తమిళనాడు లోని తిరువాయూర్ లో ప్రతి ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. త్యాగరాజ స్వామి వర్ధంతి ని పురస్కరించుకుని ఆ మహా సంగీతకారుని గౌరవార్ధం జరిగే ఈ ఉత్సవాలు ఈ ఏడాది జనవరి 22 న జరగనున్నాయి.

కర్ణాటక సంగీత విద్వాంసుడైన త్యాగరాజ స్వామి (1767-1847) ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరితం అనే రెండు సంగీత నాటకాలతో పాటు దాదాపు 25000 పాటలకు స్వరకల్పన చేసినట్లు చెబుతారు. అయితే వాటికి సంబంధించిన రికార్డులు సరిగా లేకపోవడంతో ఆయన స్వరకల్పన చేసిన పాటలు ఎన్ని అనే దానిపై ఖచ్చితమైన అంచనా లేదు. ఇప్పుడు మనకు అందులో లభిస్తున్నవి కేవలం ఏడు వందల పాటలు మాత్రమే. తాళపత్ర గ్రంధాలలో పొందుపరచిన ఎన్నో పాటలు ప్రకృతి వైపరీత్యాలకు, కాల ప్రభావానికి లోనై కాలగర్భంలో కలిసిపోయాయి.
త్యాగరాజ స్వామి కృతులన్నీ రాముల వారి పై భక్తితో రూపొందించనవే. అప్పటి తంజావూర్ రాజుగారు త్యాగరాజుల సంగీత ప్రతిభను గురించి విని తన ఆస్థానానికి రమ్మని కబురు పంపినట్లు చెబుతారు. అయితే ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాక తన స్పందనగా ‘నిధి చాల సుఖమా’ అనే పాటను కూడా రచించారు.
ఇక మళ్ళీ ఆరాధనోత్సవాల విషయానికి వద్దాం. సన్యాసం తీసుకున్న కొన్నాళ్ళకు 1847 లో త్యాగరాజస్వామి తనువు చాలించారు. కావేరీ నది ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి. అక్కడ ఒక చిన్న స్మారకచిహ్నాన్ని నిర్మించారు కానీ అది కొంతకాలానికే నిర్లక్ష్యానికి గురయ్యింది. 1903 లో ప్రముఖ సంగీత విద్వాంసులు, త్యాగరాజస్వామి శిష్యులు అయినా ఉమయాలపురం కృష్ణ భాగవతార్, సుందర భాగవత తిరువాయూర్ కు వెళ్లారు. అక్కడ శిధిలావస్థలో ఉన్న స్మృతి చిహ్నాన్ని చూసి వారిద్దరూ బాధపడి ఇక నుండి ప్రతి ఏటా తమ గురువైన త్యాగరాజస్వామి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. దానివలన ఆయనను గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన సమాధి కూడా సంరక్షించబడుతుందని వారి ఆశ.
ఆ తర్వాత ఏడాది నుండే అంటే 1904 నుండే ఈ ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి. 1905 లో ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలు, పేదలకు అన్న సంతర్పణలతో రోజులతరబడి ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్ దీని వెనుక ఉన్న చోదకశక్తులయితే వారికి ఈ ఉత్సవాలు జరిపేందుకు తగిన అంగబలం, అర్ధబలం ఉన్న ఎంతో మంది చేయూతనందించారు. తిళైస్థానం నరసింహ భాగవతార్, తిళైస్థానం పంజూ భాగవతార్ అందులో ముఖ్యులు. అయితే తర్వాత కాలంలో ఈ అన్నదమ్ములిద్దరికీ మనస్పర్థలు వచ్చి 1906 లో ఎవరికి వారే విడివిడిగా ఆరాధనోత్సవాలు నిర్వహించారు. తర్వాత కాలంలో పెద్దలు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చి ఒక ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం ఇద్దరిలో చిన్నవాడు, అతని బృందం వర్ధంతి రోజుకు ఐదు రోజుల ముందు ఉత్సవాలు ప్రారంభించి వర్ధంతి రోజు వరకు జరపాలి. పెద్దవాడైన నరసింహ, అతని బృందం వర్ధంతి రోజుతో ప్రారంభించి తర్వాత నాలుగు రోజులపాటు ఉత్సవాలు కొనసాగించాలి.
తర్వాత కొన్నాళ్ళకు ఆ మనస్పర్థలు పూర్తిగా తొలగిపోయి రెండు బృందాలూ ఒక్కటయ్యాయి. అయితే ఒక విషయంలో మాత్రం ఈ రెండు బృందాలూ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాయి. ఈ ఆరాధనోత్సవాలలో స్త్రీలు ప్రదర్శనలు చేయకూడదు అనేది వారి నియమం. అప్పట్లో సాధారణంగా దేవదాసీ స్త్రీలు మాత్రమే బహిరంగ సంగీత, నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇటువంటి పవిత్ర ఉత్సవంలో వారు పాల్గొనకూడదని ఆ అన్నదమ్ములు, అప్పటి సమాజ పెద్దలు విధించిన నియమం.
అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ ఎంతో పేరున్న సంగీత విద్వాంసురాలు. ఆమెకు ఎంతో పేరు, పరపతి ఉన్నాయి. ఆమెకు త్యాగరాజ స్వామి అంటే ఎంతో అభిమానం. తన ప్రతిభ అంతా ఆయన వరమే అని ఆమె నమ్మకం. ఎన్నో సంగీత సభలలో ఆయన కృతులు పాడటం వల్లనే ఆమెకు అంత గుర్తింపు లభించింది. అయితే స్త్రీ కావడం వలన ఆమెకు త్యాగరాజ ఆరాధనలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.
1921 లో నాగరత్నమ్మ తనకున్న అపారమైన సంపదను స్వామి వారికోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఆయన సమాధి చుట్టూ ఉన్న భూమిని కొని అందులో ఒక ఆలయాన్ని నిర్మించి దాని ముందు త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఆలయం 1926 నాటికి పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది.
ఆరాధనోత్సవాలు నిర్వహించే బృందం ఆమె తన స్వంత ఖర్చుతో ఇవన్నీ చేస్తుంటే సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ ఉత్సవాలలో ప్రదర్శనకు వచ్చేటప్పటికి ఆమెకు అనుమతి ఇవ్వలేదు. దీనిని అవమానంగా భావించిన ఆమె ఆ గుడికి దగ్గరలో తన స్వంతంగా ఆరాధనోత్సవాలను నిర్వహించాలని అనుకుంది. ఇందులో ఎంతో మంది మహిళా కళాకారులకు ప్రదర్శనకు అనుమతి లభించి ఆ ఉత్సవాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. గతంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్న బృందం ఆ ఆలయం దగ్గర ఉత్సవాలు నిర్వహించకూడదనీ, అది తాను స్వయంగా నిర్మించిన ఆలయం అనీ ఆమె న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమె కోరికను తిరస్కరించింది కానీ కొన్ని నియమిత గంటల పాటు ఆమె బృందం, మిగిలిన గంటలు మిగిలిన రెండు బృందాలు ఆరాధనను నిర్వహించవచ్చు అని తీర్పు ఇచ్చింది.
ఆ సమయంలో ఎస్. వై. కృష్ణస్వామి అనే ఇండియన్ సివిల్ సర్వెంట్ అధికారి ముందుకువచ్చి ఈ మూడు బృందాల మధ్య సంధి కుదిర్చారు. 1941 నుండి ఈ మూడు శత్రు బృందాలు ఒక్కటయ్యాయి. స్త్రీలు కూడా ఆ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం సాధించడం ద్వారా నాగరత్నమ్మ విజయం సాధించారు.
ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా త్యాగరాజ స్వామి ఐదు కృతులను పంచరత్నాల పేరుతో సామూహికంగా ఆలపించే సంప్రదాయ ప్రదర్శనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందరూ కలిసి ఎంపిక చేసిన ఐదు కృతులను ఒకే గొంతుతో ఆలపించడం ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి. యూట్యూబ్ లో చూడండి.
–Based on a piece by Meena