బట్టల షాపింగ్ కి వెళ్ళినప్పుడు అతి సాధారణంగా కనిపించే వస్తువు హ్యాంగర్.
ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, భారత్ లో తయారు చేయబడిన హ్యాంగర్ ఉండే ఆస్కారం 12% ఉందని మీకు తెలుసా!..
హ్యాంగర్ లు అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది కాగా మొదటి రెండు స్థానాలలో చైనా, వియాత్నాంలు ఉన్నాయి. ప్రతీ ఏడాది భారత్ సుమారు 11.1 వేల ఎగుమతులు ప్రముఖంగా అమెరిక, జర్మనీ, మరియు స్వీడన్ దేశాలకు చేస్తుంది.
ఐతే ఇంతలా మనను చుట్టేసిన ఈ హ్యాంగర్ల సృష్టికి ఎన్నో కథలు మరెన్నో మూలాలు చెప్పుకుంటారు. అందులో కొన్ని;
అమెరికా దేశం మూడవ అధ్యక్షుడు తన బట్టలని ఒక వరుసలో అమర్చుకునేందుకు గాను నేటి హ్యాంగర్ ను పోలినటువంటి పరికరం వాడేవారని వినికిడి, ఐతే దీన్ని నిరూపించడానికి పెద్దగా ఆధారాలు లేవు. కొన్ని కథనాల ప్రకారం, హ్యాంగర్ ల ఆవిష్కరణ 1869 సంవత్సరంలోని వ్యక్తి ఒ.ఎ నార్త్ (A O North) కి చెందుతుంది. అలాగే మరికొందరు 1903 లో ఎజె పార్క్ హౌస్ దీని ఆవిష్కరణకు మూలం అని నమ్ముతారు. దాని వెనుకాల కథ క్లుప్తంగా, ఒక రోజు ఉదయం పార్క్ తన పనికి వచ్చీ రాగానే కోట్ తగిలించుకునే కొక్కాలు ఏవి ఖాళీ లేకపోవడం చూసి, చిరాకుగా పక్కన పడున్న తీగని ప్రస్తుతం వాడకంలో ఉన్న హ్యాంగర్ ఆకారంలోకి అమర్చుకొని తన కోట్ తగిలించుకున్నాడని వినికిడి.

చెక్క, ప్లాస్టిక్, కార్డ్ బోర్డ్, ట్యూబ్, ఇలా వివిధ రకాలుగా హ్యాంగర్స్ అందుబాటులో ఉన్నాయి. ఐతే పర్యావరణ కోణం దిశగా నేడు పునరుత్పత్తి/రీసైకల్ చేయబడిన హ్యాంగర్స్ వైపు దృష్టి మరులుతుంది. ఖరీదైన బట్టల కోసం సాటిన్ హ్యాంగర్లు అలాగే లగ్జరీ మరియు కస్టం/ అవసరానికి అణుగునంగా చేయబడిన వర్గంలో రకరకాల హ్యాంగర్స్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి.
ప్రాథమికంగా చూసుకుంటే, హ్యాంగర్ అనే పరికరం మనుషుల భుజాలను పోలి ఉండి; మన బట్టలు, కోట్స్, స్కర్ట్స్ ముడత పడకుండా ఉండడానికి వాడే వస్తువు. హ్యాంగర్ల కింద భాగం ప్యాంట్స్/స్కర్ట్స్ తగిలించడానికి తయారుచేయబడింది. ఐతే మొదటి రకం హ్యాంగార్స్ లో ప్యాంట్స్/స్కర్ట్స్ వేలాడదీయడానికి అనువుగా క్లాంప్స్/బిగింపులు ఉండేవి.
20వ శతాబ్దం మొదలు నుంచి వైద్య-లాయర్ వృ త్తులలో ఉన్నవారికి హ్యాంగర్స్ యొక్క అవసరం బాగా పెరిగింది. వారి బట్టలు చక్కగా పెట్టుకోవడానికి హ్యాంగర్ లు ఒక సులభమైన పరికరం లా వారికి చిక్కాయి.
కొంత సమయంలోనే హ్యాంగర్స్ ప్రతి అవసరానికి తగట్టు రకరకాల విధాలుగా అందుబాటులోకి వచ్చాయి. సులువుగా మడత పెట్టి విహారాలకు తీసుకు వెళ్ళే వీలుగా- స్కార్ఫ్ హ్యాంగర్స్, బ్లాంకట్ హ్యంగెర్స్, టై హ్యాంగెర్స్ మొదలగు విధంగా పరిణామం చెందాయి.
మనం గమనించినట్టైతే హ్యాంగర్స్ పరిమితి కేవలం ఇంటి వరకే కాకుండా రీటైల్ (వ్యాపరాల) రంగంలో ఇంకా విస్తృతంగా ఉంది. అక్కడికే ఆగకుండా, వస్తువుల బ్రాండ్ వృద్ధి లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఈ హ్యాంగర్.
హ్యాంగర్స్ ఉత్పత్తి సంస్థల్లో ‘మైనెట్టీ’ (Mainetti) ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ సంస్థ కథ 1950 లలో ఇటలి దేశంలో మొదలైంది. కథ సారాంశం, రోమియొ మైనెట్టి అనే ఒక తెలివైన కుర్రవాడు రేసింగ్ కారు నడిపే యజమాని దగ్గర పని చేసేవాడు. యజమాని తండ్రి, వస్త్ర రంగంలో మహా ఉద్ధండుడు మార్జొట్టో కార్పరేషన్ వ్యవస్థాపకుడు. ఆ సంస్థ రెడీ-మేడ్ సూట్ లను ఉత్పత్తి చేయడం ప్రారంభించిన రోజులవి. అందులో భాగం గానే అవి నలగకుండా ఉండడానికి గాను హ్యాంగర్ల వాడకం పెంపొందించిందా సంస్థ. చెక్కతో తయారుచేయబడిన ఆ హ్యాంగర్ల ఖరీదు, బరువు రెండు అధికంగా ఉన్న పరిస్థితిని అప్పటికి గమనిస్తూ వస్తున్న రోమియొ వాళ్ళ అన్న మారియొ. గతంలో తనకు ప్లాస్టిక్ కంపని లో ఉన్న అనుభవాన్ని మేళవించి రొమియో తో కలిసి ప్లాస్టిక్ హ్యంగర్ల తయారీని నెలకొల్పారు.
అలా మొదలైన వారి ప్రయాణం యూకే, ఫ్రాన్స్, కెనడా, మరియు నెదర్ల్యాండ్స్ వంటి దేశాలకు చేరింది. వారు గుర్తించిన అంతరం, అందించిన నాణ్యత ఆ రంగాన్నే ఒక కొత్త వెలుగు తో నింపింది. ప్రస్తుతం 6 ఖండాలు, 90 స్థానాలలో విస్తరించి, భారత్ లో కూడా ప్రముఖమైన ఉత్పత్తి కేంద్రం నెలకొల్పింది.
లోహాల వెల్డింగ్ మొదలుకుని డ్రైనేజి శుబ్రపరుచుకునే వరకు, మొక్కలు పెట్టుకునే సాధనం నుంచి పిల్లల స్కూల్ ప్రాజెక్ట్ వరకు. ఇలా బట్టల హ్యాంగర్స్ వాడకం ఏన్నో ఆవిష్కరణలకి స్థావరం అయ్యింది. మరోవైపు ఇదే హ్యాంగర్ కార్ దొంగతనాలకి, అబార్షన్ లకి ఒక ముఖ్య వస్తువు అవ్వడం భాధాకరం, ఒక సమర్ధించరాని నిజం.
కాగా ఈ చరిత్ర పుటల్లో మన ముడత పడిన బట్టలకూ ఒక హ్యాంగర్ ఎల్ల వేళలా తోడై ఉంటుందని కోరుకుంటూ!
ఈ పూట పూర్తి పర్యావరణ స్పృహతో ఒక మంచి హ్యాంగర్ కొందామా మరి?
- మీన (Based on a piece by Meena)