ఈ మధ్య 2017 లో ప్రచురించబడిన ‘కంటోన్మెంట్లు: ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ హెరిటేజ్ టు మోడర్నిటీ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని చూసాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో దేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల భూమికి సంబంధించిన వివరాలు, వాటి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి.

ఫ్రెంచ్ పదం అయిన కాంటన్ నుండి ఈ కంటోన్మెంట్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏవైనా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలోనో, శీతాకాలం లోనో సైనిక దళాలు నివసించేందుకు తాత్కాలికంగా విడిది ఏర్పాట్లు చేసిన ప్రాంతాలనే తొలుతగా కంటోన్మెంట్లు అని పిలిచేవారు. అయితే దేశాల మధ్య దాడులు జరిగి ఒక దేశం మరొక దేశాన్ని పాలించే సందర్భంలో తమ సైన్యం కోసం శాశ్వతంగా కొన్ని ఆవాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకునేవారు. భారతదేశంతో సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో వీటిని కంటోన్మెంట్లు అని పిలిచేవారు. అమెరికాలో కూడా కంటోన్మెంట్ అంటే సైనిక స్థావరాలు అనే అర్థంలోనే వాడతారు. దాదాపు 250 ఏళ్ళ క్రితం దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న కాలంలో బారాకపూర్ ప్రాంతంలో దేశంలో తొలి కంటోన్మెంట్ (బీహార్ లోని దానాపూర్ దగ్గర ఉన్నదీ తొలి కంటోన్మెంట్ అని కొందరు అంటారు) ఏర్పాటు అయింది. 18 వ శతాబ్దం నాటికి వాటి సంఖ్య బాగా పెరిగింది.
ప్రస్తుతం దేశంలో 62 కంటోన్మెంట్లు ఉన్నాయి. వారి పరిమాణం, వాటిలో నివసించే జనాభా ఆధారంగా వీటిని మొత్తం నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఈ అన్ని కంటోన్మెంట్లు కలిపి రెండు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగివున్నాయి. మిలిటరీ స్టేషన్ లలో కేవలం సాయుధ మిలిటరీ దళాలు మాత్రమే నివసిస్తే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలలో మిలిటరీ దళాలు, సాధారణ పౌరులు కలిసి నివసిస్తుంటారు. కంటోన్మెంట్లు అన్నీ 2006 కంటోన్మెంట్ చట్టం పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో పాటు నామినేట్ చేయబడిన ప్రతినిధులు కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకునే అధికారిక బాడీ లో సభ్యులుగా ఉంటారు.
నేను చూసిన పుస్తకంలో దేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఎన్ని వైవిధ్యమైన ప్రాంతాలలో మన కంటోన్మెంట్లు ఏర్పడ్డాయో ఈ పుస్తకం చూసి అర్ధం చేసుకోవచ్చు.
కంటోన్మెంట్ల గురించి ఇంతకు ముందు తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. ఉదాహరణకు, కుంభ మేళా జరిగే సంగమ ప్రాంతం అలహాబాద్ లోని ఫోర్ట్ కంటోన్మెంట్ కు చెందిన ప్రాంతం. కుంభమేళాల సమయంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంత నిర్వహణా బాధ్యతను తన పరిధిలోకి తీసుకుంటుంది. తాజ్ మహల్ ను చూసేందుకు మనమందరం వెళ్లే ఆగ్రా ఫోర్ట్ కూడా కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఉంది. అలహాబాద్ కంటోన్మెంట్ లో శాసనాలతో కూడిన అశోకుని స్థూపం ఉంది. ఈ స్థూపానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిపైనా అశోకుని శాసనాలతో పాటు నాలుగవ శతాబ్దానికి చెందిన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుని శాసనాలు కూడా ఉన్నాయి. అహ్మద్ నగర్లో, బెల్గాంలో, కన్ననోరే లో ఉన్న కోటలు అన్నీ కూడా కంటోన్మెంట్ ప్రాంతాలలోనే ఉన్నాయి.
మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహౌ కంటోన్మెంట్ ప్రాంతంలోనే జన్మించారు. ఆయన తండ్రి రాంజీ మలోజి సక్పాల్ బ్రిటిష్ సైన్యంలో సుబేదార్ గా పనిచేశారు. ప్రస్తుతం ఈ కంటోన్మెంట్ ను డాక్టర్ అంబేద్కర్ నగర్ అని పిలుస్తున్నారు. ఈ కంటోన్మెంట్ లో డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం కూడా ఉంది. పాలరాతితో చేసిన ఈ భవనంలో ఈ అసమాన నాయకుని జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శన జరుగుతుంది.
గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ కూడా అల్మోరా కంటోన్మెంట్ ప్రాంతంలో ఎంతో సమయం గడిపారనీ, తన గీతాంజలి తో సహా ఎన్నో రచనలను ఇక్కడ నివసిస్తున్నప్పుడే రచించారని అంటారు. ఆయన నివసించిన భవనాన్ని ఇప్పుడు టాగోర్ హౌస్ అని పిలుస్తున్నారు.
కంటోన్మెంట్ ప్రాంతాలలో కొన్ని అద్భుతమైన భవనాలు కూడా ఉన్నాయి. హుగ్లీ ఒడ్డున 1828 లో నిర్మించిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ భవనం ఇప్పుడు బెంగాల్ గవర్నర్ కు బారక్పూర్ విడిదిగా ఉంది. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయం కూడా కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఉంది.
మద్రాస్ వార్ సిమెట్రీ, కిర్కీ వార్ సెమెట్రీ, ఢిల్లీ వార్ సిమెట్రీ వంటి అనేక యుద్ధ స్మారకాలు కూడా కంటోన్మెంట్ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక కంటోన్మెంట్లలో ఉన్న చర్చీలు, గుడులు, మసీదుల సంఖ్య లెక్కకట్టలేము.
షిల్లాంగ్, రాణిఖేత్ ప్రాంతాలలోని కంటోన్మెంట్ లు జీవ వైవిధ్య కేంద్రాలుగా కూడా అలరారుతున్నాయి. దానాపూర్ కంటోన్మెంట్ లో ప్రత్యేక రుతువులలో ఎన్నో వలస పక్షులు విడిది చేస్తుంటాయి.
మనం అందరం దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కంటోన్మెంట్ ప్రాంతం గుండా ప్రయాణించడమో, అక్కడ నివసించడమో, సందర్శించడమో చేసే ఉంటాము. ఎంతో శుభ్రంగా, పద్ధతిగా నిర్వహించబడే ఈ ప్రాంతాలు కాలుష్యంతో నిండిన పట్టణ ప్రాంతంలో ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తాయి. అయితే వీటి నిర్వహణలో సమస్యలు లేకపోలేదు, ఎన్నో విమర్శలూ లేకపోలేదు. అవి వలసవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఒక ముఖ్యమైన విమర్శ కాగా కంటోన్మెంట్ ప్రాంతాల రోడ్లను సాధారణ ప్రజానీకం వినియోగించుకోలేకపోవడం మరొక సమస్య. ఈ కంటోన్మెంట్ లలో నివసించే సాధారణ ప్రజానీకానికి ఇంటి రుణాలు తీసుకునేందుకు, ప్రభుత్వ హౌసింగ్ పధకాలను వినియోగించుకునేందుకు వెసులుబాటు లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా ఉంది.
డిఫెన్స్ శాఖ నియంత్రణలో ఉన్న భూముల నిర్వహణా వ్యయాల మీద తరచుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుండి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆర్మీ కూడా ఒక సందర్భంలో ఈ ప్రాంతాల నిర్వహణకు ఇంత ఖర్చు చేయడం గురించి పునరాలోచించిన దాఖలాలు ఉన్నాయి. 2021 లో ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ఈ కంటోన్మెంట్ ప్రాంతాల రద్దు మీద ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ప్రకటన కూడా వెలువడింది.
వీటిని బట్టి చూస్తే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలు భవిష్యత్తులో అంతర్ధానమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వీటిని రద్దు చేయడం కాకుండా వీటి నిర్వహణా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించి, వాటిలో నివసించే అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా నిర్వహణ చేసినట్లయితే పట్టణ ఆవాసాల నిర్వహణ కు సంబంధించి కంటోన్మెంట్ లు ఆదర్శంగా నిలుస్తాయి అని నాకు అనిపిస్తుంది.
Post 41
Based on a piece by Meena