ఒక యువకుడు తన దేశానికి ఎంతో దూరంగా ఉన్న విదేశీ గడ్డపై ఎవరికో సంబంధించిన యుద్ధంలో పాలుపంచుకుంటూ పోరాటం చేస్తున్నాడు. అతని పేరు పింగళి వెంకయ్య. 19 వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో సైనికుడిగా దక్షిణ ఆఫ్రికాలో జరుగుతున్న ఆంగ్లో బోయర్ యుద్ధంలో పనిచేశారు వెంకయ్య. అదే సమయంలో మరొక యువకుడు అదే దక్షిణాఫ్రికాలో సత్యం, న్యాయం, స్వేచ్చ గురించి కలలు కంటూ ఎన్నో ప్రయోగాలు ప్రారంభించాడు. అతనే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.
1899 లో బోయర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు గాంధీ మనసు నిజానికి స్థానిక బోయర్ల వైపే ఉన్నప్పటికీ నాటల్ బ్రిటిష్ క్రౌన్ కాలనీ సభ్యునిగా తాను బ్రిటిష్ వారికే మద్దతు తెలపవలసిన అవసరం ఏర్పడింది. దాదాపు 1100 మంది స్వచ్చంద సేవకులతో గాంధీ ఒక సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే తమపై ఆధిపత్యం చెలాయిస్తూ తమను అణగదొక్కుతూ ఉన్నారో వారికే సేవలందించేలా ఆ సేవా దళ సభ్యులలో గాంధీ స్ఫూర్తి నింపగలిగారు. యుద్ధక్షేత్రంలో గాయపడిన సైనికులను సురక్షిత ప్రాంతాలకు మోసుకువెళ్తూ ఈ దళ సభ్యులు ఎంతో సహాయం చేశారు.
దాదాపు ఇదే సమయంలో అప్పటికి 19 సంవత్సరాల వయసులో ఉన్న వెంకయ్య గాంధీని కలిశారు. ఆయన నిరాడంబరత, సంభాషణలలో చూపించే ఆత్మవిశ్వాసం పింగళిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ బంధం దాదాపు అర్ధ శతాబ్దం పాటు కొనసాగింది.

ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత పరాయి పాలన నుండి విముక్తి సాధించాలన్న గాంధీ స్పూర్తితో కొన్ని పోరాట సంస్థలలో చేరి ఏలూరు లో నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలో వ్యవసాయం పట్ల ఆకర్షితులై పత్తి పండించడం ప్రారంభించారు. ప్రత్తి సాగులో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు వెంకయ్య. అమెరికా నుండి కంబోడియన్ రకం పత్తి విత్తనాలను తెప్పించి వాటిని మన దేశపు విత్తనాలతో కలిపి వినూత్నమైన హైబ్రిడ్ పత్తి రకాన్ని రూపొందించారు. దగ్గరలో ఉన్న చెల్లపల్లి గ్రామంలో కొంత భూమిని తీసుకుని ఈ విత్తనాలతో అక్కడ సాగుచేయడం మొదలుపెట్టారు. ఈ వినూత్న పత్తి రకం 1909 లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో ఎంతో మంది బ్రిటిష్ అధికారులను ఆకర్షించింది. రాయల్ అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ లండన్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్ని అందించింది. అప్పటి నుండి స్థానికంగా ఆయనను ‘పత్తి వెంకయ్య’ అని పిలవడం ప్రారంభించారు.
వ్యవసాయంతో పాటు వెంకయ్య చదువు మీద కూడా దృష్టిపెట్టారు. కొత్త భాషలు నేర్చుకోవాలి అనుకున్నారు. ఈ ఆసక్తి వలెనే ఆయనే లాహోర్ లోని ఆంగ్లో వేదిక్ స్కూల్ కు వెళ్ళి సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు. ఈ భాషలన్నింటిలోనూ ప్రావీణ్యం సాధించారు. 1913 లో ఆయన జపనీస్ భాషలో చేసిన ఒక సుదీర్ఘ ప్రసంగం ఆయనకు ‘జపాన్ వెంకయ్య’ అనే పేరును తెచ్చిపెట్టింది.
తర్వాత కాలంలో పింగళి రైల్వే సర్వీసెస్ లో గార్డుగా చేరారు. బెంగుళూరు, బళ్ళారి లలో ఆయన పోస్టింగ్. ఆ సమయంలో మద్రాస్ ప్రాంతమంతా ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది. ఆ వ్యాధికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు దుస్థితిని చూసిన ఆయన తన ఉద్యోగాన్ని వదిలి ప్లేగు వ్యాధి నిర్మూలనా సంస్థ తరపున ఇన్స్పెక్టర్ గా కొంతకాలం పనిచేశారు.
ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన అనేక సదస్సులకు హాజరయ్యారు. 1906 లో కలకత్తాలో సదస్సుకు హాజరయ్యినప్పుడు ఇంగ్లీష్ యూనియన్ జెండాను ఎగురవేయడం చూసిన ఆయన ఎంతో బాధపడ్డారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక మన దేశానికి ఒక జాతీయ జెండా ఉండాలనే కొత్త ఆలోచన ఆయనలో తలెత్తింది. అనేక దేశాల జెండాలను పరిశీలించడంతో తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. 1916 లో “A National Flag for India” పేరుతో ప్రచురించిన పుస్తకంలో ముఫై రకాల జెండా నమూనాలను ప్రదర్శించారు. 1916 నుండి 1921 వరకు జరిగిన ప్రతి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులోనూ వెంకయ్య జెండాకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తేవారు. ఈ ఆలోచనను ఎంతగానో సమర్ధించిన గాంధీ మన జెండా జాతికి స్ఫూర్తినిచ్చేదిగా, అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించేదిగా ఉండాలని సూచించారు.
1921 లో విజయవాడలో జరిగిన సదస్సులో వెంకయ్య జాతీయ జెండాల నమూనాలతో ఉన్న తన పుస్తకాన్ని గాంధీకి చూపించారు. ఆయన కృషిని, పట్టుదలను గాంధీ ఎంతగానో ప్రశంసించారు. మన జాతీయ జెండా పేరుతో యంగ్ ఇండియా లో రాసిన ఒక వ్యాసంలో గాంధీ ఇలా అన్నారు. “మన జెండా కోసం మనం త్యాగాలకు సంసిద్ధంగా ఉండాలి. మచిలీపట్టణం లోని ఆంధ్ర నేషనల్ కాలేజీ లో పని చేస్తున్న పింగళి వెంకయ్య జెండా కోసం ఎంతో కృషి చేసి అనేక నమూనాలతో ఒక పుస్తకాన్ని రూపొందించారు. జాతీయ జెండాకు ఆమోదం కోసం భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులలో వెంకయ్య చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఎరుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యన అశోక చక్రం గుర్తుతో ఒక జెండాను రూపొందించమని వెంకయ్యను అడిగితే కేవలం మూడు గంటల్లో దానిని తయారు చేశారు. తర్వాత కాలంలో సత్యం, అహింసలకు చిహ్నమైన తెలుపు రంగు కూడా జెండాలో ఉంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము.”
ఆ స్పూర్తితో వెంకయ్య రాత్రిoబగళ్ళు శ్రమించి మరొక జెండా రూపొందించారు. అప్పుడు వెంకయ్య రూపొందించిన ఆ జెండానే తర్వాత మన త్రివర్ణ పతాక రూపకల్పనకు బ్లూ ప్రింట్ గా మారింది. దానితో అప్పటి నుండి ఆయనకు “జెండా వెంకయ్య” అనే మరో కొత్త పేరు వచ్చింది.
1931 లో చిన్న మార్పులతో భారత జాతీయ కాంగ్రెస్ వెంకయ్య రూపొందించిన జెండాను ఆమోదించింది. ఆయన కల సాకారమయ్యింది. 1947 ఆగష్టు 15 న దేశానికి స్వతంత్రం రాగానే బ్రిటిష్ యూనియన్ జెండా కిందికి దిగుతుండగా మన త్రివర్ణ పతాకం సగర్వంగా పైకి ఎగిరింది.
1947 తర్వాత వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల నుండి విరమించుకుని నెల్లూరు లో స్థిరపడ్డారు. ఆ సమయంలో ఆయనకు జియాలజి పై ఆసక్తి పెరిగింది. ఆ ప్రాంతంలో దొరికే విలువైన రంగురాళ్ల పట్ల ఎంతో పరిజ్ఞానం సంపాదించారు. ఆ తర్వాత జెమోలోజీ పై దృష్టి పెట్టారు. ఆ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి, పరిశోధనా వ్యాసాలు ప్రచురించి, ప్రభుత్వానికి క్షేత్ర స్థాయి పరిశోధనల విషయంలో సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. ఇక అప్పటి నుండి ఆయనకు “డైమండ్ వెంకయ్య” అనే మరొక పేరు స్థిరపడింది.
ఎన్నో ప్రత్యేక ప్రతిభా సామర్ధ్యాలు కలిగినా ఎంతో నిరాడంబరంగా జీవించిన అరుదైన వ్యక్తి పింగళి వెంకయ్య. తన చివరి రోజులను ఎంతో పేదరికంలో గడిపారు. కొత్తగా స్వతంత్రాన్ని సాధించిన ఒక దేశం తన శక్తిని, స్థాయిని తెలియచేస్తూ గర్వంతో తన జెండాను ఎగురవేస్తుండగా దాని గురించి కలలు కని, రూపకల్పన చేసిన వ్యక్తిని మాత్రం దేశం చాలా వరకు మర్చిపోయింది.
తన జీవితంలో తాను సాధించిన వాటిలో జెండా రూపకల్పనకు అత్యంత ఉన్నతమైనదిగా వెంకయ్య భావించేవారు. తాను మరణించాక తన శరీరంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి చితిపై ఉంచే ముందు మాత్రం దానిని తొలగించి ఏదైనా చెట్టు కొమ్మకు తగిలించమని ఆయన కోరుకున్నారట. 1963 జులై 4 న ఆయన మరణం తర్వాత ఆయన కోరుకున్నట్లుగానే జాతీయ జెండాను ఆయన శరీరంపై ఉంచారు.
ఈ నెల మొదటిలో మన యువ ఒలింపియన్ క్రీడాకారులు విదేశీ గడ్డపై మన జెండాను ఎగరవేస్తుంటే మనం వేడుక చేసుకున్నాం. ఈ వారాంతంలో అందరం జెండాకు సగర్వంగా తలెత్తి వందనం చేయబోతున్నాం. మనకు ఇటువంటి గర్వించదగిన క్షణాలను ఇచ్చిన మన పెద్దలందరినీ గుర్తు చేసుకునేందుకు, వారికి మన కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు కూడా ఇదే సరైన సమయం.
–From a piece by Mamata