కోవిద్ వలన చాలాకాలం ఇంటికే పరిమితమయ్యాక కొంచెం ఉధృతి తగ్గాక ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాము. బెంగుళూరు కు దగ్గరగా ఉండి ఒక్క రోజులో వెళ్ళిరాగలిగే ప్రదేశాల కోసం చూసాం.
బెంగుళూరు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో హోయసల శైలిలో నిర్మించబడిన గుడి ఉన్న సోమనాథపురం గురించి తెలిసింది. క్రీస్తుశకం 1268 లో అప్పటి హొయసల సేనాధిపతి సోమనాథుడిచే నిర్మించినబడిన చెన్నకేశవుని ఆలయం ఇది. వెంటనే కొద్దిమంది మిత్రులతో కలిసి అక్కడికి బయలుదేరాం.
ఇసుకరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం అది. హొయసల వాస్తుశిల్ప నైపుణ్యాలకు అడ్డం పడుతుంది.

చెన్నకేశవ అంటే “అందమైన కేశవుడు” అని అర్ధం. ఈ గుడి విష్ణువు యొక్క మూడు అవతారాలైన కేశవ, జనార్ధన, వేణుగోపాలులకి అంకితం చేయబడింది. ప్రధానఆలయం నక్షత్రాకారంలో ఉన్న మండపంపై నిర్మించబడగా ఈ ఒక్కో అవతారానికి ఒక్కో గర్భగుడి నిర్మించబడింది. దీనితో పాటు 64 చిన్న చిన్న మందిరాలు ప్రాంగణమంతా నిండి ఉన్నాయి. ప్రధానాలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం నిండా రామాయణ, మహాభారత, భాగవత పురాణాలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ పైకప్పులు కూడా ఎంతో అందమైన శిల్పాలతో తామరపువ్వు ఆకారంలో రూపొందించబడింది.
ఈ ఆలయం నిర్మించడానికి ఎన్నో దశాబ్దాలు పట్టిందని చెబుతారు. అయితే విదేశీయుల దురాక్రమణ ఫలితంగా నిర్మాణం పూర్తయిన ఈ ఆలయంలోకేవలం 60 నుండి 70 సంవత్సరాలు మాత్రమే పూజలు జరిగాయి. ఆలయం, లోపలి విగ్రహాలు దెబ్బతినడంతో సంప్రదాయం ప్రకారం పూజలు నిలిపివేశారు.
పూజా పునస్కారాలు నోచుకోని ఆలయమైనా దాదాపు ఏడువందల సంవత్సరాల తర్వాత కూడా ఎంతో దృఢంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ ఆలయ భారతా పురావస్తు పరిశోధక సంస్థ అధీనంలో ఉండడంతో శుభ్రంగా, పర్యాటకులకు ఆహ్లాదంగా ఉంది. టాయిలెట్లు కూడా పరిశుభ్రంగానే ఉన్నాయి.
మేము అక్కడకి చేరుకోగానే ప్రవేశ రుసుము వసూలు చేసే కౌంటర్ కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. దానికి బదులుగా టికెట్ ఇరవై రూపాయలనీ, అక్కడ ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేసి, రుసుము ఆన్లైన్ చెల్లించాలనీ సూచిస్తూ ఫ్లెక్సీ బోర్డులు ఉన్నాయి. అక్కడ దాదాపు ఆరు యాత్రికుల బృందాలు ఉన్నాయి. ఏ ఒక్కరికీ ఆ కోడ్ స్కాన్ కాలేదు. మేము ఆ స్కాన్ తో అలా కుస్తీ పడుతుండగానే ఒక పది నిముషాల తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి అది పని చేయడం లేదని పురావస్తు శాఖ వారి వెబ్సైటు లో లాగిన్ అయ్యి ప్రవేశరుసుము చెల్లించాలని చెప్పాడు. మేము ఎంతో శ్రద్ధగా ఆ పని మొదలుపెట్టాం. అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేదు. ఆ సైట్ కూడా ఎంతో నెమ్మదిగా లోడ్ అవుతుంది. ఎలాగూ నా స్నేహితులు ఒకరు లాగిన్ అయ్యారు. బృందంలోని ప్రతి ఒక్కరి పేరూ ఒక్కడా రాయాలి.ఎవరైతే బుకింగ్ చేస్తున్నారో వారి ఆధార్ లేదా పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. అవన్నీ చేసి నా స్నేహితురాలు రుసుము చెల్లించడానికి ఎంటర్ నొక్కగానే ఇక అది ఒక లూప్ లో తిరుగుతూనే ఉంది తప్ప ఇంతకీ పేమెంట్ పూర్తి కాలేదు. మేము చుట్టూ చూస్తే మిగిలిన యాత్రికుల బృందాలది కూడా అదే పరిస్థితి. డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇవ్వగలరా అని అక్కడ గార్డ్ ను అడిగితే అందుకు వీలులేదు అని స్పష్టంగా చెప్పారు. అప్పటికి ఏదో ఒక బృందంలో ఒకరు ఆన్లైన్లో టిక్కెట్లు కొనుక్కోగలిగారు. మేము డబ్బులు చెల్లిస్తాము మాకు కూడా టిక్కెట్లు బుక్ చేయండని అతనిని బ్రతిమిలాడాము. ఆయన పాపం ఎంతో మందికి అలా చేసి ఇచ్చారు.
ఇదంతా దాదాపు ఇరవై నిముషాలు పట్టింది. ఎంతో విసుగు తెప్పించింది.
ఇక లోపలి వెళ్లి ఆ అద్భుతమైన కట్టడాన్ని చూడగానే ఆ విసుగు అంతా దూరమయ్యింది అనుకోండి.
అయితే నేను చెప్పదలుచుకున్న విషయమేమంటే ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శించాలనుకునే వారందరికీ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్లు ఉండాల్సిందేనా? డిజిటల్ లిటరసీ పక్కన పెట్టండి ఇంకా సంపూర్ణ అక్షరాస్యతే సాధించలేని దేశంలో ఇది అటువంటి ప్రదేశాలు సందర్శించడానికి అవరోధం కాదా? చాలా మంది వృద్ధులకు ఈ స్కాన్ చేసి డబ్బు చెల్లించే పద్ధతి తెలియకపోవచ్చు. అటువంటప్పుడు ఇది ఒకరకంగా వారి పట్ల వివిక్ష చూపించడం కదా? సైట్ దగ్గర వైఫై పనిచేయకపోతే దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వారు వెనక్కి వెళ్లాల్సి రావడం ఎంత అన్యాయం? అంతేకాకుండా టికెట్ కొనుక్కునేందుకు ప్రతి ఒక్కరి పేరు రాయవలసిన అవసరం ఏమిటి? కొనేవారి ఆధార్ నెంబర్/ పాన్ కార్డు నెంబర్ ల అవసరం ఏమిటి? ఆ సమాచారం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పౌరుల జీవితాలను సులభతరం చేయడం. ఇక్కడి పద్ధతి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకవేళ సాంకేతికతను మరింతగా ముందుకు తీసుకువెళ్లడమే దీని ఉద్దేశమైతే డిజిటల్ పేమెంట్ చేసేవారికి ఒకరకమైన రుసుము (ఇరవై రూపాయలు) , నేరుగా కొనుక్కునేవారికి ఒకరకంగా రుసుము (ఇరవై ఐదు రూపాయలు) నిర్ణయించవచ్చు. ఆ విధంగా డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయొచ్చు. అంతేకానీ అసలు నేరుగా కొనుక్కునే అవకాశం లేకుండా చేయడం వలన డిజిటల్ పేమెంట్ చేయలేని వారికి ప్రవేశం కఠినతరం చేయడం కాదా. ఒకరకంగా ఇది వారి హక్కులకు భంగం కలిగించడం కాదా? అంతేకాకుండా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరించడం కూడా ఆమోదయోగ్యంగా అనిపించడం లేదు.
ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శించుకోవడానికి ఒక చిన్నపాటి యుద్ధం చేయాల్సి రావడం ఎంతవరకు సమంజసం?
Blog post 45
–Based on a post by Meena