జాతీయ జెండా రూపకర్త “పింగళి వెంకయ్య”: Flagman Pingala Venkiah

ఒక యువకుడు తన దేశానికి ఎంతో దూరంగా ఉన్న విదేశీ గడ్డపై ఎవరికో సంబంధించిన యుద్ధంలో పాలుపంచుకుంటూ పోరాటం చేస్తున్నాడు. అతని పేరు పింగళి వెంకయ్య. 19 వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో సైనికుడిగా దక్షిణ ఆఫ్రికాలో జరుగుతున్న ఆంగ్లో బోయర్ యుద్ధంలో పనిచేశారు వెంకయ్య. అదే సమయంలో మరొక యువకుడు అదే దక్షిణాఫ్రికాలో సత్యం, న్యాయం, స్వేచ్చ గురించి కలలు కంటూ ఎన్నో ప్రయోగాలు ప్రారంభించాడు. అతనే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.

1899 లో బోయర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు గాంధీ మనసు నిజానికి స్థానిక బోయర్ల వైపే ఉన్నప్పటికీ నాటల్ బ్రిటిష్ క్రౌన్ కాలనీ సభ్యునిగా తాను బ్రిటిష్ వారికే మద్దతు తెలపవలసిన అవసరం ఏర్పడింది. దాదాపు 1100 మంది స్వచ్చంద సేవకులతో గాంధీ ఒక సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే తమపై ఆధిపత్యం చెలాయిస్తూ తమను అణగదొక్కుతూ ఉన్నారో వారికే సేవలందించేలా ఆ సేవా దళ సభ్యులలో గాంధీ స్ఫూర్తి నింపగలిగారు. యుద్ధక్షేత్రంలో గాయపడిన సైనికులను సురక్షిత ప్రాంతాలకు మోసుకువెళ్తూ ఈ దళ సభ్యులు ఎంతో సహాయం చేశారు.

దాదాపు ఇదే సమయంలో అప్పటికి 19 సంవత్సరాల వయసులో ఉన్న వెంకయ్య గాంధీని కలిశారు. ఆయన నిరాడంబరత, సంభాషణలలో చూపించే ఆత్మవిశ్వాసం పింగళిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ బంధం దాదాపు అర్ధ శతాబ్దం పాటు కొనసాగింది.

Source: en.wikipedia.org

ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత పరాయి పాలన నుండి విముక్తి సాధించాలన్న గాంధీ స్పూర్తితో కొన్ని పోరాట సంస్థలలో చేరి ఏలూరు లో నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలో వ్యవసాయం పట్ల ఆకర్షితులై పత్తి పండించడం ప్రారంభించారు. ప్రత్తి సాగులో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు వెంకయ్య. అమెరికా నుండి కంబోడియన్ రకం పత్తి విత్తనాలను తెప్పించి వాటిని మన దేశపు విత్తనాలతో కలిపి వినూత్నమైన హైబ్రిడ్ పత్తి రకాన్ని రూపొందించారు. దగ్గరలో ఉన్న చెల్లపల్లి గ్రామంలో కొంత భూమిని తీసుకుని ఈ విత్తనాలతో అక్కడ సాగుచేయడం మొదలుపెట్టారు. ఈ వినూత్న పత్తి రకం 1909 లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో ఎంతో మంది బ్రిటిష్ అధికారులను ఆకర్షించింది. రాయల్ అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ లండన్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్ని అందించింది. అప్పటి నుండి స్థానికంగా ఆయనను ‘పత్తి వెంకయ్య’ అని పిలవడం ప్రారంభించారు.

వ్యవసాయంతో పాటు వెంకయ్య చదువు మీద కూడా దృష్టిపెట్టారు. కొత్త భాషలు నేర్చుకోవాలి అనుకున్నారు. ఈ ఆసక్తి వలెనే ఆయనే లాహోర్ లోని ఆంగ్లో వేదిక్ స్కూల్ కు వెళ్ళి సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు. ఈ భాషలన్నింటిలోనూ ప్రావీణ్యం సాధించారు. 1913 లో ఆయన జపనీస్ భాషలో చేసిన ఒక సుదీర్ఘ ప్రసంగం ఆయనకు ‘జపాన్ వెంకయ్య’ అనే పేరును తెచ్చిపెట్టింది.

తర్వాత కాలంలో పింగళి రైల్వే సర్వీసెస్ లో గార్డుగా చేరారు. బెంగుళూరు, బళ్ళారి లలో ఆయన పోస్టింగ్. ఆ సమయంలో మద్రాస్ ప్రాంతమంతా ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది. ఆ వ్యాధికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు దుస్థితిని చూసిన ఆయన తన ఉద్యోగాన్ని వదిలి ప్లేగు వ్యాధి నిర్మూలనా సంస్థ తరపున ఇన్స్పెక్టర్ గా కొంతకాలం పనిచేశారు.

ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన అనేక సదస్సులకు హాజరయ్యారు. 1906 లో కలకత్తాలో సదస్సుకు హాజరయ్యినప్పుడు ఇంగ్లీష్ యూనియన్ జెండాను ఎగురవేయడం చూసిన ఆయన ఎంతో బాధపడ్డారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక మన దేశానికి ఒక జాతీయ జెండా ఉండాలనే కొత్త ఆలోచన ఆయనలో తలెత్తింది. అనేక దేశాల జెండాలను పరిశీలించడంతో తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. 1916 లో “A National Flag for India” పేరుతో ప్రచురించిన పుస్తకంలో ముఫై రకాల జెండా నమూనాలను ప్రదర్శించారు. 1916 నుండి 1921 వరకు జరిగిన ప్రతి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులోనూ వెంకయ్య జెండాకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తేవారు. ఈ ఆలోచనను ఎంతగానో సమర్ధించిన గాంధీ మన జెండా జాతికి స్ఫూర్తినిచ్చేదిగా, అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించేదిగా ఉండాలని సూచించారు.

1921 లో విజయవాడలో జరిగిన సదస్సులో వెంకయ్య జాతీయ జెండాల నమూనాలతో ఉన్న తన పుస్తకాన్ని గాంధీకి చూపించారు. ఆయన కృషిని, పట్టుదలను గాంధీ ఎంతగానో ప్రశంసించారు. మన జాతీయ జెండా పేరుతో యంగ్ ఇండియా లో రాసిన ఒక వ్యాసంలో గాంధీ ఇలా అన్నారు. “మన జెండా కోసం మనం త్యాగాలకు సంసిద్ధంగా ఉండాలి. మచిలీపట్టణం లోని ఆంధ్ర నేషనల్ కాలేజీ లో పని చేస్తున్న పింగళి వెంకయ్య జెండా కోసం ఎంతో కృషి చేసి అనేక నమూనాలతో ఒక పుస్తకాన్ని రూపొందించారు. జాతీయ జెండాకు ఆమోదం కోసం భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులలో వెంకయ్య చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఎరుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యన అశోక చక్రం గుర్తుతో ఒక జెండాను రూపొందించమని వెంకయ్యను అడిగితే కేవలం మూడు గంటల్లో దానిని తయారు చేశారు. తర్వాత కాలంలో సత్యం, అహింసలకు చిహ్నమైన తెలుపు రంగు కూడా జెండాలో ఉంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము.”

ఆ స్పూర్తితో వెంకయ్య రాత్రిoబగళ్ళు శ్రమించి మరొక జెండా రూపొందించారు. అప్పుడు వెంకయ్య రూపొందించిన ఆ జెండానే తర్వాత మన త్రివర్ణ పతాక రూపకల్పనకు బ్లూ ప్రింట్ గా మారింది. దానితో అప్పటి నుండి ఆయనకు “జెండా వెంకయ్య” అనే మరో కొత్త పేరు వచ్చింది.

1931 లో చిన్న మార్పులతో భారత జాతీయ కాంగ్రెస్ వెంకయ్య రూపొందించిన జెండాను ఆమోదించింది. ఆయన కల సాకారమయ్యింది. 1947 ఆగష్టు 15 న దేశానికి స్వతంత్రం రాగానే బ్రిటిష్ యూనియన్ జెండా కిందికి దిగుతుండగా మన త్రివర్ణ పతాకం సగర్వంగా పైకి ఎగిరింది.

1947 తర్వాత వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల నుండి విరమించుకుని నెల్లూరు లో స్థిరపడ్డారు. ఆ సమయంలో ఆయనకు జియాలజి పై ఆసక్తి పెరిగింది. ఆ ప్రాంతంలో దొరికే విలువైన రంగురాళ్ల పట్ల ఎంతో పరిజ్ఞానం సంపాదించారు. ఆ తర్వాత జెమోలోజీ పై దృష్టి పెట్టారు. ఆ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి, పరిశోధనా వ్యాసాలు ప్రచురించి, ప్రభుత్వానికి క్షేత్ర స్థాయి పరిశోధనల విషయంలో సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. ఇక అప్పటి నుండి ఆయనకు “డైమండ్ వెంకయ్య” అనే మరొక పేరు స్థిరపడింది.

ఎన్నో ప్రత్యేక ప్రతిభా సామర్ధ్యాలు కలిగినా ఎంతో నిరాడంబరంగా జీవించిన అరుదైన వ్యక్తి పింగళి వెంకయ్య. తన చివరి రోజులను ఎంతో పేదరికంలో గడిపారు. కొత్తగా స్వతంత్రాన్ని సాధించిన ఒక దేశం తన శక్తిని, స్థాయిని తెలియచేస్తూ గర్వంతో తన జెండాను ఎగురవేస్తుండగా దాని గురించి కలలు కని, రూపకల్పన చేసిన వ్యక్తిని మాత్రం దేశం చాలా వరకు మర్చిపోయింది.

తన జీవితంలో తాను సాధించిన వాటిలో జెండా రూపకల్పనకు అత్యంత ఉన్నతమైనదిగా వెంకయ్య భావించేవారు. తాను మరణించాక తన శరీరంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి చితిపై ఉంచే ముందు మాత్రం దానిని తొలగించి ఏదైనా చెట్టు కొమ్మకు తగిలించమని ఆయన కోరుకున్నారట. 1963 జులై 4 న ఆయన మరణం తర్వాత ఆయన కోరుకున్నట్లుగానే జాతీయ జెండాను ఆయన శరీరంపై ఉంచారు.

ఈ నెల మొదటిలో మన యువ ఒలింపియన్ క్రీడాకారులు విదేశీ గడ్డపై మన జెండాను ఎగరవేస్తుంటే మనం వేడుక చేసుకున్నాం. ఈ వారాంతంలో అందరం జెండాకు సగర్వంగా తలెత్తి వందనం చేయబోతున్నాం. మనకు ఇటువంటి గర్వించదగిన క్షణాలను ఇచ్చిన మన పెద్దలందరినీ గుర్తు చేసుకునేందుకు, వారికి మన కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు కూడా ఇదే సరైన సమయం.

–From a piece by Mamata

మిరప ఘాటు – Its getting hot, hot, hot

ఆ మధ్య జరిగిన ఒక వ్యవసాయ మేళా కి వెళ్ళినప్పుడు నాస్నేహితురాలు ఈ ఫోటో తీసింది. మరొక స్నేహితురాలు ఈశాన్యరాష్ట్రాలలో ట్రెక్కింగ్ కి వెళ్లి అక్కడి నుండి నాకోసం ఎంతో కారంఉండే మిరపకాయలు తెచ్చింది. వాటి ఫోటోలు మీతో పంచుకుంటూకాసేపు మిరపకాయల గురించి కూడా మీతో చర్చిద్దామని ఈ బ్లాగ్. 

సోలానాసీఏ కుటుంబానికి చెందిన జెనస్ క్యాప్సికమ్ పండ్ల జాతికిచెందినదే ఈ మిరప. క్యాప్సికమ్ అనే పదం గ్రీకు భాషలోని కాప్సిమోఅనే పదం నుండి వచ్చింది. కొరికి తినడం అని దాని అర్ధం. దీనిమూలాలు దక్షిణ అమెరికాలోని పెరు ప్రాంతంలో ఉన్నాయి అనిఅంటారు. దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమేమిరపకాయలను అక్కడ సాగు చేసేవారు.

1493 లో క్రిస్టోఫర్కొలంబస్ మిరప విత్తనాలను దక్షిణ అమెరికా నుండి స్పెయిన్ కుతీసుకుని వచ్చాడు. అక్కడి నుండి మిరప ఇక ప్రపంచమంతాప్రయాణం చేసింది. 15 వ శతాబ్దం చివరలోనో, 16 వ శతాబ్దంమొదటిలోనే పోర్చుగీసు వారు మిరపను దక్షిణ ఆసియాకుపరిచయం చేశారు. ఇప్పుడు మిరపకాయలో, వాటితో చేసిన కారమోలేకుండా మన వంటలను ఊహించగలమా

మిరపకాయల గురించి మాట్లాడుకునేటప్పుడు వాటి ఘాటునుగురించి మాటలాడుకోవడం సహజం. అయితే ఈ ఘాటును ఎలాకొలుస్తారు. మిరపకాయలలో, ఇతర మసాలా పదార్ధాలలో ఉండేఘాటును కొలిచేందుకు స్కోవిల్లే స్కేల్ అనే దానిని ఉపయోగిస్తారు. స్కోవిల్లే హీట్ యూనిట్స్ (SHU) లలో ఘాటును కొలుస్తారు. మిరపకాయలు, ఇతర మసాలా పదార్ధాలలో ఘాటు రావడానికికారణమైన క్యాప్సిసిన్ అనే ఆల్కలాయిడ్ శాతాన్ని బట్టి ఈ కొలతఉంటుంది. అమెరికాకు చెందిన ఫార్మసిస్ట్ విల్బర్ స్కోవిల్లే 1912 లోస్కోవిల్లే ఆర్గానోలెప్టిక్ టెస్ట్ పేరుతో ఆహార పదార్ధాల ఘాటునుకొలవడం ప్రారంభించారు. ఆయన రూపొందించిన స్కేల్ నుఆయన పేరుతోనే స్కోవిల్లే స్కేల్ అని పిలవడం జరుగుతుంది. మొదట్లో మనుషులు ఆహారపదార్ధాన్ని రుచి చూసి రేటింగ్ ఇవ్వడంద్వారా ఈ SHU రేటింగ్ ను నిర్ణయించేవారు. అయితే ఆ పద్ధతిలోరేటింగ్ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే SHU నునిర్ధారించడానికి లిక్విడ్ క్రోమాటోగ్రఫీ పద్ధతిని వాడుతున్నారు.

ప్రపంచం మొత్తంలో అన్నిటికన్నా ఘాటు ఎక్కువగా ఉండేమిరపకాయలు ట్రినిడాడ్, టొబాగో లో పండుతాయి. ట్రినిడాడ్మొరుగా స్కార్పియన్ అని పిలవబడే ఈ మిరపకు దాదాపు2009231 SHU ల ఘాటు ఉంటుంది. 

మనదేశంలో నాగాలాండ్ లో పాండే భూత్ జోలోకియా జాతిమిరపకాయలు అన్నిటికన్నా ఘాటైనవి. ప్రపంచం మొత్తంలో చూస్తేఘాటు విషయంలో ఇవి నాలుగవ స్థానంలో ఉన్నాయి. వీటి SHU  దాదాపు 1041427 గా ఉంది.

భారతదేశంలో పండే మరికొన్ని మిరప జాతుల వివరాలు చూద్దాం: 

కాశ్మీరీ మిరప: ఘాటు కన్నా రంగు బాగుంటుంది

గుంటూరు మిరప: గుంటూరు సన్నం S4 అని పిలవబడే ఈ మిరపవలెనే ఆంధ్రా వంటలకు ఆ ప్రత్యేకమైన ఘాటు, రుచి ఉంటుంది

బర్డ్స్ ఐ మిరప: దీనినే థాయ్ మిరప అని కూడా అంటారు. మనదేశంలో ఈశాన్య ప్రాంతంలో పండుతుంది. ఎంతో ఘాటుగా, ప్రత్యేకమైన రుచితో ఉంటుంది

కంథారి మిరప: కేరళలో పండే ఈ మిరప ఎండే కొద్దీ తెలుపురంగులోకి మారుతుంది. 

ముండు మిరప: తమిళనాడు, ఆంధ్ర లలో పండించే ఈ మిరపచిన్నగా, గుండ్రంగా ఉండి పలుచని పొరతో ఉంటుంది. ఇవి అంతఘాటుగా ఉండవు కానీ ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. 

జ్వాలా మిరప: ప్రధానంగా గుజరాత్ లో పండుతుంది

బ్యాదాగి మిరప: కర్ణాటకలో పండే ఈ మిరప పొడవుగా, పలుచగాఉంటుంది. ఎండిన తర్వాత వంకరగా ఉంటుంది. 

ఈ సారి ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు మీరేదోవంటల గురించి బాగా తెలిసిన వారిలా కనిపించాలనుకుంటే మీకువడ్డించిన పదార్థంలో SHU స్థాయి ఎంత అని అడిగిచూడండి.

—Based on a piece by m

ఒక నంది – కొన్ని వేరుశనగలు (Peanuts for Bulls)

దొడ్డ బసవన్న గుడి బెంగుళూరు లో ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయం. దక్షిణ బెంగుళూరు లోని బసంవన్ గుడి ప్రాంతంలోని బుల్ టెంపుల్ రోడ్డు లో ఉంది ఈ గుడి. 1537 లో బెంగుళూరు నగరాన్ని నిర్మించిన కెంపెగౌడ ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. 4. 6 మీటర్ల ఎత్తు, 6. 1 మీటర్ల పొడవు ఉన్న నిలువెత్తు ఏకశిలా నంది విగ్రహం అక్కడ కొలువై ఉంది. బహుశా ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం కావచ్చు.

గుడి గురించి మాట్లాడుతూ ఈ వేరుశనగలు ఏమిటి అనుకుంటున్నారా? నిజానికి ఎన్నో శతాబ్దాలుగా ఇది ప్రధానంగా వేరుశనగలు పండించే ప్రాంతం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా వేరుశనగ పంట చేతికి వచ్చే సమయానికి ఒక ఎద్దు చేలల్లో పడి పంటను నాశనం చేస్తుండేది. రానూ రానూ రైతులకు ఇది అతి పెద్ద సమస్యగా పరిణమించింది. దానితో ఈ ఎద్దు ఆగడాలు ఆగినట్లైతే నందికి గుడికి కట్టిస్తామని రైతులంతా మొక్కుకున్నారు. ఏదో అద్భుతం జరిగినట్లు, ఆ ఏడాది నుండి ఎద్దు చేలల్లోకి రావడం ఆగిపోయింది.

అయితే గుడి దగ్గర రాసి ఉన్న ఒక శాసనంలో మరొక కథ ఉంది. ఆ కథ ప్రకారం. ఎద్దు చేలల్లో పడినప్పుడు ఒక రైతు కోపంతో ఒక రాయి తీసుకుని దానిని కొట్టాడని, అనుకోకుండా అది తగలడంతో విస్తుపోయిన ఎద్దు అకస్మాత్తుగా పరుగు ఆపి కూర్చుని రాయిలా మారిపోయినదని రాసి ఉంటుంది. ఆ తర్వాత అది పెరుగుతూనే ఉంది. దానితో భయపడిన రైతులు శివుడిని ప్రార్ధించారు. ఆ ఎద్దు పాదాల వద్ద దొరికిన త్రిసూలాన్ని దాని తలపై ఉంచగానే ఆ విగ్రహం ఎదగడం ఆగిపోయింది. తర్వాత రైతులంతా కలిసి అక్కడ ఒక చిన్న గుడిని నిర్మించారని, కెంపెగౌడ దానిని మరింత అభివృద్ధి చేసాడని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.

ఆ ఎద్దు కు కృతజ్ఞతగా దానికి ఇష్టమైన వేరుశనగలతో ఆ గుడి ప్రాంతంలో రైతులు ప్రతి ఏటా వేరుశనగల జాతరను జరుపుతారు. కార్తీక మాసంలో చివరి సోమవారం నాడు జరిపే ఈ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మొదట్లో బెంగుళూరు చుట్టుపక్కల ప్రాంతాల రైతులే నేరుగా తమ పంటను తెచ్చి ఈ జాతరలో అమ్ముతుండేవారు. కానీ ఇటీవల కాలంలో ఇక్కడంతా దళారులే అమ్మకాలు చేస్తున్నారు. ఏడాదికి సరిపడా వేరుశనగలు కొనుక్కుని దాచుకోవడమే కాదు, వేరుశనగలతో చేసిన ఎన్నో రకాల చిరుతిండ్లు కూడా ఈ జాతరలో దొరుకుతాయి. ఉడకబెట్టినవి, వేయించినవి, మసాలా అద్దినవి ఇలా ఎన్నో రకాలలో చిరుతిండ్లు లభిస్తాయి.

రుచికరంగా ఉంటుందనే కాక శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను అందించే ఒక ముఖ్యమైన ఆహారంగా వేరుశనగను చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రధానంగా పండించే చమురుపంటలలో అతి ముఖ్యమైనది కూడా. వేరుశనగ ఆకులు పశువుల దాణాగా కూడా ఉపయోగిస్తారు. చిక్కుడుజాతికి చెందిన పంట కావడంతో భూమికి కూడా కావాల్సినంత నత్రజనిని అందించి భూసారం పెంచేందుకు తోడ్పడుతుంది. దేశంలో దాదాపు 85 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో వేరుశనగ సాగు జరుగుతుంది. దాదాపు 7200 వేల టన్నుల వేరుశనగ ఏటా దేశంలో ఉత్పత్తి అవుతుంది.

కోవిద్ నిబంధనల వలన గత సంవత్సరం ఈ వేరుశనగల జాతర జరగలేదు. ఈ ఏడాది అయినా జరుగుతుందేమో వేచి చూడాలి. ఈ సారి ఎప్పుడైనా కార్తీక మాసం సమయంలో బెంగుళూరు వెళితే ఈ జాతరను మిస్ కాకండి. 

–Based on a piece by Meena

ఏమి కావాలనుకుంటున్నారు?: What Shall I Be?

గ్రామీణ ప్రాంతాల నుండి, చిన్న చిన్న పట్టణాల నుండి వచ్చిన యువతతో మేము పని చేసేటప్పుడు మేము తరచుగా వాళ్ళని మీరు ఏమి కావాలనుకుంటున్నారు అని అడిగేవాళ్ళం. సాధారణంగా వాళ్ళు ఇంజనీర్ అనో, టీచర్ అనో, పోలీస్ అనో చెప్పేవాళ్ళు. వారి రోజు వారీ జీవితాలలో వారికి పరిచయం ఉన్న వృత్తుల గురించే వారు కలలు కనగలుగుతారు. అంతకన్నా భిన్నంగా ఆలోచించే అవకాశం కానీ, పరిజ్ఞానం కానీ వారికి లేదు. వారికి రకరకాల వృత్తులను, కెరీర్ అవకాశాలను పరిచయం చేసినట్లయితే వారి ఆలోచనా పరిధి, ఆకాంక్షల విస్తృతి పెరిగే అవకాశం ఉంది అని మాకు అనిపించింది. అది వాస్తవం కూడా. ఫోరెన్సిక్ సైన్స్ నుండి డేటా సైన్స్ వరకు, యోగా శిక్షణ నుండి వండ్రంగం పని వరకు, ఆప్టిషియన్ నుండి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ వరకు – పిల్లలకు తెలియాలే కానీ వారి కలలు, కోరికలు అన్నీ భిన్నంగానే ఉంటాయి.

అయితే ఈ కింద చెప్పిన కొన్ని కెరీర్ లను కూడా యువతకి పరిచయం చేయవచ్చు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. బహుశా వీటికి మరింత భవిష్యత్తు ఉందేమో. ఇవి వారికి మరింత ఆసక్తికరంగా ఉంటాయేమో.

ఈ కరోనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏరోబయాలజీ చదవడం వలన యువతకి మంచి అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది. ఏరోబయాలజిస్ట్ లు అంటే బాక్టీరియల్ వైరస్ లు, ఫంగల్ స్పోర్లు, పోలెన్ గ్రైన్లు వంటి  గాలి ద్వారా వ్యాపించే ఆర్గానిక్  కణజాలాలను అధ్యయనం చేసే ఏరోబయాలజీ లో పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలు. ప్లేగ్ వంటి వ్యాధులను అధ్యయనం చేసే లిమోమోలోజి, శుభ్రతను ఒక శాస్త్రంగా అధ్యయనం చేసే హైజియోలజీ కూడా మంచి భవిష్యత్తు ఉన్న రంగాలు.

ప్రకృతి, జీవ జంతుజాలాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు కాలియోలజీ ని చదవచ్చు. ఇది పక్షుల గూళ్ళను అధ్యయనం చేసే శాస్త్రం. కాలియో అంటే గ్రీకు భాషలో చెక్క గూడు, గుడిసె, గూడు అని అర్ధం. నిడోలోజి అన్నా కూడా ఇదే అర్ధం. చీమలను అధ్యయనం చేసే మైర్మకాలజీ మరొక శాస్త్రం. పాములను అధ్యయనం చేసే ఓఫియోలజీ కూడా యువతకు ఉన్న మరొక అవకాశం.

గార్బియాలజిస్ట్ లకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇది చెత్తను అధ్యయనం చేసే శాస్త్రం. ఇళ్ల నుండి, పరిశ్రమలనుండి విడుదలయ్యే వ్యర్ధాలను ఏ విధంగా డిస్పోజ్ చేయవచ్చో దీని ద్వారా నేర్చుకోవచ్చు. మన వాతావరణ అంచనాలు ఎంత అవాస్తవికంగా ఉంటాయో మనకు తెలుసు. బహుశా యువతలో కొంతమంది గాలిని అధ్యయనం చేసే అనెమోలోజి ని కెరీర్ గా మలుచుకోవచ్చేమో. ఉరుములను అధ్యయనం చేసే బ్రోన్టాలజి మరొకటి. ఆహార శాస్త్రమైన బ్రోమాటోలోజి కి కూడా మంచి భవిష్యత్తు ఉంది. యువత కొంతమంది బ్రోమోటోలాజిస్టు లుగా వినూత్న ఆహార పదార్ధాలను తయారు చేయడమే కాక ఫుడ్ సేఫ్టీ మీద కూడా పని చేయొచ్చు.

మానవ కార్యకలాపాలను, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసే డెమోలోజి ని కూడా కొంత మంది యువత కెరీర్ గా మలుచుకోవచ్చు. ఫంగస్ ని అధ్యయనం చేసే మైకాలజీ, కండరాలను అధ్యయనం చేసే మయాలజీ, మేఘాలను అధ్యయనం చేసే నెఫోలోజి, మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే నెఫ్రోలోజి, వివిధ రకాల మట్టి లను అధ్యయనం చేసే పెడోలోజి, వివిధ ఉపరితలాల మధ్య ఘర్షణను అధ్యయనం చేసే ట్రైబాలాజీ, జుట్టు మరియు దానికి సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసే ట్రైకాలజీ ఇలా ఎన్నో రకాల అవకాశాలు యువత ముందు ఉన్నాయి.

ఇవే కాదు వ్యాధులను అధ్యయనం చేసే నాసాలోజి, పోషకాహారాన్ని సంబంధించిన అధ్యయనమైన ట్రోఫోలోజి, నదులను అధ్యయనం చేసే పొటమాలజీ, వివిధ రకాల పండ్లను అధ్యయనం చేసే కార్పొలోజి కూడా చదవదగిన మరికొన్ని శాస్త్రాలు.

యువత కొంచెం దృష్టి పెట్టి చూడాలే కానీ ఎన్నో కెరీర్ అవకాశాలు వారి ముందు పరుచుకుని ఉన్నాయి. 

అయితే నేను కోరుకునేది ఒక్కటే. నువ్వు ఒక సర్జన్ వి కావాలనుకోవచ్చు. లేదా ఒక వెల్డర్ వి కావాలనుకోవచ్చు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే నీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండడం అవసరం. చేస్తున్న పనిని అందరికన్నా మెరుగ్గా, క్రమశిక్షణతో, సమయపాలనతో చేయగలిగినప్పుడు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తావు.

–Based on a post by Meena

డిఆర్డిఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్) వారి వెబ్సైట్ లో డాక్టర్ డీఎస్ కొఠారి గురించి ఇలా రాసి ఉంటుంది: Dr. DS Kothari

“సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ఢిల్లీ యూనివర్సిటీ లోని సైన్స్ విభాగానికి డీన్ గా ఉన్న 48 ఏళ్ళ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి 1948 లో తొలి శాస్త్రీయ సలహాదారుగా నియమించబడ్డారు. ఇందులో భాగంగా ఆయన డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజషన్ ను స్థాపించారు. దానిలో పని చేసేందుకు ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, రసాయన శాస్త్రం, గణితం, పోషకాహారం, భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం వంటి వివిధ విభాగాలలో అనేక యూనివర్సిటీ లలో పని చేస్తున్న శాస్త్రవేత్తల నుండి కొందరిని ఈ సంస్థ కోసం ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేశారు. వీరు బాలిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, పేలుడు పదార్ధాలు, పెయింట్లు, ఆహారం, పోషణ, మానసిక దృఢత్వానికి సంబంధించిన అంశాలు, యుద్ధరంగంలో ఉండే వత్తిడి, శారీరక అలసట వంటి అనేక అంశాలలో పరిశోధనలు నిర్వహించేవారు. రక్షణ సమస్యల పరిష్కారంలో శాస్త్రవేత్తల పాత్ర ఎంత కీలకమైందో ఆయన నిరూపించారు. ఏ పరిధులు లేకుండా నేర్చుకునేందుకు అవకాశం ఉండి, పెద్ద, చిన్న తేడాలు లేని, సిబ్బంది అందరి మధ్యలో మంచి అనుబంధం ఉండే సంస్థగా దానిని మలచాలనేది డాక్టర్ కొఠారి లక్ష్యం. ఆయన తొలిగా స్థాపించిన సైన్స్ లేబొరేటరీ నే ఈ రోజు డిఆర్డిఓ అనే అత్యున్నత సంస్థ ఏర్పాటుకు పునాది.

ఎవరి వృత్తి జీవితంలో అయినా తొలి బాస్ ప్రభావం ఎంతో ఉంటుంది. వారి నాయకత్వ నైపుణ్యాలు, వృత్తి నియమాలు వారి కింద పని చేసే సిబ్బంది కెరీర్ లో కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకి అయితే మంచి బాస్ దొరికితే వారే దేవుడి లాగా కనపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. 

మా నాన్నకు డాక్టర్ కొఠారి మొదటి బాస్. ఆయన సాక్షాత్తు దేవుడే మా నాన్నకి.

డిఆర్డిఓ వెబ్సైటు లో డాక్టర్ కొఠారి గురించి రాసి ఉన్నదానికి మా నాన్న ఆయన గురించి నాతో చెప్పిన దానికి కొంచెం కూడా తేడా లేదు. 

డిఆర్డిఓ అధికారంగా ఏర్పడింది 1958 లో. అయితే దానికి ముందే ఎన్నో రక్షణకి సంబంధించిన ల్యాబ్ లు ఉండేవి. 1953 లో డిఫెన్స్ సైన్స్ ల్యాబ్ లో ఒక జూనియర్ స్థాయి ఉద్యోగానికి మా నాన్న దరఖాస్తు పంపి, ఇంటర్వ్యూ కి హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూ పానెల్ లో డాక్టర్ కొఠారి నే స్వయంగా కూర్చున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖకి శాస్త్ర సలహాదారుగా ఉన్న ఆయన తన ఎన్నో ముఖ్యమైన పనులను పక్కన పెట్టి ఆ యువ శాస్త్రవేత్తలను తానే స్వయంగా ఎంపిక చేసుకోవాలని రోజుల తరబడి ఇంటర్వ్యూ లలో పాల్గొన్నారు. అప్పుడే స్వతంత్రం పొందిన దేశంలో ఒక బలమైన రక్షణ సంస్థను ఏర్పాటు చేయాలంటే దేశం నలుమూలల నుండి ప్రతిభ గల యువ శాస్త్రవేత్తలను ఎంపిక చేయడం తన ముఖ్యమైన కర్తవ్యంగా భావించారు ఆయన.

మా నాన్న, ఆయనతో పాటు చేరిన యువ శాస్త్రవేత్తలకు మొదటగా అప్పగించిన పని అత్యంత ఎత్తైన ప్రాంతాలలో పని చేస్తున్న సైనికులకు ఇచ్చే చపాతీలు ఎంత మందంగా ఉండాలో పరిశోధించడం. చపాతీ చేయడానికి ఎంత పిండి వాడాలి, ఎంత సమయం తీసుకోవాలి, కాల్చడానికి ఎంత సమయం కావాలి, ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది వంటివన్నీ వీరు అంచనా వేయాల్సి ఉంది. అన్నిటికీ మించి ఆ చపాతీలు రుచిగా ఉండాలి కూడా. రోజువారీ సమస్యల పరిష్కారంలో సైన్స్ అవసరం ఎంత ఉందో ఆ తరం శాస్త్రవేత్తలందరికీ  స్పష్టత ఉంది.  

1955 లో అప్పటి ప్రధాని నెహ్రు న్యూక్లియర్, థెర్మో న్యూక్లియర్, ఇంకా అనేక ఇతర విధ్వంసకర ఆయుధాల వినియోగంలో ఉండే పరిణామాలను అంచనా వేయాల్సిందిగా శాస్త్రవేత్తలను కోరారు. డాక్టర్ హోమీబాబా, డాక్టర్ ఖానాల్కర్ తో పాటు ఆ పరిశోధనా పత్రాన్ని వెలువరించడంలో కొఠారి ఎంతో కీలకపాత్ర పోషించారు. ఈ ప్రముఖ శాస్త్రవేత్తలకు సహకరించిన యువ రక్షణ శాస్త్రవేత్తలతో మా నాన్న కూడా ఉన్నారు.

పది నుండి పన్నెండు నెలల పాటు కొనసాగిన ఆ పరిశోధనా కాలం మా నాన్న వృత్తి జీవితంలో ఎంతో ఒత్తిడితో కూడినదైనా మరువలేని కాలం. ఆ సమయంలో ఈ అంశం మీద చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. క్లాసిఫైడ్ సమాచారం చాలా వరకు భారతదేశానికి అప్పటిలో అందుబాటులో లేదు. అయినా ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలోనే ‘ న్యూక్లియర్ ఎక్సప్లోజన్స్ అండ్ దెయిర్ ఎఫెక్ట్స్’ పేరుతో 212 పేజీల ఎంతో విలువైన సమాచారంతో కూడిన నివేదికను ఈ బృందం రూపొందించింది. ఇందులో కొఠారి గారి పాత్రే ఎంతో కీలకం. దీనికి పండిట్ నెహ్రు ముందు మాట రాశారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు పొందిన నివేదిక ఇది. అందులో కేవలం ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు మాత్రమే కాక మా నాన్న నాగరత్నం గారి వంటి యువ శాస్త్రవేత్తల పేర్లను కూడా ప్రస్తావించడం కొఠారి గారి వినమ్ర స్వభావానికి నిదర్శనం.

మా కుటుంబంలో కూడా కొఠారి గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని గురించి ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాము. ఒక ఆదివారం సాయంత్రం  నాలుగు గంటల ప్రాంతంలో మా అమ్మ నాన్న నివసిస్తున్న ఇంటి తలుపు ఎవరో తట్టినట్లు వినిపించింది. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా డాక్టర్ కొఠారి నిలబడి ఉన్నారు. ఆ పుస్తకంలోని ఏదో అంశం మీద ఆయన అత్యవసరంగా మా నాన్నతో చర్చించాల్సి ఉంది. అప్పటికి మా ఇళ్లల్లో టెలిఫోన్ సదుపాయం లేదు. ఆయన ఆఫీస్ లో మా నాన్న ఉంటున్న ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకుని నేరుగా వచ్చేసారు. ఆయన స్థాయిలో వేరే ఎవరైనా ఉంటే ఎవరినైనా పంపి నాన్నని ఆఫీస్ కి పిలిపించేవారు. ఆయన అలా కాదు. తానే స్వయంగా రావడం ఆయన వారికి ఇచ్చిన గౌరవం, సమయం ఆదా కూడా.

ఆ అమ్మ తన చివరి రోజులలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేది. అప్పటికి ఆమెది చాలా చిన్న వయసు. తమిళనాడు నుండి వచ్చి చంకలో పసి బిడ్డతో ఉంది. హిందీ రాదు. ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రంగా వచ్చు. నాన్న దైవంగా భావించే మనిషి అలా అనుకోకుండా ఇంటికి రావడం ఆమెని ఎంతో కంగారు పెట్టింది. అప్పటికి మా ఇంట్లో కొన్ని గోద్రెజ్ కుర్చీలు, ఒక స్టడీ టేబుల్, ఒక మంచం మాత్రమే ఉండేవి. ఆ చిన్న ఆవాసానికి ఆయన రావడం ఆమెకి ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలిసి ఆయన కాఫీ ఇవ్వమని అడిగి ఉంటారు. అప్పటికి ఇంకా దక్షిణాది కుటుంబాలలో తేయాకులు వాడే అలవాటు అంతగా లేదు. ఆమెకి ఎలా చేయాలో కూడా తెలీదు. ఆయనకి కాఫీ ఇవ్వడానికి స్టీల్ గ్లాస్ లు తప్ప కప్పు లు కూడా లేవు ఆ ఇంట్లో.

అయితే డాక్టర్ కొఠారి కి ఇవేమీ పట్టలేదు. ఆయన వచ్చి చక్కగా ఒక గోద్రెజ్ కుర్చీ లాక్కుని అందులో కూర్చుని ఒక గంట పాటు మా నాన్నతో మాట్లాడి అన్నయకి ఆశీర్వాదాలు తెలిపి నవ్వుతూ వెళ్లిపోయారని అమ్మ చెప్పేది.

ఆయన గడిపింది కొద్ధి గంటలే కానీ మా కుటుంబంలో అన్ని తరాలకీ మా అమ్మ ఆ సంఘటన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూనే ఉండేది.

(డాక్టర్ కొఠారి లార్డ్ ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ మార్గదర్శకత్వంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని కావెండిష్ లాబరేటరీ లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పి. బ్లాకెట్ తో కలిసి పనిచేశారు. రూథర్ఫోర్డ్ ని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ గా పిలుస్తారు. వీరంతా కలిసి స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్, థియరీ ఆఫ్ వైట్ డ్వార్ఫ్ స్టార్స్ వంటి అంశాల మీద ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. డాక్టర్ కొఠారి డిఆర్డిఓ కి మాత్రమే కాదు దేశంలో ఎన్నో ప్రముఖమైన ల్యాబ్ ల స్థాపకులు కూడా. యు.జి.సి, యెన్.సి.ఈ.ఆర్.టి వంటి సంస్థల స్థాపనలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. దేశంలో తొలి విద్యా కమిషన్ చైర్మన్ గా కూడా వ్యవరించారు)

–Based on a piece by Meena

Small is Not Yet Beautiful

2017 లో జూన్ 27 వ తేదీని ప్రపంచ చిన్న, మధ్య తరహా వ్యాపారాల దినోత్సవంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేసింది. స్థానికంగా, అంతర్జాతీయంగా సుస్థిర అభివృద్ధిని సాధించడంలో ఈ రంగం యొక్క పాత్ర తక్కువేమీ కాదు. ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాకూడా ఎందువల్లనో వాటికి తగినంత ఆదరణ లభించడం లేదన్నది వాస్తవం. అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఉద్యోగాలలో మూడింట రెండు వంతులు ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమలలోనే ఉంటున్నాయి. సంఘటిత రంగంలో ప్రతి ఐదు ఉద్యోగాలలో నాలుగు ఈ రంగానివే. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇటువంటి పరిశ్రమలను ముఖ్యంగా అతి చిన్న పరిశ్రమలను మహిళలే నిర్వహిస్తున్నారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అంటే అంతర్జాతీయంగా ఒకటే నిర్వచనం లేదు. భారతదేశంలో గత సంవత్సరం చేసిన మార్పుల ప్రకారం వార్షిక టర్నోవర్ తో పాటు, ప్లాంట్, యంత్రాలు, పరికరాలు వంటి వాటిలో పెట్టిన పెట్టుబడుల ఆధారంగా ఏవి చిన్న తరహా పరిశ్రమలు, ఏవి మధ్యతరహా, ఏవి భారీ పరిశ్రమలు అనేది నిర్ధారిస్తారు.

ప్లాంట్, యంత్రాలు, పరికరాలలో పెట్టిన పెట్టుబడి కోటి రూపాయల కంటే తక్కువగా ఉండి వార్షిక టర్నోవర్ ఐదు కోట్ల కన్నా తక్కువగా ఉన్నవి అతి చిన్న పరిశ్రమలు. పెట్టుబడి ఒకటి నుండి పది కోట్ల మధ్యలో ఉండి టర్నోవర్ 50 కోట్ల కంటే తక్కువగా ఉన్నవి చిన్న తరహా పరిశ్రమలు. 10 నుండి 50 కోట్ల మధ్యలో పెట్టుబడి ఉంది వార్షిక టర్నోవర్ 250 కోట్లకు మించనివి మధ్య తరహా పరిశ్రమలు.

అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో వలెనే మన దేశంలో కూడా ఈ రంగం దేశ స్థూల జాతీయోత్పత్తికి ఎంతో దోహదపడుతుంది. దేశంలో ప్రస్తుతం 6 కోట్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉండగా అందులో 99.4 శాతం అతి చిన్న పరిశ్రమలు, 0.52 శాతం చిన్న పరిశ్రమలు, 0.007 శాతం మధ్య తరహా పరిశ్రమలుగా ఉన్నాయి. అంటే మొత్తం మీద అతి చిన్న పరిశ్రమల సంఖ్య బాగా ఎక్కువ. దేశం మొత్తం ఎగుమతులతో 48 శాతం ఈ పరిశ్రమల నుండే ఉంటున్నాయి. జిడిపి లో 30% ఈ రంగానిదే. దాదాపు 11 కోట్ల మంది ఈ పరిశ్రమలలో ఉపాధి పొందుతున్నారు. 41% చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పాదక రంగంలో ఉండగా మిగిలిన 59% సేవా రంగానికి చెందినవి.

గడచిన నాలుగు, ఐదు సంవత్సరాలలో ఈ పరిశ్రమల సంఖ్య బాగా పెరిగింది.

సంఖ్య పెరిగినా జిడిపి లో వీటి వాటా మాత్రం ఏ మాత్రం పురోగతి లేకుండా నిలకడగా ఉంది. ఇది ఆ రంగం లో నానాటికీ పడిపోతున్న ఉత్పాదక సామర్ధ్యాన్ని సూచిస్తుంది. కొన్ని అంచనాల ప్రకారం ఇతర దేశాల పరిశ్రమలతో పోలిస్తే భారత దేశపు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇరవై ఐదు శాతం తక్కువ ఉత్పాదక సామర్ధ్యాన్ని కలిగివున్నాయి.

ఉత్పాదక సామర్ధ్య లోపంతో పాటు మార్కెట్ లను అందిపుచ్చుకోవడంలో కూడా మన దేశ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెనుకబడే ఉన్నాయి. ఇక విధాన లోపాలు, నియంత్రణా చట్టాలలోని లోపాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పటి కరోనా మహమ్మారి ఈ రంగాన్ని మరింత దెబ్బ తీసింది. వ్యాపారం లేకపోవడంతో పాటు పనివారిని తగ్గించాల్సి రావడం, ముడిసరుకుల కొనుగోలులో ఉన్న ఇబ్బందులు ఈ రంగాన్ని మరింత దెబ్బతీశాయి.

నానాటికీ ఉద్యోగాల కల్పన తగ్గిపోవడంతో స్వయం ఉపాధే సరైన మార్గం అనుకుంటున్న తరుణంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇంకా ఎంతో చేయవలసి ఉంది. అనేక సంవత్సరాలు విద్య, నైపుణ్య కల్పనా రంగంలో పని చేసిన నాకు ఈ రంగం ఎదుర్కుంటున్న సంక్షోభానికి విద్య, నైపుణ్య శిక్షణ ముఖ్యమైన పరిష్కార మార్గాలుగా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాధమిక విద్యా స్థాయిలో పునాది బలంగా ఉండాలి.

వృత్తి విద్య పట్ల గౌరవం, వాటి సాధన తో పాటు ప్రాధమిక దశ నుండే నాణ్యత పట్ల, ఇచ్చిన పనిని క్రమ పద్దతిలో నిర్వహించవలసిన అవసరం పట్ల అవగాహన కల్పించాలి. ఇవి ఎప్పుడో పెరిగి పెద్దయ్యాక నేర్పించేవి కాదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణంలో భాగంగా ఉండవలసిన నైపుణ్యాలు ఇవి.

వృత్తి విద్యా శిక్షణ కూడా ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా ఎన్నో రేట్లు మెరుగ్గా అందించాల్సి ఉంది. జర్మనీ ని ఉదాహరణగా తీసుకుంటే, ఒక వృత్తి విద్యని నేర్చుకునే విద్యార్థి దాదాపు రెండు నుండి మూడున్నర సంవత్సరాలు ఆ విద్యని నేర్చుకోవడానికే కేటాయిస్తారు. అందులో సగం సమయం వృత్తి విద్యా పాఠశాలలోనూ, మిగిలిన సగం సమయం ఆ వృత్తి విద్యకు సంబంధించిన కర్మాగారాలలోనూ గడుపుతూ శిక్షణ పొందుతారు. మన దేశంలో మూడు నెలలలో వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాం! పాలిటెక్నిక్ లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో విద్యార్థులు కొంత ఎక్కువ సమయం గడిపినా వారికి నిజంగా పని ప్రదేశాలలో పని చేయగలిగే నైపుణ్యాలు అందడం లేదు. ప్రాక్టికల్ శిక్షణ దాదాపు లేదు. ఆధునిక యంత్రాల మీద శిక్షణ అసలే లేదు. ఇంక ఉత్పాదకత ఏ విధంగా పెరుగుతుంది?

ఇంతేకాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు మానేజ్మెంట్ విద్యను అందించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. తమ దగ్గర పని చేసే వ్యక్తులను, తమ ఆర్ధిక లావాదేవీలను, ఉత్పత్తిని, మార్కెటింగ్ ను ఎలా నిర్వహించుకోవాలో తెలియక ఎంతో మంది తప్పులు చేస్తూ ఆర్ధికంగా నష్టపోతూ వ్యాపారాలను మూసేసే పరిస్థితికి వస్తున్నారు. కొన్ని చిన్న వ్యాపారాల నిర్వహణ కు సంబంధించిన కోర్సులు ఉన్నాయి కానీ అవి అవసరమైన వారికి అందుతున్న దాఖలాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

ఇంక్లూసివ్ డెవలప్మెంట్ ను సాధించాలంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకం. స్థానికంగా చిన్న స్థాయి వ్యాపారాల ద్వారా ఎంతో మంది పేదలు, నిరుపేదలకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. కరోనా వలన దెబ్బ తిన్న అనేక చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు స్పందించాల్సిన సమయం ఇదే, ఇప్పుడే!

–Based on a piece by Meena

క్రమపద్ధతిలో జీవితం: SOPing my Life

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ల (SOP) గురించి చాలా మందికి తెలుసు. వస్తుసేవల ఉత్పత్తి రంగంలో ముఖ్యంగా ఫార్మా రంగంలో మొదలైన ఈ SOP పద్ధతులు తర్వాత మిగిలిన రంగాలకు కూడా విస్తరించాయి. ఏదైనా ఒక వస్తువును పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి అన్నీ ఒకే నాణ్యతతో, ఒకే పరిమాణంతో ఒకే విధంగా ఉండాలంటే ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఉత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఉత్పత్తి క్రమాన్ని ఏ పనితో ప్రారంభించాలి, వరుసగా ఏమేమి చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఎవరు ఏ పని చేయాలి వంటి వివరాలన్నీ రాసి పెట్టుకున్న నియమావళినే SOP అంటారు. పెద్ద స్థాయిలో వస్తు, సేవలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఈ SOP లు అత్యవసరం. 

అయితే పని ప్రదేశాలలోనే కాక మన దైనందిన జీవితంలో కూడా SOP లు అవసరమని నేను నమ్ముతాను. నాకు ఏది ఎక్కడ పెట్టానో గుర్తు ఉండదు. పనిని ఒక పద్ధతిలో చేసుకోలేను. అయినా కూడా నా జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడుపుకునేందుకు SOP లే నాకు ఉపయోగపడుతున్నాయి. ఏదైనా ఒకటి రెండు సార్లు తప్పుగా చేస్తే వెంటనే ఆ పని చేయడానికి ఒక SOP తయారు చేసుకోవాలి అని నాకు అర్ధమయ్యిపోతుంది. 

ఉదాహరణకు: 

  • ఎప్పుడైనా దూరప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు నేను వెళ్ళవలసిన చోటికి వెళ్ళాక అవసరమైన వస్తువు ఏదో ఒకటి మర్చిపోయి వచ్చానని గుర్తు వస్తుంది. అది జరగకుండా ఉండేందుకు నేను రెండు SOP లు నిర్ణయించుకున్నాను. మొదటిది, ప్రయాణం అనగానే ఖచ్చితంగా అవసరమైన వస్తువులు ఏమిటో ఒక లిస్ట్ రాసి పెట్టుకోవడం. రెండవది, ప్రయాణానికి వారం ముందుగానే సూట్ కేసు కిందకి దించి పెట్టుకుని ఒక్కొక్క వస్తువు అందులో పెట్టుకోవడం. బట్టలు, ఇతర వస్తువులే కాదు, మందులు, దారిలో చదువుకోవడానికి పుస్తకాలు, వాకింగ్ బూట్లు, వెళ్లిన చోట మిత్రులకు ఇచ్చేటందుకు కొన్ని బహుమతులు కూడా.
  • తర్వాత రోజు ఆఫీస్ కి చెక్ బుక్ తీసుకువెళ్ళాలి అనుకోండి. లేదా ఏవైనా మందులు తీసుకెళ్ళాలి. వాటిని నేను మర్చిపోయి వెళ్తానని నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకే నా కప్ బోర్డు లో ఒక స్థలం పెట్టుకున్నా. తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలో ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు ఆ కప్ బోర్డు లో పెట్టుకుంటా. ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు, లేదా ప్రయాణం అప్పుడు సూట్ కేసు లో పట్టుకువెళ్లిన బ్రోచర్లు కావచ్చు. ఏవైనా సరే గుర్తు వచ్చినప్పుడు అందులో పెట్టేస్తా. రోజూ ఆఫీస్ కి వెళ్లేముందు ఆ కప్ బోర్డు ఒకసారి చూసుకుని వెళ్లడం ఒక అలవాటుగా పెట్టుకున్నా. దీనికోసం ఒక నాలుగు సార్లు అటూ ఇటూ ఇంట్లో తిరగాల్సి రావచ్చు. కానీ ఇలా చేయడం వలన ఇంతవరకూ ఏదీ మర్చిపోకుండా తీసుకువెళ్తున్నా. ఈ పద్ధతే లేకపోతే తీసుకువెళ్లాల్సిన వస్తువు మర్చిపోయి వెళ్లేందుకు నాకు 75% అవకాశం ఉంది.
  • నాకు ఎప్పుడూ కళ్ళజోడు మర్చిపోయే అలవాటు ఉంది. కానీ అవి లేకుండా పని గడవదు. అందుకే నా రీడింగ్ గ్లాస్సెస్ విషయంలో కూడా ఒక SOP పెట్టుకున్నా. నాకున్న హ్యాండ్ బ్యాగ్ లు అన్నిటిలో ఒక జోడు పెట్టుకుంటాను. ట్రావెల్ బాగ్ లో ఒకటి. బెడ్ రూమ్ లో ఒకటి. లివింగ్ రూమ్ లో ఒకటి. మరీ ఎక్కువైనట్లు అనిపిస్తుందా? అదేమీ లేదు. నేను ఒక్కోదాని మీద 250 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టను. 
  • నా చీరలు, సల్వార్ లు, చుడిదార్ లు అన్నీ రంగుల వారీగా సర్దుకుంటాను. నేను ప్రత్యేకమైన కిట్ బ్యాగ్ లు తయారు చేయించుకున్నా. ఒక రంగుకు దగ్గరగా ఉండే చీరలన్నీ ఒక కిట్ లో ఉంటాయి. తెల్లని సల్వార్ లకు ఒక కిట్, బ్లూ, గ్రీన్ రంగుల్లో ఉన్న సల్వార్ లకు మరో కిట్ ఇలా. ఇది నాకు చాలా ఉపయోగపడింది. ఏదైనా సల్వార్ వెతుక్కోవాలంటే మొత్తం కప్ బోర్డు ని చిందరవందర చేసేబదులు ఒక కిట్ ని చేస్తే సరిపోతుంది. 
  • ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి.

మీలో చాలా మంది ఇటువంటి SOP ల అవసరం లేకుండానే జీవితాన్ని క్రమపద్ధతిలో నడుపుకుంటారని నాకు తెలుసు. అయితే కొంచెం క్రమశిక్షణ లేని వారికి, నాలాగా మతిమరుపు ఉన్నవారికి ఇవి ఉపయోగపడతాయి. కొంతమంది ఇటువంటి పద్ధతులు పెట్టుకున్నా వాటికి నాలాగా SOP అని పేరు పెట్టుకుని ఉండరు. కానీ అలా వాటిని SOP లుగా పిలుచుకోవడం వలన నాకు నా జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో, ప్రొఫెషనల్ గా నడుపుకుంటున్నాననే ఒక సంతృప్తి వస్తుంది.

–Based on a piece by Meena

చిరంజీవ – Bless You

కరోనా వైరస్ దేశాన్ని పట్టి కుదిపేయడం మొదలుపెట్టాక ఎవరైనా తుమ్మితే సహజంగా వచ్చే స్పందన వాళ్ళని తిట్టుకుని దూరంగా వెళ్ళిపోవడం. అయితే ముందు పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలుసు. ఎవరైనా తుమ్మగానే “చిరంజీవ” అని ఆశీర్వదించడం కరోనా కు ముందు ఉన్న సహజమైన స్పందన. తుమ్మితే చిరంజీవ అనే ఆచారం మన తెలుగు వాళ్లలోనే కాదు, ప్రపంచమంతా ఉన్నదే. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎవరైనా తుమ్మగానే ‘బ్లెస్స్ యు’ అంటారని మనకు తెలియనిది కాదు.   

ఈ ఆచారం అసలు ఎలా మొదలయ్యింది అని కొంచెం చరిత్రలోకి చూస్తే అనుకోకుండా అది మరో మహమ్మారి దగ్గరకి వెళ్లి ఆగింది. ప్రపంచమంతా ప్లేగు వ్యాధి ప్రబలిన సమయం అది. నిజానికి ప్లేగ్ ఒకసారి కాదు, అనేక వేవ్స్ లో అనేక సార్లు అనేక దేశాలను, ముఖ్యంగా యూరోపియన్ దేశాలను పట్టి కుదిపేసింది. ఎవరికైనా ప్లేగు వ్యాధి సోకగానే మొదట జలుబు, దగ్గు ప్రారంభం అయ్యేవి. తర్వాత జ్వరం, శ్వాస ఇబ్బందులు, రక్తపు వాంతులు, చర్మం నల్లగా మారిపోవడం వంటి అనేక లక్షణాలు కనపడి దాదాపు ఏడు నుండి పది రోజులలో వ్యాధి సోకిన వ్యక్తులు ప్రాణాలు కోల్పోయేవారు. అసలీ వ్యాధి ఎలా ఇంత తీవ్రంగా ప్రబలింది, దీనికి చికిత్స ఏమిటి అనేదానిపై అవగాహన లేక ప్రజలు స్థానికంగా దొరికిన ఆకులు, మూలికలతో వైద్యం చేసుకుంటూ, వ్యాధిని తగ్గించమని ప్రార్ధనలు చేసుకుంటూ గడిపారు.

యూరప్ లో ఈ మహమ్మారి ప్రబలిన సమయంలో పోప్ కూడా దాని బారిన పడి మరణించడంతో పోప్ గ్రెగొరీ I కొత్త పోప్ అయ్యారు. ఫిబ్రవరి 16, 600 వ సంవత్సరంలో ఎవరైనా తుమ్మిన వెంటనే ఆ చుట్టు పక్కల ఉన్న ప్రజలు ఆ వ్యక్తి కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తూ మూడు పదాలతో కూడిన ఒక ప్రార్ధన చేయవలసిందిగా ప్రజలకు సందేశం ఇచ్చారు. తుమ్ముతూ ఉన్న వ్యక్తి కి ప్రజల దీవెనలు, ప్రార్ధనలు అందినట్లైతే అతను త్వరగా కోలుకుంటాడని ఆయన ఆశించారు. ఇంగ్లీష్ మాట్లాడే దేశాలన్నిటిలో ఎవరైనా తుమ్మగానే “గాడ్ బ్లెస్స్ యు” అని ప్రార్ధించడం అప్పటి నుండి ఆచారంగా మారింది.

యూరోపియన్ దేశాలలో పోప్ సూచనతో ఆచారంగా మారిన ఈ “గాడ్ బ్లెస్స్ యు” ప్రార్ధన అంతకు ముందు నుండే ఎన్నో దేశాలలో అలవాటుగా ఉంది. ఎన్నో ప్రాచీన సంస్కృతులలో తుమ్ములను అశుభ సూచకంగా, దేవుని నుండి వచ్చిన ప్రమాద సంకేతంగా భావించేవారు. తుమ్మగానే వ్యక్తి ఆత్మ అతని నుండి కొంతసేపు బయటకు వెళుతుందని, ఆ కొద్దిసేపటిలో దెయ్యాలు, దుష్ట శక్తులు ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయని అనుకునేవారు. గాడ్ బ్లెస్స్ యు అనడం వలన ఆ దుష్ట శక్తులు ఆ మనిషి దగ్గరకి చేరలేవని, అతని ఆత్మ అతని వద్దకు తిరిగి వస్తుందని నమ్మేవారు. తర్వాత కాలంలో, తుమ్మినప్పుడు వ్యక్తి గుండె కొద్దిసేపు స్పందనలు కోల్పోతుందనీ, గాడ్ బ్లెస్స్ యు అని ప్రార్ధించడం వలన అది తిరిగి కొట్టుకోవడం మొదలుపెడుతుందనే నమ్మకం కూడా కొన్ని సమూహాలలో ఉండేది. 

ప్రాచీన గ్రీకులు, ఈజిప్షియన్లు, రోమన్లు తుమ్మడం అంటే దేవుడు భవిష్యత్తు గురించి ఇస్తున్న సందేశం అని భావించేవారు. అది శుభసూచకం అయినా కావొచ్చు. అశుభసూచకం కూడా కావచ్చు. అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. దురదృష్టాన్నీ తీసుకురావచ్చు.

ఇవి యూరోపియన్ దేశాలలో ఉన్న కొన్ని నమ్మకాలు మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఇంకా అనేక నమ్మకాలు  ఉండేవి.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లలో నవజాత శిశువు మొదటి సారి తుమ్మేవరకూ ఆ బిడ్డ ఇంకా దేవలోకపు పరిధిలోనే ఉన్నట్లు భావించేవారు. పాలినేషియన్ ప్రజలు కూడా అలాగే పసిపిల్లల తుమ్ములో ఏదో దైవ సందేశం ఉందని భావించేవారు. టోంగా లో పసిపిల్లలు తుమ్మితే ఆ కుటుంబానికి ఏదో కీడు జరుగుతుంది అనుకునేవారు. మరోయులలో పిల్లలు తుమ్మితే దానిని ఏదైనా ప్రయాణానికి, లేదా ఏదైనా శుభవార్తకు సూచనగా భావించేవారు. 

నావికులు కూడా తుమ్ములను బట్టి తమ ప్రయాణం ఎలా ఉండనుండో అంచనా వేసేవారు. ఓడ బయలుదేరే ముందు సరంగు ఓడ ముందుభాగంలో నిలబడి తుమ్మినట్లైతే ఆ ప్రయాణం సవ్యంగా సాగనుందనీ, వెనక భాగంలో ఉన్నప్పుడు తుమ్మితే ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోయే ప్రమాదం ఉందనీ అనుకునేవారు.

పోలిష్ సంస్కృతిలో తుమ్ము అశుభ సూచకం. ఎవరైనా తుమ్మితే, ఆ సమయంలో వారి అత్తగారు వారి గురించి చెడు ఆలోచనలు చేస్తుంది అనుకునేవారు. తుమ్మిన వ్యక్తి అవివాహితులు అయినట్లయితే వారికి వివాహం అయ్యాక అత్తగారితో సంబంధాలు సరిగ్గా ఉండవు అని భావించేవారు. ఈ నమ్మకం ఇప్పటికీ అక్కడి ప్రజలలో ఉంది. ఇటాలియన్ సంస్కృతిలో పిల్లి కనుక తుమ్మినట్లైతే దాన్ని శుభసూచకం అనుకునేవారు. పెళ్లికూతురు తన వివాహ దినోత్సవాన పిల్లి తుమ్మడం విన్నట్లైతే ఆ వివాహ బంధం కలకాలం సంతోషంగా వర్ధిల్లుతుందని వారి నమ్మకం. అయితే అది మూడు సార్లు వరుసగా తుమ్మితే, ఆ కుటుంబానికంతటికీ జలుబు చేస్తుందని కూడా అనుకునేవారు.

కొన్ని తూర్పు ఆసియా దేశాలలో మీకు తుమ్ము వచ్చింది అంటే మీకు తెలియకుండా ఎవరో ఎక్కడో మీ గురించి మాట్లాడుతున్నారని నమ్మేవారు. ఒకసారి తుమ్మితే మంచి విషయాలు మాట్లాడుతున్నట్లు, రెండు సార్లు తుమ్మితే చెడ్డ విషయాలు మాట్లాడుతున్నట్లు నమ్మకం. వరుసగా మూడు సార్లు తుమ్మితే మీతో ఎవరో ప్రేమలో ఉన్నట్లు లేదా మీరు త్వరలో ప్రేమలో పడబోతున్నట్లు. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ తుమ్ములైతే ఆ కుటుంబానికి లేదా కుటుంబంలో ఎవరో ఒకరికి నష్టం జరగనున్నట్లు.

చైనా లో కూడా తుమ్ముల గురించి ఎన్నో ప్రాచీన గాధలు ఉండేవి. టాంగ్ వంశంలో చక్రవర్తి తల్లి కనుక తుమ్మినట్లైతే రాజప్రాసాదంలోని అధికారులంతా “వాన్ సుయ్” (చిరంజీవ) అనేవారని ఆ వంశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పొందిపరిచిన ఒక పుస్తకంలో రాసి ఉంది. ఇప్పటికీ చైనాలో కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం ఉంది.

తుమ్మిన సమయాన్ని బట్టి కూడా కొన్ని నమ్మకాలు ఉండేవి. తెల్లవారు జామున ఒకటి నుండి మూడు మధ్య తుమ్మితే నిన్ను ఎవరో గుర్తు చేసుకుంటున్నట్లు; మూడు నుండి ఐదు మధ్య తుమ్మితే నిన్నెవరో ఆ రోజు రాత్రి భోజనానికి ఆహ్వానిస్తారు; ఐదు నుండి ఏడు మధ్య తుమ్మితే నీకు త్వరలో అదృష్టం పట్టనుంది అని; 11 నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో తుమ్మితే దూరం నుండి ఎవరో స్నేహితులు నిన్ను కలవడానికి వస్తున్నారని. ఇలా రోజులో మనిషి తుమ్మిన సమయాన్ని బట్టి నమ్మకాలు ఉండేవి.

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభసూచకంగా భావిస్తారు. అలా తుమ్మినప్పుడు బయటకు వెళ్లకుండా ఆగి, కాసేపు కూర్చుని, కొంచెం నీళ్లు తాగి మళ్ళీ బయలుదేరినట్లయితే ఆ అశుభం జరగకుండా ఆగుతుందని నమ్మకం.

ఏదైనా వైరస్ శరీరంలో ప్రవేశించి జలుబునో, ఎలర్జీ నో కలుగచేస్తే తుమ్ములు వస్తాయని ఈ రోజు మనందరికీ తెలుసు. అయినా ఎవరైనా తుమ్మగానే “చిరంజీవ” అనే అలవాటు మాత్రం మనలో ఇంకా అలాగే ఉంది.

–Based on a piece by Mamata

బడి చదువు మేలా? ఇంటి చదువు మేలా? TO School or Not to School

గతవారం బ్లాగ్ లో కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో బడి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండనుంది అని కొంత చర్చ చేసాం. కోట్లాది మంది పిల్లలు, ఉపాధ్యాయులు అప్పటివరకు పెద్దగా పరిచయం లేని డిజిటల్ బోధన, లెర్నింగ్ వైపుకు మళ్ళవలసిన అవసరం ఏర్పడింది. పిల్లలు ఇంటి దగ్గర నుండే నేర్చుకోవాల్సి రావడంతో తల్లితండ్రులు కూడా అదనపు బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. పిల్లలు ఇంటి వద్ద నుండే నేర్చుకునేందుకు ఉన్న మార్గాలేమిటి, ఏ పద్ధతిలో వారు మెరుగ్గా నేర్చుకోగలుగుతారు అనే విషయాలపై విస్తృతమైన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఈ హోమ్ స్కూలింగ్ పద్ధతే బాగుందని కూడా అభిప్రాయ పడుతున్నారు.

పాఠశాల వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోని రోజుల్లోనే కొంతమంది తల్లిదండ్రులు ఈ హోమ్ స్కూలింగ్ తో ప్రయోగాలు చేశారు. రకరకాల వినూత్న బోధనా విధానాలను ఉపయోగించారు. వాటిలో ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఇక్కడ ఇస్తున్నాను. 

ఇది 1847 నాటి కథ. ఏడేళ్ల ఆల్ అనే పిల్లవాడు కేవలం మూడు నెలలు మాత్రమే బడికి వెళ్ళాక ఒక రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. చేతిలో టీచర్ ఇచ్చిన చిన్న కాగితం ఉంది. అందులో ఈ పిల్లవాడికి ఆలోచించే శక్తి లేదని, చదువులో ఎంతమాత్రం శ్రద్ధ లేదనీ, బడి నుండి పంపివేస్తున్నామని సమాచారం ఉంది. ఆల్ తల్లి నాన్సీ కి తన కొడుకు పట్ల బడి ఇచ్చిన తీర్పు పట్ల ఎంతో బాధ కలిగింది. అది ఆమె సవాలుగా తీసుకుని తన కొడుకుకి తానే ఇంటి దగ్గరే చదువు చెప్పాలని నిర్ణయించుకుంది. తన కొడుకుకి ఎంతో బెరుకు అని, మొహమాటస్థుడని ఆమెకి తెలుసు. అతనికి ఏమైనా వినికిడి లోపం ఉందేమో, దాని వలననే బడిలో చెప్పే విషయాలను గ్రహించలేకపోతున్నాడేమో అనుకుంది. ఒకప్పుడు ఆమె టీచర్ కావడంతో తన పిల్లవాడిని అర్ధం చేసుకుని అంచనా వేసే ప్రయత్నం చేసింది. అతనికి సాంప్రదాయ బోధనా పద్ధతిలో చదువు చెప్పడం విసుగు తెప్పిస్తుందని ఆమె అర్ధం చేసుకుంది. తన కొడుకులో ఉన్న కుతూహలాన్నీ, పుస్తక పఠనం పట్ల ఉన్న ప్రేమని ప్రోత్సహిస్తూ అతను స్వతంత్రంగా ఆలోచించేందుకు, ప్రయోగాలు చేసేందుకు, కొత్త కొత్త పనులను ప్రయత్నించేందుకు అవకాశం కల్పించింది.

ఆ పిల్లవాడికి యంత్ర సంబంధమైన విషయాలన్నా, వాటికి సంబంధించిన ప్రయోగాలన్నా చెప్పలేనంత ఆసక్తి. అతనికి తొమ్మిదేళ్ళ వయసులో వాళ్ళ అమ్మ రసాయన మూలకాలతో వివిధ రకాల ప్రయోగాల వివరాలు ఉన్న ఒక పుస్తకం ఇచ్చింది. ఆల్ ఆ పుస్తకాన్ని వదలకుండా చదివాడు. తన పాకెట్ మనీ ఖర్చు పెట్టి వీడి చివర ఉన్న ఫార్మసీ స్టోర్ నుండి తనకి కావలసిన రసాయన పదార్ధాలను కొనుక్కుని ప్రయోగాలు చేసేవాడు. తనకి పదేళ్ల వయసులో తమ ఇంటి బేస్మెంట్ లో ఒక చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని గంటల తరబడి అందులోనే గడిపేవాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాహిత్యం, చరిత్ర కూడా విస్తృతంగా చదివాడు. అలా కేవలం మూడు నెలలు మాత్రమే బడి ముఖం చూసిన పిల్లవాడు తన జీవితాంతం నేర్చుకుంటేనే ఉండేందుకు పునాదులు ఏర్పడ్డాయి.

అలా ఆల్ అని పిలవబడే థామస్ ఆల్వా ఎడిసన్ తన వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తిగా ఎదిగాడు. లైట్ బల్బ్, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా లను ఆవిష్కరించడంతో పాటు టెలిగ్రాఫ్, టెలిఫోన్ ఆవిష్కరణలను కూడా ఎంతో మెరుగుపరిచాడు. తన 84 ఏళ్ళ జీవితంలో 1093 పేటెంట్ లను పొందాడు. కేవలం ఆవిష్కర్తగా మిగిలిపోకుండా తాను కనిపెట్టిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసి విజయవంతమైన వ్యాపారవేత్త గానూ మారాడు.

ఎడిసన్ కు 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అతని తల్లి నాన్సీ మరణించింది. కానీ ఆమె తన జీవితాంతం తనకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఎడిసన్ చెప్పుకునేవారు. “నన్ను ఇలా రూపుదిద్దింది ఆమే. నాపైన అమ్మకు అపారమైన విస్వాసం ఉండేది. ఆమెకోసమే నేను జీవించాలని, ఆమెని ఎప్పుడూ నిరాశపరచకూడదు అనీ అనిపిస్తుంది” అని ఒక సందర్భంలో ఎడిసన్ అన్నారు.

ఇంటి వద్దే చదువు చెప్పే తల్లితండ్రులందరూ నాన్సీ ఎడిసన్ లు కాలేరు. అలాగే ఇంటి వద్ద చదువుకున్న పిల్లలందరూ థామస్ ఆల్వా ఎడిసన్ లు కాలేరు. ఈ కథలో నాకు అన్నిటికన్నా ఆసక్తి కలిగించిన అంశం విద్యా విధానం పట్ల ఎడిసన్ కు ఉన్న దృక్పథం. అది అతని కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది ఈనాటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోయే ఆలోచనా దృక్పధం.

తన కాలంలో ఉన్న విద్యా వ్యవస్థను ఎడిసన్ ఇలా విమర్శించారు. “ఇప్పటి విద్యా వ్యవస్థ మనోవికాసానికి అవకాశం ఇవ్వదు. అది బుద్ధిని ఒక మూసలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. బడిలో చెప్పిన దానిని పిల్లవాడు ఒప్పుకుని తీరాలి అని నేర్పిస్తుంది. వారి సృజనాత్మక ఆలోచనలకు, ప్రశ్నించే తత్వానికి అవకాశం ఇవ్వదు. పరిశీలన ద్వారా నేర్చుకోవడం కన్నా బట్టీ పట్టి నేర్చుకునేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. తమ జీవితాలతో సంబంధం లేని విషయాలను బట్టీ కొట్టడమే తప్ప స్వంత ఆలోచనలకు తావు లేదు. దాని వలన భయం, భయం నుండి అజ్ఞానం పుట్టుకొస్తాయి”

ఎడిసన్ ది తీరని జ్ఞాన తృష్ణ. కేవలం పుస్తకాలలో ఉన్నదానిని అనుసరించడం కాకుండా తాను స్వయంగా పరిశోధించి విషయాలను తెలుసుకోవాలి అనుకునేవాడు. తన జీవితమంతా తాను చేసిన ప్రయోగాలను, పరిశీలనలను, తన ఆలోచనలను వివరంగా తన ప్రయోగశాలలోని నోటు పుస్తకాలలో రాసుకునేవారు. తాను ఒక వ్యాపారవేత్తగా ఎదిగాక కూడా తన కార్పొరేట్ ఆఫీస్ ను తన లైబ్రరీ లో ఏర్పాటు చేసుకున్నారు అంటే ఆయనకి అధ్యయనం అంటే ఎంత మక్కువో అర్ధం అవుతుంది. తన చిన్నతనంలో మొదలైన వినికిడి సమస్య తనతో పాటే పెరిగినా దానిని ఎప్పుడూ ఆయన సమస్యగా అనుకోలేదు. ఇన్ని కొత్త ఉత్పత్తులను కనిపెట్టిన మీరు ఒక వినికిడి యంత్రాన్ని ఎందుకు కనిపెట్టలేదు అని ఒకసారి ఆయనని ఎవరో అడిగారు. బయటి శబ్దాలు వినపడకపోవడం మంచిదే కదా నా ప్రయోగాల మీద ఎక్కువ ధ్యాస కుదురుతుంది అన్నారు ఎడిసన్. 

తాను ఎన్నో ప్రయోగశాలలు ఏర్పాటు చేసి, ఎంతో మంది సిబ్బందిని నియమించుకున్నాక కూడా తానే స్వయంగా పరిశోధనలు చేసుకునేందుకు ఆసక్తి చూపేవారు. 1890 లలో ఆయన ఒక వినూత్న పరిశోధన మొదలుపెట్టారు. భవనాల నిర్మాణానికి వాడే ఇటుకలు ఓపెన్ గా ఉండే గూడ్స్ రైళ్లలో తరలిస్తున్నప్పుడు వర్షం పడినట్లైతే తేమ ని పీల్చుకుని తడిగా ఉండేవి. ఆ పరిస్థితి లేకుండా వాన నీటిని గ్రహించి తేమ గా ఉండే ఇటుకలు తయారు చేయాలి అనుకున్నారు. రకరకాల పదార్ధాలతో బైండింగ్ సొల్యూషన్ ను తయారు చేసి చూసారు. ఎడిసన్, అతని సహోద్యోగులు దానిని “మక్” అని పిలిచేవారు. దానితో ఆ ప్రయోగంలో భాగస్వామ్యులైన వారందరినీ ఎడిసన్ “మక్కర్స్” అని పిలుస్తుండేవారు. ఇక ఎడిసన్ ప్రయోగశాలల్లో పని చేసే సిబ్బంది అందరికీ ఉమ్మడి పేరుగా “మక్కర్స్” స్థిరపడి పోయింది. వారంతా తర్వాత కాలంలో “ఎడిసన్స్ మక్కర్స్” పేరుతో మరొక సంస్థని కూడా స్థాపించుకున్నారు.

ఒక పేరెంట్ గా కూడా తన పిల్లలను పరిశీలన, పరిశోధన వైపు ప్రోత్సహించాడు. తాను ఏ పుస్తకం చదవాలనుకుంటున్నాడో పిల్లలకి చెప్పి తన విశాలమైన లైబ్రరీలో ఆ పుస్తకం కోసం వెతకమని పిల్లలకి చెప్పేవాడు. ఒక్కోసారి కొన్ని పేజీలు వెతికి పెట్టమని అడిగేవాడు. ఆ విధంగా పిల్లలకు పుస్తకాలతో సమయం గడిపే అవకాశం ఇస్తూ వారిని పుస్తక పఠనం వైపు ప్రోత్సహించాడు. 

ప్రస్తుత విద్యా విధానం పట్ల తన అసంతృప్తిని ప్రకటిస్తూనే తనకు మాంటిస్సోరి విద్యా విధానం పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేసాడు. “నాకు మాంటిస్సోరి పద్ధతిలో బోధన అంటే ఇష్టం. అది పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ పద్దతిలో నేర్చుకోవడం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప పిల్లలకు ఇబ్బందిగా ఉండదు. మనిషి సహజాతాలను అర్ధం చేసుకుంటే బోధించే వ్యవస్థ ఇది” అని ఒకచోట రాశారు. 1913 లో మరియా మాంటిస్సోరి తొలిసారి అమెరికా సందర్శించినప్పుడు ఎడిసన్ ఇంట్లోనే బస చేశారు.

ఎడిసన్ ఆవిష్కరణలు ప్రపంచంలో ఎన్నో మార్పులు తెచ్చాయి. సాంకేతిక విప్లవానికి ఆద్యులలో ఆయనను ఒకడిగా చెప్పుకోవచ్చు. కేవలం ప్రయోగాలు, ఫలితాల పట్ల మాత్రమే కాక ఎడిసన్ విద్యా విధానం పట్ల, నేర్చుకునే ప్రక్రియ పట్ల ఎంతో ఆసక్తి చూపించేవారు. తన తల్లి నేర్పిన నాలుగు సూత్రాలను తన జీవితాంతం పాటించారు. 

ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దు. దాని నుండి నేర్చుకో. మళ్లీ ప్రయత్నించు. 

బుద్ధితో, చేతులతో రెండింటితో నేర్చుకో 

విలువైనవన్నీ పుస్తకాలలోనే దొరకవు – ప్రపంచాన్ని పరిశీలించు 

నేర్చుకోవడం ఎప్పటికీ ఆపవద్దు. అన్ని రకాల సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యి.

ప్రతి పేరెంట్ కూడా ఈ విధమైన సూత్రాలను తమ పిల్లలకు నేర్పినట్లైతే వారు జీవితాంతం నేర్చుకునే ప్రక్రియని కొనసాగిస్తూనే ఉంటారు. 

దాదాపు శతాబ్దం తర్వాత కూడా విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులేమీ రాలేదు. ఈ వ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉండనుంది అనే ప్రశ్న ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమాచార సాంకేతిక యుగంలో విద్యా వ్యవస్థని పునర్వ్యవస్థీకరించాలి అనుకుంటే పిల్లలను “మక్కర్స్” గా ఉండేలా ప్రోత్సహించేందుకు అవకాశం కల్పించాలి. అప్పుడే వారు నేర్చుకోవడంలోని ఆనందాన్ని గ్రహించగలుగుతారు.

–Based on a piece by Mamata

విద్యా వ్యవస్థ భవిష్యత్తు ముఖచిత్రం: Future of Education

ఏడాది క్రితం కరోనా, లాక్ డౌన్ ప్రజల జీవితాలలో ఎటువంటి ప్రభావం చూపించాయి అర్ధం చేసుకునే క్రమంలో నా సహోద్యోగులతో ఒక చర్చా కార్యక్రమం నిర్వహించుకున్నాం. బడి ఈడు పిల్లల మీద కోవిద్ చూపించిన ప్రభావాన్ని గురించి మేము అర్ధం చేసుకున్న విషయాలను ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేసాం. వాటిలో కొన్ని ఇవి. 

  • చదువుకు సుదీర్ఘ విరామం రావడం వలన నేర్చుకున్న విషయాలను మర్చిపోవడం 
  • విద్యావకాశాలను అందుకోవడంలో అసమానతలు – ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ లెర్నింగ్ సదుపాయాలు లేకపోవడం 
  • ఇంటి దగ్గర చదువుకు తల్లితండ్రుల సహకారంలో ఉన్న సమస్యలు 
  • ఇతర పిల్లలు, పెద్దవారితో కలిసే అవకాశం లేకపోవడం 
  • వినూత్న విద్యా బోధనా పద్ధతులకు, సాంకేతిక అంశాలకు అలవాటు పడటంలో ఉన్న సమస్యలు 
  • తగినంత బోధన, వనరులు లేకపోవడం
  • బయటకి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకునేందుకు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనేందుకు అవకాశం లేకపోవడం 
  • పిల్లలలో ఉండే అసాధారణమైన శక్తికి తగిన పనులు లేకపోవడం 
  • సరైన నిర్మాణం, క్రమశిక్షణ లేని బోధనా వ్యవస్థ 
  • మధ్యాహ్న భోజనం అందకపోవడం వలన పెరిగిన పోషకాహార లోపాలు 
  • ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించినా సామాజిక దూరం, సరైన పరిశుభ్రత పాటించేందుకు తగినన్ని మౌలిక వసతుల లేమి
  • పెద్ద ఎత్తున వలస కార్మికులు సొంతూర్లకు వెళ్లిన కారణంగా, తగ్గిన ఆదాయాల వలన ప్రైవేట్ పాఠశాలల నుండి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు మార్చిన కారణంగా ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన భారం 
  • పాఠ్యపుస్తకాల అందుబాటు లో ఉన్న సమస్యలకు తోడు విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం వలన ఉత్పన్నమైన సమస్యలు 
  • విద్యా సంవత్సరం లో, పరీక్షా విధానాలలో వచ్చిన మార్పులు 
  • అనేక కారణాల వలన కొంతమంది పిల్లలు చదువు మధ్యలో మానుకోవడం, పెరిగిన బాల కార్మికుల, బాల్య వివాహాల సంఖ్య
  • భయం, ఆందోళన 
  • ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన తల్లితండ్రులు ఎదుర్కునే మానసిక ఒత్తిడి 
  • ఆరోగ్యసేవలు అందుబాటులో లేకపోవడం

ఇలా అనేక రకాల సమస్యలను అందరూ గుర్తించడం జరిగినా ఈ ఏడాది కాలంలో వీటిని ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికలు రూపొందలేదనేది వాస్తవం. 

బడులు ప్రారంభించాలా? వద్దా?

తరగతుల నిర్వహణ మొదలుపెట్టాలా? వద్దా? 

పరీక్షలు నిర్వహించాలా? లేదా? 

ఇటువంటి స్వల్పకాలిక సమస్యలే తప్ప ఏడాది పాటు బడులు మూసి ఉంచడం వలన ఉత్పన్నమవుతున్న దీర్ఘకాలిక సమస్యల పట్ల పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.

నిజానికి విధాన రూపకర్తల అసలు బాధ్యత ఈ సమస్యల అన్నిటినీ అర్ధం చేసుకుని భవిష్యత్తు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో, వినూత్న ప్రపంచానికి పిల్లలను ఎలా సంసిద్ధులను చేయాలో ఆలోచించడం. ఈ నేపథ్యంలోనే యునెస్కో ‘కోవిద్ అనంతర ప్రపంచంలో విద్యా వ్యవస్థ: 9 ఆలోచనలు” పేరుతో ఒక నివేదిక ప్రచురించింది. భవిష్యత్తు విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని నిర్దేశించే ఆలోచనలు అని వీటిని అనలేము కానీ పైన చెప్పుకున్న సమస్యల సాధన దిశగా ఈ సూచనలు కొంతవరకూ పనిచేసే అవకాశం ఉంది. ఆ తొమ్మిది ఆలోచనలు ఇలా ఉన్నాయి.

1. ప్రజా సంక్షేమ సాధనకి విద్య ఒక ఉత్తమ మార్గంగా గ్రహించి విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. అసమానతలను నిర్మూలించేందుకు విద్య ఒక్కటే మార్గం 

2. విద్యా హక్కు యొక్క నిర్వచనాన్ని మరింత విస్తరించాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం, సమాచారం, జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ నిర్వచనంలో భాగం కావాలి.

3. ఉపాధ్యాయ వృత్తికి మరింత గౌరవం పెరగాలి. ఉపాధ్యాయుల మధ్య అనుసంధానం జరగాలి. క్షేత్ర స్థాయి విద్యావేత్తలకి తగినంత స్వతంత్ర ప్రతిపత్తి, ఒకరితో ఒకరు కలిసి పనిచేసేందుకు తగిన వెసులుబాటు ఇవ్వాలి 

4. విద్యార్థులు, యువత, పిల్లల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి, వారి హక్కులను కాపాడాలి. విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలని విద్యార్థులు, యువత కోరుకుంటున్నారో అర్ధం చేసుకుని దానికి తగిన వ్యవస్థ నిర్మాణం చేపట్టాలి.

5. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల వలన బడి వాతావరణం పిల్లలకు అందించే సామాజిక వేదికలను కోల్పోకుండా చూడాలి. ఎంత టెక్నాలజీ ఆధారిత తరగతులు నిర్వహిస్తున్నా బడి ఉండాల్సిందే. సంప్రదాయ తరగతి గదికి భిన్నంగా ఎన్నో కొత్త వేదికలు రూపొందుతూ ఉండవచ్చు. కానీ బడి అనే వ్యవస్థలో పిల్లలు అందరూ కలిసి ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉండాలి.

6. ఓపెన్ సోర్స్ టెక్నాలజీలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తేవాలి. విద్య నేర్చుకునేందుకు తగిన స్థలం, వాతావరణం లేకుండా, విద్యార్థులు, గురువుల మధ్య మానవ సంబంధం లేకుండా రెడీ మేడ్ గా లభించే సమాచారం వలన విద్యావికాసం జరగదు. ప్రైవేట్ కంపెనీల నియంత్రణలో ఉన్న డిజిటల్ కంటెంట్, ప్లాట్ఫారం ల మీద విద్యా వ్యవస్థ ఆధారపడటం సమంజసం కాదు.

7. శాస్త్రీయ అక్షరాస్యత (సైంటిఫిక్ లిటరసీ) విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి

8. ప్రభుత్వ విద్యా వ్యవస్థకి స్థానికంగా, అంతర్జాతీయంగా సమకూరుతున్న ఆర్ధిక వనరులను నిలబెట్టుకోవాలి. దశాబ్దాలుగా సాధించిన ప్రగతి ఈ పాండెమిక్ వలన ఎన్నో మెట్లు కిందకి దిగజారింది 

9. ప్రస్తుత అసమానతలను తొలగించాలంటే అంతర్జాతీయ స్థాయి సమన్వయం, సహకారం అవసరం.

(సేకరణ:: https://en.unesco.org/sites/default/files/education_in_a_post-covid-world )

గత ఏడాది కాలంలో ప్రపంచం ఎంతో మారింది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవలసిన సమయం ఆసన్నమయింది. భవిష్యత్తు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో ఆలోచించాల్సిన తరుణం ఇదే, ఇప్పుడే.

–Based on a piece by Meena