
2017 లో జూన్ 27 వ తేదీని ప్రపంచ చిన్న, మధ్య తరహా వ్యాపారాల దినోత్సవంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేసింది. స్థానికంగా, అంతర్జాతీయంగా సుస్థిర అభివృద్ధిని సాధించడంలో ఈ రంగం యొక్క పాత్ర తక్కువేమీ కాదు. ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాకూడా ఎందువల్లనో వాటికి తగినంత ఆదరణ లభించడం లేదన్నది వాస్తవం. అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఉద్యోగాలలో మూడింట రెండు వంతులు ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమలలోనే ఉంటున్నాయి. సంఘటిత రంగంలో ప్రతి ఐదు ఉద్యోగాలలో నాలుగు ఈ రంగానివే. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇటువంటి పరిశ్రమలను ముఖ్యంగా అతి చిన్న పరిశ్రమలను మహిళలే నిర్వహిస్తున్నారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అంటే అంతర్జాతీయంగా ఒకటే నిర్వచనం లేదు. భారతదేశంలో గత సంవత్సరం చేసిన మార్పుల ప్రకారం వార్షిక టర్నోవర్ తో పాటు, ప్లాంట్, యంత్రాలు, పరికరాలు వంటి వాటిలో పెట్టిన పెట్టుబడుల ఆధారంగా ఏవి చిన్న తరహా పరిశ్రమలు, ఏవి మధ్యతరహా, ఏవి భారీ పరిశ్రమలు అనేది నిర్ధారిస్తారు.
ప్లాంట్, యంత్రాలు, పరికరాలలో పెట్టిన పెట్టుబడి కోటి రూపాయల కంటే తక్కువగా ఉండి వార్షిక టర్నోవర్ ఐదు కోట్ల కన్నా తక్కువగా ఉన్నవి అతి చిన్న పరిశ్రమలు. పెట్టుబడి ఒకటి నుండి పది కోట్ల మధ్యలో ఉండి టర్నోవర్ 50 కోట్ల కంటే తక్కువగా ఉన్నవి చిన్న తరహా పరిశ్రమలు. 10 నుండి 50 కోట్ల మధ్యలో పెట్టుబడి ఉంది వార్షిక టర్నోవర్ 250 కోట్లకు మించనివి మధ్య తరహా పరిశ్రమలు.
అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో వలెనే మన దేశంలో కూడా ఈ రంగం దేశ స్థూల జాతీయోత్పత్తికి ఎంతో దోహదపడుతుంది. దేశంలో ప్రస్తుతం 6 కోట్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉండగా అందులో 99.4 శాతం అతి చిన్న పరిశ్రమలు, 0.52 శాతం చిన్న పరిశ్రమలు, 0.007 శాతం మధ్య తరహా పరిశ్రమలుగా ఉన్నాయి. అంటే మొత్తం మీద అతి చిన్న పరిశ్రమల సంఖ్య బాగా ఎక్కువ. దేశం మొత్తం ఎగుమతులతో 48 శాతం ఈ పరిశ్రమల నుండే ఉంటున్నాయి. జిడిపి లో 30% ఈ రంగానిదే. దాదాపు 11 కోట్ల మంది ఈ పరిశ్రమలలో ఉపాధి పొందుతున్నారు. 41% చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పాదక రంగంలో ఉండగా మిగిలిన 59% సేవా రంగానికి చెందినవి.
గడచిన నాలుగు, ఐదు సంవత్సరాలలో ఈ పరిశ్రమల సంఖ్య బాగా పెరిగింది.
సంఖ్య పెరిగినా జిడిపి లో వీటి వాటా మాత్రం ఏ మాత్రం పురోగతి లేకుండా నిలకడగా ఉంది. ఇది ఆ రంగం లో నానాటికీ పడిపోతున్న ఉత్పాదక సామర్ధ్యాన్ని సూచిస్తుంది. కొన్ని అంచనాల ప్రకారం ఇతర దేశాల పరిశ్రమలతో పోలిస్తే భారత దేశపు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇరవై ఐదు శాతం తక్కువ ఉత్పాదక సామర్ధ్యాన్ని కలిగివున్నాయి.
ఉత్పాదక సామర్ధ్య లోపంతో పాటు మార్కెట్ లను అందిపుచ్చుకోవడంలో కూడా మన దేశ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెనుకబడే ఉన్నాయి. ఇక విధాన లోపాలు, నియంత్రణా చట్టాలలోని లోపాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పటి కరోనా మహమ్మారి ఈ రంగాన్ని మరింత దెబ్బ తీసింది. వ్యాపారం లేకపోవడంతో పాటు పనివారిని తగ్గించాల్సి రావడం, ముడిసరుకుల కొనుగోలులో ఉన్న ఇబ్బందులు ఈ రంగాన్ని మరింత దెబ్బతీశాయి.
నానాటికీ ఉద్యోగాల కల్పన తగ్గిపోవడంతో స్వయం ఉపాధే సరైన మార్గం అనుకుంటున్న తరుణంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇంకా ఎంతో చేయవలసి ఉంది. అనేక సంవత్సరాలు విద్య, నైపుణ్య కల్పనా రంగంలో పని చేసిన నాకు ఈ రంగం ఎదుర్కుంటున్న సంక్షోభానికి విద్య, నైపుణ్య శిక్షణ ముఖ్యమైన పరిష్కార మార్గాలుగా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాధమిక విద్యా స్థాయిలో పునాది బలంగా ఉండాలి.
వృత్తి విద్య పట్ల గౌరవం, వాటి సాధన తో పాటు ప్రాధమిక దశ నుండే నాణ్యత పట్ల, ఇచ్చిన పనిని క్రమ పద్దతిలో నిర్వహించవలసిన అవసరం పట్ల అవగాహన కల్పించాలి. ఇవి ఎప్పుడో పెరిగి పెద్దయ్యాక నేర్పించేవి కాదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణంలో భాగంగా ఉండవలసిన నైపుణ్యాలు ఇవి.
వృత్తి విద్యా శిక్షణ కూడా ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా ఎన్నో రేట్లు మెరుగ్గా అందించాల్సి ఉంది. జర్మనీ ని ఉదాహరణగా తీసుకుంటే, ఒక వృత్తి విద్యని నేర్చుకునే విద్యార్థి దాదాపు రెండు నుండి మూడున్నర సంవత్సరాలు ఆ విద్యని నేర్చుకోవడానికే కేటాయిస్తారు. అందులో సగం సమయం వృత్తి విద్యా పాఠశాలలోనూ, మిగిలిన సగం సమయం ఆ వృత్తి విద్యకు సంబంధించిన కర్మాగారాలలోనూ గడుపుతూ శిక్షణ పొందుతారు. మన దేశంలో మూడు నెలలలో వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాం! పాలిటెక్నిక్ లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో విద్యార్థులు కొంత ఎక్కువ సమయం గడిపినా వారికి నిజంగా పని ప్రదేశాలలో పని చేయగలిగే నైపుణ్యాలు అందడం లేదు. ప్రాక్టికల్ శిక్షణ దాదాపు లేదు. ఆధునిక యంత్రాల మీద శిక్షణ అసలే లేదు. ఇంక ఉత్పాదకత ఏ విధంగా పెరుగుతుంది?
ఇంతేకాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు మానేజ్మెంట్ విద్యను అందించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. తమ దగ్గర పని చేసే వ్యక్తులను, తమ ఆర్ధిక లావాదేవీలను, ఉత్పత్తిని, మార్కెటింగ్ ను ఎలా నిర్వహించుకోవాలో తెలియక ఎంతో మంది తప్పులు చేస్తూ ఆర్ధికంగా నష్టపోతూ వ్యాపారాలను మూసేసే పరిస్థితికి వస్తున్నారు. కొన్ని చిన్న వ్యాపారాల నిర్వహణ కు సంబంధించిన కోర్సులు ఉన్నాయి కానీ అవి అవసరమైన వారికి అందుతున్న దాఖలాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ఇంక్లూసివ్ డెవలప్మెంట్ ను సాధించాలంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకం. స్థానికంగా చిన్న స్థాయి వ్యాపారాల ద్వారా ఎంతో మంది పేదలు, నిరుపేదలకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. కరోనా వలన దెబ్బ తిన్న అనేక చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు స్పందించాల్సిన సమయం ఇదే, ఇప్పుడే!
–Based on a piece by Meena