“సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ఢిల్లీ యూనివర్సిటీ లోని సైన్స్ విభాగానికి డీన్ గా ఉన్న 48 ఏళ్ళ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి 1948 లో తొలి శాస్త్రీయ సలహాదారుగా నియమించబడ్డారు. ఇందులో భాగంగా ఆయన డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజషన్ ను స్థాపించారు. దానిలో పని చేసేందుకు ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, రసాయన శాస్త్రం, గణితం, పోషకాహారం, భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం వంటి వివిధ విభాగాలలో అనేక యూనివర్సిటీ లలో పని చేస్తున్న శాస్త్రవేత్తల నుండి కొందరిని ఈ సంస్థ కోసం ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేశారు. వీరు బాలిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, పేలుడు పదార్ధాలు, పెయింట్లు, ఆహారం, పోషణ, మానసిక దృఢత్వానికి సంబంధించిన అంశాలు, యుద్ధరంగంలో ఉండే వత్తిడి, శారీరక అలసట వంటి అనేక అంశాలలో పరిశోధనలు నిర్వహించేవారు. రక్షణ సమస్యల పరిష్కారంలో శాస్త్రవేత్తల పాత్ర ఎంత కీలకమైందో ఆయన నిరూపించారు. ఏ పరిధులు లేకుండా నేర్చుకునేందుకు అవకాశం ఉండి, పెద్ద, చిన్న తేడాలు లేని, సిబ్బంది అందరి మధ్యలో మంచి అనుబంధం ఉండే సంస్థగా దానిని మలచాలనేది డాక్టర్ కొఠారి లక్ష్యం. ఆయన తొలిగా స్థాపించిన సైన్స్ లేబొరేటరీ నే ఈ రోజు డిఆర్డిఓ అనే అత్యున్నత సంస్థ ఏర్పాటుకు పునాది.
ఎవరి వృత్తి జీవితంలో అయినా తొలి బాస్ ప్రభావం ఎంతో ఉంటుంది. వారి నాయకత్వ నైపుణ్యాలు, వృత్తి నియమాలు వారి కింద పని చేసే సిబ్బంది కెరీర్ లో కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకి అయితే మంచి బాస్ దొరికితే వారే దేవుడి లాగా కనపడటంలో ఆశ్చర్యమేమీ లేదు.
మా నాన్నకు డాక్టర్ కొఠారి మొదటి బాస్. ఆయన సాక్షాత్తు దేవుడే మా నాన్నకి.

డిఆర్డిఓ వెబ్సైటు లో డాక్టర్ కొఠారి గురించి రాసి ఉన్నదానికి మా నాన్న ఆయన గురించి నాతో చెప్పిన దానికి కొంచెం కూడా తేడా లేదు.
డిఆర్డిఓ అధికారంగా ఏర్పడింది 1958 లో. అయితే దానికి ముందే ఎన్నో రక్షణకి సంబంధించిన ల్యాబ్ లు ఉండేవి. 1953 లో డిఫెన్స్ సైన్స్ ల్యాబ్ లో ఒక జూనియర్ స్థాయి ఉద్యోగానికి మా నాన్న దరఖాస్తు పంపి, ఇంటర్వ్యూ కి హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూ పానెల్ లో డాక్టర్ కొఠారి నే స్వయంగా కూర్చున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖకి శాస్త్ర సలహాదారుగా ఉన్న ఆయన తన ఎన్నో ముఖ్యమైన పనులను పక్కన పెట్టి ఆ యువ శాస్త్రవేత్తలను తానే స్వయంగా ఎంపిక చేసుకోవాలని రోజుల తరబడి ఇంటర్వ్యూ లలో పాల్గొన్నారు. అప్పుడే స్వతంత్రం పొందిన దేశంలో ఒక బలమైన రక్షణ సంస్థను ఏర్పాటు చేయాలంటే దేశం నలుమూలల నుండి ప్రతిభ గల యువ శాస్త్రవేత్తలను ఎంపిక చేయడం తన ముఖ్యమైన కర్తవ్యంగా భావించారు ఆయన.
మా నాన్న, ఆయనతో పాటు చేరిన యువ శాస్త్రవేత్తలకు మొదటగా అప్పగించిన పని అత్యంత ఎత్తైన ప్రాంతాలలో పని చేస్తున్న సైనికులకు ఇచ్చే చపాతీలు ఎంత మందంగా ఉండాలో పరిశోధించడం. చపాతీ చేయడానికి ఎంత పిండి వాడాలి, ఎంత సమయం తీసుకోవాలి, కాల్చడానికి ఎంత సమయం కావాలి, ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది వంటివన్నీ వీరు అంచనా వేయాల్సి ఉంది. అన్నిటికీ మించి ఆ చపాతీలు రుచిగా ఉండాలి కూడా. రోజువారీ సమస్యల పరిష్కారంలో సైన్స్ అవసరం ఎంత ఉందో ఆ తరం శాస్త్రవేత్తలందరికీ స్పష్టత ఉంది.

1955 లో అప్పటి ప్రధాని నెహ్రు న్యూక్లియర్, థెర్మో న్యూక్లియర్, ఇంకా అనేక ఇతర విధ్వంసకర ఆయుధాల వినియోగంలో ఉండే పరిణామాలను అంచనా వేయాల్సిందిగా శాస్త్రవేత్తలను కోరారు. డాక్టర్ హోమీబాబా, డాక్టర్ ఖానాల్కర్ తో పాటు ఆ పరిశోధనా పత్రాన్ని వెలువరించడంలో కొఠారి ఎంతో కీలకపాత్ర పోషించారు. ఈ ప్రముఖ శాస్త్రవేత్తలకు సహకరించిన యువ రక్షణ శాస్త్రవేత్తలతో మా నాన్న కూడా ఉన్నారు.
పది నుండి పన్నెండు నెలల పాటు కొనసాగిన ఆ పరిశోధనా కాలం మా నాన్న వృత్తి జీవితంలో ఎంతో ఒత్తిడితో కూడినదైనా మరువలేని కాలం. ఆ సమయంలో ఈ అంశం మీద చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. క్లాసిఫైడ్ సమాచారం చాలా వరకు భారతదేశానికి అప్పటిలో అందుబాటులో లేదు. అయినా ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలోనే ‘ న్యూక్లియర్ ఎక్సప్లోజన్స్ అండ్ దెయిర్ ఎఫెక్ట్స్’ పేరుతో 212 పేజీల ఎంతో విలువైన సమాచారంతో కూడిన నివేదికను ఈ బృందం రూపొందించింది. ఇందులో కొఠారి గారి పాత్రే ఎంతో కీలకం. దీనికి పండిట్ నెహ్రు ముందు మాట రాశారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు పొందిన నివేదిక ఇది. అందులో కేవలం ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు మాత్రమే కాక మా నాన్న నాగరత్నం గారి వంటి యువ శాస్త్రవేత్తల పేర్లను కూడా ప్రస్తావించడం కొఠారి గారి వినమ్ర స్వభావానికి నిదర్శనం.
మా కుటుంబంలో కూడా కొఠారి గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని గురించి ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాము. ఒక ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మా అమ్మ నాన్న నివసిస్తున్న ఇంటి తలుపు ఎవరో తట్టినట్లు వినిపించింది. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా డాక్టర్ కొఠారి నిలబడి ఉన్నారు. ఆ పుస్తకంలోని ఏదో అంశం మీద ఆయన అత్యవసరంగా మా నాన్నతో చర్చించాల్సి ఉంది. అప్పటికి మా ఇళ్లల్లో టెలిఫోన్ సదుపాయం లేదు. ఆయన ఆఫీస్ లో మా నాన్న ఉంటున్న ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకుని నేరుగా వచ్చేసారు. ఆయన స్థాయిలో వేరే ఎవరైనా ఉంటే ఎవరినైనా పంపి నాన్నని ఆఫీస్ కి పిలిపించేవారు. ఆయన అలా కాదు. తానే స్వయంగా రావడం ఆయన వారికి ఇచ్చిన గౌరవం, సమయం ఆదా కూడా.
ఆ అమ్మ తన చివరి రోజులలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేది. అప్పటికి ఆమెది చాలా చిన్న వయసు. తమిళనాడు నుండి వచ్చి చంకలో పసి బిడ్డతో ఉంది. హిందీ రాదు. ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రంగా వచ్చు. నాన్న దైవంగా భావించే మనిషి అలా అనుకోకుండా ఇంటికి రావడం ఆమెని ఎంతో కంగారు పెట్టింది. అప్పటికి మా ఇంట్లో కొన్ని గోద్రెజ్ కుర్చీలు, ఒక స్టడీ టేబుల్, ఒక మంచం మాత్రమే ఉండేవి. ఆ చిన్న ఆవాసానికి ఆయన రావడం ఆమెకి ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలిసి ఆయన కాఫీ ఇవ్వమని అడిగి ఉంటారు. అప్పటికి ఇంకా దక్షిణాది కుటుంబాలలో తేయాకులు వాడే అలవాటు అంతగా లేదు. ఆమెకి ఎలా చేయాలో కూడా తెలీదు. ఆయనకి కాఫీ ఇవ్వడానికి స్టీల్ గ్లాస్ లు తప్ప కప్పు లు కూడా లేవు ఆ ఇంట్లో.
అయితే డాక్టర్ కొఠారి కి ఇవేమీ పట్టలేదు. ఆయన వచ్చి చక్కగా ఒక గోద్రెజ్ కుర్చీ లాక్కుని అందులో కూర్చుని ఒక గంట పాటు మా నాన్నతో మాట్లాడి అన్నయకి ఆశీర్వాదాలు తెలిపి నవ్వుతూ వెళ్లిపోయారని అమ్మ చెప్పేది.
ఆయన గడిపింది కొద్ధి గంటలే కానీ మా కుటుంబంలో అన్ని తరాలకీ మా అమ్మ ఆ సంఘటన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూనే ఉండేది.
(డాక్టర్ కొఠారి లార్డ్ ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ మార్గదర్శకత్వంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని కావెండిష్ లాబరేటరీ లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పి. బ్లాకెట్ తో కలిసి పనిచేశారు. రూథర్ఫోర్డ్ ని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ గా పిలుస్తారు. వీరంతా కలిసి స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్, థియరీ ఆఫ్ వైట్ డ్వార్ఫ్ స్టార్స్ వంటి అంశాల మీద ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. డాక్టర్ కొఠారి డిఆర్డిఓ కి మాత్రమే కాదు దేశంలో ఎన్నో ప్రముఖమైన ల్యాబ్ ల స్థాపకులు కూడా. యు.జి.సి, యెన్.సి.ఈ.ఆర్.టి వంటి సంస్థల స్థాపనలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. దేశంలో తొలి విద్యా కమిషన్ చైర్మన్ గా కూడా వ్యవరించారు)
–Based on a piece by Meena