వసంత పంచమి: Basant Panchami

శిశిరం ముగిసి వసంతం మొదలయ్యే మాఘ మాసం ఐదవ రోజున మనం వసంత పంచమి పండుగను జరుపుకుంటాం. వేసవి మొదలవడానికి సుమారు నలభై రోజుల ముందుగా, హోళీ పండుగ కన్నా ముందుగా వచ్చే పండుగ ఇది.  

Basant Panchami

పసుపు ఈ పండుగకు సంబంధించిన రంగు. అందుకు తగిన కారణం లేకపోలేదు. ఎన్నో రకాల పసుపు రంగు పూలు పూసే సమయం ఇది. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో ఈ సమయంలో పూసే ఆవ పూలు ఆ ప్రాంతం మొత్తాన్ని కొన్ని నెలలపాటు బంగారు రంగులోకి మారుస్తాయి. దేశంలోని అనేకప్రాంతాలలో ఈ పండుగ నాడు సరస్వతీ దేవిని పూజిస్తారు. పసుపు సరస్వతి దేవికి సంబంధించిన రంగు కూడా.

రుతువులు మారే కాలాన్ని సూచించడమే కాకుండా ఈ పండుగకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో నాకు ఇష్టమైనది కవి కాళిదాసుకు సంబంధించిన కథ. ఆ కథ తెలియని వారి కోసం క్లుప్తంగా ఇక్కడ చెబుతాను. ఉత్తరభారతదేశంలో ఒక రాజ్యానికి చెందిన యువరాణి ఎంతో తెలివైనది. పొడుపుకథల పోటీలో తనను ఓడించిన వాడినే వివాహం చేసుకుంటానని షరతు పెట్టింది. ఎంతోమంది యువకులు ముందుకు రావడం, వారిని ఆమె తిరస్కరించడం జరిగాయి. వారిలో ఆ దేశ ముఖ్యమంత్రి కుమారుడు కూడా ఉన్నాడు. యువరాణి తనను తిరస్కరించడంతో అహం దెబ్బతిన్న ముఖ్యమంత్రి కుమారుడు, తనలా తిరస్కరించబడిన మరికొందరితో కలిసి ఆమెకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. తమకన్నా తెలివైన స్త్రీ ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆ రాజ్యంలో అందరికన్నా తెలివితక్కువ యువకుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్లకు ఒక గొర్రెలు కాసుకునే కుర్రవాడు ఒక చెట్టుపై ఎక్కి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ కనిపించాడు. దానితో పాటు తానూ పడిపోతాననే గ్రహింపు లేని అతనికన్నా తెలివితక్కువ వాడు ఉండడు అనుకుని అనేక ప్రయత్నాల ద్వారా ఇతను ఎంతో తెలివైన వాడు అని యువరాణిని నమ్మించారు. యువరాణి అతనిని వివాహమాడింది కానీ ఆ రహస్యం ఎంతోకాలం దాగలేదు. అతను మందబుద్ధి కలవాడని గ్రహించిన యువరాణి అతనిని ఇంటి నుండి తరిమివేసింది. అతను ఎంతో బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై అక్కడ ఉన్న నదిలో స్నానమాచరించమని అతనికి చెప్పింది. అంతే, ఆ తర్వాత అద్భుతం జరిగింది. నదీ స్నానం చేసి వణుకుతూ బయటకి వచ్చిన అతని నోటినుండి అప్రయత్నంగా దేవిని స్తుతిస్తూ శ్యామలా దండకం వెలువడింది! అపార భాషా సంపద, జ్ఞానం, తెలివి, కవిత్వం అతనికి వశమయ్యాయి. ఆ కాళిదాసే తర్వాత కాలంలో అభిఙ్ఞానశాకుంతలం, కుమారసంభవం, రితుసంహార, మేఘదూత వంటి కావ్యాలను రచించాడు. మాఘమాసంలో ఐదవ రోజున సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై జ్ఞానాన్ని ప్రసాదించింది కాబట్టి అటువంటి జ్ఞానసంపదలు తమకు కూడా అందించమని భక్తులంతా సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. కొంతమంది ఇది సరస్వతీ దేవి జన్మదినం అనికూడా అంటారు.

రెండవది శివపార్వతులకు సంబంధించిన కథ. శివుని ప్రియమైన భార్య సతీదేవి మరణించింది. దానితో ఆయనను తీవ్రమైన దుఃఖం, కోపం ఆవరించాయి. దానితో ప్రపంచాన్ని, దానికి సంబంధించిన తన బాధ్యతలను విస్మరించి ధ్యానంలో మునిగిపోయాడు. అయితే జననమరణ చక్రం సాఫీగా తిరగాలంటే ప్రపంచానికి శివుని అవసరం ఉంది. అప్పట్లో కల్లోలం సృష్టిస్తున్న ఒక రాక్షసుడిని అంతం చేయాలంటే శివునికి పుట్టిన బిడ్డ వలన మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఆయన అవసరం మరింత ఉంది. సతి అప్పటికే హిమాలయ రాజుకు పుత్రికగా పార్వతి రూపంలో పునర్జన్మించి ఉంది. కానీ ఆయనను ఎవరూ ధ్యానం నుండి మరల్చలేకపోయారు. అప్పుడే దేవతలంతా కలిసి కామదేవుడిని పంపారు. ఆయన విసిరిన మన్మధ బాణానికి శివుడు కళ్ళు విప్పాడు. కానీ ఆయన అత్యంత క్రోధంతో మూడవ కన్ను కూడా తెరవడంతో కామదేవుడు అక్కడికక్కడే భస్మమయిపోయాడు. అయితే అనుకున్నది జరిగింది. శివుడు పార్వతిని చూడడం ఆమెతో ప్రేమలో పడటం కూడా జరిగింది. మన్మధుని భార్య రతి దుఃఖంతో 40 రోజులు కఠోర తపస్సు చేసింది. దానితో కరుణించిన శివుడు ఏడాదికి ఒకరోజు కాముడు తన శరీరాన్ని ధరిస్తాడని వరం ఇస్తాడు. ఆ రోజే వసంత పంచమి.

దక్షిణ భారతం కన్నా ఉత్తర, తూర్పు భారతదేశంలో వసంత పంచమిని ఎంతో ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. కనీసం నాకు తెలిసిన మా తమిళ కుటుంబాలలో ఈ పండుగను జరుపుకోవడం చూడలేదు. కానీ నా బెంగాలీ స్నేహితుల ఇళ్లల్లో ఎన్నో సార్లు వసంత పంచమి వేడుకలకు వెళ్లి ఉండటాన వారెంత శ్రద్ధగా ఈ పండుగను జరుపుకుంటారో తెలిసింది. మంచి పుసుపు వస్త్రాలు ధరించే అవకాశం వచ్చింది.

మనవెన్ని సంప్రదాయాలు, వేడుకలు, కథలో కదా. ఇవే మన జీవితాలకు మరిన్ని రంగులద్ది ఆసక్తికరంగా మార్చేవి.

–Based on a piece by Meena

నేచురల్ హిస్టరీ మ్యూజియంల రూపశిల్పి డాక్టర్ నాయర్ కు నివాళి: Dr. SM Nair

కొన్ని రంగాలలో మార్గదర్శకులుగా చెప్పుకోదగిన వారు కొందరే ఉంటారు. ఎస్.యం. నాయర్ అటువంటి అరుదైన మార్గదర్శకులలో ఒకరు. మ్యూజియాలజీ అనేది ఇప్పటికీ అంతగా ఆదరణ లేని రంగమే. 1950 లలో పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ఆ రోజుల్లోనే కేరళలోని త్రివేండ్రంలో బి.ఎస్సీ పూర్తిచేసిన ఒక కుర్రవాడు బరోడా వరకు వెళ్ళి యం.ఎస్. యూనివర్సిటీ లో ఈ సబ్జెక్టు లో యం.ఎస్సీ చేయడానికి సిద్ధపడ్డాడంటే ఆశ్చర్యమే మరి. 

డాక్టర్ నాయర్ బరోడాలో తాను చదువుకున్న విద్యాసంస్థలోనే అధ్యాపకునిగా పని చేయడం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బిట్స్ పిలానీలో మ్యూజియం స్టడీస్ శాఖకు మారారు.

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన యూరప్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలను చూసి ఎంతో మెచ్చుకున్నారు. దానికి తోడు ఆమెకు సహజంగానే పర్యావరణం పట్ల ఆసక్తి ఎక్కువ. అటువంటి ప్రదర్శనశాలలు మన దేశంలో కూడా ఏర్పాటు చేయాలని ఆమె ఆలోచన చేశారు. ఢిల్లీ లో ఒకటి, భోపాల్ లో ఒకటి నెలకొల్పేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక ను అమలు చేసేందుకు కొంతమంది మ్యూజియం ప్రొఫెషనల్స్, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా 1974 లో కేవలం 37 ఏళ్ళ వయసుకే ఈ వినూత్న ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా డాక్టర్ ఎస్.యం నాయర్ ఎంపిక కావడం జరిగింది.

Dr. Nair and Mrs. Gandhi at NMNH
Dr. Nair and Mrs. Gandhi at NMNH

తర్వాత నాలుగు సంవత్సరాలు ఆ మ్యూజియంల గురించిన ప్రణాళిక రూపకల్పన, అమలుతో ఎంతో ఒత్తిడితో గడిచిపోయాయి. శ్రీ డిపి సింగ్, ఎస్.కె. సరస్వత్, బి. వేణుగోపాల్, ఇంకెంతో మంది అంకితభావం కల ప్రొఫెషనల్స్ ఈ ప్రాజెక్ట్ పై ఎంతో కృషి చేశారు. డాక్టర్ నాయర్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలను సందర్శించారు. ప్రపంచంలోని అత్యుత్తమైన సంస్థలలో తన బృంద సభ్యులకు శిక్షణ ఇప్పించారు. మొత్తానికి 1978 జూన్ ఐదు (ప్రపంచ పర్యావరణ దినోత్సవం) నాడు జాతీయ ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాల తలుపులు ప్రజల కోసం తెరుచుకున్నాయి. తర్వాత కాలంలో డాక్టర్ నాయర్ మార్గదర్శకత్వంలో మైసూర్, భోపాల్, భువనేశ్వర్ లలో ప్రాంతీయ ప్రదర్శనశాలలు కూడా ప్రారంభమయ్యాయి.  

ఢిల్లీ లో ఈ జాతీయ ప్రదర్శనశాల ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఖడ్గమృగం ఢిల్లీ లో పెరిగిన పిల్లలందరి జ్ఞాపకాలలో తప్పకుండా ఉంటుంది. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో సహజంగా మరణించిన ఖడ్గమృగ కళేబరాన్ని తెచ్చి అది పాడవుకుండా రసాయనాలు వాడి ఈ ప్రదర్శనశాలలో ఉంచారు.

జాతీయ ప్రదర్శన శాల ప్రారంభమయిన నాటి నుండీ బడి పిల్లలకోసం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించింది. మిగిలిన అన్ని మ్యూజియంలు వస్తువులు ప్రదర్శనకు పెట్టి ఊరుకుంటే అందుకు భిన్నంగా ఈ ప్రదర్శన శాల స్వయంగా ప్రజలలోకి, పిల్లలలోకి వెళ్లి వారిని మ్యూజియం కార్యక్రమాలలో భాగమయ్యేలా చేసేది. అప్పటిలో ఎన్నో పాఠశాలలో ఉపాధ్యాయులకు పర్యావరణం పట్ల ఎన్నో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది.   

మ్యూజియం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో డాక్టర్ నాయర్ స్వయంగా పాల్గొనేవారు. తొంభైలలో ఉద్యోగ విరమణ చేసే వరకు ఆయన తన ఉద్యోగ తొలినాళ్లలో ఉన్న ఉత్సాహాన్నే కొనసాగిస్తూ పనిచేశారు. 2016 ఏప్రిల్ 26 న మ్యూజియంలో అగ్నిప్రమాదం జరిగి అందులో పొందుపరచిన జంతు, జీవజాలాల శిలాజాలన్నీ తగలబడిపోయాయన్న వార్త ఆయనను ఎంత బాధ పెట్టి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

డాక్టర్ నాయర్ తన ఉద్యోగ విరమణ తర్వాత కూడా పర్యావరణ విద్య మీద చురుకుగా పనిచేస్తూనే వచ్చారు. డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్-ఇండియా, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వంటి ప్రఖ్యాత సంస్థలలో పనిచేశారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన ఎంతో గౌరవాన్ని, గుర్తింపును పొందారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ లో నాచురల్ హిస్టరీ మ్యూజియం కమిటీ చైర్మన్ గా, ఇండో-యు.ఎస్. సబ్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ లోని జాయింట్ మ్యూజియం కమిటీ సభ్యునిగా కూడా ఆయన తన సేవలు అందించారు.

‘అంతరించిపోతున్న జంతుజాలం, వాటి సంరక్షణ’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించగా ఆగం కళా ప్రకాశన్ సంస్థ ఆయన మరొక పుస్తకం ‘బయో డీటీరియరేషన్ ఆఫ్ మ్యూజియం మెటీరియల్స్’ ను ప్రచురించింది. 

భారతదేశంలో పర్యావరణ విద్యను ఒక ఉద్యమంగా రూపొందించిన తొలితరం మార్గదర్శకులుగా డాక్టర్ నాయర్ మాకు ఎనభైల కాలం నుండి తెలుసు.

నేను పని చేసిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ లో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా, తర్వాత సీనియర్ కొలీగ్ గా ఆయన మాకు చూపించిన దారి మరువలేనిది. ఒక చిన్న స్వచ్చంద సంస్థగా ప్రారంభమయిన తొలినాళ్లలో ఈ సంస్థలో  పనిచేసిన వారందరికీ ఆయన అన్నా, ఆయన నెలకొల్పిన మ్యూజియం అన్నా అపారమైన గౌరవం ఉంది. వేరే ఏ ప్రాజెక్ట్ లు లేని తొలినాళ్లలో ఈ సంస్థ యొక్క, అక్కడి సిబ్బంది యొక్క సామర్ధ్యాన్ని గుర్తించి మ్యూజియంకు సంబంధించి ఎక్సిబిట్లు తయారు చేసే పనిని వారికి అప్పగించడం ద్వారా వారిలో ఎంతో స్ఫూర్తిని, ఆశను కలిగించారు. కొన్ని నెలల పాటు సిబ్బంది జీతభత్యాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా సమకూరడమే కాకుండా మొదటిసారి ఒక జాతీయ స్థాయి సంస్థకు పనిచేసిన అనుభవం కూడా సంస్థకు కలిగింది. అది సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

మాతో పనిచేసిన మీనా తండ్రిగా కూడా మాకు ఆయనతో పరిచయం ఉంది. ఆమె కూడా తండ్రి బాటలోనే పర్యావరణ పరిరక్షణ రంగంలోనే తన కెరీర్ ను ఎంపిక చేసుకుంది. 

ఒక తరం పిల్లలలో ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచిన జాతీయ మ్యూజియం ఇప్పుడు లేదు. కానీ డాక్టర్ నాయర్ స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 1937 నుండి 2021 వరకు జీవించిన డాక్టర్ నాయర్ గత వారం మరణించారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ

Post 39

–Based on a piece by Meena

సుందరలాల్ బహుగుణ కి నివాళి: Sundarlal Bahugunaji

1970, 80 లలో యువతకు అత్యధికంగా స్ఫూర్తినిచ్చిన ఉద్యమాలలో చిప్కో ఒకటి. ఈ ఉద్యమం యువతకు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగేలా చేయడమే కాదు శాంతియుతంగా ఉద్యమాలు నడిపే విధానాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది.

గాంధేయవాదం, సర్వోదయ ఉద్యమాలచే స్ఫూర్తి పొందిన సుందరలాల్ బహుగుణ, చండీప్రసాద్ భట్ ఈ చిప్కో ఉద్యమాన్ని ముందుండి నడిపిన కార్యశీలురు. పర్యావరణ వినాశనానికి ప్రజల సంక్షేమం, జీవనోపాధులకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకున్న తొలి ఉద్యమంగా చిప్కోని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉన్న తెహ్రి గరవాల్ ప్రాంతంలోని ప్రజలను సర్వోదయ పద్ధతులకు అనుగుణంగా సమీకరించడంతో పాటు వారి జీవనోపాధులు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో అంశాలపై బహుగుణ అనేక దశాబ్దాల పాటు పని చేశారు.

ఆ దశాబ్దాల తరబడి సాగిన కృషే చిప్కో ఉద్యమానికి బీజాలు వేసింది.

చిప్కో ఉద్యమ ప్రస్థానం 1970 వర్ష ఋతువులో ప్రారంభమయ్యింది. అలకనంద తో పాటు ఇతర హిమాలయా నదులన్నీ పోటెత్తి ఆ పక్కన లోయలోని గ్రామాలన్నింటినీ వరద నీటితో ముంచెత్తాయి. ఊర్లన్నీ నీటిలో మునిగి ఎంతో విధ్వంసం జరిగింది. కొండ వాలులలో ఉన్న వృక్షాలను కొట్టి వేసుకుంటూ పోవడమే ఈ ఉత్పాతానికి కారణం అయింది అని అక్కడి ప్రజలందరికీ స్పష్టంగా అర్ధమయ్యింది. అప్పటికి ఎన్నో సంవత్సరాల నుండి అటవీ కాంట్రాక్టర్ లు ఆ ప్రాంతంలోని చెట్లని నరికి కలపని నగరాలకు తరలిస్తున్నారు. దానితో కొండవాలులన్నీ పెళుసుగా మారి, నీటి ప్రవాహాన్ని ఆపలేక వరదలకు కారణమవుతున్నాయి. ఇంతే కాకుండా చెట్లని నరికేందుకు కాంట్రాక్టర్లకు అనుమతి నివ్వడం వలన తమ ఆహారం కోసం, వంట చెరకు కోసం, వైద్యం కోసం, కలప కోసం అడవిపై ఆధారపడి జీవించే స్థానికులకు ఆ చెట్లపై ఏ హక్కు లేకుండా పోయింది. అక్కడి అడవి అంతా ఓక్ చెట్లతో నిండి ఉంది. స్థానికులకు ఆ చెట్లతో ఎంతో అనుబంధం ఉంది. ఆ చెట్ల ఉత్పత్తులను వివిధ ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన ఉంది. అయితే కాంట్రాక్టర్లు ఆ చెట్లను నాశనం చేయడంతో పాటు చిర్ పైన్ చెట్లను అక్కడ పెంచడం మొదలుపెట్టారు. ఈ పైన్ చెట్లు అక్కడి వాతావరణానికి తగినవి కావు. స్థానికులకు వాటివలన ఉపయోగమూ లేదు. అయితే పైన్ కలపకి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్లు వాటిని పెంచడం ప్రారంభించారు. ఇవన్నీ కూడా అక్కడి స్థానికులలో అసహనానికి కారణమయ్యాయి.

1973 మార్చ్ లో ఒక ఉదయాన తొలిసారిగా ఉద్యమానికి అగ్గి రగులుకుంది. అలహాబాద్ లోని ఒక క్రీడా ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ కి సంబంధించిన మనుషులు చమోలీ జిల్లాలోని గోపేశ్వర్ గ్రామానికి వచ్చారు. అక్కడి చెట్లను నరికి క్రికెట్ బాట్ ల తయారీ చేయాలనేది వారి ఉద్దేశం.

గ్రామస్థులు ఆ చెట్లని ధ్వంసం చేసేటందుకు ఎంతమాత్రమూ సిద్ధంగా లేరు. ఆ చెట్లు నరికేందుకు వచ్చిన మనుషులను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అయితే వారికి చెట్లని నరకమని ఆదేశాలు ఉండడంతో వారు వెనక్కి వెళ్లేందుకు తిరస్కరించారు. గ్రామస్థులంతా కలిసి అప్పటికప్పుడు ఆలోచించుకుని తమ ప్రాణాలు పోయినా సరే ఒక్క చెట్టుని కూడా తాకనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. చిప్కో, చిప్కో (చెట్లని కౌగలించుకోండి) అని అరుచుకుంటూ ముందుకు నడిచారు. చెట్లను చుట్టుకుని వదలలేదు. ఏమి చేయాలో తెలియని ఫ్యాక్టరీ మనుషులు ఒక్క చెట్టుని కూడా నరకకుండానే తిరిగి వెళ్లిపోయారు.

ఆ పోరాటంలో వారు స్థానికులు విజయం సాధించారు. కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు నెలల తర్వాత గోపేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ ఫతా గ్రామం దగ్గర అడవిలో చెట్లను కొట్టేందుకు అటవీ అధికారుల నుండి కాంట్రాక్టర్లు అనుమతి సంపాదించారు.

ఈ వార్త గోపేశ్వర్ కు చేరింది. జనం మండిపడ్డారు. మొత్తం గ్రామంలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అంతా కలిసి ఒక ఉరేగింపులాగా ఫతా బాట పట్టారు. తప్పెట్లు, తాళాలు మోగిస్తూ దారిలోని అందరి దృష్టిని ఆకర్షించారు. “నన్ను నరకండి, చెట్టును మాత్రం నరకొద్దు” అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ ఫతా కు చేరుకున్నారు. దారిలో అనేక గ్రామాల ప్రజలు వారితో జత కలిశారు. వారందరి నోటి నుండి వెలువడిన ‘చిప్కో’ నినాదం ఆ అటవీ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.

చెట్ల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్న అంత పెద్ద జనసందోహాన్ని చూసిన కాంట్రాక్టర్ల మనుషులు తిరిగి ఉట్టి చేతులతో వెళ్ళక తప్పలేదు. 

తమ అడవిని, పర్యావరణాన్ని తాము కాపాడుకోగలమనే నమ్మకం స్థానికులలో బలపడింది.

అయితే కాంట్రాక్టర్లు కూడా తమ పధకాలు తాము రచిస్తూనే ఉన్నారు. లాభాల పంట కురిపించే చెట్లను అంత తేలికగా వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. ఒకసారి రేని గ్రామంలో మగవారు అంతా ఊరిలో లేరని తెలుసుకున్న కాంట్రాక్టర్లు ఇదే అదనుగా తమ మనుషులను చెట్లు కొట్టుకురమ్మని పంపారు. ఆ వార్త ఊరంతా తెలిసింది. గౌరా దేవి ఆధ్వర్యంలో ఊరిలోని మహిళలు, పిల్లలు ఊరేగింపుగా అడవి వైపు నడిచారు. ఈ మహిళలు తమనేమి చేయగలరులే అని వచ్చిన వారు ధీమాగా ఉన్నారు. వారి ఊహ తప్పని వెంటనే తెలిసింది. తాము అంతా చెట్లని కౌగలించుకుని ఉంటామని, ఒక్క చెట్టుని కూడా ముట్టుకోనివ్వమని గౌరా దేవి స్పష్టంగా చెప్పింది. “ముందు మమ్మల్ని నరకండి. అప్పుడే మా తల్లి లాంటి ఈ అడవి జోలికి వెళ్ళండి” అని మహిళలంతా ఎదురు నిలబడ్డారు.

మరొకసారి కాంట్రాక్టర్ల మనుషులు ఉట్టి చేతులతో తిరుగు ప్రయాణమయ్యారు. 

వారిని ఉట్టి చేతులతో పంపించడమే కాదు. మహిళలంతా కలిసి అసలా కాంట్రాక్టర్ల మనుషులు అడవిలోకి ఎటు నుండి వస్తున్నారు అని ఆలోచన చేశారు. వారు అడవిని చేరుకుంటున్న మార్గాన్ని కనిపెట్టారు. కొండవాలులో ఉన్న ఒక దారి గుండా వారు అడవికి వస్తున్నారు. కొండచరియలు విరిగి పడినప్పుడు ఆ దారి మధ్యలో విరిగిపోతే ఆ విరిగిన దారిని ఒక పెద్ద సిమెంట్ రాయి సహాయంతో కాంట్రాక్టర్లు దాటుతున్నారు. అది ఒక్కటే ఊరి వారి కంట పడకుండా అడవిలోకి రావడానికి కాంట్రాక్టర్లకు ఉన్న మార్గం. మహిళలంతా కలిసి చర్చించారు. ఒక బలమైన దుంగ సహాయంతో వారందరి బలం ఉపయోగించి ఆ సిమెంట్ రాయిని లోయలోకి తోసేశారు. ఇక ఆ దారిలోనుండి కాంట్రాక్టర్లు అడవిలోకి రాలేరు!

అలా మొదలైన చిప్కో ఉద్యమం ఆ ప్రాంతంలోనే కాదు దేశంలోనూ, ప్రపంచంలోనూ అనేకమందిలో పర్యావరణ స్పృహ పెరిగేలా చేసింది. 

సుందరలాల్ బహుగుణ హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కిలోమీటర్లు కాలినడకన తిరిగి ఈ ఉద్యమం పట్ల అన్ని ఊర్లలోని ప్రజలలో విస్తృతంగా చైతన్యం తేగలిగారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో మాట్లాడి 1980 నుండి దాదాపు 15 సంవత్సరాల పాటు పచ్చని చెట్లను నరకకుండా ఆదేశాలు తేగలిగారు. తెహ్రి డామ్ కు వ్యతిరేకంగా కూడా బహుగుణ గాంధేయమార్గంలో అనేక శాంతియుత ఉద్యమాలు నిర్వహించారు. 

ప్రజా సంక్షేమం కోసం తాను నమ్మిన మార్గంలో రాజీ లేకుండా నడిచిన అరుదైన వ్యక్తిత్వం బహుగుణది. అటువంటి వ్యక్తులు తమ వారసత్వంగా మనకి అందించిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అనేదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న!

— Based on a piece by Meena