మొన్ననే మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం. ఈ సందర్భంగా విద్య, పాఠశాలలు, గురువుల పాత్ర వంటి ఎన్నో అంశాల మీద విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అనే అంశంపై ఎన్నో కాల్పనిక కథలు, నిజజీవిత గాధలు, విధాన పత్రాలు, మరెన్నో పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఉపాధ్యాయుడే కీలకం. నూతన జాతీయ విద్యా విధానం 2020 కూడా “విద్యా వ్యవస్థలో ఎటువంటి ప్రాధమిక సంస్కరణలు చేపట్టాలన్నా ఉపాధ్యాయులే కేంద్రంగా ఉండాలి. రాబోయే తరాలను తీర్చిదిద్దే గురువులకు సమాజంలో తగినంత గౌరవం, గుర్తింపు ఉండేలా అన్ని స్థాయిలలో ఉపాధ్యాయుల పాత్రను మెరుగుపరచాల్సి ఉంది” అని అభిప్రాయపడింది.
ఈ నూతన విద్యా విధానం ప్రకారం “ఒక మంచి విద్యా సంస్థ అంటే అందులోని ప్రతి విద్యార్థి తాను ముఖ్యమైనవారిగా, తమకు తగినంత భద్రత, సంరక్షణ ఉన్నట్లు భావించగలగాలి. నేర్చుకునేందుకు తగిన వాతావరణం ఉండాలి. అనేకరకాల అనుభవాలను పాఠశాల విద్యార్థులకు అందించగలగాలి. విద్యార్థులు మెరుగ్గా నేర్చుకునేందుకు తగిన మౌలిక వసతులు, వనరులు పాఠశాలలో ఉండాలి” .
విద్యా విధానం కొత్తదే కానీ ఈ కల ఈ నాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా విద్యావేత్తలు మన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను కోరుకుంటూ ఎన్నో కలలు కంటూనే ఉన్నారు. ఈ కలే దాదాపు వందేళ్ళ క్రితం గుజరాత్ కు చెందిన ఒక యువ ఉపాధ్యాయుడిని ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దింది. అతనే గిజుభాయ్ బధేక.

విద్యా బోధనలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసిన గిజుభాయ్ పిల్లలు వాటికి ఎలా స్పందిస్తున్నారో నిశితంగా పరిశీలించేవారు. ఉపాధ్యాయులు, తల్లిదండులు పిల్లలతో వ్యవహరించే పద్ధతులు ఒకే విధంగా ఉన్నట్లయితే తాను ప్రయత్నించిన బోధనా విధానాలు మరింత మెరుగ్గా పనిచేస్తాయని కూడా ఆయన అర్ధం చేసుకున్నారు. ఆయన చేసిన ప్రయోగాలు, పరిశీలనలు, ఆయన కన్న కలలు అన్నీ “దివాస్వప్న” అనే పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం తెలుగులో పగటికల పేరుతో అనువదించబడింది. 1931 లో తొలిసారిగా ప్రచురించబడిన ఈ దివాస్వప్న పుస్తకం లక్ష్మిశంకర్ అనే ఉపాధ్యాయుడు విద్యా బోధనలో చేసిన వినూత్న ప్రయత్నాలను వివరించే కాల్పనిక కథ. నిజానికి ఇది గిజుభాయ్ స్వానుభవాల ఆధారంగా రాసిన కథే.
కథాకాలం చూస్తే దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న కాలం. నిర్దేశించిన పాఠ్యప్రణాళికతో, సరైన మార్కులు పొందని వారికి దారుణమైన శిక్షలు అమలు జరుగుతూ బ్రిటిష్ అధికారుల పర్యవేక్షణలో మూసపద్ధతిలో బోధన జరుగుతూ ఉండేది. కానీ ఎటువంటి పరిస్థితులలో అయినా లక్ష్మిశంకర్ వంటి దార్శనికులు పుడుతూనే ఉంటారు. ఈ యువ ఉపాధ్యాయుడు విద్యా బోధనలో తాను చేసిన నూతన ప్రయత్నాలను స్వయంగా వివరించే పుస్తకమే దివాస్వప్న.
లక్ష్మిశంకర్ యువకుడు. మంచి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో ఆదర్శవంతమైన ఆలోచనలు కలవాడు. బ్రిటిష్ అధికారిని కలిసి తన ఆలోచనలను అమలు చేసేందుకు ఏదైనా ఒక పాఠశాలలో వినూత్నంగా బోధించే అవకాశం ఇవ్వమని కోరాడు.
అతని ఆలోచనలు విన్న ఆ అధికారి మొదట నవ్వుతాడు. కానీ తర్వాత కొద్దిగా సంకోచిస్తూనే ఒక పాఠశాలలో నాలుగవ తరగతి పిల్లలకు తాను అనుకున్న పద్ధతిలో బోధన చేసేందుకు అనుమతిస్తాడు. అయితే ఏడాది చివరిలో లక్ష్మిశంకర్ విద్యార్థులు కూడా మిగిలిన అందరు పిల్లలలాగే పరీక్షకు హాజరయ్యి మంచి ఫలితాలు సాధించాల్సి ఉంటుందని షరతు విధిస్తాడు.
లక్ష్మిశంకర్ ఆ సవాలును స్వీకరిస్తాడు. అనేక ఆలోచనలు, కలలతో నాలుగవ తరగతిలో అడుగుపెడతాడు. అరుచుకుంటూ, కొట్టుకుంటూ, పరుగులు పెడుతూ రౌడీలలా ప్రవర్తిస్తున్న పిల్లలతో చేపల మార్కెట్ లా ఉన్న ఆ తరగతిని చూసి నిర్ఘాంతపోతాడు. తన పగటికలను నిజం చేసుకోవాలంటే ముందుగా ఏదైనా చేసి ఈ పిల్లల మనసులలో స్థానం సంపాదించుకోవాలి అనుకుంటాడు.
తర్వాత రోజు తన తొలి తరగతిని పిల్లలకు ఒక కథ చెప్పడంతో ప్రారంభిస్తాడు. కథ ఆసక్తిగా ఉండడంతో పిల్లలు చాలా శ్రద్ధగా, నిశ్శబ్దంగా వినడం మొదలు పెడతారు. నిజానికి వారు కథలు ఆపేసి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. తర్వాత పది రోజులూ ఆయన తరగతులు కథలతోనే గడిచిపోతాయి. పాఠ్యఅంశాలు బోధించకుండా ఇలా కథలతో కాలక్షేపం చేస్తున్నందుకు అధికారులు అతనిని ప్రశ్నిస్తే ఈ కథల ద్వారా ముందు పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చి క్రమశిక్షణను అలవాటు చేస్తున్నాను. వారికి చదువు పట్ల ఆసక్తి కలిగేలా స్ఫూర్తినిస్తున్నాను. వారికి సాహిత్యం, భాషానైపుణ్యాలను పరిచయం చేస్తున్నాను అని చెబుతాడు.
అతను ఆశించనట్లుగానే పిల్లలలో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తాము విన్న కథలను వారు ఇతరులతో పంచుకునేవారు. తర్వాత లక్ష్మిశంకర్ తన తరగతిలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తాడు. తమ పాఠ్య పుస్తకాలు తప్ప వేరే పుస్తకాల మొహం చూడని పిల్లలు వాటిని ఆసక్తిగా తిరగేయడం మొదలుపెడతారు.
పిల్లలలో మరింత క్రమశిక్షణ, పద్ధతి, జట్టుగా ఉండే గుణాలను అలవాటు చేసేందుకు లక్ష్మిశంకర్ వారిని క్రీడల వైపు ప్రోత్సహిస్తాడు.
అయితే పిల్లలను ఉతికిన బట్టలతో, తల చక్కగా దువ్వి, గోళ్లు కత్తిరించి శుభ్రంగా బడికి పంపించమని తల్లిదండ్రులను ఒప్పించడం అతనికి సవాలుగా మారుతుంది. తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పాఠశాలకు సంబంధించిన విషయం కాదని అతనిని విమర్శిస్తారు. అయితే శుభ్రంగా, పద్దతిగా ఉండడమే పిల్లలు నేర్చుకోవాల్సిన తొలిపాఠం అని లక్ష్మిశంకర్ విశ్వాసం.
అతని ఆశయాలు, ఆదర్శాలు, పిల్లలపట్ల అతని నిబద్ధత ఇతరుల కన్నా భిన్నమైనవి. తన ప్రయత్నాలలో అన్ని వర్గాల వారి నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. విద్యార్థులతో, తోటి ఉపాధ్యాయులతోనే కాదు. పిల్లల తల్లితండ్రులతో కూడా అతను ఇబ్బందులు ఎదుర్కొంటాడు. “పిల్లలకు పుస్తకాలలో ఉన్న చదువు మాత్రమే చెప్పాలి అనేది వారి ఉద్దేశం. నేను ఇచ్చే సంజాయిషీలు వారికి రుచించేవి కాదు” అంటాడు లక్ష్మిశంకర్.
తోటి ఉపాధ్యాయులు కూడా అతనిని దారితప్పిన వ్యక్తిగా భావించేవారు. “నా సహోద్యోగులు నా మీద విశ్వాసం లేదు. నా ఆలోచనలు అన్నీ ఆచరణ సాధ్యమైనవి కాదని వారి అభిప్రాయం. అంతేకాక నాకున్న అనుభవం తక్కువ. నాకు వారు బోధిస్తున్న పద్ధతులు, విధానాలపై విశ్వాసం లేదు. నేను పిల్లలను పాడు చేస్తున్నాను అనేవారు. నేను వాళ్లకి కథలు చెప్పడం తప్ప బోధన చేయననీ, ఆటలు ఆడుకోమని వారి విలువైన పఠన సమయాన్ని వృధా చేస్తున్నానని విమర్శించేవారు”
“అయితే నేను సరైన దారిలోనే ఉన్నానని నా నమ్మకం. ఈ కథలూ, ఆటలే సగం చదువు. మిగిలిన సగాన్ని ఎలా బోధించాలో నాకు తెలుసు”
“పై అధికారులకు ఫలితాలు వెంటనే కనపడాలి. లక్ష్మిశంకర్ కు అనుమతి ఇచ్చిన అధికారి కొంచెం అసహనం వ్యక్తం చేస్తాడు. అతని సమస్యలు అతనివి. అతను తన పై అధికారులకు సంజాయిషీ ఇవ్వాలి. వారి మెప్పు పొందాలంటే ఫలితాలు తొందరగా చూపించాలి. నాకు ఎంత మద్దతు ఇవ్వాలనుకున్నా అతని పరిమితులు అతనికి ఉన్నాయి”
ఈ సమస్యలు వేటికీ వెరవకుండా లక్ష్మిశంకర్ మొదటి మూడునెలలు ఇదే పద్ధతి కొనసాగిస్తాడు. మూడవ నెలలో చిన్నగా తరగతి పాఠ్య ప్రణాళిక పైన దృష్టి పెడతాడు. పిల్లలు అన్ని సబ్జెక్టు లలో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కో సబ్జెక్టు కు ఒక్కో పద్ధతి అవలంభిస్తాడు. భాషా నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు రకరకాల కథల పుస్తకాల నుండి డిక్టేషన్ ఇవ్వడం; చరిత్రను కథల రూపంలో చెప్పడం; బట్టీ చదువులు కాకుండా నేర్పినవి గుర్తు పెట్టుకునేందుకు వాటిని నాటకాల రూపంలో ప్రదర్శించడం; పదాలతో చిన్న చిన్న ఆటలు ఆడించడం ద్వారా గ్రామర్ నేర్పించడం; పజిల్స్, పొదుపు కథల ద్వారా విషయాలను పరిచయం చేయడం; క్షేత్ర పర్యటనలు, సందర్శనల ద్వారా భూగోళ శాస్త్రం, జీవశాస్త్రాల పరిచయం వంటివి లక్ష్మిశంకర్ అవలంభించిన విధానాలు.
ఏడాది గడిచేకొద్దీ లక్ష్మిశంకర్ ఇంకా ఎన్నో కొత్త పద్ధతులను ప్రయత్నిస్తాడు. టెర్మినల్ పరీక్షలలో అతని విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. తోటి ఉపాధ్యాయులు కూడా మార్పును గమనిస్తారు కానీ ఇంకా వారి సందేహాలు వారికున్నాయి. లక్ష్మిశంకర్ కు డబ్బు అవసరం లేదనీ, అతని ఆలోచనలన్నీ అతను చదివే ఇంగ్లీష్ పుస్తకాలలోవి అనీ, ఇటువంటి ప్రయోగాలు చేసేందుకు అతనికి తగిన తీరిక, సమయం ఉన్నాయి కాబట్టి అతను ఇవన్నీ చేయగలుగుతున్నాడనీ వాళ్ళ అభిప్రాయం. అయితే లక్ష్మిశంకర్ అందుకు అంగీకరించడు. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రానే విజయం రాదని చెబుతాడు. అది కేవలం ఒక సాకు మాత్రమే అనీ, కొత్త మార్గాన్ని అవలంభించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అనీ అంటాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తికి మార్గం తప్పకుండా దొరుకుతుందని అంటాడు.
ఏడాది చివరికి వచ్చేసరికి విద్యాశాఖాధికారి నాలుగవ తరగతి పిల్లలలో మార్పును చూడగలుగుతాడు. వారి మార్కులలోనే కాదు, వారి ప్రవర్తన, శుభ్రత వంటి అంశాలలో కూడా. మొత్తం తరగతిని తర్వాత తరగతికి ప్రమోట్ చేయమంటాడు. అయితే లక్ష్మిశంకర్ మాత్రం అందుకు ఒప్పుకోడు. కొంతమంది పిల్లలలో ఇంకా తాను ఆశించిన మార్పు రాలేదనీ, అందుకు కారణం వారికి చదువు రాకపోవడం కాదనీ, వారికి వచ్చే చదువును పాఠశాల బోధించలేకపోవడమే అనీ అంటాడు. వారికి ఆసక్తి ఉన్న విషయాలను పాఠశాల బోధించడం లేదు అని అతని అభిప్రాయం.
ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఏటా ఇచ్చే 125 రూపాయిల ప్రోత్సాహక బహుమతిని ఆ ఏడాది పాఠశాల లైబ్రరీ కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తారు.
పాఠశాల వార్షికోత్సవంలో విద్యాశాఖాధికారి ఇలా అంటాడు. “ఈ టీచర్ గతసంవత్సరం తన అభ్యర్ధనతో నా దగ్గరకి వచ్చినప్పుడు, నేను ఇతనిని ఒక మూర్ఖుడు అనుకున్నాను. చాలా మందికి కొత్త ఆలోచనలు ఉంటాయి కానీ అవి ఆచరణలో పెట్టాల్సి వచ్చేసరికి అమలు చేయలేక పారిపోతారు. ఆ ఉద్దేశంతోనే నేను అతనికి అనుమతి ఇచ్చాను తప్ప అతను చెప్పినవాటిపై నమ్మకంతో కాదు. అయితే అతను సాధించిన విజయం చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అతను నా ఆలోచనలను మార్చాడు.”
మన విద్యావ్యవస్థ ఎలా ఉండాలి, మన పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి అని మనం కలలు కంటామో వాటికి ప్రతిరూపమే ఈ దివాస్వప్న. ఆ కలలను నిజంచేసి చూపించిన ఒక ఉపాధ్యాయుడి కథ. గత శతాబ్ద కాలంలో విద్యా బోధనా విధానాలపై వచ్చిన పుస్తకాలలో దివాస్వప్న ఎప్పడూ ముందు స్థానంలో నిలుస్తుంది. 1931 లో గుజరాతీ భాషలో మొదటి సారి ప్రచురించబడిన ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ 11 భారతీయ భాషలలోకి అనువాదం చేసి ప్రచురించింది.
Post 34
Based on a piece by Mamata