గ్రామీణ ప్రాంతాల నుండి, చిన్న చిన్న పట్టణాల నుండి వచ్చిన యువతతో మేము పని చేసేటప్పుడు మేము తరచుగా వాళ్ళని మీరు ఏమి కావాలనుకుంటున్నారు అని అడిగేవాళ్ళం. సాధారణంగా వాళ్ళు ఇంజనీర్ అనో, టీచర్ అనో, పోలీస్ అనో చెప్పేవాళ్ళు. వారి రోజు వారీ జీవితాలలో వారికి పరిచయం ఉన్న వృత్తుల గురించే వారు కలలు కనగలుగుతారు. అంతకన్నా భిన్నంగా ఆలోచించే అవకాశం కానీ, పరిజ్ఞానం కానీ వారికి లేదు. వారికి రకరకాల వృత్తులను, కెరీర్ అవకాశాలను పరిచయం చేసినట్లయితే వారి ఆలోచనా పరిధి, ఆకాంక్షల విస్తృతి పెరిగే అవకాశం ఉంది అని మాకు అనిపించింది. అది వాస్తవం కూడా. ఫోరెన్సిక్ సైన్స్ నుండి డేటా సైన్స్ వరకు, యోగా శిక్షణ నుండి వండ్రంగం పని వరకు, ఆప్టిషియన్ నుండి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ వరకు – పిల్లలకు తెలియాలే కానీ వారి కలలు, కోరికలు అన్నీ భిన్నంగానే ఉంటాయి.
అయితే ఈ కింద చెప్పిన కొన్ని కెరీర్ లను కూడా యువతకి పరిచయం చేయవచ్చు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. బహుశా వీటికి మరింత భవిష్యత్తు ఉందేమో. ఇవి వారికి మరింత ఆసక్తికరంగా ఉంటాయేమో.

ఈ కరోనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏరోబయాలజీ చదవడం వలన యువతకి మంచి అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది. ఏరోబయాలజిస్ట్ లు అంటే బాక్టీరియల్ వైరస్ లు, ఫంగల్ స్పోర్లు, పోలెన్ గ్రైన్లు వంటి గాలి ద్వారా వ్యాపించే ఆర్గానిక్ కణజాలాలను అధ్యయనం చేసే ఏరోబయాలజీ లో పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలు. ప్లేగ్ వంటి వ్యాధులను అధ్యయనం చేసే లిమోమోలోజి, శుభ్రతను ఒక శాస్త్రంగా అధ్యయనం చేసే హైజియోలజీ కూడా మంచి భవిష్యత్తు ఉన్న రంగాలు.
ప్రకృతి, జీవ జంతుజాలాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు కాలియోలజీ ని చదవచ్చు. ఇది పక్షుల గూళ్ళను అధ్యయనం చేసే శాస్త్రం. కాలియో అంటే గ్రీకు భాషలో చెక్క గూడు, గుడిసె, గూడు అని అర్ధం. నిడోలోజి అన్నా కూడా ఇదే అర్ధం. చీమలను అధ్యయనం చేసే మైర్మకాలజీ మరొక శాస్త్రం. పాములను అధ్యయనం చేసే ఓఫియోలజీ కూడా యువతకు ఉన్న మరొక అవకాశం.
గార్బియాలజిస్ట్ లకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇది చెత్తను అధ్యయనం చేసే శాస్త్రం. ఇళ్ల నుండి, పరిశ్రమలనుండి విడుదలయ్యే వ్యర్ధాలను ఏ విధంగా డిస్పోజ్ చేయవచ్చో దీని ద్వారా నేర్చుకోవచ్చు. మన వాతావరణ అంచనాలు ఎంత అవాస్తవికంగా ఉంటాయో మనకు తెలుసు. బహుశా యువతలో కొంతమంది గాలిని అధ్యయనం చేసే అనెమోలోజి ని కెరీర్ గా మలుచుకోవచ్చేమో. ఉరుములను అధ్యయనం చేసే బ్రోన్టాలజి మరొకటి. ఆహార శాస్త్రమైన బ్రోమాటోలోజి కి కూడా మంచి భవిష్యత్తు ఉంది. యువత కొంతమంది బ్రోమోటోలాజిస్టు లుగా వినూత్న ఆహార పదార్ధాలను తయారు చేయడమే కాక ఫుడ్ సేఫ్టీ మీద కూడా పని చేయొచ్చు.
మానవ కార్యకలాపాలను, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసే డెమోలోజి ని కూడా కొంత మంది యువత కెరీర్ గా మలుచుకోవచ్చు. ఫంగస్ ని అధ్యయనం చేసే మైకాలజీ, కండరాలను అధ్యయనం చేసే మయాలజీ, మేఘాలను అధ్యయనం చేసే నెఫోలోజి, మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే నెఫ్రోలోజి, వివిధ రకాల మట్టి లను అధ్యయనం చేసే పెడోలోజి, వివిధ ఉపరితలాల మధ్య ఘర్షణను అధ్యయనం చేసే ట్రైబాలాజీ, జుట్టు మరియు దానికి సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసే ట్రైకాలజీ ఇలా ఎన్నో రకాల అవకాశాలు యువత ముందు ఉన్నాయి.
ఇవే కాదు వ్యాధులను అధ్యయనం చేసే నాసాలోజి, పోషకాహారాన్ని సంబంధించిన అధ్యయనమైన ట్రోఫోలోజి, నదులను అధ్యయనం చేసే పొటమాలజీ, వివిధ రకాల పండ్లను అధ్యయనం చేసే కార్పొలోజి కూడా చదవదగిన మరికొన్ని శాస్త్రాలు.
యువత కొంచెం దృష్టి పెట్టి చూడాలే కానీ ఎన్నో కెరీర్ అవకాశాలు వారి ముందు పరుచుకుని ఉన్నాయి.
అయితే నేను కోరుకునేది ఒక్కటే. నువ్వు ఒక సర్జన్ వి కావాలనుకోవచ్చు. లేదా ఒక వెల్డర్ వి కావాలనుకోవచ్చు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే నీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండడం అవసరం. చేస్తున్న పనిని అందరికన్నా మెరుగ్గా, క్రమశిక్షణతో, సమయపాలనతో చేయగలిగినప్పుడు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తావు.
–Based on a post by Meena
Valuable and very interesting information madam. I will inform to my students.
LikeLiked by 1 person