నేను చదివే వార్తా పత్రికలో ప్రతి బుధవారం టెక్నాలజీ కి సంబంధించిన వార్తల కోసం కొన్ని పేజీలు కేటాయించబడి ఉంటాయి. అందులో టెక్నాలజీ రంగంలో విజయాలు సాధించిన యువత గురించి, ముఖ్యంగా యువతుల గురించి వార్తలు వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా నాకు అదా లవ్ లేస్ గుర్తువస్తూ ఉంటుంది. ఈ రోజు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాలలో ఆడపిల్లలను ప్రోత్సహించాలని అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడో 19 వ శతాబ్దపు తొలినాళ్లలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ లో తనదైన ముద్ర వేసింది లవ్ లేస్.

ఈ రోజు మనందరం విరివిగా ఉపయోగిస్తున్న కంప్యూటింగ్ సైన్స్ కు పునాది వేసింది దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం అనీ, అందునా ఒక స్త్రీ అనీ ఎంతమందికి తెలుసు? అదా లవ్ లేస్ కంప్యూటర్ ల గురించి, భవిష్యత్తు ప్రపంచంలో వాటి ప్రాముఖ్యతను గురించీ ఎన్నో ఏళ్ళ క్రితమే అంచనా వేసిన దార్శనికురాలు. అదా లవ్ లేస్ అని పిలవబడే అగస్టా అదా బైరన్ 1815 డిసెంబర్ 10 న లండన్ లో జన్మించింది. అద్భుతమైన కవిగా మనందరికీ తెలిసిన జార్జ్ గోర్డాన్ అలియాస్ లార్డ్ బైరన్, ప్రముఖ గణితవేత్త అన్నబెల్లా మిల్బంకే ల కూతురే అదా.
గొప్ప కవే అయినా పిచ్చివాడిగా పేరు తెచ్చుకున్న బైరన్ కూ గణిత మేధావి అయిన అతని భార్యకూ మధ్య వివాహ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. అదా పుట్టిన నెలరోజులకు అన్నబెల్లా లండన్ లోని బైరన్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. తన కూతురి మీద అతని ప్రభావం పడకూడదని, అతని కవిత్వ వారసత్వం, అతని పిచ్చి లక్షణాలు ఆ అమ్మాయికి కూడా అంటకూడదనీ, ఈ ఊహాత్మక కళాజీవనానికి భిన్నంగా ఆ అమ్మాయి గణితం, సంగీతం, సైన్స్ లలో రాణించాలని ఆ తల్లి కోరిక.
అదా తండ్రి బైరన్ కూడా ఆ అమ్మాయి చాలా చిన్న వయసులో ఉండగానే లండన్ వదిలి వెళ్ళిపోయాడు. అదాకు ఎనిమిదేళ్ల వయసు ఉండగా గ్రీస్ లో ఆయన చనిపోయాడు. అదా కు ఆయనతో పరిచయమే లేదు. తన అమ్మమ్మ పెంపకంలో పెరిగింది. ప్రైవేట్ టీచర్లు తనకు వ్యక్తిగతంగా చదువు చెప్పేవారు. చిన్నతనం నుండీ ఆ అమ్మాయి అనారోగ్యాలతో బాధపడేది. దానితో ఇంటిలోనే చదువు కొనసాగింది.
అదా కు చిన్నప్పటి నుండే యంత్రాలంటే ఆసక్తి. సైన్స్ పత్రికలు విపరీతంగా చదివేది. అయితే తన తండ్రికి ఉన్నట్లు ఊహాశక్తి కూడా ఎక్కువే. తన 12 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి ఎగరాలి అనే కోరిక కలిగింది. అది కలగా మిగిలిపోలేదు. చాలా పద్ధతిగా పక్షులు, వాటి రెక్కల మీద పరిశోధనలు చేసి రకరకాల పదార్ధాలతో రెక్కలను తయారు చేసేది. తాను చేసిన పరిశోధనకు ‘ఫ్లయాలజీ’ అని పేరు పెట్టింది. ఈ పరిశోధనంతటికి గానూ తన తల్లి నుండి ఎన్నో చివాట్లు కూడా తింది.
1833 లో లండన్ లో జరిగిన ఒక పార్టీ లో ఆమెను ప్రముఖ గణిత మేధావి చార్లెస్ బాబేజ్ కు ఎవరో పరిచయం చేశారు. బాబేజ్ తాను కొత్తగా సృష్టించిన పరికరాన్ని గురించి ఆమెకు వివరించారు. దానిలో అంకెలు వేసి ఉన్న చక్రాన్ని ఒక హేండిల్ సహాయంతో ఖచ్చితమైన లెక్కలు చేయవచ్చు. దీనిని ఆయన ‘డిఫరెన్స్ మెషిన్” అని పిలిచారు. కొన్ని రోజుల తర్వాత ఆ పరికరాన్ని స్వయంగా చూసేందుకు గానూ అదా తల్లి ఆ అమ్మాయిని బాబేజ్ ఇంటికి తీసుకుని వెళ్ళింది. అయితే అది అసంపూర్తిగా ఉన్నట్లు అదా గ్రహించింది. దానిని ఇంకా ఎలా మెరుగ్గా చేయవచ్చో సూచిస్తూ బాబేజ్ తో అనేక చర్చలు జరిపింది. అలా మొదలైన వారిద్దరి స్నేహం జీవితాంతం కొనసాగింది. బాబేజ్ కు అప్పటికే నలభై సంవత్సరాలు. భార్యను కోల్పోయారు. అదా ఉత్సాహవంతమైన యువతి. ఆ అమ్మాయిలోని ప్రతిభను గుర్తించిన బాబేజ్ ఆమెను ఎంతో ప్రోత్సహించారు.
తన 19 ఏళ్ళ వయసులో అదా ధనిక కుటుంబానికి చెందిన విలియం కింగ్ ను వివాహమాడింది. వారికి ముగ్గురు పిల్లలు. 1838 లో అదా అతని లవ్ లేస్ కుటుంబ వారసురాలిగా లేడీ అదా కింగ్ గా హోదా పొందింది. అప్పటి నుండి ఆమెను అదా లవ్ లేస్ అని పిలిచేవారు.
ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరొక వైపు అదా తన గణిత పరిశోధనలపైన కూడా ద్రుష్టి పెట్టింది. మరొక మహిళా గణిత మేధావి మేరీ తో ఆమెకు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి అనేక గణిత విషయాలతో పాటు చార్లెస్ బాబేజ్ రూపొందించిన డిఫరెన్స్ మెషిన్ గురించి కూడా చర్చించుకునేవారు. 1841 లో లండన్ యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ అయినా ఆగస్టస్ డెమోర్గన్ ఆమెకు ఒక ఉన్నతమైన ప్రాజెక్ట్ అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ చేస్తూనే మేరీ తో కలిసి అడ్వాన్సుడ్ మాథెమాటిక్స్ నేర్చుకుంటూనే ఉండేది. డిఫరెన్స్ మెషిన్ ఎప్పుడూ ఆమె ఆలోచనలలోనే ఉండేది.
ఆ సమయంలో బాబేజ్ అనలిటికల్ ఇంజిన్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. అదా దానిలో కీలక పాత్ర పోషించింది. ఆ ఇంజిన్ కు సంబంధించి అదా ఒక పేపర్ కూడా రాసింది. అందులో దాని పనితీరును సోదాహరణంగా క్లుప్తంగా వివరించింది. మెషిన్ కోడ్ ద్వారా బాబేజ్ తయారు చేసిన యంత్రం ఎలా ఒక వరుసలో పనులు చేసుకుంటూ వెళ్లిపోతుందో ఆమె అందులో వివరించింది. ఈ పేపర్ లోనే ప్రపంచంలోనే తొలిసారిగా అల్గోరిథం లేదా కంప్యూటర్ ప్రోగ్రాం ను ఆమె పరిచయం చేసింది. ఆ విధంగా చూస్తే ఆమె తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ అనుకోవచ్చు.
కంప్యూటింగ్ లో ఒక కొత్త అంశాన్ని పరిచయం చేసి అదా లవ్ లేస్ నూతన శకానికి తెరతీసింది. అనలిటికల్ ఇంజిన్ కేవలం అంకెలు, లెక్కలకు సంబంధించినది కాదు అని తాను గుర్తించింది. అది కేవలం కాలిక్యులేటర్ కాదు అని గణితానికి మించి ఎన్నో విషయాలలో మనిషికి తోడ్పడగలదని గుర్తించింది. ఉదాహరణకు మ్యూజిక్ కంపోసింగ్ లో కూడా అది సహాయపడగలదు.
1852 లో తన 36 ఏళ్ళ వయసులో అదా మరణించింది. ఆ తర్వాత వందేళ్లకు గానీ ఆమె అనలిటికల్ ఇంజిన్ పై రాసిన నోట్స్ బయటపడలేదు. 1940 లో ఆధునిక కంప్యూటర్లపై అలాన్ టూరింగ్ చేసిన కృషికి స్ఫూర్తి లవ్ లేస్ రాసిన నోట్స్ అంటే ఆమె ఎంత దార్శనికురాలో అర్ధం అవుతుంది. 1979 లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వారు కొత్తగా రూపొందించిన కంప్యూటర్ లాంగ్వేజ్ కు అదా గౌరవార్ధం ఆమె పేరునే పెట్టారు.
సైన్స్, టెక్నాలజీ రంగాలలోకి అడుగుపెట్టేందుకు ఇప్పటికీ అమ్మాయిలు వెనుకంజ వేస్తున్న ఈ సమయంలో అదా వంటి తొలితరం శాస్త్రవేత్తలను గుర్తు చేసుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తుంది.
Post 44
–Based on a piece by Mamata