గత కొన్ని సంవత్సరాలుగా నేను మహిళలకు సంబంధించిన ఎన్నో సదస్సులలో, సభలలో మాట్లాడాను. ఎంతో మంది యువతులకు గైడ్ గా వ్యవహరించాను. నా టీం లో కూడా ఎంతోమంది ఆడవాళ్ళతో పనిచేసాను.
ఎక్కడ ఏ స్త్రీతో మాట్లాడినా నేను ఇచ్చే సందేశం ఒకటే “మంచి అమ్మాయిగా ఉండాల్సిన పనిలేదు” అని. ఇలా చెప్పడం వెనుక నా ఉద్దేశం ఏమిటంటే: నీ కుటుంబం, నీ సమాజం నువ్వు ఉండాలని అనుకుంటుందో దానికి పరిమితమవ్వాల్సిన పనిలేదు; ఈ పని నీది అని ఎవరో నీ నెత్తిమీద రుద్దినంతమాత్రాన ఆ పనిని నువ్వు చేయనవసరం లేదు; అందరిపట్లా విధేయత చూపించాల్సిన అవసరం లేదు; నీకు ఏది సరైనది అని తోస్తే, ఏది నీకు మంచిది అని బలంగా అనిపిస్తే దాని కోసం పోరాడు, అవిధేయత చూపించు, ప్రశ్నించు.
అయితే ఈ విషయాన్ని నేను సరిగా వారికి అర్ధమయ్యేలా చెప్పలేకపోయాను. చాలా సందర్భాలలో ఇది ఎలా అర్ధమయ్యేదంటే నేనేదో అమ్మాయిలను చెడగొడుతున్నట్లు, ప్రతిదానికీ తిరగబడమని వారికి చెబుతున్నట్లు ఉండేది. బహుశా నేను ఇలా చెప్పకూడదేమో అని ఆలోచించడం మొదలుపెట్టాను.
అయితే “గుడ్ గర్ల్ సిండ్రోమ్” అనే పదం ఎక్కడో నా కంటపడేవరకూ ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాను. దీని గురించి మరింత లోతుగా చదవడం మొదలుపెట్టాకే ఇదేదో ఒక పదం మాత్రమే కాదనీ, ఒక పరిశోధన చేయడానికి తగిన అతిపెద్ద సబ్జెక్టు అనీ అర్ధమయ్యింది.
2011 లో బెవర్లీ ఎంగెల్స్ రాసిన “ది నైస్ గర్ల్ సిండ్రోమ్” అనే పుస్తకం ఈ పదాన్ని సరిగ్గా వివరించగలుగుతుంది. దీని అర్ధం ఏమిటో నా మాటల్లో చెప్పేబదులు ఎంగెల్స్ ఏమి చెప్పిందో చెబుతాను.
“ఒక మంచి అమ్మాయి తన గురించి తాను ఏమనుకుంటుంది అనే దానికన్నా ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారు అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. తన స్వంత భావోద్వేగాల కన్నా ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇస్తుంది”
“మంచి అమ్మాయిలు చెప్పిన మాట వింటారు. వారికి ఏది చేయమని చెబితే అది చేస్తారు. ఎవరితో అయినా వాదన పెట్టుకునే బదులు వారు చెప్పిందేదో చేసేస్తే పోతుంది అనుకుంటారు. విధి ఎలా ఉంటే అలా జరగనీ అనుకుంటారు. వారు నమ్మిన వాటికోసం గట్టిగా నిలబడేందుకు కూడా భయపడతారు. ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచాలి అనుకుంటారు. వారి మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేందుకు కూడా భయపడతారు. దానితో మంచి అమ్మాయిలు ఎంతో నటించాల్సి వస్తుంది”
- బెవర్లీ ఎంగెల్స్ 2011 లో రాసిన నైస్ గర్ల్ సిండ్రోమ్ పుస్తకం నుండి
ఈ మంచి అమ్మాయిల లక్షణాలు ఇలా ఉంటాయి: ఇతరులు తాము ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి భిన్నంగా ఉండాలంటే భయం, తమ మనసులో ఉన్నది చెబితే ఇతరులు ఎక్కడ బాధపడతారో అనే భయం; అన్నిటిలో రాణించాలనే కోరిక; ఘర్షణలకు దూరంగా ఉండడం; నియమాలన్నిటినీ ప్రశ్నించకుండా పాటించడం. వారికి ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినా తిరస్కరించేందుకు భయపడతారు.

ఇది నిజమో కాదో ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ విధంగా మంచి అమ్మాయిలం అనిపించుకోవాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది అనిపిస్తుంది. అరవైలలో పుట్టిన నాలాంటి మహిళలం మా వస్త్రాలు, కేశాలంకరణ విషయాలలో మా తల్లులతో దాదాపు యుద్ధాలు చేసాం; ప్రొఫెషనల్ చదువులు చదివి ఉద్యోగాలు చేసేందుకు గొంతులు పోయేలా పోట్లాడాం; ఎవరిని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే విషయాలపై కూడా యుద్ధాలే చేసాం; వైవాహిక బంధంలోనూ గౌరవాన్ని పొందేందుకు తగాదాలు పెట్టుకున్నాం. ఇవన్నీ మమ్మల్ని బలంగా మార్చాయి. అలా బలాన్ని సంపాదించుకుంటూనే మా దారులను మేము మలుచుకున్నాం.
అయితే మేము కూడా మాకన్నా ముందు తరం మహిళలు చూపించిన స్ఫూర్తినే అందిపుచ్చుకున్నాం. వారే అసలైన మార్గదర్శకులు. మొట్టమొదటి తరపు ఇంజినీర్లు, మొదటి డాక్టర్లు, పరదాలు దాటి మొదటి సారి బయటకి వచ్చిన మహిళలు, ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు, కుటుంబంతో, సమాజంతో పోరాడి మరీ తమ స్వంత దారులు ఏర్పాటు చేసుకున్న ఆ నలభైలు,యాభైలలో పుట్టిన మా ముందు తరపు మహిళలు ఇచ్చిన స్ఫూర్తి ఇంతా అంతా కాదు. వారి ధైర్యసాహసాలతో పోలిస్తే మాకు సగం కూడా లేవు. అయినా వారు చూపించిన బాటలోనే ముందుకు సాగాము.
ఈ రోజున ఇవన్నీ అత్యంత సాధారణమైన విషయాలు కావచ్చు. ఈనాటి అమ్మాయిలు వీటికోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. మాలాగా వారికోసం వారు దృఢంగా నిలబడాల్సిన సందర్భాలు లేకపోవచ్చు. అందుకే సమాజం వారికి చూపించిన దారిలో నడవడమే తప్ప వారికంటూ కొత్త దారులు ఏర్పాటు చేసుకోవాలి అనుకునే స్ఫూర్తి ఈ తరం అమ్మాయిలలో కొరవడింది అనిపిస్తుంది. అప్పట్లో మేము కొత్త దారులలో నడిచినందుకు చెడ్డవారిమి అనిపించుకున్నాం. అయితే ఈ రోజు ఆ దారిలో నడవమనే సమాజం సూచిస్తుంది. ఆ దారులలో నడిచిన వారినే మంచివారు అంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కొత్త తరపు అమ్మాయిలు కూడా కొత్త దారులు కనుగొనాలనీ, నూతన శిఖరాలు అందుకోవాలనీ నా ఆకాంక్ష.
బహుశా ప్రతి తరం ఇలా తమ తరవాతి తరం వారిని విమర్శించడం అనేది అత్యంత పురాతనమైన విషయం కావచ్చు. అయినప్పటికీ ఇదే నా ఆకాంక్ష
–Translated by Bharathi Kode, based on a piece by Meena Raghunathan