గత కొద్ది వారాలుగా పేపర్లలో, వార్తలలో కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP) సదస్సుకు సంబంధించిన విషయాలే ప్రముఖంగా చూస్తూ ఉన్నాం. గ్లాస్గో లో ఈ సదస్సు జరుగుతుందనీ, వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాలను చర్చిస్తున్నారనీ మనందరికీ తెలుసు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు మన భూగోళం యొక్క, మానవాళి యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని కూడా తెలుసు.
అసలు ఈ కాప్ అంటే ఏమిటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఈ కాప్ పూర్తిపేరు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCC) పై సంతకం చేసిన దేశాలన్నింటినీ కలిపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. వాతావరణ మార్పులపై ఆ సంతకం చేసిన దేశాలన్నిటి మధ్య ఒప్పందాన్ని ఇది సూచిస్తుంది. ఈ ఒప్పందం 1992 లో రియో లో జరిగిన సదస్సు నుండి అమలులోకి వచ్చింది. ఈ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ద్వారా వాతావరణ మార్పులను ఒక సమస్యగా ఈ దేశాలు గుర్తించి, దాని పరిష్కారానికై అందరూ కలిసి కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. అయితే ఖచ్చితమైన ప్రణాళిక ఏదీ ఈ ఒప్పందంలో పొందుపరచలేదు. వివిధ దేశాలు, ప్రాంతీయ స్థాయి అనుబంధ సంస్థలు ఈ సమస్య దిశగా చేసిన ప్రయత్నాలను ఆమోదించడం మాత్రమే ఈ ఫ్రేంవర్క్ లో భాగంగా ఉంది.
అయితే వాతావరణ మార్పులపై పరిజ్ఞానం పెరిగి సమాచారం విస్తృతమయ్యే కొద్దీ ఈ దేశాలమధ్య ఒక అంగీకారం కుదిరింది. ఈ ఫ్రేంవర్క్ మరింత మెరుగైంది. ఖచ్చితమైన ఒప్పందాలు, ప్రొటొకాల్స్, బాధ్యతలు నిర్వచించబడ్డాయి. క్యోటో ప్రోటోకాల్, పారిస్ అగ్రిమెంట్ వంటి ఖచ్చితమైన ఒప్పందాలు దేశాలమధ్య కుదిరింది UNFCC ఫ్రేంవర్క్ ఆధారంగానే. వీటన్నిటినీ ప్రతి ఒక్క దేశమూ సంతకం చేసి ఆమోదించాల్సి ఉంటుంది. అదే అత్యంత కీలకమైన అంశం. మంచి ఆకాంక్షలతో నిండిన పత్రాలపై సంతకాలు చేయడం సులభమే. పత్రాలలో ఉన్న ఒప్పందాలకు కట్టుబడి ఉండడం ఏమంత తేలికైన అంశం కాదు. దానికి వివిధ స్థాయిలలో నిబద్ధత అవసరం.
UNFCC ను 1992 లో జూన్ 4 న జరిగిన రియో సదస్సులో కాప్ సభ్యుల ఆమోదానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1994 మార్చ్ 21 నుండి అమలులోకి వచ్చింది. 1992 జూన్ 10 న భారతదేశం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసి 1993 నవంబర్ లో దానిని ఆమోదించింది.

ఇప్పటికి మొత్తం 197 పార్టీలు (196 దేశాలు, ఒక ప్రాతీయ ఆర్ధిక అనుసంధాన సంస్థ) ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే మాటలో ఉన్న పార్టీలు ఇవే. UNFCC కి సంబంధించిన ఏ ప్రధాన నిర్ణయమైనా ఈ పార్టీలే తీసుకుంటాయి. ఇందులో భాగంగా ఉన్న దేశాలు వాటిని అమలు చేసే బాధ్యతను కలిగిఉంటాయి.
ఈ కాప్ ఏడాదికి ఒకసారి సమావేశం అవుతుంది. ఒప్పందం అమలులోకి వచ్చిన మొదటి ఏడాది అయిన 1995 లోనే బాన్ లో మొదటి సమావేశం జరిగింది. కాప్ అధ్యక్ష పదవి ఐదు ఐక్యరాజ్యసమితి ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది. మనదేశంలో 2002 లో న్యూ ఢిల్లీ లో ఎనిమిదవ కాప్ సమావేశం జరిగింది.
ఒప్పందంలో భాగంగా ఉన్న పార్టీలే కాకుండా ఇతర దేశాలు కూడా ఈ సమావేశాలకు హాజరవుతాయి. వీరే కాకుండా పత్రికలు, మీడియా కు సంబంధించిన ప్రతినిధులు, ఇతర పరిశీలనా సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజషన్స్, స్వచ్చంద సంస్థలు కూడా ఈ పరిశీలనా సంస్థల కేటగిరీ లో ఉన్నాయి.
ఇప్పుడు గ్లాస్గో లో జరుగుతున్న సదస్సుకు రిజిస్టర్ చేసుకున్న మొత్తం ప్రతినిధుల సంఖ్య 40000. 2019 లో జరిగిన కాప్ 25 సదస్సుకు హాజరయిన ప్రతినిధుల సంఖ్యకు దాదాపుగా ఇది రెట్టింపు. అయితే రిజిస్టర్ చేసుకున్న వారిలో చాలామంది ఆయా దేశాలలో ఉన్న కోవిద్ నిబంధనల వలన సమావేశానికి హాజరుకాలేనట్లు తెలుస్తుంది.
రిజిస్టర్ చేసుకున్న ప్రతినిధులు అందరూ హాజరవలేదు అనే విమర్శతో పాటు మరొక విమర్శ కూడా ఈ సదస్సు ఎదుర్కొంటుంది. సదస్సు పూర్తయ్యే నాటికి సాధించిన ప్రగతి కానీ, చర్చించిన అంశాలు కానీ పెద్దగా లేవు. ఇదేదో రెండు వారాల వేడుక లాగా ఉంది అని గ్రేటా థున్‌బర్గ్ బాధపడిందంటే ఆ సదస్సు నిర్వహణలో నిబద్ధత ఎంతగా లోపించింది అనేది అర్ధమవుతుంది.
అయితే మన స్థాయిలో ఈ దేశాలన్నీ కలిసి ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకుంటాయేమో అని ఆశపడటం తప్ప చేసేదేమీలేదు. అయితే వ్యక్తిగతంగా పర్యావరణ మార్పులు తెచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు చేయదగిన చిన్న చిన్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అవి మనందరికీ తెలియనివి కావు. మన స్థాయిలో మనం వాటిని అమలు చేయడమే ఇప్పుడు చేయదగినది.
Post 42
Based on a piece by Meena