ఇంతకుముందు వ్యాసంలో టూరిజం కు అడ్డంకిగా ఉన్న కొన్ని హైటెక్ అంశాల గురించి ప్రస్తావించాము. పోయిన నెలలో నా మైసూర్ ప్రయాణం దేశంలో టూరిజం విస్తరించడానికి అడ్డంకిగా ఎన్నో లోటెక్ అంశాలను గుర్తు చేసింది.
మైసూర్ ప్యాలస్ (మరమ్మత్తు పనుల కారణంగా సగం ప్యాలస్ లోకి సందర్శకులకు అనుమతి లేనే లేదు) లో కానీ, జగన్మోహన్ ప్యాలస్ లో కానీ ఆర్ట్ గ్యాలరీ ని సందర్శించాలంటే సందర్శకులు చెప్పులు విడిచి లోపలి వెళ్ళాలి. కొన్ని పవిత్రమైన శాలిగ్రామాలు లోపల ఉన్నందున ఈ నిబంధన ఉంది. అయితే ఆ శాలిగ్రామాలు మందపాటి వెండి తలుపుల వెనక ఉన్నాయి. నిజానికి చెప్పులు విడిచి వెళ్ళవలసిన అవసరం లేదు. జగన్మోహన్ ప్యాలస్ లో గ్యాలరీ లోపల ఇతర ప్రదర్శనలతో పాటు ఒక వినాయక విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి దానిని సందర్శించుకోవాలనుకునేవారి వరకు చెప్పులు తీసి వెళ్లమనే అవకాశం ఉంది. ఇవి రెండూ కూడా ఎంతో పెద్ద ప్యాలస్లు. ఎన్నో అంతస్తులలో విస్తరించి ఉన్నాయి. ప్రతిరోజూ సందర్శకులు వస్తూనే ఉంటారు. చెప్పులు తీసి తిరగడం సౌకర్యమూ కాదు, వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా మంచిదీ కాదు. ఒకవేళ తప్పని సరిగా చెప్పులు తీసి వెళ్ళాలి అంటే సాక్స్ వంటివి ఏర్పాటు చేసి గ్యాలరీ సందర్శన ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకుని, శుభ్రపరచి తిరిగి వాడుతూ ఉండొచ్చు. లేదా మరేదైనా పరిష్కారం ఆలోచించవచ్చు. నా భర్త రఘు డయాబెటిక్ పేషెంట్. ఏదైనా చిన్న గాయమైనా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అని ఈ రెండుచోట్లా చెప్పులు తీయడం ఇష్టం లేక లోపలికి రాలేదు. మిగిలినవారమంతా లోపలోకి వెళ్లాం. లోపల ప్రదర్శనకు ఉన్న అద్భుతమైన కళా ఖండాలను చూసే అదృష్టం ఆయనకు లేకపోవడం ఎంత విచారకరం.

ఇక బృందావన్ గార్డెన్స్ సందర్శన మరొక బాధాకరమైన అనుభవం. మేము అక్కడకి వెళ్లడం కొంచెం ఆలస్యం అయ్యింది. పూర్తిగా చీకటి పడే లోపే గార్డెన్స్ చూడాలని మేమెంతో ఉత్సాహపడ్డాము. మేము అక్కడకి చేరే సమయానికి అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బగ్గి పూర్తిగా మనుషులను ఎక్కించుకుని రౌండ్ కి తీసుకుని వెళ్ళింది. తర్వాత మళ్ళీ బగ్గి ఎప్పుడు ఉంటుందో అడుగుదామని సమాచారకేంద్రం కోసం వెతికాం. అటువంటిదేమీ ఉన్నట్లు కనిపించలేదు. బగ్గి సమయాలు సూచిస్తూ ఒక బోర్డు కూడా లేదు. ప్రవేశద్వారం దగ్గర అడ్డదిడ్డంగా ఏర్పాటుచేసిన షాప్ లలో కొంతమందిని అడిగాము. ఏ ఇద్దరు చెప్పిన సమాచారమూ ఒకేలా లేదు. సరే ఈ లోపు ఒక కాఫీ తాగి తర్వాత బగ్గి కోసం ఎదురుచూద్దాం అనుకున్నాం. కాఫీ లు ఆర్డర్ చేసాము. మధ్యలో కరెంటు పోవడంతో మాకు కాఫీ ఇవ్వలేదు. బాత్రూం ల కోసం చూసాము. అవి ఎక్కడున్నాయో సూచించే బోర్డు లేమీ కనపడలేదు. అటుఇటు తిరిగి వాటిని వెతికి పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. నలభై ఐదు నిముషాలు దాటినా మళ్ళీ బగ్గి రాలేదు. చీకటి పడింది. ఇక మేము తిరిగివెళ్లిపోదాం అనుకున్నాం.
తర్వాత రోజు మంగళవారం. రైల్ మ్యూజియం చూద్దాం అనుకున్నాం. మేము అక్కడకి చేరేటప్పటికి అది మూసేసి ఉంది. దానితో జూ కి వెళదాం అనుకున్నాం. అయితే జూ కి కూడా ఆ రోజు సెలవు దినమే అట.
ఆ విధంగా మా మైసూర్ పర్యటన మొత్తం గందరగోళంగా ముగిసింది. మైసూర్ చాలా అందమైన నగరం. పచ్చని, ప్రశాంతమైన ఆ నగరంలో డ్రైవింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మాలో కొంతమంది ప్యాలస్, మ్యూజియం చూడగలిగాం. ఎంతో రుచికరమైన దోసెలు, సాంబారులో ముంచిన ఇడ్లీలు, పుల్లని, రుచికరమైన పచ్చళ్ళు అతి తక్కువ ధరలలో సంతృప్తిగా, శుచికరంగా తినగలిగాము.
ఇక ఆ ట్రిప్ మొత్తంలో అద్భుతంగా అనిపించిన అంశం ఒకటి ఉంది. దాదాపు 99 వేల బల్బులతొ రాత్రిపూట ధగధగా మెరిసిపోతున్న ప్యాలస్ ను చూస్తుంటే ఏదో జానపద కథలోకో, అందమైన కలలోకో జారినట్లు అనిపించింది. ఆదివారాలు, సెలవు దినాలలో ప్యాలస్ ఇలా విద్యుత్ కాంతితో మెరిసిపోతుంది తెలిసింది. మా పాలస్ టూర్ గైడ్ చెప్పి ఉండకపోతే ఆ రోజు అలా వెలిగిపోయే ఒక ప్రత్యేకమైన రోజు అని తెలిపే బోర్డు లు ఏవీ లేనందువల్ల ఈ అందమైన అనుభవాన్ని కూడా కోల్పోయేవాళ్ళం.
భారతదేశం ఎంతో ప్రాకృతిక, సాంస్కృతిక సంపద కలిగిన దేశం. ఇప్పడు చాలామంది భారతీయులు పర్యాటకంపై ఆసక్తి చూపిస్తూ అందుకు సమయం, డబ్బు వెచ్చిస్తున్నారు. అయితే అలా ఆసక్తితో వస్తున్న టూరిస్ట్ లకు కనీస సమాచారం, సదుపాయాలు అందించే ఏర్పాట్లు చేయడం అంత కష్టమా? వారి పట్ల కొంత గౌరవం చూపించలేమా? ప్రయాణ అనుభవాన్ని అందంగా, ఆహ్లాదంగా, జ్ఞాపకంగా, నేర్చుకునేందుకు ఒక అవకాశంగా మార్చలేమా? చిన్న చిన్న ప్రయత్నాలైనా మొదలుపెట్టలేమా?
- టూరిస్ట్ ప్రాంతాలలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడం, టూరిస్ట్ లు అధికంగా వచ్చే నగరాలలో కూడా అటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన టూరిస్ట్ లకు ఎంత వెసులుబాటు ఉంటుంది?
- డైరెక్షన్ లు చూపిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడం ఉపయోగకరం కాదా?
- మైళ్ళకు మైళ్ళు ఉన్న కారిడార్ లలో చెప్పులు లేకుండా తిరిగే అవసరం లేకుండా చూడలేమా? ఒకవేళ తీయవలసిన అవసరం ఉన్న సందర్భాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేమా?
- అన్ని ప్రదేశాలలోనూ ఒకే సెలవుదినాలు ఉండేలా చూడలేమా? నా ఈ అనుభవం తర్వాత నేను కొంచెం గూగుల్ లో పరిశోధన జరిపిన తర్వాత తెలుసుకున్నదేమంటే ఢిల్లీ జూ కు శుక్రవారం సెలవుదినం. హైదరాబాద్ జూ కు సోమవారం. మైసూర్ జూ, చెన్నై జూ లకు మంగళవారం, ఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం కు సోమవారం, ముంబై లోని డాక్టర్ భావు దాజి లాడ్ మ్యూజియం కు బుధవారం, ఢిల్లీ లోని మోడరన్ ఆర్ట్ గ్యాలరీ కు సోమవారం, సైన్స్ సెంటర్ కు శని, ఆదివారాలు. ఇన్ని రకాల సెలవు దినాలు ఎందుకు. అన్ని చోట్లా ఒకటే పాటించవచ్చు కదా. కనీసం ఒక నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నిటికీ ఒకటే షెడ్యూల్ ఉండవచ్చు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పర్యాటకులు ఏదైనా ఒకరోజు ఒక నగరంలో గడిపితే కొన్ని ప్రదేశాలు చూడగలుగుతారు, కొన్ని చూడలేరు.
మనది నిజంగా అత్యద్భుతమైన దేశం. కొద్దిపాటి శ్రద్ద, చిత్తశుద్ధి ఉంటే దీనిని పర్యాటకులకు స్వర్గధామంగా మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.
–Based on a piece by Meena