కొన్ని రంగాలలో మార్గదర్శకులుగా చెప్పుకోదగిన వారు కొందరే ఉంటారు. ఎస్.యం. నాయర్ అటువంటి అరుదైన మార్గదర్శకులలో ఒకరు. మ్యూజియాలజీ అనేది ఇప్పటికీ అంతగా ఆదరణ లేని రంగమే. 1950 లలో పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ఆ రోజుల్లోనే కేరళలోని త్రివేండ్రంలో బి.ఎస్సీ పూర్తిచేసిన ఒక కుర్రవాడు బరోడా వరకు వెళ్ళి యం.ఎస్. యూనివర్సిటీ లో ఈ సబ్జెక్టు లో యం.ఎస్సీ చేయడానికి సిద్ధపడ్డాడంటే ఆశ్చర్యమే మరి.
డాక్టర్ నాయర్ బరోడాలో తాను చదువుకున్న విద్యాసంస్థలోనే అధ్యాపకునిగా పని చేయడం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బిట్స్ పిలానీలో మ్యూజియం స్టడీస్ శాఖకు మారారు.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన యూరప్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలను చూసి ఎంతో మెచ్చుకున్నారు. దానికి తోడు ఆమెకు సహజంగానే పర్యావరణం పట్ల ఆసక్తి ఎక్కువ. అటువంటి ప్రదర్శనశాలలు మన దేశంలో కూడా ఏర్పాటు చేయాలని ఆమె ఆలోచన చేశారు. ఢిల్లీ లో ఒకటి, భోపాల్ లో ఒకటి నెలకొల్పేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక ను అమలు చేసేందుకు కొంతమంది మ్యూజియం ప్రొఫెషనల్స్, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా 1974 లో కేవలం 37 ఏళ్ళ వయసుకే ఈ వినూత్న ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా డాక్టర్ ఎస్.యం నాయర్ ఎంపిక కావడం జరిగింది.

తర్వాత నాలుగు సంవత్సరాలు ఆ మ్యూజియంల గురించిన ప్రణాళిక రూపకల్పన, అమలుతో ఎంతో ఒత్తిడితో గడిచిపోయాయి. శ్రీ డిపి సింగ్, ఎస్.కె. సరస్వత్, బి. వేణుగోపాల్, ఇంకెంతో మంది అంకితభావం కల ప్రొఫెషనల్స్ ఈ ప్రాజెక్ట్ పై ఎంతో కృషి చేశారు. డాక్టర్ నాయర్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలను సందర్శించారు. ప్రపంచంలోని అత్యుత్తమైన సంస్థలలో తన బృంద సభ్యులకు శిక్షణ ఇప్పించారు. మొత్తానికి 1978 జూన్ ఐదు (ప్రపంచ పర్యావరణ దినోత్సవం) నాడు జాతీయ ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాల తలుపులు ప్రజల కోసం తెరుచుకున్నాయి. తర్వాత కాలంలో డాక్టర్ నాయర్ మార్గదర్శకత్వంలో మైసూర్, భోపాల్, భువనేశ్వర్ లలో ప్రాంతీయ ప్రదర్శనశాలలు కూడా ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ లో ఈ జాతీయ ప్రదర్శనశాల ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఖడ్గమృగం ఢిల్లీ లో పెరిగిన పిల్లలందరి జ్ఞాపకాలలో తప్పకుండా ఉంటుంది. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో సహజంగా మరణించిన ఖడ్గమృగ కళేబరాన్ని తెచ్చి అది పాడవుకుండా రసాయనాలు వాడి ఈ ప్రదర్శనశాలలో ఉంచారు.
జాతీయ ప్రదర్శన శాల ప్రారంభమయిన నాటి నుండీ బడి పిల్లలకోసం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించింది. మిగిలిన అన్ని మ్యూజియంలు వస్తువులు ప్రదర్శనకు పెట్టి ఊరుకుంటే అందుకు భిన్నంగా ఈ ప్రదర్శన శాల స్వయంగా ప్రజలలోకి, పిల్లలలోకి వెళ్లి వారిని మ్యూజియం కార్యక్రమాలలో భాగమయ్యేలా చేసేది. అప్పటిలో ఎన్నో పాఠశాలలో ఉపాధ్యాయులకు పర్యావరణం పట్ల ఎన్నో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది.
మ్యూజియం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో డాక్టర్ నాయర్ స్వయంగా పాల్గొనేవారు. తొంభైలలో ఉద్యోగ విరమణ చేసే వరకు ఆయన తన ఉద్యోగ తొలినాళ్లలో ఉన్న ఉత్సాహాన్నే కొనసాగిస్తూ పనిచేశారు. 2016 ఏప్రిల్ 26 న మ్యూజియంలో అగ్నిప్రమాదం జరిగి అందులో పొందుపరచిన జంతు, జీవజాలాల శిలాజాలన్నీ తగలబడిపోయాయన్న వార్త ఆయనను ఎంత బాధ పెట్టి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
డాక్టర్ నాయర్ తన ఉద్యోగ విరమణ తర్వాత కూడా పర్యావరణ విద్య మీద చురుకుగా పనిచేస్తూనే వచ్చారు. డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్-ఇండియా, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వంటి ప్రఖ్యాత సంస్థలలో పనిచేశారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన ఎంతో గౌరవాన్ని, గుర్తింపును పొందారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ లో నాచురల్ హిస్టరీ మ్యూజియం కమిటీ చైర్మన్ గా, ఇండో-యు.ఎస్. సబ్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ లోని జాయింట్ మ్యూజియం కమిటీ సభ్యునిగా కూడా ఆయన తన సేవలు అందించారు.
‘అంతరించిపోతున్న జంతుజాలం, వాటి సంరక్షణ’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించగా ఆగం కళా ప్రకాశన్ సంస్థ ఆయన మరొక పుస్తకం ‘బయో డీటీరియరేషన్ ఆఫ్ మ్యూజియం మెటీరియల్స్’ ను ప్రచురించింది.
భారతదేశంలో పర్యావరణ విద్యను ఒక ఉద్యమంగా రూపొందించిన తొలితరం మార్గదర్శకులుగా డాక్టర్ నాయర్ మాకు ఎనభైల కాలం నుండి తెలుసు.
నేను పని చేసిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ లో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా, తర్వాత సీనియర్ కొలీగ్ గా ఆయన మాకు చూపించిన దారి మరువలేనిది. ఒక చిన్న స్వచ్చంద సంస్థగా ప్రారంభమయిన తొలినాళ్లలో ఈ సంస్థలో పనిచేసిన వారందరికీ ఆయన అన్నా, ఆయన నెలకొల్పిన మ్యూజియం అన్నా అపారమైన గౌరవం ఉంది. వేరే ఏ ప్రాజెక్ట్ లు లేని తొలినాళ్లలో ఈ సంస్థ యొక్క, అక్కడి సిబ్బంది యొక్క సామర్ధ్యాన్ని గుర్తించి మ్యూజియంకు సంబంధించి ఎక్సిబిట్లు తయారు చేసే పనిని వారికి అప్పగించడం ద్వారా వారిలో ఎంతో స్ఫూర్తిని, ఆశను కలిగించారు. కొన్ని నెలల పాటు సిబ్బంది జీతభత్యాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా సమకూరడమే కాకుండా మొదటిసారి ఒక జాతీయ స్థాయి సంస్థకు పనిచేసిన అనుభవం కూడా సంస్థకు కలిగింది. అది సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.
మాతో పనిచేసిన మీనా తండ్రిగా కూడా మాకు ఆయనతో పరిచయం ఉంది. ఆమె కూడా తండ్రి బాటలోనే పర్యావరణ పరిరక్షణ రంగంలోనే తన కెరీర్ ను ఎంపిక చేసుకుంది.
ఒక తరం పిల్లలలో ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచిన జాతీయ మ్యూజియం ఇప్పుడు లేదు. కానీ డాక్టర్ నాయర్ స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 1937 నుండి 2021 వరకు జీవించిన డాక్టర్ నాయర్ గత వారం మరణించారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ
Post 39
–Based on a piece by Meena