నేటి విద్యా-విధానాల గురించి సుదీర్ఘమైన ఆలోచన కొనసాగించగా, నాకు సార్ కెన్ రాబిన్సన్ గుర్తుకు వచ్చారు. వారి గురించి పరిచయం లేని వారి కోసం.
రాబిన్సన్ బాగా పేరు గడించిన సమకాలీనమైన(contemporary) విద్యాతత్వావేత్తల్లో ఒకరు. వారు బ్రిటన్ దేశంలో జన్మించారు. ఒక టీచర్, రచయిత మరియు నేటి విద్యా విధానల గురించి తనదైన శైలిలో ప్రసంగించగల ఒక గొప్ప వక్త. చిత్రంగా విద్య పట్ల దూరదృష్టిలో(vision) వీరికి మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఎన్నో దగ్గర పోలికలు కనిపిస్తాయి.
రాబిన్సన్, ప్రస్తుత విద్యావిధానాల్ని వ్యతిరేకిస్తూ. విద్య ఒక పారిశ్రామిక నమూనాగా మారిన తీరు గురించి. కేవలం సరళ రేఖకి(linearity), అనుగున్యానికి(conformity) కట్టుబడి ‘బ్యాచింగ్’ (batching) పద్ధతిలో తయారయ్యే సరుకుగా అమలవుతున్న పరిస్థితుల గురించి ఎన్నో వేదికల్లో విరివిగా చర్చించటం జరిగింది. వారి మాటల్లో: “మనల్ని మనం ఈ ఫాస్ట్ ఫుడ్ (చిరుతిండి వ్యాపారాన్ని తలపించే) విద్యా నమూనాకి ఎప్పుడో అమ్ముకున్నాము. ఫాస్ట్ ఫుడ్ (చిరుతిళ్లు) మన భౌతిక దేహాల్ని ఏ విధంగా బలహీనపరుస్తుందో అదే రీతిలో ఈ ఫాస్ట్ ఫుడ్ విద్య మన ఆత్మల్ని, శక్తిని నిర్వీర్యం చేస్తుంది” అని వ్యక్తపరిచారు.

రాబిన్ పెద్ద పాఠశాలలను పిల్లలలోని సృజనాత్మకతని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, వారి ఇష్టాలకు స్పందించకుండా కేవలం ప్రమాణీకరించబడిన పరీక్షా పద్ధతుల్ని తమదైన పద్ధతుల్లో ధ్రువీకరించి, కళలు మరియు మానవీయ శాస్త్రాలకి తావు ఇవ్వకుండ, బహిరంగంగా గణితము మరియు విజ్ఞానం దిశగా నడిపించే వ్యవస్థలుగా చూస్తారు.
అలా కాకుండా పాఠశాలల దృష్టి కేవలం పాఠ్యప్రణాళికను మెరుగుపరుచుకునే వైపే కాకుండా ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి పెంపొందించే నిపుణులుగా తయారవ్వడానికి మద్దతు ఇవ్వగలగాలని, కెన్ రాబిన్సన్ బలంగా విశ్వసిస్తారు. వ్యక్తీకరించబడిన లర్నింగ్ (personalized learning) వాతావరణం సృష్టించి చిన్న గ్రూపులుగా విద్యను అందించడం పిల్లల్లో విసుగును దూరం చేస్తుందని, అలాంటి వ్యవస్థ ఆచరణీయమైనదని, కెన్ ఖచ్చితత్వంతో చెప్తారు.
సుమారు 100 ఏళ్ళకి ముందు ఠాగూర్, మంచి ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు నిర్వచనాన్ని ఇలా రాసారు “ఒక మంచి గురువు కేవలం విద్యార్థులు సమాచారాన్ని సేకరించి సమ్మిళితం చేసుకునే దిశగా కాకుండ పిల్లల మనుసుని జాగృతి చేసి వారు పరస్పరం స్వయం అభివృద్ధి బాటలో అడుగులేసేవైపు స్పూర్థి నింపుతారు/డు” అని గుర్తుచేసారు కెన్.
రాబిన్సన్ విద్యా విధానాల్లో సృజనాత్మకతని పెంపొందించే వాతావరణాన్ని నడిపే వ్యవస్థల్ని సృష్టించే దిశగా నడవడం తన జీవిత ధ్యేయంగా మలుచుకున్నారు. అదే విషయ జ్ఞానాన్ని పంచుతూ తన దృష్టిలో సృజనాత్మకత అంటే ఎమిటో, వారి పుస్తకం ‘క్రియేటివ్ స్కూల్స్’ లో రాయడం జరిగింది.
సృజనకు, ఊహ మూలము. మన ఇంద్రియాలకు కూడ అందని దృష్టి మన మనసులకు అందించే శక్తి ఊహలకి ఉంది.
సృజన అనేది ఆ ఊహ శక్తిని తరిచి లేపడమే. దానినే అనువర్తిత కల్పన (applied imagination) అంటారు. ఆవిష్కర్ణ అంటే కొత్త ఆలోచనల్ని అమలుచేయడం. సృజన గురించి ఏన్నో అవాస్తవాలు వ్యాపించి ఉన్నాయి. అందులో కొన్ని: ప్రత్యేకమైన వారే సృజన కలిగి ఉంటారు, సృజన కేవలం కళలకి సంబంధించిందని, మూడవది సృజనని ఎవరూ నేర్పించలేరు, నాల్గవది సృజన ఒక నిరోధించలేని ‘స్వీయ-వ్యక్తీకరణ’.
నిజం ఏమిటంటే ఈ పైన చర్చించిన వాటిలో ఏ ఒక్కటీ నిజం కాదు. సృజన మన మానవ నైజంలోని ఎన్నో శక్తులనుంచి పెంపొందుతుంది. సృజన మన జీవితంలోని ప్రతీ కోణంలో భాగం: విఙానం, కళలు, గణితం, సాంకేతికం, వంటకాలు, రాజకీయాలు, వ్యాపారం, ఇలా అన్నిటిలోను. అలాగే ఎన్నో మానవ సామర్ధ్యాలలాగనే సృజనను అలవరుచుకొని, సాన పెట్టి మెరుగుపరుచుకోవచ్చు. అలా చేయడానికి నైపుణ్యాలు, జ్ఞానం, కొత్త ఆలోచనలని ఆహ్వానించి పాండిత్యాన్ని పెంచుకోవడం అవసరం.
సృజన కొత్త ఆలోచనలలో ఉంటుంది. అదనంగా లాభమున్నా కూడ సృజన ఎల్లపుడూ అందరికి నూతనంగా ఉండవలసిన పని లేదు, కాని తమ పనిలో నిమగ్నమైన వారికి అదితప్పనిసరి. ఒక సిద్ధాంతం, ఒక రూపకల్పన, ఒక కవిత అలా ఏదైనా కావచ్చు, సృజనా పాటివం మనం పని చేసే వాటిలో క్లిష్తమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉంటుంది. సృజన ఎన్నో సాధారణ దశలు దాటుతుంది. కొన్ని సార్లు మనం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిస్తాము. అది ఒక క్రియాశీల ప్రక్రియలో భాగము, కొత్త పరిచయాలు, విభాగాలు, రూపకాలు, సారూప్యాల పైన ఆధారపడి ఉంటుంది. సృజనాత్మకంగా ఉండటమంటే కేవలం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు, ఊహశక్తిని తట్టడమే కాదు. అది ఒక నిరంతర ప్రక్రియ. మెరుగుపరచడం, పరీక్షించడం, దృష్టిని కేంద్రీకరించడం అందులో అతి ముఖ్యమైన భాగాలు. ఏదైన పని నిర్వహించేటపుడు ఒరిజినల్ ఆలోచనలు ఆ పని వెళ్ళే దిశను ముందస్తుగా ఊహించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోగలగటం సృజనలో భాగమే. సృజనకు క్రమశిక్షణ, నియంత్రణ వ్యతిరేకం కాదు. చెప్పాలంటే ఏ రంగంలో అయినా సృజనకి వాస్తవ జ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యం చాలా అవసరం.
అలాంటి సృజనను పెంపొందించడం గురువులకు కత్తి మీద సాము వంటిదే. వాస్తవానికి దానికి సృజనాత్మకమైన పని చేయడానికి కావాల్సిన విషయ జ్ఞానం, లోతుపాట్లు తెలిసుండాలి. వాస్తవికంగా సృజనను నడిపేవి రెండు ముఖ్యాంశాలు, ఒకటి ఆవిష్కరణల పట్ల తీవ్ర ఆసక్తి, రెండు చేసే పని పట్ల అభిరుచి. విద్యార్థులకి నేర్చుకోవాలనే ప్రేరణ కలిగితే వారికి వారే నైపుణ్యాలు పెంచుకునే దిశగా నడుస్తారు. అలా సాగుతున్న కొద్దీ ఆ దిశలో వారి ఆశయాలు పెంపొందుతాయి అలాగే ఆ పనిలో పాండిత్యం కూడ మెరుగుచెందుతుంది. ఈ ప్రక్రియకి నిదర్శనం ఫుట్ బాల్ క్రీడ నుంచి రసాయన శాస్త్రం వరకు ఎన్నో రంగాల్లో చూడవచ్చు. మనం గుర్తించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మనిషి జీవనం ఒక యాంత్రికమైన ప్రక్రియ కాదు. ఒక జీవక్రియ. మానవ అభివృద్ధి ఫలితాలని మనం అంచనా వేయలేము. మనం చేయగలిగిందల్లా ఒక రైతులా తమ వంతు కృషిగా అందరూ మెరుగుపడగల పరిస్థితుల్ని సృష్టించడం.
ఠాగూర్ అలాంటి కలనే ఒకటి కన్నారు, అది సాకారం కావాలని కోరుకున్నారు. దాని గురించి రాస్తూ: “విధానాలలో నిమగ్నమైపోకండి. మీలోని ఇన్స్టింక్ట్స్ ని (మీలోని సహజ భావాల్ని/గట్) మీ జీవనానికి మార్గదర్శకాలు అవ్వనివ్వండి. ఏ ఇద్దరు పిల్లలూ ఒకలా ఉండరు. అది గ్రహించి సముద్రపు దిబ్బల/రీఫ్స్ మధ్యలో ఎలా పయనిస్తామో అలాగే ప్రతి పిల్లవాడిని తరిచి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి”.
మనల్ని మలచిన ప్రతీ గురువును గుర్తు చేసుకుంటూ.
-మమత