మేక్ ఇన్ ఇండియా అనే నినాదం ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ భారతదేశంలో భారతదేశం కోసమే తయారైన ఎన్నో ఆవిష్కరణలు ఉన్నాయి. మనమే రూపొందించినవి, ఇతరులవి చూసి అనుసరించినవి, అనుకరించినవి… ఏమైనా కానీ నూతన ఆవిష్కరణలు దేశంలో ఎన్నో ఎప్పటి నుండో వెలుగు చూస్తూనే ఉన్నాయి.

వాటిలో కొన్నిటిని పరిశీలించినప్పుడు నాకు అద్భుతంగా తోచింది కోయింబత్తూర్ వెట్ గ్రైండర్. దేశంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రతి రోజూ ఏదో ఒక పిండితో అవసరం ఉంటుంది. ఇడ్లీ పిండి, దోస పిండి, గారె పిండి, పెసరట్టు పిండి, ఆపం పిండి, ఆడై పిండి, పనియారం పిండి ఇలా వీటిలో ఏదో ఒకటి లేకుండా ఏ ఇంటి నైనా ఊహించగలమా? ఇవన్నీ దక్షిణ భారత దేశపు వంటలు అయినా దేశమంతటా ప్రజల ఆహారంలో భాగమయిపోయాయి.
గతంలో ఈ పిండిలు తయారు చేసుకోవాలంటే మహిళలు రోట్లో రుబ్బుకోవడమే మార్గం. సన్నగా, పీలగా కనిపించే అమ్మలు కూడా రోటి ముందు కూర్చోగానే కరణం మల్లేశ్వరిలు, కుంజరాని దేవిలు అయిపోయి పెద్ద పొత్రం తోటి పిండి తిప్పుతూ కనపడేవాళ్లు. ఒక పెద్ద కుటుంబానికి బ్రేక్ఫాస్ట్ కు తగినంత పిండి తయారు చేయాలంటే మహిళలు రోటి ముందు కనీసం గంట సేపు చాకిరీ చేయాల్సి వచ్చేది.
అప్పుడు మిక్సర్ గ్రైండర్ లు వచ్చాయి. అయితే మనకి కావలసిన పరిమాణంలో పిండి రుబ్బటానికి పనికి వచ్చేవి కావు. వాటి జార్ లు చిన్నవి. కాసేపు తిరగగానే మోటార్ వేడెక్కిపోతుంది. కొంచెం ఎక్కువ పిండి చేసుకోవాలంటే ఎన్నో సార్లు మిక్సీ లో తిప్పాల్సి వస్తుంది. చాలా సమయం పడుతుంది. దోశలు కూడా రోట్లో రుబ్బినంత రుచిగా ఉండవు. నిజానికి ఈ మిక్సీ లు మన దేశ అవసరాలకు తగినట్లు తయారు చేసినవి కాదు.
ఇక అప్పుడు రంగంలోకి దిగాయి వెట్ గ్రైండర్లు. ఎంత అద్భుతం అవి! వంటింట్లో ఒక మూల అమరిపోయే వీటికి మిక్సీలతో పోలిస్తే సామర్ధ్యం ఎక్కువ. ఎక్కువ పరిమాణంలో పిండి రుబ్బుకోవచ్చు. రాతితో చేసిన రోటి లో ఎలా అయితే రోలు, పొత్రం మధ్య పిండి నలుగుతుందో వీటిలో కూడా పిండి రాళ్ళ మధ్యనే నలుగుతుంది. అందుకే వీటిలో రుబ్బిన పిండికి రుచి ఎక్కువ. స్త్రీలకు శ్రమ తక్కువ. గ్రైండింగ్ సమయంలో వేడెక్కే అవకాశం లేదు. శుభ్రం చేయడం కూడా తేలిక.
మొదటిసారి ఈ వెట్ గ్రైండర్ ను రూపొందించింది కోయింబత్తూర్ కు చెందిన పి. సభాపతి అనే వ్యక్తి. 1955 లో అనేక రకాలుగా ప్రయోగాలు చేసి దీనిని తయారు చేసాడు. మొదట తన ఊరిలోనే వాటిని అమ్మినా తర్వాత కాలంలో చెన్నైలో, మదురై లో వీటిని అమ్మడం మొదలుపెట్టాడు. అతను తయారు చేసిన ఆ బేసిక్ మోడల్ నుండే ఇప్పుడు మరింత ఆధునిక వెట్ గ్రైండర్లు, టేబుల్ టాప్ గ్రైండర్లు వంటివి తయారుచేయబడ్డాయి.
కోయింబత్తూర్ వెట్ గ్రైండర్ల తయారీకి కేంద్రంగా మారింది. అక్కడికి దగ్గరలోనే గ్రానైట్ లభించే ప్రాంతాలు ఉండడం కూడా ఇందుకు అనుకూలించిన అంశం. అంతేకాకుండా కోయింబత్తూర్ అనేక ఇతర పరిశ్రమలకు కూడా కేంద్రం కావడం వలన వెట్ గ్రైండర్ల తయారీకి అవసరమైన ఇతర పరికరాలు, ఎలక్ట్రిక్ మోటార్ల వంటివి అక్కడే లభిస్తాయి. దేశంలో నెల నెలా తయారయ్యే లక్ష వెట్ గ్రైండర్లలో దాదాపు 75 శాతం కోయింబత్తూర్ లోనే తయారవుతాయి. ఇంటి అవసరాలకు వాడే వెట్ గ్రైండర్ల నుండి కమర్షియల్ వెట్ గ్రైండర్ల వరకు దేశంలో ఇప్పుడు దాదాపు నలభై రకాల వెట్ గ్రైండర్లు తయారవుతున్నాయి. 2007 లో తమిళనాడు ప్రభుత్వం వెట్ గ్రైండర్ల తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు తయారు చేసేందుకు, వెట్ గ్రైండర్లకు సంబంధించిన పరిశోధనలు చేసేందుకు ఇక్కడ ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా ప్రారంభించింది.
సి.ఆర్. ఎలాంగోవన్ అనే చరిత్రకారుడు కోయింబత్తూర్ వెట్ గ్రైండర్ల చరిత్రను తన పుస్తకం “ఆటోమేటిక్ ఆతాంగల్: కోవైయిన్ సీతానం’ అనే తన పుస్తకంలో పొందుపరిచాడు.
తన భార్య రోటి ముందు కూర్చుని పిండి రుబ్బడానికి పడే కష్టాన్ని చూసిన సభాపతి ఆమెకు ఆ చాకిరీ తగ్గించడానికి ఈ వెట్ గ్రైండర్ తయారు చేసాడు అని చెబుతారు. అతని భార్యకే కాదు ఎంత మంది స్త్రీలకు ఈ ఆవిష్కరణ చాకిరీని తగ్గించింది? ఎంత సమయం ఆదా చేసింది? కానీ అతని పేరు ఎంతమందికి తెలుసు? నిజానికి స్త్రీలను చాకిరీ నుండి విముక్తి చేసిన ఆవిష్కర్తగా అతని పేరు పాఠ్య పుస్తకాలలో ఉండొద్దూ? ఈ నాటి పరిభాషలో చెప్పాలంటే అతనిని ఒక సోషల్ ఎంట్రప్రెన్యూర్ గా గుర్తించొద్దూ? పద్మశ్రీ లాంటి బిరుదులతో సత్కరించొద్దూ?
అన్నట్లు కోయింబత్తూర్ వెట్ గ్రైండర్ ఇటీవలే జియోగ్రాఫికల్ ఇండికేటర్ (GI) సర్టిఫికేషన్ కూడా పొందింది.
Post 35
Based on piece by Meena