కాలరీల గురించి లక్ష్యపెట్టకుండా బంగాళాదుంపలను ఇష్టంగా తినేవారిలో నేను ఒకదానిని. వాటి మీద ఉన్న ఇష్టం వల్లనేమో పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అనే పోటీ జరుగుతుందని తెలిసి ఎంతో ఆనందపడ్డాను. 2020 లో ఈ పోటీలు ప్రారంభమయితే 2021 సంవత్సరానికి పోటీల ఫలితాలు మొన్న ఆగస్టులో వెలువడ్డాయి. గెలుపొందిన ఫోటోలను చూస్తే ఆ ఫోటోగ్రాఫర్ లు కూడా ఆ కూరగాయపట్ల ఎంతో ప్రేమతో, అభిమానంతో ఫోటోలు తీశారు అనిపించింది. కంటితో కవిత్వాన్ని చూస్తున్నట్లు అనిపించాయి.

ఈ పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీకి మార్టిన్ పార్ వంటి ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్ లు జడ్జీలుగా ఉన్నారు. దాదాపు రెండువేల పౌండ్ల విలువ గల బహుమతులు (ఒక లెన్స్ కిట్, కెమెరా కేసు, బ్యాక్ ప్యాక్, ఒక ఫోటోగ్రఫీ వర్కుషాప్ లో ఉచితంగా పాల్గొనే అవకాశం, కొన్ని ఫోటోగ్రఫీ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్) విజేతలకు అందించారు. బంగాళాదుంపల మీద ప్రేమను ఇలా ఫోటోల రూపంలో వ్యక్తపరచడమే కాకుండా ఈ పోటీలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు గా ఔత్సాహికులు చెల్లించిన మొత్తాన్ని (ఒక్కొక్కరు ఐదు పౌండ్లు) బ్రిటన్లో పేదల కోసం ఫుడ్ బ్యాంకు ను నిర్వహిస్తున్న ట్రుస్సెల్ ట్రస్ట్ కు విరాళంగా ఇవ్వడం మరొక మంచి విషయం.
దుంప జాతికి చెందిన ఈ మొక్కకు సోలనుమ్ ట్యూబేరోసుమ్ అనేది శాస్త్రీయనామం. నైట్ షేడ్ కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలాలు పెరూవియన్-బొలీవియన్ ఆండిస్ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహార పంటలలో ఒకటిగా ఉంది. బంగాళాదుంపలో శరీరానికి అవసరమైన విటమిన్ సి, ప్రోటీన్, థయామిన్, నియాసిన్ అధికంగా లభిస్తాయి.
దాదాపు 1800 సంవత్సరాలకు పూర్వమే దక్షిణ అమెరికాలో ఇంకాలు బంగాళాదుంపల సాగును భారీస్థాయిలో ప్రారంభించారు. 16 వ శతాబ్దపు రెండవ భాగంలో దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్న స్పానియార్డ్ లు వాటిని యూరప్ కు పరిచయం చేశారు. 17 వ శతాబ్దం చివరి నాటికి ఐర్లాండ్ లో బంగాళాదుంపలే ప్రధాన పంటగా మారాయి. 18 వ శతాబ్దం చివరినాటికి జర్మనీ, పశ్చిమ ఇంగ్లాండ్ తో సహా ఐరోపా ఖండంలోని అనేక ప్రాంతాలలో దుంపలను భారీ స్థాయిలో పండించడం ప్రారంభించారు. ఐరిష్ ఆర్ధికవ్యవస్థ దాదాపుగా బంగాళాదుంపల సాగుపైనే ఆధారపడి ఉంది. 19 వ శతాబ్దం మధ్యలో దుంప చెట్లకు సోకే లేట్ బ్లెయిట్ వ్యాధి కారణంగా ఆ దేశం మొత్తం మీద బంగాళా దుంపలు ఎక్కువగా పండకపోవడంతో ఏర్పడిన బంగాళాదుంపల కరువు అక్కడి ఆర్ధిక వ్యవస్థను, జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
16 వ శతాబ్దం చివరిలో లేదా 17 వ శతాబ్దపు తొలినాళ్లలో మనదేశంలోకి ప్రవేశించిన పోర్చుగీసు, డచ్ ఓడల ద్వారా మనదేశంలోకి కూడా బంగాళాదుంపలు మొదటిసారి ప్రవేశించాయి. ఇప్పుడు ప్రపంచంలో బంగాళాదుంపల సాగులో మనదేశం మూడవస్థానంలో ఉంది. 2017 సంవత్సరంలో దేశంలో దాదాపు 4.9 కోట్ల టన్నుల దుంపలు సాగు అయ్యాయి. ఈ బంగాళాదుంపలు మనకి ఆహారపదార్ధంగా ఉపయోగపడటమే కాక స్థానిక, అంతర్జాతీయ మార్కెట్ లలో మంచి ధరను అందిస్తూ రైతులకు మంచి ఆదాయమార్గంగా మారాయి.
పోర్చుగీసు, డచ్ ఓడల ద్వారా దేశంలో ప్రవేశించిన దుంపల సాగు మొదట్లో మలబారు తీర ప్రాంతానికే పరిమితమయ్యింది. బ్రిటిష్ వారి పరిపాలనలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సాగు విస్తరించింది. దేశంలో అప్పటివరకు స్థానికంగా సాగు అవుతున్న కూరగాయల స్థానంలో బ్రిటిష్ వారి ఆహారంలో ఎప్పటి నుండో భాగంగా ఉన్న బంగాళాదుంపల వంటి కూరగాయల సాగును ప్రోత్సహించాలని అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. దానితో వారు దుంపల సాగు గురించి ఎంతో ప్రచారం చేసి దేశంలోని మూలమూలకు దానిని చేర్చారు. రైతులకు విత్తనాలు ఉచితంగా ఇచ్చి మరి దుంపల సాగుకు ప్రోత్సహించారు. అప్పట్లో దేశంలో వరిసాగులో తరచుగా సమస్యలు తలెత్తి పంటలు దెబ్బతింటుండటంతో రైతుల సమస్యలు తీరేందుకు వరి స్థానంలో బంగాళాదుంపల సాగు చేయడమే సరైన ప్రత్యామ్నాయం అని కూడా వారు విస్తృతంగా ప్రచారం చేశారు.
ఏదేమైనా ఇప్పుడు బంగాళాదుంపలు లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. అలా ఊహించడానికి ఇష్టపడను కూడా.
ఒకవైపు పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అని పోటీలు నిర్వహిస్తూ దుంపలపై అభిమానాన్ని చాటుకుంటుంటే లక్కీ అడ్కిన్స్ వంటి కొందరు రచయితలు బంగాళాదుంపలపై కవిత్వాన్ని కూడా రాశారు.
మన దేశంలో పండే వివిధరకాల బంగాళాదుంపల జాతుల పేర్లు కూడా కవిత్వానికి తక్కువగా లేవు. కుఫ్రి జవహర్, కుఫ్రి చంద్రముఖి, కుఫ్రి సట్లెజ్, కుఫ్రి బాహర్, కుఫ్రి ఆనంద్, కుఫ్రి అశోక, కుఫ్రి ఫుఖ్రాజ్, కుఫ్రి సింధూరి, కుఫ్రి జ్యోతి, కుఫ్రి మేఘ, కుఫ్రి లువకర్, కుఫ్రి స్వర్ణ వంటివి ఆ పేర్లలో కొన్ని. ఈ కుఫ్రి అనే పేరు హిమాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా బంగాళాదుంపలు పండించే కుఫ్రి ప్రాంతం నుండి వచ్చింది అనుకుంటాను. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన పరిశోధనా కేంద్రం కూడా ఈ కుఫ్రి ప్రాంతంలోనే ఉంది.
మన ఆహారంలో ఇంతగా భాగమయ్యి మన జిహ్వకి ఆహ్లాదాన్నందిస్తున్న ఈ బంగాళాదుంపల ప్రస్థానం మానవజాతి కొనసాగినంతకాలం కొనసాగుతూనే ఉంటుందని ఆశిస్తాను.
Post 40
Based on a piece by Meena