అకాడెమిక్ సంస్థల పట్ల తరచుగా వినిపించే ఒక ఫిర్యాదు ఏమిటంటే ఆ సంస్థలు సాధారణ ప్రజా జీవితానికి దూరంగా ఉండి సామాజిక వాస్తవాలను అర్ధం చేసుకోలేవు. అందువల్లనే సామాజిక సమస్యలకు ఈ సంస్థలు సూచించే పరిష్కారాలు కూడా ఎంతో డొల్లగా ఉంటాయి అని.

అయితే అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కలిసి అమలు చేసిన జవాజా ప్రాజెక్ట్ మాత్రం ఇందుకు ఒక మినహాయింపు అనే చెప్పాలి.
1975 లో ఐఐఎం, అహ్మదాబాద్ తొలి ఫుల్ టైం డైరెక్టర్ అయిన రవి మత్తయి భారతదేశం ఎదుర్కుంటున్న పేదరిక సమస్యను కార్పొరేట్ మేనేజ్మెంట్ సూత్రాలను ఉపయోగించి ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకునేందుకు ఒక చిన్న ప్రయోగం మొదలుపెట్టారు. అప్పటికే ఆయన డైరెక్టర్ గా పదవి నుండి తప్పుకుని ఉండడంతో తన పూర్తి సమయాన్ని ఈ ప్రాజెక్ట్ కు కేటాయించారు.
రాజస్థాన్ లోని కరువు పీడిత జిల్లా అయిన జవాజాను ఈ ప్రయోగానికి వేదికగా ఎంచుకున్నారు.మొత్తం 200 గ్రామాలు, 80000 జనాభా. బీడు భూములు, నీటి కరువు తో పాటు ఇతర భౌతిక వనరులేమీ లేని ఈ జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. అందరి దృష్టిలో ఏ వనరులూ లేని ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యం. కానీ రవి మత్తాయి దృష్టి అందుకు భిన్నమైంది. ఆయన దృష్టిలో మానవ వనరులను మించిన వనరు లేదు.
ఆ ప్రాంతాన్ని అర్ధం చేసుకునే క్రమంలో అక్కడ దాదాపు మూడువందల ఏళ్లుగా తోళ్ళతో హస్తకళా ఉత్పత్తులు చేసే సంప్రదాయం ఉన్నదని తెలిసింది. అక్కడి ప్రజలకు నేతపనిలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యాలను ఉపయోగించి వారికి సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే ప్రొఫెసర్ మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను రంగంలోనికి తీసుకువచ్చారు. జవాజా ప్రజల జీవనోపాధులపై పని చేసి వారి సాధికారత వైపు కృషి చేయాలనేది ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం. ఈ ప్రయత్నంలో మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు చెందిన అశోక్ ఛటర్జీ తో పాటు రెండు సంస్థలకు చెందిన అనేకమంది ఇతర సిబ్బందితో కలిసి పనిచేశారు.
హస్తకళాకారులకు సమకాలీన సంస్కృతికి తగిన డిజైన్ లను, నిర్వహణా నైపుణ్యాలను అందివ్వడం, అందుకు అవసరమైన సంస్థలతో వారిని కలపడం ఈ ప్రాజెక్ట్ చేసిన ముఖ్యమైన పని. ఈ ప్రాజెక్ట్ కొన్ని ముఖ్యమైన విలువల ఆధారంగా నిర్వహించబడింది. పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనేవి వాటిలో ముందు వరసలో నిలిచే విలువలు. అక్కడి ప్రజలు ఈ సంస్థలకు చెందిన నిపుణుల నుండి కొత్త విషయాలను నేర్చుకోవడం ఒక ఎత్తైతే ఆ నిపుణులకు కూడా తమ నైపుణ్యాలను సామాజిక సమస్యల పరిష్కారాలకు వినియోగించేందుకు ఒక అవకాశం దొరికింది. ఆ హస్తకళాకారులు తయారుచేసే వస్తువుల విలువగొలుసు లో వీలైనంత ఎక్కువభాగంపై ఆ కళాకారులు, ప్రజలకే నియంత్రణ ఉండేలా చేయడం ఈ ప్రాజెక్ట్ లోని మరొక ముఖ్యమైన అంశం. మారుతున్న మార్కెట్ ప్రాధాన్యతలకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తులను తయారుచేయడం, వాటికి సంబంధించిన ఉత్పత్తి మరియు మార్కెట్ అంశాలలో ఆ కళాకారులకే అధికారం ఉండేలా చూడడం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగింది. కళాకారులంతా ఎవరికి వారు వ్యక్తిగతంగా కాకుండా బృందంగా కలిసి పనిచేయడం ద్వారా ప్రాజెక్ట్ కు మరింత బలం చేకూరింది.
జవాజా బ్యాగ్:
మొదట తోళ్లతో స్కూల్ బాగ్స్, ఫ్లోర్ మాట్ లు వంటి సాధారణ, సంప్రదాయ ఉత్పత్తులతో ప్రారంభించినా చిన్నగా ఆఫీస్ లకు అవసరమైన వస్తువులు, వినూత్నమైన బ్యాగ్లు, ఖరీదైన అలంకరణ వస్తువుల వైపు ప్రాజెక్ట్ మలుపు తిరిగింది.
ఈ ప్రక్రియలో ఎదుర్కున్న సమస్యలు తక్కువేమీ కాదు. పాత నైపుణ్యాలతో, సాంకేతిక పరికరాలు, పనిముట్లతో అధునాతన ఉత్పత్తులు తయారుచేయాల్సి రావడం ఒక సమస్య అయితే వాటి నాణ్యతను నియంత్రించడం మరొక ముఖ్యమైన సమస్య.
కొత్త డిజైన్ లకు వచ్చేసరికి ముందుగా కమ్యూనిటీ లోనుండి కొంతమందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారితో మిగిలిన వారికి శిక్షణ ఇప్పించాలి అనుకున్నారు కానీ అది అంతగా విజయవంతం కాలేదు. నాణ్యత నియంత్రణకు వచ్చేసరికి, మొదటగా ఈ క్వాలిటీ కంట్రోల్ ను ఆయా సంస్థలకు చెందిన నిపుణులు నిర్వహించినా తర్వాత కాలంలో కళాకారుల బృందాలే ఆ బాధ్యత తీసుకుంటాయి అనేది ప్రాజెక్ట్ ఉద్దేశం. అది కూడా అనుకున్నంత వేగంగా సాగలేదు. కొత్త ఉత్పత్తులను రూపొందించేందుకు, వాటికి తగిన ముడి పదార్ధాలు కొనుగోలు చేసేందుకు తగిన నిధులు, వనరుల కొరత అయితే నిరంతరం ఉండేది.
ఇన్ని సమస్యల మధ్య అమలు జరిగినా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ విజయం సాధించడమే కాదు సుస్థిరంగా కొనసాగింది కూడా.
ఈ ప్రాజెక్ట్ సాధించిన విజయాలలో మొదటిది ఆర్టిసన్స్ యలయన్సు ఆఫ్ జవాజా అనే స్వయంప్రతిపత్తి గల సంస్థను, దాని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం. ప్రాజెక్ట్ కు సంబంధించిన ముడిపదార్ధాలు కొనుగోలు, బ్యాంకు వ్యవహారాలు, ఆర్ధిక లావాదేవీలు, సాంకేతిక అంశాలు, మార్కెటింగ్ విషయాలు అన్నీ ఈ సంస్థలే స్వయంగా నిర్వహించుకునేవి. ఈ సంస్థలు ఈ నాటికీ ఎంతో చురుకుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వినూత్న ఉత్పత్తులను తయారుచేస్తూ, మార్కెట్ చేస్తున్నాయి. ఈ సంస్థల ఉత్పత్తులకు సంబంధిత మార్కెట్లలో ఎంతో విలువ ఉంది.
ఇక రెండవ విజయం అభివృద్ధి రంగంపైన ఈ ప్రాజెక్ట్ చూపించిన ప్రభావం. ఈ గ్రాస్ రూట్ సంస్థ నుండి నేర్చుకున్న పాఠాల నుండే రూరల్ మానేజ్మెంట్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ ఉండాలి అనే ఆలోచనకు తద్వారా ఆనంద్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మానేజ్మెంట్ ఏర్పాటుకు బీజం పడింది. ఈ సంస్థకు రవి మతాయి తో పాటు ఐఐఎం, అహ్మదాబాద్ కు చెందిన మరొక ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ కమల చౌదరి, డాక్టర్ మిచెల్ హల్సే లు ఒక రూపాన్ని ఇచ్చారు.
పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనే విలువల ఆధారంగా ప్రజా సంస్థలను నిర్వహించడం, వారి జీవనోపాధులకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం ద్వారా జవాజా ప్రయోగం అభివృద్ధి రంగంలో ఒక నూతన ఆలోచనా దృక్పధాన్ని ప్రవేశపెట్టి ఎంతో ప్రభావవంతమైన ప్రయోగంగా నిలిచిపోయింది.
ఇటువంటి ప్రయత్నాల గురించి మరింత మంది తెలుసుకోవాలి, అర్ధం చేసుకోవాలి, చర్చ చేయాలి.
–Based on a piece by Meena