నా చిన్న వయసులో నాన్నతో కలిసి అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుండేదానిని. అక్కడ నాకు అద్భుతంగా తోచిన అనేక విషయాలలో అక్కడ పని చేసేవారందరి టేబుల్స్ పైన ఉండే పేపర్ వెయిట్ ఒకటి. ఫ్యాన్ గాలికి పేపర్లు ఎగిరిపోకుండా వాటిపైన ఈ పేపర్ వెయిట్ లు పెట్టేవారు.
ప్రతిఒక్కటీ ఒక విభిన్నమైన డిజైన్ లో, విభిన్నమైన రంగులలో ఎంతో అందంగా ఉండేది. ఇంత అందమైన ఆకృతులు ఆ గ్లాస్ డోమ్ లోపలికి ఎలా వెళ్లాయా అని నాకు ఆశ్చర్యంగా ఉండేది.
ఈ మధ్య నా టేబుల్ సొరుగులో దేనికోసమో వెతుకుతుంటే ఒక పాత పేపర్ వెయిట్ బయటపడింది. చిన్నతనంలో నాకు ఆశ్చర్యాన్ని, ప్రశ్నలను మిగిల్చిన ఆ పేపర్ వెయిట్ ల గురించి చదువుదాం అనుకున్నాను.

పేపర్ వెయిట్ ల లోపల అందమైన పూల కళాకృతులను చెక్కే ఈ ప్రక్రియను ‘మిల్లెఫీరి’ అంటారట. ఇటాలియన్ భాషలో వేయి పూలు అని దీని అర్ధం. పురాతన ఈజిప్ట్ లో ఈ ప్రక్రియ పుట్టిందనీ, బహుశా ప్రాచీన రోమన్ కాలం నుండి వీటిని తయారు చేస్తున్నారని తెలుస్తుంది. దాదాపు 5 వ శతాబ్దం నాటి నమూనాలు కూడా ఇంకా లభ్యమవుతున్నాయి. అయితే ఈ నైపుణ్యం మధ్యలో కొంతకాలం మరుగునపడి 19వ శతాబ్దం లో మురానో గ్లాస్ ఆర్టిస్ట్ ల కృషి వలన మళ్ళీ వెలుగులోకి వచ్చింది. వింసెంజో మోరెట్టి అనే కళాకారుడు ఎన్నో ఏళ్ళ పాటు శ్రమించి ఈ కలలో అత్యద్భుతమైన నైపుణ్యం సాధించాడు. ‘మిల్లెఫీరి’ పదం తొలిసారిగా 1849 లో ఆక్సఫర్డ్ డిక్షనరీ లో చోటు సంపాదించుకుంది.
కరగబెట్టిన రంగు రంగుల గాజు ముక్కలను పొరలు పొరలుగా వేసి ఒక స్థూపాకార ఆకృతిలోకి దానిని మలుచుతారు. తర్వాత ఇద్దరు కళాకారులు దానిని చెరోవైపు పట్టుకుని లాగుతూ ఒకరి నుండి ఒకరు దూరంగా వెళ్తూ ఉంటే అది ఒక పొడవైన రాడ్ లాగా తయారు అవుతుంది. ఆ రాడ్ ను రకరకాల ఆకృతులలో ముక్కలుగా కత్తిరిస్తారు. ప్రతి ముక్కను ఒక మురైన్ అంటారు. అలాంటి ఎన్నో మురైన్ లను ఒక నిర్దిష్ట డిజైన్లోకి మలిచి గాజు డోమ్ లో అమరుస్తారు. దానితో పేపర్ వెయిట్ లు, ఫ్లవర్ వేజ్ లు, ఉంగరాలు, లాకెట్ లు, డెకొరేటివ్ వస్తువులు ఎన్నో తయారు చేయవచ్చు.
ఈ కళ కేవలం కంటికి ఇంపైన ఆకృతులకు సంబంధించింది మాత్రమే కాదు. సున్నితమైన గాజుతో అత్యంత ఖచ్చితత్వం తో తయారు చేయాల్సిన అరుదైన, ఉన్నతస్థాయి నైపుణ్యం. పేపర్ వెయిట్ లలో ఎక్కువగా పువ్వుల ఆకృతులే కనిపించినప్పటికీ జామెట్రికల్ ఆకారాలు, పురుగుల ఆకృతులతో తయారు చేసిన పేపర్ వెయిట్ లు కూడా మార్కెట్ లో దొరుకుతాయి.
ఇప్పుడు ఈ పేపర్ వెయిట్ లు అంత ఎక్కువగా వాడటం లేదు. కానీ ఆసక్తి ఉన్నవారి సేకరణల జాబితాలో చేరిపోయాయి. క్రిస్టీ లాంటి వ్యక్తులు కొన్ని అరుదైన పేపర్ వెయిట్ లను వేలం వేయడం కూడా చూస్తున్నాం.
నా టేబుల్ సొరుగులో దొరికిన పేపర్ వెయిట్ అడుగున కొంచెం విరిగింది. అయినా రోజూ వాడటానికి బాగానే ఉపయోగపడుతుంది. దానిని అలా రోజూ టేబుల్ పైన చూడటం కొన్ని జ్ఞాపకాలను, సంతోషాన్ని అందిస్తుంది.
Post 38
Based on a piece by Meena