దొడ్డ బసవన్న గుడి బెంగుళూరు లో ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయం. దక్షిణ బెంగుళూరు లోని బసంవన్ గుడి ప్రాంతంలోని బుల్ టెంపుల్ రోడ్డు లో ఉంది ఈ గుడి. 1537 లో బెంగుళూరు నగరాన్ని నిర్మించిన కెంపెగౌడ ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. 4. 6 మీటర్ల ఎత్తు, 6. 1 మీటర్ల పొడవు ఉన్న నిలువెత్తు ఏకశిలా నంది విగ్రహం అక్కడ కొలువై ఉంది. బహుశా ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం కావచ్చు.
గుడి గురించి మాట్లాడుతూ ఈ వేరుశనగలు ఏమిటి అనుకుంటున్నారా? నిజానికి ఎన్నో శతాబ్దాలుగా ఇది ప్రధానంగా వేరుశనగలు పండించే ప్రాంతం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా వేరుశనగ పంట చేతికి వచ్చే సమయానికి ఒక ఎద్దు చేలల్లో పడి పంటను నాశనం చేస్తుండేది. రానూ రానూ రైతులకు ఇది అతి పెద్ద సమస్యగా పరిణమించింది. దానితో ఈ ఎద్దు ఆగడాలు ఆగినట్లైతే నందికి గుడికి కట్టిస్తామని రైతులంతా మొక్కుకున్నారు. ఏదో అద్భుతం జరిగినట్లు, ఆ ఏడాది నుండి ఎద్దు చేలల్లోకి రావడం ఆగిపోయింది.
అయితే గుడి దగ్గర రాసి ఉన్న ఒక శాసనంలో మరొక కథ ఉంది. ఆ కథ ప్రకారం. ఎద్దు చేలల్లో పడినప్పుడు ఒక రైతు కోపంతో ఒక రాయి తీసుకుని దానిని కొట్టాడని, అనుకోకుండా అది తగలడంతో విస్తుపోయిన ఎద్దు అకస్మాత్తుగా పరుగు ఆపి కూర్చుని రాయిలా మారిపోయినదని రాసి ఉంటుంది. ఆ తర్వాత అది పెరుగుతూనే ఉంది. దానితో భయపడిన రైతులు శివుడిని ప్రార్ధించారు. ఆ ఎద్దు పాదాల వద్ద దొరికిన త్రిసూలాన్ని దాని తలపై ఉంచగానే ఆ విగ్రహం ఎదగడం ఆగిపోయింది. తర్వాత రైతులంతా కలిసి అక్కడ ఒక చిన్న గుడిని నిర్మించారని, కెంపెగౌడ దానిని మరింత అభివృద్ధి చేసాడని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.

ఆ ఎద్దు కు కృతజ్ఞతగా దానికి ఇష్టమైన వేరుశనగలతో ఆ గుడి ప్రాంతంలో రైతులు ప్రతి ఏటా వేరుశనగల జాతరను జరుపుతారు. కార్తీక మాసంలో చివరి సోమవారం నాడు జరిపే ఈ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మొదట్లో బెంగుళూరు చుట్టుపక్కల ప్రాంతాల రైతులే నేరుగా తమ పంటను తెచ్చి ఈ జాతరలో అమ్ముతుండేవారు. కానీ ఇటీవల కాలంలో ఇక్కడంతా దళారులే అమ్మకాలు చేస్తున్నారు. ఏడాదికి సరిపడా వేరుశనగలు కొనుక్కుని దాచుకోవడమే కాదు, వేరుశనగలతో చేసిన ఎన్నో రకాల చిరుతిండ్లు కూడా ఈ జాతరలో దొరుకుతాయి. ఉడకబెట్టినవి, వేయించినవి, మసాలా అద్దినవి ఇలా ఎన్నో రకాలలో చిరుతిండ్లు లభిస్తాయి.
రుచికరంగా ఉంటుందనే కాక శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను అందించే ఒక ముఖ్యమైన ఆహారంగా వేరుశనగను చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రధానంగా పండించే చమురుపంటలలో అతి ముఖ్యమైనది కూడా. వేరుశనగ ఆకులు పశువుల దాణాగా కూడా ఉపయోగిస్తారు. చిక్కుడుజాతికి చెందిన పంట కావడంతో భూమికి కూడా కావాల్సినంత నత్రజనిని అందించి భూసారం పెంచేందుకు తోడ్పడుతుంది. దేశంలో దాదాపు 85 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో వేరుశనగ సాగు జరుగుతుంది. దాదాపు 7200 వేల టన్నుల వేరుశనగ ఏటా దేశంలో ఉత్పత్తి అవుతుంది.
కోవిద్ నిబంధనల వలన గత సంవత్సరం ఈ వేరుశనగల జాతర జరగలేదు. ఈ ఏడాది అయినా జరుగుతుందేమో వేచి చూడాలి. ఈ సారి ఎప్పుడైనా కార్తీక మాసం సమయంలో బెంగుళూరు వెళితే ఈ జాతరను మిస్ కాకండి.
–Based on a piece by Meena