తమిళంలో “ఎందేన్” అనే ఒక పదం ఉంది. గయ్యాళి అని అర్ధం వస్తుంది. నిజానికి గయ్యాళి అనేది సరైన అర్ధం కాదేమో, తెలివైన,చురుకైన, దూకుడుగా ఉండే స్త్రీ అనవచ్చు. ఈ పదం వెనుక ఉన్న కథేమిటో ఒకసారి చూద్దాం.
స్త్రీలకే కాకుండా ఏ పనినైనా సాధించగలిగే, తమ పనులలో ఇతరుల జోక్యాన్ని, వ్యతిరేకతను సహించని వ్యక్తులకు కూడా ఈ పదాన్నివాడతారు.
ఆ పదాన్ని పలికే విధానాన్ని బట్టి దానికి రకరకాల అర్ధాలు ఉన్నాయి. ఎవరైనా పెద్దావిడ తనకి ఇష్టమైన మేనకోడలు గురించి చెబుతూ ప్రేమగా ఈ పదం వాడింది అనుకోండి, ఆ అమ్మాయిని ఎవరూ మోసం చేయలేనంత తెలివైనది అని మురిపెంగా అన్నట్లు. అదే తనకు అంతగా ఇష్టం లేని పక్కింటామె కూతురి గురించి కొంత చిరాకుగా అన్నది అనుకోండి, ఆ అమ్మాయి సరైన ప్రవర్తన కలిగినది కాదు అని అన్నట్లు. అదే తనకు అసలు ఇష్టం లేని తన వదిన గురించి కోపంగా ఈ పదాన్ని వాడింది అనుకోండి, ఆమె చాలా కోపిష్టి, ఎవరితోనూ కలవని మనిషి, తమ కుటుంబానికి తగిన మనిషి కాదు అన్నట్లు అర్ధం.
నా చిన్నతనంలో నేను ఇది తమిళపదమే అనుకుని మా సంభాషణలలో ఎక్కువగా ఉపయోగించేదాన్ని. పెరిగి పెద్దయ్యాకనే ఈ పదం యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిసాయి. దీని మూలం తెలుసుకున్నాక ఆశ్చర్యం కలిగింది.

మొదటి ప్రపంచ యుద్ధం తొలినాళ్లలో 1914 సెప్టెంబర్ 22 రాత్రి ఎందేన్ అని పిలవబడే జర్మన్ యుద్ధనౌక మద్రాస్ ఓడరేవు కు వచ్చింది. బర్మా ఆయిల్ కంపెనీ అనే బ్రిటిష్ కంపెనీకి చెందిన అనేక ఆయిల్ ట్యాంకర్లు ఆ రేవులో నిలబడి ఉన్నాయి. ఎందేన్ కమాండర్ అయిన కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్ వాటిమీద బాంబులు వేసి, కాల్పులు జరిపాడు. కేవలం కొన్ని నిముషాలలో ఐదు ట్యాంకర్లు తగలబడి దాదాపు మూడు లక్షల యాభై వేల గాలన్ల ఇంధనం తగలబడిపోయింది.
బాంబులు, కాల్పులు, యుద్ధం, విధ్వంసంతో కూడిన ఆ రాత్రి తమిళనాడు, మద్రాస్ ప్రజలకు కాళరాత్రిగా జ్ఞాపకాలలో మిగిలిపోయింది. తర్వాతెప్పుడో కెప్టెన్ ముల్లర్ ఇలా రాశారు ” భారతీయులలో ఆసక్తిని రేకెత్తించి, ఇంగ్లీష్ వారి వ్యాపారాన్ని దెబ్బతీసి, వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించేందుకే నేను ఈ బాంబుదాడి చేసాను” అని. ఆయన అలా ఆసక్తిని రేకిత్తించడంలో విజయం సాధించాడని చెప్పాలి. దాదాపు శతాబ్దం తర్వాత కూడా ఆయన నౌక “ఎందేన్” పేరు తమిళ పదజాలంలో భాగంగా మారిపోయింది.
జర్మనీ లోని ఒక పట్టణమైన ఎందేన్ పేరుని ఈ నౌకకి పెట్టారు. వాయువ్య జర్మనీ లో ఎమ్స్ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రేవు పట్టణం. 2011 లో ఈ పట్టణం మొత్తం జనాభా 51,528.
ఈ పట్టణానికి చారిత్రకంగా అంత ప్రాధ్యాన్యత లేకపోయినా ఆ పేరుతో నిర్మించబడిన ఎందేన్ నౌకకి మాత్రం చెప్పుకోదగ్గ రక్త చరిత్రే ఉంది..జర్మన్ ఇంపీరియల్ నేవీ కోసం తయారుచేయబడిన ఈ డ్రెస్డెన్ క్లాస్ లైట్ క్రూయిజర్ లో 10.5 సెంటీమీటర్ గన్నులు ఒక పది, రెండు టార్పెడో గొట్టాలు ఉన్నాయి.
ఎందేన్ కెరీర్లో అధికభాగం చైనా కేంద్రంగా పనిచేసిన జర్మన్ తూర్పు ఆసియా స్క్వాడ్రన్ లో గడిచింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు రెండు డజన్ల ఓడలను ఎందేన్ స్వాధీనం చేసుకుంది. చెన్నై పై చేసిన దాడి మాత్రమే కాక, ఎందేన్ పెనాంగ్ పై కూడా దాడి చేసి పెనాంగ్ యుద్ధానికి కారణమయ్యింది. ఒక రష్యన్ యుద్ధనౌకని, ఒక ఫ్రెంచ్ నౌకాని కూడా ఎందేన్ విధ్వంసం చేసింది.
ఆ తర్వాత కెప్టెన్ ముల్లర్ ఎందేన్ ను కోకస్ దీవులకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొద్దిమంది నావికుల సహాయంతో బ్రిటిష్ స్థావరాలను నాశనం చేసాడు. అక్కడ ఒక ఆస్ట్రేలియన్ యుద్ధ నౌక ఎందేన్ పై దాడి చేయగా ముల్లర్ దానిని మునిగిపోకుండా కాపాడటానికి గానూ నీటి అడుగుభాగానికి తీసుకుని పోయాడు. నౌకలో ఉన్న 376 మంది క్రూ లో మొత్తం 133 మంది ఈ దాడిలో మరణించారు. బతికి ఉన్నవారిలో చాలా మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. సముద్ర అలల కుదుపులకు ఎందేన్ తీవ్రంగా దెబ్బతినడంతో 1950 లో దానిని ముక్కలుగా చేసి స్క్రాప్ కింద అమ్మివేసారు.
అనుకోకుండా ఎందేన్ పట్టణం కూడా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన బాంబు దాడిలో దెబ్బతిన్నది. 1944 సెప్టెంబర్ 6 న రాయల్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడిలో ఈ పట్టణంలోని 80 శాతం పైగా ఇల్లు ధ్వంసం అయ్యాయి. ఆ పట్టణ ప్రజలు ఆ రోజును ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
ఎందేన్ పదాన్ని బలమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీలను ఎత్తిపొడిచేందుకు ఒక తిట్టుగా వాడే సందర్భాన్ని గుర్తు చేసినందుకు క్షమాపణలతో
Post 32
–Based on a piece by Meena