గురుపూజోత్సవం: Celebrating the Teacher

సెప్టెంబర్ ఐదవ తేదీని మనదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని మనందరికీ తెలిసిందే. ఆ రోజున మనకి చదువు నేర్పించి స్ఫూర్తినిచ్చిన గురువులను గుర్తుచేసుకుని, అవకాశం ఉంటే గౌరవించుకుంటూ ఉంటాము. పసి హృదయాలమీద, జీవితాలమీద తమదైన ముద్ర వేసిన ఎందరో గొప్ప గురువులు మనకు ఉన్నారు. వారిలో కొందరి గురించైనా పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా తెలియచెప్పే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. 

అలాంటి సినిమాలలో ఒకటి ఈ మధ్యనే చూసాను. మీరందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అది అని ఖచ్చితంగా చెప్పగలను. ఎంతో దుర్భర నేపధ్యం నుండి వచ్చి వీరికి చదువు చెప్పడం కష్టం అని అందరూ తేల్చేసిన పిల్లలతో ఒక యువ ఉపాధ్యాయిని ఎలా కలిసిపోయింది, వారికి ఎలా చదువు చెప్పగలిగింది అనే విషయాలను ఎంతో అందంగా చూపించిన సినిమా ఫ్రీడమ్ రైటర్స్.

ఎరిన్ గ్రూవెల్ అనే టీచర్ తన నిజజీవిత అనుభవాలతో రాసిన ‘The Freedom Writers Diary: How a Teacher and 150 Teens Used Writing to Change Themselves and the World Around Them’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తీశారు. 1999 లో ఈ పుస్తకం ప్రచురించబడింది.

సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వివక్ష, హింసను ఎదుర్కున్న నేపధ్యం నుండి వచ్చిన ఆఫ్రికన్ అమెరికన్ పిల్లలు, లాటిన్ అమెరికన్ పిల్లలు ఉన్న తరగతి గదిలోకి 23 ఏళ్ళ ఎరిన్ ఉపాధ్యాయురాలిగా అడుగుపెడుతుంది. వీరికి చదువు చెప్పలేం అని అందరిలాగా నిర్ధారించకుండా ఓపికగా వారితో సమయం గడిపి వారు తగినంత గౌరవం లేకపోవడం, వారిపైన ఎవరికీ వారిపైన శ్రద్ధ లేకపోవడం, విశాల ప్రపంచం పట్ల వారికి అవగాహన లేకపోవడం వంటి సమస్యలతో పోరాడుతున్నారని గ్రహిస్తుంది. వారికి ప్రపంచం పట్ల ఉన్న అవగాహనను విస్తృతం చేయాలంటే అనేక నేపధ్యాలకు చెందిన రచయితలు రాసిన పుస్తకాలను చదివించాలి అనుకుంటుంది. The Diary of Anne Frank, Zlata’s Diary: A Child’s Life in Sarajevo వంటి పుస్తకాలను వారితో చదివిస్తుంది. లాస్ ఏంజెల్స్ లోని హోలోకాస్ట్ మ్యూజియం ఆఫ్ టాలరెన్స్ కు కూడా వారిని తీసుకువెళ్తుంది. మొదట్లో పిల్లలు ఆమె మాట వినకపోయినా చిన్నగా ఆ పుస్తకాలలోని మనుషుల జీవితాలకు, తమ జీవితాలకు ఉన్న సారూప్యతను అర్ధం చేసుకుంటూ, చరిత్రను మరింత అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇటువంటి సమస్యలు తమకు మాత్రమే సంబంధించినవి కావు అని అర్ధం చేసుకుంటారు. ప్రతి విద్యార్థి తన గతం, వర్తమానం, భవిష్యత్తు కు సంబంధించిన ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తీకరించుకుంటూ ఒక పుస్తకంలో పొందుపరుచుకోమని ఎరిన్ ఆ పిల్లలందరినీ ప్రోత్సహిస్తుంది.

అన్నే ఫ్రాంక్ జీవిత చరిత్ర చదివి ఆ పిల్లలు ఎంత స్ఫూర్తి పొందుతారంటే 1994-95 లో వారంతా కలిసి చందాలు పోగుచేసుకుని అన్నే గ్రంక్ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చిన డచ్ మహిళా మైప్ గైస్ ను కాలిఫోర్నియా లో తమను కలవమని ఆహ్వానం పంపుతారు. ఎరిన్ గ్రూవెల్ విద్యార్థులు నిజమైన హీరోలు అంటూ మైప్ ప్రశంసిస్తుంది. ఎరిన్ రాజీలేని ప్రయత్నాల ఫలితంగా తన మొత్తం 150 మంది విద్యార్థులూ (ఫ్రీడమ్ రైటర్స్) కూడా హై స్కూల్ చదువు విజయవంతంగా పూర్తిచేసుకుని పై చదువులకు కళాశాలలకు వెళ్తారు. వీళ్ళకి చదువు చెప్పలేం అని తేల్చివేయబడ్డ విద్యార్థులకు అది ఎంత పెద్ద విజయం!

ఆ విద్యార్థులందరూ రాసిన అనుభవాల సంకలనమే ది ఫ్రీడమ్ రైటర్స్ అనే పుస్తకం. 1960 లో అమెరికాలో మానవ హక్కులపై పని చేసిన ఫ్రీడమ్ రైడర్స్ అనే హక్కుల సంఘానికి గౌరవార్థంగా ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. ఎరిన్ సంకలనం చేసిన ఈ పుస్తకం ఎంతో విజయం సాధించింది. తర్వాత కాలంలో ఆమె తాను విజయవంతంగా అమలు చేసిన బోధనా పద్ధతులను మరింత విస్తృతంగా విద్యా ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు గానూ ఫ్రీడమ్ రైటర్స్ ఫౌండేషన్ ను స్థాపించింది.

ఈ సినిమాను చూస్తున్నప్పుడు మరొక అద్భుతమైన సినిమా గుర్తు వచ్చింది. 1967 లో వచ్చిన To Sir, With Love అనే సినిమా లండన్ లో ఉపాధ్యాయునిగా పని చేసిన ఈ. ఆర్. బ్రెత్వెయిట్ జీవితానుభవాల ఆధారంగా తీసిన సినిమా. లండన్ లోని ఒక వర్కింగ్ క్లాస్ నివాస ప్రాంతానికి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు, శ్వేత జాతీయుల పిల్లలకు కలిపి ఒక నల్లజాతికి చెందిన ఉపాధ్యాయుడు బోధన చేయడంలో ఉన్న సమస్యలను ఈ సినిమా ఎంతో అద్భుతంగా చూపించింది. చదువు అంటే ఆసక్తి లేని, అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు బోధన చేసేందుకు ఈయన కూడా ఎరిన్ లాగానే పిల్లలను మ్యూజియం లకు తీసుకువెళ్లడం, వారి నిత్య జీవిత సమస్యల గురించి తరగతి గదిలో పిల్లలతో చర్చ చేయడం వంటి సంప్రదాయేతర బోధనా విధానాలను అవలంభిస్తారు. ఎరిన్, బ్రెత్వెయిట్ ఇద్దరూ కూడా వీరికి బోధన చేయలేము అని ఇతరులు చేతులెత్తేసిన సందర్భాలలో తరగతి గదులలలోకి ప్రవేశించి ఆ విద్యార్థులకు కేవలం చదువు చెప్పడమే కాకుండా వారి జీవితాలలో చెరగని ముద్ర వేస్తారు.

రెండూ కూడా ఎంతో స్ఫూర్తివంతమైన సినిమాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎటువంటి సందర్భంలో అయినా ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఎంతో మార్పు సాధించగలడని ఈ సినిమాలు మరొక్కసారి గుర్తుచేస్తాయి. తమ విద్యార్థుల హృదయాలపై, జీవితాలపై చెరగని ముద్ర వేస్తూ తమ జీవితాలను సార్ధకం చేసుకుంటున్న గురువులకు ప్రణామాలతో

Post 33

–Based on a piece by Mamata

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s