గాంధేయ వాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, ఉమెన్ వరల్డ్ బ్యాంక్ సహ-స్థాపకురాలు, గుజరాత్ విద్యాపీఠం గౌరవాధ్యక్షురాలు, గాంధీ ఆశ్రమ ట్రస్టీ, రామన్ మెగసెసే – ది రైట్ లైవ్లీహూడ్, పద్మ విభూషణ్ వంటి ఎన్నో విలక్షణ పురస్కారాల గ్రహీత. అన్నింటికీ మించి తనదైన నిరాడంబరతకు, అసాధరణ స్ఫూర్తికి చెరగని ప్రతీక. డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసేవారికి ఎంతో సుపరిచితమైన పేరు.
ఇలా తో ఒక్కసారి మాట్లాడిన ఎవరైనా ఇట్టే మంత్రముగ్ధులు అవుతారు. ఆమె వ్యక్తిత్వంలోని సరళత, ముక్కుసూటితనం, పని పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి ఇందుకు ప్రధాన కారణాలు. అసంఘటిత రంగంలోని మహిళల ఆర్థిక సాధికారతకై వారు చేసిన కృషి, పాటించిన నిబద్ధత ఆమెను ఆ దిశలో నడిచిన ఒక అనంతమైన తారగా ఎల్లపుడు నిలబెడతాయి. ఒక మృదుభాషి ఈ ప్రపంచంలో నింపిన వెలుగుకి తెచ్చిన మార్పుకి ఇంకో పేరే ఇలా.
ఇలా తో సంభాషణల సారాన్ని, వి రఘునాథన్ గారు వారి పుస్తకం “డోంట్ స్ప్రింట్ ది మారథాన్” లో చర్చించటం జరిగింది. అందులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనందరి కోసం;

‘ఇలా తన స్కూల్లో కాని, కాలేజీలో కాని మొదటి ర్యాంకు విద్యార్థి ఏమి కాదు, ఒక 10 పర్సెంటైల్ విద్యార్థుల్లో ఒకరిగా నిలిచేవారామె. కేవలం మార్కుల కోసం చదివే మార్గంలో తనను ఎవరు నడపాలనుకొలేదు కూడా. ఇలా భాషా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఆమె తండ్రి వేసవి సెలవుల్లో చదవడానికి వివిధ రకాల పుస్తకాలు ఇష్టంగా కొనిపెట్టేవారు, వాటిని తను అంతే ఆసక్తిగా చదివేవారు. తనలో విలక్షణంగా కనిపించే విలువలు-సిద్ధాంతాలకు రూపురేఖ, కేవలం తన హైలీ ప్రిన్సిపల్డ్ నాన్న నుంచే కాకుండ అప్పుడు నెలకొన్న జాతీయవాద వాతావరణం నుంచి ఆమె గ్రహించారు. బ్రిటిష్ పాలనా చెరలనుండి విముక్తి కోసం పోరాడుతూ గెలుపు కోసం వేచి చూస్తున్న హృదయాలలో గాంధీజీ బోధన, సందేశాలకి, జీవనశైలికి, పిలుపుకి స్పందిస్తున్న భారత దేశ నీడలో పెరిగారు ఇలా.
చిన్నతనంలోనే ఇలా న్యాయ-అన్యాయాల పట్ల విచక్షణ కలిగిఉండి వెనుకబడిన వారి పై జరిగే దోపిడిని సహించేది కాదు.
మహిళా ఉద్యమాల్లో తన తల్లి పోషించిన పాత్ర చిన్నారి ఇలా మనసులో బలంగా నిలిచిపొయింది. మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె నేరుగా గ్రహించారు. మహిళలు దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడుతున్నపటికీ వ్యవస్థలో ఎదుర్కొంటున్న వేతన మరియు ఎన్నో రకాల అసమానతల్ని పరిశీలిస్తూ వచ్చింది. వ్యవసాయ రంగం లో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నా వారిని రైతులుగా గుర్తించకుండా, రుణాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోటు పాట్లని గమనిస్తూ వచ్చింది.
అసమానతల పట్ల నిత్యం అవగాహన కలిగి ఉండే దృష్టికోణం దానికి బలంగా ముడిపడున్న తన వ్యక్తిత్వం, భవిష్యత్తు రెండూ తన తల్లిదండ్రుల నుంచి అలవడి ఉంటాయి. ఇలా వ్యక్తిత్వాన్ని చూసిన ఎవరికైనా తెలుసు వారు నిర్భలులకు ఒక దృఢమైన గొంతుక అని.’
ఇలా లోని వినయం, సున్నితతత్వం చూపే ఒక చిన్ని ఉదాహరణ వారు రచించిన పుస్తకం ‘వి ఆర్ పూర్, బట్ సో మెనీ లోని పరిచయ వాక్యాలలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తన వాక్యాలలో:
“స్వయం ఉపాధి పనులు చేసే పేద మహిళల జీవితాల గురించి రాసే క్రమంలో నేను ఎంతో కొంత అహంకారాన్ని ప్రదర్శించాను. నేను వారి గురించిన రాసిన విషయాలను చదవలేని మహిళల గురించి ఈ పుస్తకం రాసాను. అదే కాక నాకున్న అవగాహన చాలా పరిమితమైనది, అది నేను ఉన్న ఆర్ధిక-సామాజిక వర్గాల నుంచి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను రాసిన మహిళల కోసం పూర్తిగా మాట్లాడుతున్నానని ఎన్నటికీ చెప్పలేను, ఎందుకంటే నేను నా కోసమే మాట్లాడగలను.” స్వయం ఉపాధితో జీవనం గడిపే మహిళల కోసం తన జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను, ప్రశంసలను అందుకున్న ఇలా ఈ విధంగా మాట్లాడటం ఆమెలోని వినమ్రతకు నిదర్శనం..
ఆమె ఒక నిరంతర స్ఫూర్తి.
ఓం శాంతి.
– మీనా
Based on a piece by Meena Raghunathan