మన బంగాళాదుంపల కథ: Portrait of a Potato

కాలరీల గురించి లక్ష్యపెట్టకుండా బంగాళాదుంపలను ఇష్టంగా తినేవారిలో నేను ఒకదానిని. వాటి మీద ఉన్న ఇష్టం వల్లనేమో పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అనే పోటీ జరుగుతుందని తెలిసి ఎంతో ఆనందపడ్డాను. 2020 లో ఈ పోటీలు ప్రారంభమయితే 2021 సంవత్సరానికి పోటీల ఫలితాలు మొన్న ఆగస్టులో వెలువడ్డాయి. గెలుపొందిన ఫోటోలను చూస్తే ఆ ఫోటోగ్రాఫర్ లు కూడా ఆ కూరగాయపట్ల ఎంతో ప్రేమతో, అభిమానంతో ఫోటోలు తీశారు అనిపించింది. కంటితో కవిత్వాన్ని చూస్తున్నట్లు అనిపించాయి.

Potato Photo Competition
One of the winners of the Potato Photo Competition 2021!

ఈ పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీకి మార్టిన్ పార్ వంటి ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్ లు జడ్జీలుగా ఉన్నారు. దాదాపు రెండువేల పౌండ్ల విలువ గల బహుమతులు (ఒక లెన్స్ కిట్, కెమెరా కేసు, బ్యాక్ ప్యాక్, ఒక ఫోటోగ్రఫీ వర్కుషాప్ లో ఉచితంగా పాల్గొనే అవకాశం, కొన్ని ఫోటోగ్రఫీ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్) విజేతలకు అందించారు. బంగాళాదుంపల మీద ప్రేమను ఇలా ఫోటోల రూపంలో వ్యక్తపరచడమే కాకుండా ఈ పోటీలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు గా ఔత్సాహికులు చెల్లించిన మొత్తాన్ని (ఒక్కొక్కరు ఐదు పౌండ్లు) బ్రిటన్లో పేదల కోసం ఫుడ్ బ్యాంకు ను నిర్వహిస్తున్న ట్రుస్సెల్ ట్రస్ట్ కు విరాళంగా ఇవ్వడం మరొక మంచి విషయం.

దుంప జాతికి చెందిన ఈ మొక్కకు సోలనుమ్ ట్యూబేరోసుమ్ అనేది శాస్త్రీయనామం. నైట్ షేడ్ కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలాలు పెరూవియన్-బొలీవియన్ ఆండిస్ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహార పంటలలో ఒకటిగా ఉంది. బంగాళాదుంపలో శరీరానికి అవసరమైన విటమిన్ సి, ప్రోటీన్, థయామిన్, నియాసిన్ అధికంగా లభిస్తాయి.

దాదాపు 1800 సంవత్సరాలకు పూర్వమే దక్షిణ అమెరికాలో ఇంకాలు బంగాళాదుంపల సాగును భారీస్థాయిలో ప్రారంభించారు. 16 వ శతాబ్దపు రెండవ భాగంలో దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్న స్పానియార్డ్ లు వాటిని యూరప్ కు పరిచయం చేశారు. 17 వ శతాబ్దం చివరి నాటికి ఐర్లాండ్ లో బంగాళాదుంపలే ప్రధాన పంటగా మారాయి. 18 వ శతాబ్దం చివరినాటికి జర్మనీ, పశ్చిమ ఇంగ్లాండ్ తో సహా ఐరోపా ఖండంలోని అనేక ప్రాంతాలలో దుంపలను భారీ స్థాయిలో పండించడం ప్రారంభించారు. ఐరిష్ ఆర్ధికవ్యవస్థ దాదాపుగా బంగాళాదుంపల సాగుపైనే ఆధారపడి ఉంది. 19 వ శతాబ్దం మధ్యలో దుంప చెట్లకు సోకే లేట్ బ్లెయిట్ వ్యాధి కారణంగా ఆ దేశం మొత్తం మీద బంగాళా దుంపలు ఎక్కువగా పండకపోవడంతో ఏర్పడిన బంగాళాదుంపల కరువు అక్కడి ఆర్ధిక వ్యవస్థను, జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

16 వ శతాబ్దం చివరిలో లేదా 17 వ శతాబ్దపు తొలినాళ్లలో మనదేశంలోకి ప్రవేశించిన పోర్చుగీసు, డచ్ ఓడల ద్వారా మనదేశంలోకి కూడా బంగాళాదుంపలు మొదటిసారి ప్రవేశించాయి. ఇప్పుడు ప్రపంచంలో బంగాళాదుంపల సాగులో మనదేశం మూడవస్థానంలో ఉంది. 2017 సంవత్సరంలో దేశంలో దాదాపు 4.9 కోట్ల టన్నుల దుంపలు సాగు అయ్యాయి. ఈ బంగాళాదుంపలు మనకి ఆహారపదార్ధంగా ఉపయోగపడటమే కాక స్థానిక, అంతర్జాతీయ మార్కెట్ లలో మంచి ధరను అందిస్తూ రైతులకు మంచి ఆదాయమార్గంగా మారాయి.

పోర్చుగీసు, డచ్ ఓడల ద్వారా దేశంలో ప్రవేశించిన దుంపల సాగు మొదట్లో మలబారు తీర ప్రాంతానికే పరిమితమయ్యింది. బ్రిటిష్ వారి పరిపాలనలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సాగు విస్తరించింది. దేశంలో అప్పటివరకు స్థానికంగా సాగు అవుతున్న కూరగాయల స్థానంలో బ్రిటిష్ వారి ఆహారంలో ఎప్పటి నుండో భాగంగా ఉన్న బంగాళాదుంపల వంటి కూరగాయల సాగును ప్రోత్సహించాలని అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. దానితో వారు దుంపల సాగు గురించి ఎంతో ప్రచారం చేసి దేశంలోని మూలమూలకు దానిని చేర్చారు. రైతులకు విత్తనాలు ఉచితంగా ఇచ్చి మరి దుంపల సాగుకు ప్రోత్సహించారు. అప్పట్లో దేశంలో వరిసాగులో తరచుగా సమస్యలు తలెత్తి పంటలు దెబ్బతింటుండటంతో రైతుల సమస్యలు తీరేందుకు వరి స్థానంలో బంగాళాదుంపల సాగు చేయడమే సరైన ప్రత్యామ్నాయం అని కూడా వారు విస్తృతంగా ప్రచారం చేశారు.

ఏదేమైనా ఇప్పుడు బంగాళాదుంపలు లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. అలా ఊహించడానికి ఇష్టపడను కూడా. 

ఒకవైపు పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అని పోటీలు నిర్వహిస్తూ దుంపలపై అభిమానాన్ని చాటుకుంటుంటే లక్కీ అడ్కిన్స్ వంటి కొందరు రచయితలు బంగాళాదుంపలపై కవిత్వాన్ని కూడా రాశారు.

మన దేశంలో పండే వివిధరకాల బంగాళాదుంపల జాతుల పేర్లు కూడా కవిత్వానికి తక్కువగా లేవు. కుఫ్రి జవహర్, కుఫ్రి చంద్రముఖి, కుఫ్రి సట్లెజ్, కుఫ్రి బాహర్, కుఫ్రి ఆనంద్, కుఫ్రి అశోక, కుఫ్రి ఫుఖ్రాజ్, కుఫ్రి సింధూరి, కుఫ్రి జ్యోతి, కుఫ్రి మేఘ, కుఫ్రి లువకర్, కుఫ్రి స్వర్ణ వంటివి ఆ పేర్లలో కొన్ని. ఈ కుఫ్రి అనే పేరు హిమాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా బంగాళాదుంపలు పండించే కుఫ్రి ప్రాంతం నుండి వచ్చింది అనుకుంటాను. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన పరిశోధనా కేంద్రం కూడా ఈ కుఫ్రి ప్రాంతంలోనే ఉంది.

మన ఆహారంలో ఇంతగా భాగమయ్యి మన జిహ్వకి ఆహ్లాదాన్నందిస్తున్న ఈ బంగాళాదుంపల ప్రస్థానం మానవజాతి కొనసాగినంతకాలం కొనసాగుతూనే ఉంటుందని ఆశిస్తాను.

Post 40

Based on a piece by Meena

కాఫీ, బోర్నవిటా, హార్లిక్స్: Coffee, Bournvita or Horlicks?

ఏమి తీసుకుంటారు? ఒక సాయంత్రం మా ఇంటికి వచ్చిన స్నేహితులు కిరణ్, జగదీప్ లను మా అమ్మ అడిగింది

వాళ్ళ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఇంటికి వచ్చిన అతిధులకు ఇలా బోర్నవిటా, హార్లిక్స్ వంటి పానీయాలను ఇవ్వడం మనకి దక్షిణ భారతదేశంలో కొంత సహజమే కానీ ఉత్తర భారతదేశంలో అది కొంచెం అసహజంగా కనిపించే విషయమే. చివరకి వారు హార్లిక్స్ కావాలని అడిగి తాగారు. దానిని బాగా ఇష్టపడ్డారు. వారికి అది ఎంతగా నచ్చిందంటే అది మళ్ళీ తాగాలనిపించి ఇంట్లో రోజూ తాగేందుకు వీలుగా ఒక పెద్ద హార్లిక్స్ సీసా కొనుక్కుని ఇంటికి వెళ్ళారు.

ఇటువంటి పానీయాలన్నీ మన చిన్న నాటినుండీ అలవాటుగా తాగుతూ వస్తున్నవే. అవి శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకి ఎంత నమ్మకం అంటే వీటిలో ఏదో ఒకటి మన వంటింట్లోని అలమరలలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అవి పిల్లలకు ఇవ్వడం మాత్రమే కాదు. ఇంట్లోని ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఏదైనా కొంచెం నలతగా ఉన్నా, కాఫీ,టీ లు కాకుండా వేరే ఏదైనా తాగాలనిపించినా వీటినే తాగడం సర్వసాధారణం. అంతేకాకుండా, కొన్ని రాష్ట్రాలలో ఇంటికి వచ్చిన అతిధులకు కూడా ఈ పానీయాలను ఇవ్వడం సాధారణంగా జరిగేదే.

మన జీవితాలలో ఇంతగా భాగమయిపోయిన ఈ పానీయాలు అసలేమిటి?

భారతదేశంలో అన్నిటికిన్నా విరివిగా వినియోగంలో ఉన్నది హార్లిక్స్. హార్లిక్స్ కు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ మనదేశం. ఈ పానీయం యొక్క మూలాలు తెలుసుకోవాలంటే మనం 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1873 లో జేమ్స్ హార్లిక్స్ అనే ఫార్మసిస్ట్ తన సోదరుడు విలియం తో కలిసి చికాగోలో జె&డబ్ల్యు హార్లిక్స్ అనే కంపెనీ ని స్థాపించాడు. ఈ కంపెనీ పేటెంట్ పొందిన మాల్టెడ్ డ్రింక్ ను తయారు చేసేది. మొదట్లో ఇది పసి పిల్లలకు మాత్రమే ఇచ్చే ఆహారంగా మార్కెట్ చేయబడిన తర్వాత కాలంలో ముసలి వారికి, ప్రయాణాలు చేసేవారికి కూడా శక్తి నిచ్చే పానీయంగా మార్కెట్ చేయడం జరిగింది. 20 వ శతాబ్దం మొదట్లో దీనిని ఆహారానికి బదులుగా తీసుకోగలిగిన పానీయంగా ప్రచారం చేశారు. మన దేశం విషయానికి వస్తే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ ఆర్మీ తరపున యూరప్ కి పంపబడిన మన సైనికులు తిరిగి వస్తూ ఈ హార్లిక్స్ ను మనదేశానికి తీసుకు వచ్చారు. పంజాబ్, బెంగాల్, మద్రాస్ రాష్ట్రాల ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడి ఆదరించారు. 1940, 50 లలో ఇది ఇంట్లో ఉండడం ఒక స్టేటస్ సింబల్ గా భావించేవారు.

ఆ తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఒకే ఫ్లేవర్ లో దొరికే హార్లిక్స్ మన జీవితాలలో భాగం అయిపొయింది. ఇప్పుడు ఇలాచీ, కేసర్ బాదం వంటి ఎన్నో ఫ్లేవర్ లలో హార్లిక్స్ లభిస్తుంది. అలాగే ఇప్పుడు వివిధ వయసుల వారికి, వివిధ జెండర్ లకు తగినట్లు వేరు వేరు రకాల హార్లిక్స్ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. 

హార్లిక్స్ లో ఉండే ఒక ప్రత్యేక గుణం ఏమిటంటే ఇది అంత తేలికగా కరగదు. ఎంత ప్రయత్నం అవసరమని! ఒక స్పూన్ తో కొంచెం పొడిని గ్లాస్ లో వేసి వేడి వేడి నీళ్ళు కొంచెం పోసి బాగా కలిపితే కొంచెం కరుగుతుంది. మధ్యమధ్యలో అక్కడక్కడా ఉండలు కనిపిస్తే స్పూన్ ని వెనక్కి తిప్పి ఉండలను గ్లాస్ అంచుకు వేసి నొక్కితేనే  అవి పూర్తిగా కరుగుతాయి. అప్పుడు వేడి పాలను పోసుకుని కలుపుకుని తాగాలి. ఇంత చేసినా ఒక్కోసారి గ్లాస్ చివరిలో ఉండలు కనిపిస్తూనే ఉంటాయి.

హార్లిక్స్ వంటి ఇతర పానీయాలతో మరీ ఇంత సమస్య ఉండదు.

హార్లిక్స్ తో పోలిస్తే బోర్నవిటా ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన పానీయం అనే చెప్పాలి దీనిని 1920 లలో ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే మన దేశ మార్కెట్ లోకి 1948 మాత్రమే ఈ పానీయం అడుగుపెట్టింది. ఈ మాల్టెడ్ చాక్లెట్ మిక్స్ ను క్యాడ్బరీ తయారు చేసింది. వారి ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన ఆదర్శగ్రామం బోర్నవిల్లే పేరు మీద దానికి బోర్నవిటా అనే పేరు పెట్టడం జరిగింది. వెన్న తీయని పాలు, తాజా  గుడ్లు, మాల్ట్, చాక్లెట్ లతో తయారయిన ఈ పానీయాన్ని ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా మార్కెట్ చేశారు.

ఇక ఓవాల్టిన్ విషయానికి వస్తే ఇది స్విట్జర్లాండ్ లో తయారయ్యింది. అక్కడ దీనిని వోవోమల్టిన్ అని పిలుస్తారు. ఓవం (గుడ్లు), మాల్ట్ అనే రెండు పదాల కలయికతో దానికి ఆ పేరు వచ్చింది. 1909 లో అది యుకె మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది. అక్కడ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో అప్లికేషన్ మీద పేరు తప్పుగా రాయడంతో దానిపేరు ఓవాల్టిన్ గా మారిపోయింది. ఇక ఇంగ్లీష్ మార్కెట్ లో అదే పేరుతో స్థిరపడిపోయింది మొదట్లో మాల్ట్, గుడ్లు, కోకో తో తయారుచేయడిన ఈ ఉత్పత్తి తర్వాత కాలంలో అనేక ఇతర రకాల ఫ్లేవర్ లలో, రుచులలో కూడా లభిస్తుంది. భారతదేశంలో, యుకె లో అమ్ముడయ్యే ఓవాల్టిన్ లో ఇప్పుడు గుడ్లు ఉండడం లేదు.

వీటన్నింటికీ భిన్నంగా కాంప్లెన్ పూర్తిగా మిల్క్ ప్రోటీన్ తో తయారవుతుంది. 1942 లో యుకె లో దీనిని రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు కేవలం కొద్దిపాటి రేషన్ మాత్రమే తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేవారు. దీనితో వారికి తేలికగా తీసుకువెళ్లగలిగేలా, తొందరగా శక్తినివ్వగలిగేలా ఉండే పానీయం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దీనిని తయారు చేయడం జరిగింది. భారత దేశపు మార్కెట్ లో 1964 లో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.

చాలామందికి అంతగా పరిచయం లేని మరొక పానీయం రాగిమాల్ట్. ఇప్పుడైతే నాకు మార్కెట్ లో దొరకడం లేదు. నారింజ రంగులో ఉండే ఈ పానీయం పిల్లలకోసం అని ఉద్దేశించబడినప్పటికీ అందరూ ఇష్టపడేంత తీయగా ఉండేది.

వీటిలో చాలా పానీయాలు ఇప్పుడు అనేక దేశాలలో లభించడం లేదు. ఉదాహరణకు 2008 నుండి యుకె లో బోర్నవిటా ను అమ్మడం లేదు. ఇప్పుడు అందరి అభిప్రాయాలు అభిరుచులు మారిపోవడం, పోషణ పట్ల ప్రజలకు ఉన్న అవగాహనలో వస్తున్న మార్పు, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు, వేగనిజం వంటి కొత్త ధోరణుల మధ్య ఈ పానీయాలు ఎంత కాలం ఇంకా మనుగడలో ఉంటాయో అనిపిస్తుంది.

వెళ్ళి ఇప్పుడే ఒక బాటిల్ తెచ్చుకుందామా?

–From a piece by Meena

మహిళలు-టాయిలెట్లు: Toilet Travails

పట్టణాలలో మనం చూసే పే అండ్ యూజ్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలోని కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకున్నాను. అవి నిజంగా ఎంతో ఆసక్తికరమైనవి. అయితే వాటి గురించి మరొక సందర్భంలో మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో పే అండ్ యూజ్ టాయిలెట్ల నిర్మాణం గురించి ఆలోచన చేసినప్పుడు మేము చేసిన ఒక సర్వే గురించిన వివరాలు తెలియచేస్తాను.

ఈ సర్వే నిర్వహించి దాదాపు దశాబ్దం గడిచింది. అయినా ఈ సర్వే ద్వారా మేము తెలుసుకున్న సమస్యలు ఇప్పటికీ దాదాపు అలాగే ఉండడం విచారకరం.

దాదాపు 400 మంది మహిళలతో నిర్వహించిన ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

 • దాదాపు నాలుగింట ఒక వంతు మందికి మహిళలకోసం పే అండ్ యూజ్ టాయిలెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న విషయమే తెలియదు.
 • బయటకు వెళ్ళినప్పుడు టాయిలెట్ కు వెళ్ళవలసిన అవసరం వచ్చినా ఆపుకుని ఇంటికి చేరే వరకూ ఎదురు చూస్తామని దాదాపు సగం మంది మహిళలు తెలియచేసారు.
 • పేద మహిళలు, ప్రతిరోజూ బయట పనికి వెళ్ళే మహిళల కన్నా ధనికులైన మహిళలు, గృహిణులు, విద్యార్థినులు ఈ టాయిలెట్ లను చాలా తక్కువగా వినియోగిస్తున్నారు.
 • ఈ టాయిలెట్లు వినియోగించిన వారిలో 64.2 శాతం మంది తమకు చాలా అసౌకర్య అనుభవం ఎదురైందని చెప్పారు. వారు పేర్కొన్న అసౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి.
అసౌకర్య కారణంపేర్కొన్న మహిళల శాతం
అపరిశుభ్రత92.5
తగినన్ని నీరు లేకపోవడం69.2
దుర్గంధం 62.8
కేర్ టేకర్ గా మగవారు ఉండడం57
మగవారి, ఆడవారి టాయిలెట్లు ఒకే చోట ఉండడం53
అభద్రతా భావం36.4

ఈ సమస్యలను పేర్కొన్న మహిళలంతా కొన్ని విలువైన సూచనలు కూడా చేశారు.

 • మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉండాలి అని 53% మహిళలు చెప్పారు
 • టాయిలెట్ల ను నిర్వహించే కేర్ టేకర్ కు మర్యాదపూర్వకంగా ప్రవర్తించేలా తగిన శిక్షణ ఉండాలని, వారు చదువుకుని ఉండి, మధ్య వయసులో ఉన్నవారైతే బాగుంటుందనీ 57% మంది మహిళలు అభిప్రాయపడ్డారు
 • టాయిలెట్లలో సానిటరీ నాప్కిన్ల వంటివి పారవేయడానికి డస్ట్ బిన్లు, మహిళలు తీసుకువెళ్ళే వస్తువులు పెట్టుకోవడానికి చిన్న అరలు, మగ్గు, బకెట్లు, మంచి వెలుతురు ఉండాలని అనేక మంది మహిళల అభిప్రాయం
 • రకరకాల నేపధ్యాల నుండి వచ్చిన వారి అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ టాయిలెట్లు, వెస్ట్రన్ టాయిలెట్లు రెండూ ఉండాలనేది మరొక అభిప్రాయం.
 • భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి
 • సరైన నిర్వహణ, ఎప్పటికప్పడు శుభ్రం చేస్తుండడంతో పాటు సమగ్ర పర్యవేక్షణ ఉండాలి
 • కొన్ని చోట్ల టాయిలెట్ల చుట్టూ ఉండే కొద్దిపాటి స్థలాన్ని మగవారు టాయిలెట్ల లాగా ఉపయోగిస్తున్నారు. దానివలన దుర్వాసన తో పాటు టాయిలెట్లో కి అడుగుపెట్టడానికి కూడా మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది
 • చాలా చోట్ల “మగవారి”, “ఆడవారి” టాయిలెట్ల ను సూచించే గుర్తులు సరిగా సూచించబడి లేవు. దానివలన కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు.

దశాబ్దం క్రితం మేము ఈ సర్వే నిర్వహించినప్పటికన్నా ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ల సంఖ్యా బాగా పెరిగింది. వాటి నిర్వహణ కూడా మెరుగయ్యింది. అయినా ఇంకా చాలా విషయాలలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ మెరుగుపడవల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ని సమస్యలపై దృష్టి పెట్టి పని చేస్తే కానీ మన టాయిలెట్లు మెరుగుపడి మహిళల ఇబ్బందులు తీరే అవకాశం లేదు.

–From a piece by Meena

ఫ్రూట్ సలాడ్: Fruit Salad

గత వారం ఎవరో మాకు రూపం మరియు రంగులో పరిపూర్ణంగాఉన్న ఒక పండు ఇచ్చారు.  దానిపేరు పెర్సిమోన్ అని చెప్పారు.. నేనుజపనీస్ సాహిత్యంలో పెర్సిమోన్ యొక్క వర్ణనలను, దాని పైన అనేకకవితలను చదివాను. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఈ విదేశీపండును చూడలేదు, దాని రుచి గురించి అసలు తెలియదు.  

ఇప్పుడు భారతదేశంలో విక్రయించబడుతున్న అనేక అన్యదేశపండ్లలో ఇది ఒకటి. మనం ఒకప్పుడు తింటూ పెరిగిన నేరేడు, సీతాఫలం, జామ, అరటిపండ్లు వంటి పండ్ల కన్నా మన పిల్లలకుకివి, డ్రాగన్ ఫ్రూట్ వంటి వాటి రుచి ఎక్కువగా తెలుసు.

ఇప్పుడు ఎన్నో కొత్త రకాల పండ్లను మన దేశంలోనే పండిస్తుండడం, ఇతర దేశాల నుండి అనేక రకాల పండ్లను దిగుమతిచేస్తుండడంతో ఏవి స్థానికమైనవి, ఏవి ఇతర దేశాలకు చెందినవిఅనే విభజన రేఖ చిన్నగా చెరిగిపోతూ ఉంది. ఇప్పుడు పండ్లనునిల్వ చేసే సదుపాయాలు కూడా మెరుగుపడడంతో అన్ని పండ్లుఅన్ని సీజన్ లలోనూ దొరుకుతున్నాయి. 

మన పండ్లను గురించి, వాటి మూలాల గురించి తెలుసుకోవాల్సినఅవసరం బహుశా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ‘ఎ హిస్టారికల్ డిక్షనరీఆఫ్ ఇండియన్ ఫుడ్’ అనే పుస్తకం సహాయంతో నేను పండ్లగురించి చాలా వివరాలు తెలుసుకున్నాను. వాటిలో కొన్నిఆసక్తికరమైన వివరాలు మీకోసం.   

మనకి లభించే ఆహార పదార్ధాలలో పండ్లు ‘ఫల’ అనే వర్గానికిచెందినవి. దీని అర్ధం వరి, పప్పు ధాన్యాల లాగా నాగలితో దున్నిపండించవలసిన అవసరం లేనివి. 

దా

నిమ్మ, నేరేడు, ఉసిరి, నిమ్మ, మామిడి, చెరుకు, ద్రాక్ష, అరటి, కొబ్బరి, పనస వంటివి చారిత్రాత్మకంగా భారతదేశానికి చెందినఫలాలు. వీటి గురించిన ప్రస్తావన మన వేద సాహిత్యంలోఉండడమే కాకుండా అనేక పురాతన వైద్య విధానాలలో కూడా ఈపండ్లను వినియోగించే పద్దతి ప్రస్తావించబడి ఉంది.

వీటిలో అనేక రకాల పండ్లు ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో వండర్ఫుడ్స్ గా గుర్తించబడ్డాయి. ఉసిరి, రేగు పండ్ల వంటివి విటమిన్ సిఅధికంగా ఉండే పండ్లుగా ప్రపంచ ఖ్యాతి పొందాయి. 

ఇటీవల కాలంలో ఆపిల్, మల్బరీ, ఆప్రికాట్ వంటి పండ్లు కూడాఆరోగ్యానికి మేలు చేసేవిగా గుర్తింపు పొందాయి. ఇవి గతంలో అంతనాణ్యమైనవిగా లేకున్నప్పటికీ మొఘలుల కాలంలో గ్రాఫ్టింగ్ ద్వారావీటి నాణ్యతను మెరుగుపరచడం జరిగింది.

క్రీస్తు శకం 1500 సంవత్సరం తర్వాత బొప్పాయి, సపోటా, జామ, అనాస, సీతాఫలం, అవొకాడో వంటి పండ్లు దక్షిణ, మధ్య అమెరికాదేశాల నుండి దిగుమతి చేసుకోబడ్డాయి. అయితే ఇక్కడ కూడావీటిని విస్తృతంగా పండించడం మొదలయ్యాక ఇవి కూడా స్థానికపండ్లుగా మారిపోయాయి.

పురాతన వైద్య విధానాలపై మనకు లభిస్తున్న తొలిపుస్తకమైనసుశ్రుత సంహితలో పండ్లను ఆహారంలో భాగంగా ఏ విధంగామార్చుకోవాలో వివరంగా ఉంది. భోజనం చేసేటప్పుడు తొలిగాపండ్లను తీసుకోవాలని అందులో మొదటగా దానిమ్మ, ద్రాక్ష వంటినమిలి తినవలసిన పండ్లను, తర్వాత చెరకు, ఖర్జూరం, మామిడివంటి పండ్లను తీసుకోవాలని ఈ పుస్తకం సూచిస్తుంది. 

మామిడి, నిమ్మ వంటి పండ్లను పచ్చళ్ళ రూపంలో నిల్వ చేయడంమన దేశంలో సాంప్రదాయంగా వస్తున్న అలవాటు. గుజరాత్ వంటిరాష్ట్రాలలో తీయటి, పుల్లటి పచ్చళ్ళ రూపంలో కూడా నిల్వ చేస్తారు. ముస్లింల యునాని వైద్య పద్దతి ప్రాచుర్యం లోకి వచ్చాక పండ్లనుచిక్కటి పంచదార పాకం రూపంలోకి మార్చి వాటికి అల్లం, చెక్క, లవంగాల రుచిని అద్ది చేసే మురబ్బాలు పండ్లను నిల్వ చేసేపద్దతిగా వెలుగులోకి వచ్చింది.

పండ్లను పులియబెట్టి మద్య పానీయాల తయారీకి వాడడం కూడాఅధికంగా ప్రాచుర్యంలో ఉంది. ఆయుర్వేద వైద్య విధానాలపైఅందుబాటులో ఉన్న అత్యంత ప్రాచీన పుస్తకం చరక సంహితలో ఈమద్యం యొక్క తయారీకి వాడదగిన పండ్లుగా చెరకు (దానిఅనుబంధ ఉత్పత్తులైన మొలాసిస్, బెల్లం), ద్రాక్ష, మామిడి, వెలగపండు, ఖర్జూరాలు, అరటి, పనస, దానిమ్మ వంటి పండ్లుసూచించబడి ఉన్నాయి.

ఈ పచ్చళ్ళు, పండ్లతో చేసిన వైన్ లను ఏ ఋతువులోవినియోగించినా బాగుంటుంది కానీ మామిడి, పుచ్చకాయ వంటిపండ్లు శీతాకాలంలో దొరికితే కొంత వింతగానే అనిపిస్తుంది. మండువేసవిలో తొలిసారిగా మామిడి ముక్కని కొరకడం, దీపావళిసమయంలో వచ్చే సీతాఫలాలకై ఎదురు చూడడం మనందరిజీవితంలో భాగంగా మారిపోయాయి. ఈ స్థానికంగా ఋతువులవారీగా దొరికే పండ్లను తినడంలోని ఆనందం ఎప్పుడైనా దొరికే ఈడ్రాగన్ ఫ్రూట్, పెర్సిమ్మోన్స్ వంటి విదేశీ పండ్లను తినడంలో ఎప్పటికీదొరకదు అని నాకు అనిపిస్తుంది.

2021 ని అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరంగాప్రకటించారు. ఈ ఏడాదైనా మనం తింటున్న పండ్లు ఏమిటి, వాటిమూలం ఏమిటి, ఎక్కడ నుండి వచ్చాయి, మనకు అందుబాటులోకిఎలా వస్తున్నాయి, వాటిని ఎలా తింటున్నాం, ఎంత ఆస్వాదిస్తున్నాంఅని ఆలోచిస్తే బాగుంటుందేమో. పండ్లకి ఇంగ్లీష్ పదమైన ఫ్రూట్ కిమూలం లాటిన్ పదం ఫ్రూక్టస్. దీనికి అర్ధం ఆస్వాదించడం. మనంతింటున్న ప్రతి ఒక్క పండును దాని గురించి తెలుసుకుంటూఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. 

—Based on a piece by Mamata

మహిళలు-వాక్సిన్లు: Women and the Vaccine

మొత్తానికి కోవిద్ వాక్సిన్ వచ్చింది. వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది మొదటగా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ వాక్సిన్ రూపకల్పనకు ఎన్నో దేశాలు ఎంతో మంది శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు శ్రమించిన విషయం మనకు తెలుసు. అందులో ఎంతోమంది మహిళలు కూడా ఉన్నారు. ఈ 21 వ శతాబ్దంలో సైన్స్ లో మహిళల పాత్ర గురించి మనం పెద్దగా చర్చించుకోనవసరం లేదు. అన్ని రంగాలలోనూ మహిళలు దూసుకుపోతున్న ఈ కాలంలో వాక్సిన్ ల తయారీలో కూడా మహిళలు ప్రముఖ పాత్రనే పోషించారు. ప్రొఫెసర్ సారా గిల్బర్ట్, డాక్టర్ కిజ్మెకియా కార్బెట్, డాక్టర్ నీతా పటేల్ కోవిద్ వాక్సిన్ తయారీలో ప్రముఖంగా వినిపించిన పేర్లు. నీతా పటేల్ మాటల్లో చెప్పాలంటే సైన్స్ లాబ్ లో చాలా వరకు పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే వాక్సిన్ తయారీలో మహిళల పేర్లు ప్రధానంగా వినిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

అయితే గతంలో పరిస్థితి ఇలా లేదు. మహిళలు వాక్సిన్ ల తయారీలో ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ వారికి ఎప్పుడూ తగినంత గురింపు రాలేదు.

ఇరవై శతాబ్దపు తొలినాళ్లలో పోలియో అతి భయంకరమైన వ్యాధి. అది సోకితే కొందరు చనిపోవడం, మరెంతో మందికి కాళ్ళు చచ్చుబడిపోవడం జరిగేది. ఇప్పటికీ ఈ వ్యాధికి మందు లేదు. వాక్సినేషన్ ద్వారా వ్యాధి సోకకుండా అరికట్టడం మాత్రమే చేయగలం. పోలియో వాక్సిన్ ను కనిపెట్టిన ఘనత జోనస్ సాక్ దే అనడంలో ఏ సందేహమూ లేదు. అయితే ఈ వాక్సిన్ కనిపెట్టడంలో మరొక ఇద్దరు మహిళలు చేసిన కృషి మాత్రం ఏ గుర్తింపుకు నోచుకోలేదు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ ఇసాబెల్ మోర్గాన్ వారిలో ఒకరు. పోలియో కు సంబంధించిన హోస్ట్ ఇమ్మ్యూనిటి ని, వాక్సిన్ రూపకల్పనలో జీవించి ఉన్న వైరస్ కి బదులుగా మరణించిన వైరస్ ను వాడే ప్రక్రియను అర్ధం చేసుకోవడంలో ఆమె చేసిన కృషి ఈ వాక్సిన్ పరిశోధనలను పెద్ద మలుపు తిప్పింది. గుర్తింపుకు నోచుకోని రెండవ మహిళ యేల్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ డొరొతి హోస్టమన్. ఆమె తన బృందంతో కలిసి చేసిన కృషి వల్లనే పోలియో కు చుక్కల మందు కనిపెట్టడం సాధ్యమయ్యింది.

Suchitra Ella. Co-founder, Joint MD. Bharat Biotech, Manufacturers of Covaxin.

ఈ రోజున మనం అనేక వ్యాధులను నిర్మూలించి ఒక భద్రమైన ప్రపంచంలో జీవిస్తున్నామంటే అందుకు అనేక మంది మహిళలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. డిప్తీరియా కు వాక్సిన్ కనుగొన్న డాక్టర్ అన్నా వెస్సెల్స్ విలియమ్స్; కోరింత దగ్గుకి వాక్సిన్ కనుగొన్న డాక్టర్ పెర్ల్ కెండ్రిక్ మరియు గ్రేస్ ఎల్డరింగ్; మెనింజైటిస్, న్యుమోనియా వాక్సిన్ల తయారీలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ మార్గెరిట్ పిట్మాన్; గర్భాశయ కాన్సర్ కు వాక్సిన్ ల అభివృద్ధికి తోడ్పడిన డాక్టర్ అన్నే సరెవ్స్కి, పిల్లలలో తరచుగా వచ్చే డయేరియా కు కారణమైన రోటా వైరస్ కు వాక్సిన్ తయారు చేసిన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ రూత్ బిషప్ వీరిలో కొందరు మాత్రమే.

అయితే వీరందరికన్నా అద్భుతమైన కథ మరొకటి ఉంది. అది పాశ్చాత్య ప్రపంచానికి రోగనిరోధక శక్తి అనే భావనను తొలిసారిగా పరిచయం చేసిన లేడీ మేరీ మాంటాగ్ కథ. 1689 లో జన్మించిన ఈమె సాధించిన విజయాలు అనేకం. అయితే వాక్సిన్ ల రూపకల్పనలో ఆమె పాత్ర గురించి మాత్రమే ఇక్కడ చర్చించబోతున్నాం. ఆమె చాలా తెలివైన, అందమైన స్త్రీ. అయితే 1715 లో మశూచి సోకి ఆమె అందమైన మొహం అంతా స్ఫోటకపు మచ్చలతో వికారంగా మారింది. దానికి ముందు ఆమె సోదరుడు కూడా మశూచి సోకి చనిపోయాడు.దానితో సహజంగానే ఆమె తన పిల్లలు ఎవరికీ ఈ వ్యాధి సోకకూడదని ఎంతో ఆందోళన పడింది. 1716 లో లేడీ మేరీ భర్త లార్డ్ ఎడ్వర్డ్ మాంటాగ్ కాన్స్టాంటినోపుల్ కు రాయబారిగా నియమించబడ్డారు. అక్కడ ఆమె టర్కిష్ మహిళలతో సన్నిహితంగా ఉండి వారి సంప్రదాయాలు, ఆచారాలను గురించి తెలుసుకున్నారు. వారిలో ఆమె ఒక ఆసక్తికరమైన విషయం గమనించారు. అక్కడ ఎవరైనా పిల్లలకు మశూచి సోకినట్లైతే ఆ కురుపు నుండి కారే రసిక ను తీసి మశూచి సోకని పిల్లల చర్మంపై ఎక్కడైనా గీరి ఆ రసిక ను రాసేవారు (Variolation). అలా చేసిన పిల్లలకు ఎప్పటికీ మశూచి సోకకపోవడం లేడీ మేరీ గమనించారు. ఆ ప్రక్రియపై ఎంతో నమ్మకం కలిగి ఆమె తమ ఎంబసీ సర్జన్ ను అడిగి తన ఐదేళ్ళ కొడుకుకి అదే పద్దతిలో టీకా వేయించారు.

ఆమె ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్ళాక అక్కడ కూడా ఈ పద్దతి గురించి విస్తృతంగా  కానీ అక్కడి వైద్య వ్యవస్థ దీనిని అశాస్త్రీయమైన పురాతన విధానమని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలకు తగిన పద్ధతి కాదనీ తిప్పికోట్టింది. వారు వ్యతిరేకించడానికి మరొక ముఖ్య కారణం ఈ పద్దతిని ప్రతిపాదించింది ఒక మహిళ కావడం.

1721 లో ఇంగ్లాండ్ లో మశూచి విజృభించింది. లేడీ మేరీ తన కుమార్తెకు కూడా టర్కిష్ పద్దతిలో టీకా వేయించింది. ఆమె ఈ పద్దతి ఎంత ప్రభావవంతమైనదో చెప్పి వేల్స్ యువరాణిని కూడా తన ఇద్దరు కుమార్తెలకు ఈ టీకా వేయించేందుకు ఒప్పించింది. మనుషులలో వచ్చే మశూచి వైరస్ తో కాకుండా పశువులకు సోకే మశూచి వైరస్ తో మరింత సురక్షితమైన వాక్సిన్ ను జెన్నర్ అనే వ్యక్తి రూపొందించేవరకూ  కూడా ఇదే పద్దతిలో మశూచి టీకాలు వేసేవారు. అసలు వ్యాధులు రాకుండా నివారించే టీకాలు కనుగొనవచ్చు అనే ఆలోచనకు బీజం పడింది దీనివల్లనే!

Translated from Meena’s Piece

ది లేడీ విత్ ది గ్రాఫ్స్ : The Lady with the Graphs

ఈ ఏడాది లేడీ విత్ ది లాంప్ గా మనందరికీ తెలిసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ద్విశత జయంతి సంవత్సరం. ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరు వినగానే మన పుస్తకాలలో చదువుకున్నట్లు చేతిలో ఒక దీపం పట్టుకుని యుద్ధంలో గాయపడిన, జ్వరంతో బాధపడుతున్న సైనికులకు సేవలందించిన ఒక సేవామూర్తి రూపం మాత్రమే మన కళ్ళ ముందు మెదులుతుంది.

ఆమె ఈ అరుదైన సేవలందించింది అనడంలో సందేహం ఏమీ లేదు. ఆమె దీపం పట్టుకుని రాత్రనక, పగలనక సైనికుల క్యాంపులలో తిరిగి వారికి ఎనలేని సేవ చేసింది. అయితే ఆమె అంతకు మించి చేసిన సేవ మాత్రం ఎక్కువ గుర్తింపుకు నోచుకోలేదు.

ఆమె అద్భుతమైన గణాంకవేత్త. 1860 లో స్టాటిస్టికల్ సొసైటీ కి ఎంపికయిన మొదటి మహిళా ఫెలో.

ఆమె పనిచేసే యుద్ధ ప్రాంతపు ఆసుపత్రిలో మరణాలను కూడా సరిగా నమోదు చేయని సందర్భంలో ఆమె ఎంతో శ్రమకోర్చి వివిధ గణాంకాలను సేకరించి, వాటిని విశ్లేషించడం వలన పరిస్థితిని సరిగా అర్ధం చేసుకుని మరణాలను తగ్గించగలిగారు. ఉదాహరణకు ఆమె బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఇతర గణాంకవేత్తలతో కలిసి ఆ ఆసుపత్రిలో సంభవించిన 18000 మరణాలలో 16000 వరకు యుద్ధంలో గాయపడటం వలన సంభవించినవి కావని, పారిశుధ్య వసతులు సరిగా లేక వివిధ వ్యాధులు వ్యాపించి వాటి వలన సంభవించినవే అని గణాంకాలతో సహా నిరూపించారు. అప్లైడ్ స్టాటిస్టికల్ పద్దతులను ఉపయోగించి సరైన పారిశుధ్య వసతులు కల్పించడం ఎంత అవసరమో సోదాహరణంగా వివరించగలిగారు. దీని వలన ఎన్నో జీవితాలు కాపాడబడ్డాయి (ఈ ఏడాది నోబెల్ బహుమతి వచ్చిన ఎవిడెన్స్ బేస్డ్ పాలసీస్ కు ఇది తొలి ఉదాహరణగా చెప్పుకోవచ్చు)

అప్పటి వ్యవస్థలను కదిలించి సంస్థాగతమైన మార్పులు సాధించగలిగింది ఫ్లోరెన్స్. ఈ మార్పులు సాధించడానికి తన ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వాలతో పోరాటం చేస్తూనే ఉంది. మార్పు ఎంత అవసరమో అధికారులకు చెప్పి ఒప్పించడం అంత సులువు కాదని ఆమెకు తెలుసు. బహుశా అందుకే గణాంక శాస్త్రంలోనే పెద్ద మలుపుగా చెప్పుకోదగిన ఇన్ఫోగ్రాఫిక్స్ ను తొలిసారిగా రూపొందించింది. ఆమె రూపొందించిన ఇన్ఫోగ్రాఫిక్స్ లో అన్నిటికన్నా పేరు పొందింది “కాక్స్ కోమ్బ్” డయాగ్రమ్. ఇవి సాధారణ ప్రజలు కూడా సులువుగా అర్ధం చేసుకోగలిగినవి. ఈ కాక్స్ కోమ్బ్ అనేది గణాంకశాస్త్రంలో ఉపయోగించే “పై చార్ట్” ల వంటిదే కానీ మరింత లోతుగా సమాచారాన్ని విశదపరుస్తుంది. పై చార్ట్ లో ఒక్కొక్క భాగం యొక్క పరిమాణం ఆ డేటా పాయింట్ యొక్క మొత్తాన్ని సూచిస్తుంది. అయితే ఈ కాక్స్ కోమ్బ్ లో కేంద్రం నుండి ఒక్కొక్క భాగం యొక్క పొడవు వివిధ స్థాయిలలో ఉండి సమాచారాన్ని వివిధ పొరలుగా విశదపరుస్తుంది. నైటింగేల్ ఈ చార్ట్ ను ఇలా విభిన్నంగా అమర్చడం వలన వివిధ స్థాయిలలో ఉన్న సంక్లిష్ట సమాచారాన్నిఒకే చార్ట్ పై వివరంగా చూపించగలిగింది. క్రిమియన్ యుద్ధ సమయంలో ఆమె తయారు చేసిన కాక్స్ కోమ్బ్ డయాగ్రమ్ ఒక ఏడాదిలోని 12 నెలలను సూచించే విధంగా 12 భాగాలుగా ఉండి ప్రతి భాగంలోనూ రంగు వేయబడిన భాగం ఆ నెలలో సంభవించిన మరణాలను సూచించేలా రూపొందించబడింది. ఆమె ఉపయోగించిన వివిధ రంగులు ఆ మరణాలకు గల వివిధ కారణాలను సూచించేలా ఉన్నాయి.

ఆమె కనుక ఇప్పుడు జీవించి ఉన్నట్లయితే ఇప్పటి కోవిద్ వ్యాప్తికి కూడా గణాంకాల విశ్లేషణ జరిపి వాటి ఆధారంగా వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టడానికి పరిష్కార మార్గాలు సూచించగలిగే వారని చాలా మంది నమ్మకం. అయితే ఇటువంటి నమ్మకాలు, ఆశల వలన ఒనగూరేదేమీ లేదు. ఇటువంటి మార్గదర్శకులు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ఇప్పటి తరంపై ఉన్నది.

తాను సేకరించిన గణాంకాలు, సమాచారం ఆధారంగా మన దేశంలో పరిశుభ్రమైన త్రాగునీరు, కరువు భత్యం, మెరుగైన పారిశుధ్య వసతులు కల్పించవలసిన అవసరం గురించి ఆమె చేసిన కృషికి కూడా మనం ఆమెకు ధన్యవాదాలు తెలుపుకోవాలి.

*https://thisisstatistics.org/florence-nightingale-the-lady-with-the-data/

Translated by Bharathi Kode from Meena’s piece ‘The Lady With the Graph’

http://www.millennialmatriarchs.com

పౌష్టికాహారం-ఒక విజయవంతమైన కార్యక్రమం: Focus on a Nutrition Success Story

గర్భిణీలు, బాలింతల కోసం పోషకాహార కేంద్రాలు

గర్భిణీలు, బాలింతలకు సరైన పోషకాహారం యొక్క అవసరం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మహిళలలో పోషకాహార లోపాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంగన్వాడీ ల ద్వారా ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ అంగన్వాడీలలో ఇచ్చే ఆహార పదార్ధాలను మహిళలు తీసుకువెళ్ళడం, ఇంటిలోని కుటుంబ సభ్యులందరితో పంచుకుంటున్నారనేది మేము క్షేత్ర స్థాయిలో గమనించిన అంశం. బహుశా పిల్లలు, మగవారు తిన్నాక మిగిలిన కొద్ది మొత్తం వారు తీసుకుంటుండవచ్చు. ఇంట్లో ఎవరికీ పెట్టకుండా కోడళ్ళు తమకు ఇచ్చిన ఆహారాన్ని దాచుకుని తినడం ఇంకా చాలా కుటుంబాలలో ఆమోదయోగ్యమైన విషయం కాదు. దీనితో వారికోసం ఉద్దేశించి ఇచ్చిన పోషకాహారం నిజానికి వారికి అందడం లేదు. 

కొన్ని రాష్ట్రాలలో ఈ అనుభవాలను చూసాక, మేము జి.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్ లో ఈ కార్యక్రమాన్ని మరొక విధంగా అమలు చేసి చూద్దామనే ఆలోచన చేసాము. పోషకాహారాన్ని మహిళల ఇంటికి పంపే బదులుగా మహిళలే ఒక చోటకి చేరి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుందనేదే ఆ ఆలోచన. ఈ ఆలోచనతో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని గర్భిణీలు, బాలింతలకు అనువుగా ఉండే ప్రదేశాలలో వారికోసం పోషకాహార కేంద్రాలను ప్రారంభించాము. ప్రతిరోజూ నిర్దేశించిన సమయానికి ఒక అరగంట సమయం గడిపేలా వారంతా కేంద్రానికి రావాల్సి ఉంటుంది. పోషకాహారంపై పనిచేసే ఒక జాతీయ స్థాయి సంస్థ సహాయంతో ఏ రోజు ఏ ఆహారం ఇవ్వాలి అని ఒక మెనూ తయారుచేశాము. ఇక్కడ మేము ఇచ్చేది పూర్తి భోజనం కాదు. కానీ సహజంగా మహిళలలో ఎటువంటి పోషకాలు లోపిస్తాయో వాటిని అందించేందుకు తగిన అదనపు ఆహారం ఈ కేంద్రాలలో ఇవ్వడం జరుగుతుంది. ఆయా సీజన్ లలో దొరికే ఆహార పదార్ధాలకు తగినట్లు ఎక్కువ వంట చేయవల్సిన అవసరం లేకుండా ఉండేలా ఈ మెనూ రూపొందించాము. ఈ కేంద్రాలకు వచ్చే మహిళలు అంగన్వాడీ నుండి కూడా తమకు రావాల్సిన రేషన్ ను తీసుకోవచ్చు.

రిజిస్టర్ చేసుకున్న మహిళలు ప్రతిరోజూ ఈ కేంద్రాలకు వస్తారు. ఒక చిన్న కిట్టి పార్టీ లాగా ఉంటుందక్కడ. వారంతా కలిసి తింటారు. ముచ్చట్లు చెప్పుకుంటారు. గర్భిణీలుగా, బాలింతలుగా తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. అప్పుడప్పుడు టీకాలు వేయించుకోవాల్సిన అవసరం గురించి, కుటుంబ నియంత్రణ గురించి, ఇతర ఆరోగ్య, పోషకాహార అంశాల గురించి అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తలతో అవగాహన సదస్సులు నిర్వహించడం, ఆహారం, బిడ్డల సంరక్షణకు సంబంధించి చిన్న చిన్న ఆటలు ఆడించడం, పరిశుభ్రత, ఆరోగ్య అంశాలపై డాక్యుమెంటరీ ల వంటివి చూపించడం వంటి అనేక కార్యక్రమాలు ఈ కేంద్రాలలో నిర్వహిస్తారు. వారి బరువు, హిమోగ్లోబిన్ శాతం, డాక్టర్ ఇచ్చిన సలహాలు అన్నీ రికార్డు చేయడం జరుగుతుంది. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు.

ఈ కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి దాదాపు ఒక దశాబ్దం అయింది. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న మహిళలు వందకి వంద శాతం ఆసుపత్రులలోనే ప్రసవం చేయించుకుంటుండగా బిడ్డల సగటు బరువు 2.5 కేజీల కన్నా అధికంగా ఉంటుంది. మరి ఖర్చు ఎంత అంటారా? రోజుకు ఒక్కో మహిళకు కేవలం పదిహేను రూపాయలు. గర్భిణీగా మూడవ నెల ప్రారంభం అయినప్పటి నుండి ప్రసవం తర్వాత ఆరవ నెల వరకు మొత్తం మీద ఒక్కో మహిళకు 12 నెలల పాటు సహాయం అందించడం జరుగుతుంది. ప్రసవం అయిన వెంటనే కేంద్రానికి రాలేని మహిళలకు ఆహారాన్ని ఇంటికి పంపిస్తారు. మొత్తం మీద వారి ఆరోగ్యం కోసం, వారి బిడ్డల ఎదుగుదలకు బలమైన పునాది వేయడం కోసం ఒక్కో మహిళ మీద 5500 రూపాయిల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఏ సంస్థ అయినా తేలికగా అమలు చేయగలిగిన కార్యక్రమం. ఆసక్తి ఉన్న వారు వ్యక్తిగతంగా కూడా ఈ సహాయం చేయవచ్చు.

దేశం మొత్తం మీద చూస్తే స్వచ్చంద సంస్థలు అమలు చేస్తున్న ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒకరితో ఒకరు పంచుకోవడం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, వాటిని మరింత పెద్ద స్థాయిలో అమలు చేయడం ఇప్పుడు ఎంతో కీలకం.

Translated by Bharathi Kode from Meena’s piece

Focus on a Nutrition Success Story