
మరొక యుద్ధం మొదలయ్యింది. ఆఫ్ఘనిస్థాన్ దృశ్యాలు ఇంకా కళ్ళముందు నుండి పూర్తిగా చెదరకముందే ఉక్రెయిన్ నుండి హృదయవిదారకమైన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు తమ బలాబలాలు తేల్చుకునేందుకు తలపడతుండగా మనలాంటి సాధారణ ప్రజలు మాత్రం తమ జీవితాలు తల్లకిందులై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలుముకున్న పొగ, ధూళి వెనుక అనిశ్చితితో, భయంతో బిక్కచచ్చిపోయిన మనుషులు కనిపిస్తున్నారు. వారిది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ.
ఇటువంటి నిరాశానిస్పృహలు అలుముకున్న సందర్భాలలోనే మనకు ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు, గొంతులు అవసరమవుతాయి. అయితే అటువంటి రెండు శక్తివంతమైన గొంతులను ఇటీవల కాలంలో కోల్పోవడం మన దురదృష్టం. వాటిలో ఒకటి ఆర్చిబిషప్ డెస్మండ్ టూటూ ది. ఆయన డిసెంబర్ 2021 లో మరణించారు. మరొకరు పోయిన నెలలో తన 95 వ ఏట మరణించిన థిచ్ న్హాట్ హాన్.
థిచ్ వియత్నాంకు చెందిన బౌద్ధ భిక్షువు. రచయిత, కవి, గురువు, శాంతిదూత. మధ్య వియత్నాంలోని హ్యూ పట్టణంలో 1926 అక్టోబర్ 11 న జన్మించిన ఆయన అసలు పేరు న్యూయెన్ దిన్ లాంగ్. పదహారేళ్ళ ప్రాయంలోనే ఒక జెన్ ఆశ్రమంలో భిక్షువుగా చేరారు. 1949 లో సన్యాసం స్వీకరించాక తన పేరు థిచ్ న్హాట్ హాన్ గా మార్చుకున్నారు. తర్వాత ఆయన థాయ్ అనే పేరుతో ప్రపంచప్రసిద్ధి చెందారు థాయ్ అంటే గురువు అని అర్ధం.
1950 లలో తన యుక్త వయసులోనే థిచ్ వియత్నాం లో బౌద్ధాన్ని పునరుద్ధరించే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సైగన్ యూనివర్సిటీ లో లౌకికత మీద అధ్యయనం చేసిన మొదటి భిక్షువులలో ఆయన ఒకరు. సైకిల్ తొక్కిన మొదటి ఆరుగురు భిక్షువులలో కూడా థిచ్ ఒకరు.
1950 ల మధ్యలో వియత్నాం యుద్ధ సమయంలో తమ ధ్యాన మందిరాలలో ధ్యానం చేసుకుంటూ తమదైన సన్యాస జీవితాన్ని ఆచరించాలా లేక యుద్ధంలో, బాంబు దాడులలో దెబ్బతిని బాధపడుతున్నవారికి ఆపన్నహస్తం అందించాలా అనేది అక్కడి భిక్షువులు, సన్యాసినులు ఎదుర్కున్న అతి పెద్ద సమస్య. థిచ్ ఈ రెండు పనులూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు బౌద్ధమత ఆచారాలను ఎంతో లోతుగా అవగాహన చేసుకుని ఆ ఆచారాలకి అనుగుణంగా జీవనం గడుపుతూనే మరొకవైపు తన దేశం, అక్కడి ప్రజలపై యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకు తనవైన ప్రయత్నాలు ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ యూత్ అండ్ సోషల్ సర్వీస్ పేరుతో సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక సంస్థను స్థాపించారు. అందులో యువ భిక్షువులతో సహా దాదాపు 10000 మంది స్వచ్చంద కార్యకర్తలు తమ సేవలందించారు. వీరంతా యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి గాయపడిన వారికి సేవలందివ్వడమే కాకుండా శరణార్ధులకు పునరావాస వసతుల ఏర్పాట్లు, వారికోసం పాఠశాలలు, ఆసుపత్రులు వంటివి ఏర్పాటు చేశారు. ఇందులో యువత కేవలం సామాజిక కార్యకర్తలు మాత్రమే కాదు.బౌద్ధ సూత్రాలైన అహింస, కరుణ లను శ్రద్ధగా ఆచరించే అభ్యాసకులు కూడా.
1961 లో అమెరికా లోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ లో తులనాత్మక మత అంశాలపై బోధించేందుకు థిచ్ అమెరికా కు వెళ్లారు. ఆ తరువాత ఏడాది బుద్ధిజం పై పరిశోధన, బోధన చేసేందుకు కొలంబియా యూనివర్సిటీ కు వెళ్లారు. 1963 లో అమెరికా-వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా బౌద్ధులు చేస్తున్న ఉద్యమంలో భాగస్వామ్యాలయ్యేందుకు గానూ ఆయన వియత్నాం తిరిగి వచ్చారు. అప్పటికే ఎంతో మంది బౌద్ధ సన్యాసులు ఈ ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకుని ఉండడంతో ఈ ఉద్యమం ప్రపంచ దేశాలన్నిటి దృష్టినీ ఆకర్షించింది. ఆయన మరొక సారి అమెరికాలో, యూరప్ లో పర్యటించి వియత్నాంలో నెలకొని ఉన్న భయానక పరిస్థితుల గురించి వివరించి అక్కడ శాంతి నెలకొల్పవసిందిగా కోరారు. 1960 ల మధ్యలో వియత్నాం యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఆయన మానవ హక్కుల నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ ను కలిసి ఈ ఘర్ణణ వాతావరణానికి వ్యతిరేకంగా మాట్లాడవలసిందిగా ఆయనను ఒప్పించారు.
1964 లో థిచ్ ఒక బౌద్ధుల వారపత్రికలో యుద్ధానికి వ్యతిరేకంగా ఒక కవిత రాశారు. దానిలో కొంతభాగం ఇలా ఉంది.
ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారంతా సాక్షులుగా ఉండండి.
నేను ఈ యుద్ధాన్ని అంగీకరించలేను
ఎప్పటికీ, ఏనాటికీ
నేను మరణించేలోగా ఈ మాట కొన్ని వేల సార్లు చెప్పవలసి రావచ్చు
తన జంటపక్షి కోసం మరణానికైనా సిద్ధపడే పక్షి లాంటి వాడిని నేను
విరిగిన ముక్కు నుండి రక్తం ఓడుతున్నా ఇలా అరుస్తూనే ఉంటాను
“జాగ్రత్త, వెనుకకు తిరుగు
వాంఛ, హింస, ద్వేషం, దురాశ అనే అసలైన శత్రువులతో పోరాడు.
ఈ కవిత ఆయనకు యుద్ధ వ్యతిరేక కవి అనే పేరుతో పాటు కమ్యూనిస్ట్ భావజాలంగల వ్యక్తి అనే ముద్ర కూడా తీసుకువచ్చింది. ఆయన ఇలా అమెరికా, యూరప్ లలో తన గళాన్ని వినిపిస్తూ మరొక వైపు అటు ఉత్తర, దక్షిణ వియత్నాంల మధ్య జరుగుతున్నా ఘర్షణలో ఏ వర్గం వైపు నిలబడకపోవడంతో అటు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, ఇటు కమ్యూనిస్ట్ లు కానీ ప్రభుత్వాలు కూడా ఆయనకు 39 సంవత్సరాల పాటు దేశ బహిష్కరణను విధించాయి. దానికి స్పందిస్తూ ఆయన ఇలా అన్నారు “నేను పాశ్చాత్త్య దేశాలలో ఎక్కువకాలం ఉండాలనుకోలేదు. వారు నన్ను వివిధ అంశాలపై ప్రసంగించేందుకు ఆహ్వానించారు. నేను దానిని యుద్ధానికి వ్యతిరేకంగా నా గొంతు వినిపించేందుకు అవకాశంగా మలుచుకున్నాను. లేకుంటే వియత్నాం కు బయట ఉన్న ప్రజలకు వియత్నాం ప్రజల ఆకాంక్షలు అర్ధం కావు. వియత్నంలో బౌద్ధులం అత్యధిక సంఖ్యలో ఉన్నాం. మేము యుద్ధం జరుపుతున్న ఏ ఒక్క వర్గం వైపూ నిలబడే వారిమి కాదు. మాకు కావాల్సింది యుద్ధంలో గెలవడం కాదు. యుద్ధం జరగకుండా ఉండడం. అందుకే వియత్నంలో యుద్ధం జరుపుతున్న ఏ ఒక్క వర్గానికీ నా మాటలు రుచించలేదు. అందుకే నన్ను నా ఇంటికి రాకుండా నిషేధించారు”
తన దేశ బహిష్కరణ కాలంలోనే థిచ్ అనేక దేశాలు పర్యటించి యుద్ధం, హింసలకు వ్యతిరేకంగా తన గళం విప్పి ప్రపంచ శాంతిదూతగా మారారు. ఏడు భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన విస్తృతంగా రాశారు కూడా. అంతేకాక మైండ్ఫుల్ నెస్ ఆర్ట్, శాంతియుత జీవన విధానాలపై కూడా ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడమే కాక ఎన్నో వ్యాసాలు రాశారు. 1970 లో యూనివర్సిటీ అఫ్ సోర్బోన్, పారిస్ లో బుద్ధిజం పై ఉపన్యాసకులు, పరిశోధకులుగా పనిచేశారు. 1975 లో పారిస్ లో స్వీట్ పొటాటో కమ్యూనిటీ ని స్థాపించారు. తర్వాత 1982 లో ఫ్రాన్స్ లోని నైరుతి భాగంలో ఒక విశాలమైన భూభాగంలో ఒక బౌద్ధ ఆరామాన్ని స్థాపించారు. ప్లమ్ విలేజ్ అని పిలవబడే ఈ ఆరామంలో దాదాపు 200 మంది బౌద్దులు నివసించేవారు. అంతేకాక ప్రతిఏటా ప్రపంచంలోని నలుమూలలనుండి ఎనిమిది వేల మందికిపైగా ఈ ఆరామానికి మైండ్ ఫుల్ లివింగ్ కు సంబంధించిన అంశాలు నేర్చుకునేందుకు వచ్చేవారు.
2005 లో వియత్నాం లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆయనను దేశంలో ప్రవేశించేందుకు, ప్రయాణించేందుకు, బోధన చేసేందుకు అనుమతి ఇచ్చింది. తన యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన కొనసాగిస్తూనే వచ్చారు. 2014 లో తన 88 వ ఏట వచ్చిన గుండె నొప్పి కారణంగా శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైనప్పటికీ ఆయన తన నిర్మలమైన వ్యక్తిత్వంతో అందరికీ స్ఫూర్తినిస్తూనే వచ్చారు. 2022 జనవరి 22 న తన 95 ఏళ్ళ వయసులో వియత్నాం లోని హ్యూ ప్రాంతంలో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు.
యుద్ధమేఘాలు అలుముకుని ఉన్న ఈ సమయంలో ఆయనే కనుక ఉండి ఉంటే మరొక యుద్ధాన్ని చూసి ఎంతో దుఃఖించి ఉండేవారు. అన్ని సమస్యలకు యుద్ధం మాత్రమే పరిష్కారం కాదనీ, నమ్మకం, సహానుభూతి, సోదరభావం అనే మార్గాల ద్వారా కూడా పరిష్కారాలు సాధించవచ్చనీ ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసేవారు. ఆయన మాటలను ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుందాం “చెడు ఆలోచనలను, అభిప్రాయాలను క్షిపణులు, తుపాకులు, బాంబులు నాశనం చేయలేవని మనకు తెలుసు. ప్రేమపూర్వకమైన సంభాషణ, సహానుభూతితో అవతలి వారి ఆలోచనలను వినడం ద్వారా మాత్రమే చెడు ఆలోచనలను సరిచేసుకోగలము. కానీ ఈ పద్ధతిపై మన నాయకులెవరికీ శిక్షణ లేదు. అందుకే వారు తీవ్రవాదాన్ని అణచడానికి ఆయుధాలపై ఆధారపడతారు”
ఈ సందర్భంలో ఆయన మరొక మాటను కూడా గుర్తు చేసుకోవాలి. “ఆశ అన్నిటికన్నా ముఖ్యం. అది ఉండడం వలన ప్రస్తుతం ఎంత కఠినంగా ఉన్నా భరించగలం. భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ ఉన్నప్పుడే ఈ రోజు ఎదురైన కష్టాన్ని ఓర్చుకునేందుకు సిద్ధపడతాం”
భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో. …
–Based on a piece by Mamata
.