఉండే చీరలన్నీ ఒక కిట్ లో ఉంటాయి. తెల్లని సల్వార్ లకు ఒక కిట్, బ్లూ, గ్రీన్ రంగుల్లో ఉన్న సల్వార్ లకు మరో కిట్ ఇలా. ఇది నాకు చాలా ఉపయోగపడింది. ఏదైనా సల్వార్ వెతుక్కోవాలంటే మొత్తం కప్ బోర్డు ని చిందరవందర చేసేబదులు ఒక కిట్ ని చేస్తే సరిపోతుంది.
- ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి.
మీలో చాలా మంది ఇటువంటి SOP ల అవసరం లేకుండానే జీవితాన్ని క్రమపద్ధతిలో నడుపుకుంటారని నాకు తెలుసు. అయితే కొంచెం క్రమశిక్షణ లేని వారికి, నాలాగా మతిమరుపు ఉన్నవారికి ఇవి ఉపయోగపడతాయి. కొంతమంది ఇటువంటి పద్ధతులు పెట్టుకున్నా వాటికి నాలాగా SOP అని పేరు పెట్టుకుని ఉండరు. కానీ అలా వాటిని SOP లుగా పిలుచుకోవడం వలన నాకు నా జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో, ప్రొఫెషనల్ గా నడుపుకుంటున్నాననే ఒక సంతృప్తి వస్తుంది.
–Based on a piece by Meena