గుడ్ గర్ల్ సిండ్రోమ్

గత కొన్ని సంవత్సరాలుగా నేను మహిళలకు సంబంధించిన ఎన్నో సదస్సులలో, సభలలో మాట్లాడాను. ఎంతో మంది యువతులకు గైడ్  గా వ్యవహరించాను. నా  టీం లో కూడా ఎంతోమంది ఆడవాళ్ళతో పనిచేసాను.

ఎక్కడ ఏ స్త్రీతో మాట్లాడినా నేను ఇచ్చే సందేశం ఒకటే “మంచి అమ్మాయిగా ఉండాల్సిన పనిలేదు” అని. ఇలా చెప్పడం వెనుక నా ఉద్దేశం ఏమిటంటే: నీ కుటుంబం, నీ సమాజం నువ్వు  ఉండాలని అనుకుంటుందో దానికి పరిమితమవ్వాల్సిన పనిలేదు; ఈ పని నీది అని ఎవరో నీ నెత్తిమీద రుద్దినంతమాత్రాన ఆ పనిని నువ్వు చేయనవసరం లేదు; అందరిపట్లా విధేయత చూపించాల్సిన అవసరం లేదు; నీకు ఏది సరైనది అని తోస్తే, ఏది నీకు మంచిది అని బలంగా అనిపిస్తే దాని కోసం పోరాడు, అవిధేయత చూపించు, ప్రశ్నించు.

అయితే ఈ విషయాన్ని నేను సరిగా వారికి అర్ధమయ్యేలా చెప్పలేకపోయాను. చాలా సందర్భాలలో ఇది ఎలా అర్ధమయ్యేదంటే నేనేదో అమ్మాయిలను చెడగొడుతున్నట్లు, ప్రతిదానికీ తిరగబడమని వారికి చెబుతున్నట్లు ఉండేది. బహుశా నేను ఇలా చెప్పకూడదేమో అని ఆలోచించడం మొదలుపెట్టాను.

అయితే “గుడ్ గర్ల్ సిండ్రోమ్” అనే పదం ఎక్కడో నా కంటపడేవరకూ ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాను. దీని గురించి మరింత లోతుగా చదవడం మొదలుపెట్టాకే ఇదేదో ఒక పదం మాత్రమే కాదనీ, ఒక పరిశోధన చేయడానికి తగిన అతిపెద్ద సబ్జెక్టు అనీ అర్ధమయ్యింది.

2011 లో బెవర్లీ ఎంగెల్స్ రాసిన “ది నైస్ గర్ల్ సిండ్రోమ్” అనే పుస్తకం ఈ పదాన్ని సరిగ్గా వివరించగలుగుతుంది. దీని అర్ధం ఏమిటో నా మాటల్లో చెప్పేబదులు ఎంగెల్స్ ఏమి చెప్పిందో చెబుతాను.

“ఒక మంచి అమ్మాయి తన గురించి తాను ఏమనుకుంటుంది అనే దానికన్నా ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారు అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. తన స్వంత భావోద్వేగాల కన్నా ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇస్తుంది”

“మంచి అమ్మాయిలు చెప్పిన మాట వింటారు. వారికి ఏది చేయమని  చెబితే అది చేస్తారు. ఎవరితో అయినా వాదన పెట్టుకునే బదులు వారు చెప్పిందేదో చేసేస్తే పోతుంది అనుకుంటారు. విధి ఎలా ఉంటే  అలా జరగనీ అనుకుంటారు. వారు నమ్మిన వాటికోసం గట్టిగా నిలబడేందుకు కూడా భయపడతారు. ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచాలి అనుకుంటారు. వారి  మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేందుకు కూడా భయపడతారు. దానితో మంచి అమ్మాయిలు ఎంతో నటించాల్సి వస్తుంది”

  • బెవర్లీ ఎంగెల్స్ 2011 లో రాసిన నైస్ గర్ల్ సిండ్రోమ్  పుస్తకం నుండి 

ఈ మంచి అమ్మాయిల లక్షణాలు ఇలా ఉంటాయి: ఇతరులు తాము ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి భిన్నంగా ఉండాలంటే భయం, తమ మనసులో ఉన్నది చెబితే ఇతరులు ఎక్కడ బాధపడతారో అనే భయం; అన్నిటిలో రాణించాలనే కోరిక; ఘర్షణలకు దూరంగా ఉండడం; నియమాలన్నిటినీ ప్రశ్నించకుండా పాటించడం. వారికి ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినా తిరస్కరించేందుకు భయపడతారు.

IWD

ఇది నిజమో కాదో ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ విధంగా మంచి అమ్మాయిలం అనిపించుకోవాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది అనిపిస్తుంది. అరవైలలో పుట్టిన నాలాంటి మహిళలం మా  వస్త్రాలు, కేశాలంకరణ విషయాలలో మా తల్లులతో దాదాపు యుద్ధాలు చేసాం; ప్రొఫెషనల్ చదువులు చదివి ఉద్యోగాలు చేసేందుకు గొంతులు పోయేలా పోట్లాడాం; ఎవరిని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే విషయాలపై కూడా యుద్ధాలే చేసాం; వైవాహిక బంధంలోనూ గౌరవాన్ని పొందేందుకు తగాదాలు పెట్టుకున్నాం. ఇవన్నీ మమ్మల్ని బలంగా మార్చాయి. అలా బలాన్ని సంపాదించుకుంటూనే మా దారులను మేము మలుచుకున్నాం.

అయితే మేము కూడా మాకన్నా ముందు తరం మహిళలు చూపించిన స్ఫూర్తినే అందిపుచ్చుకున్నాం. వారే అసలైన మార్గదర్శకులు. మొట్టమొదటి తరపు ఇంజినీర్లు, మొదటి డాక్టర్లు, పరదాలు దాటి మొదటి సారి బయటకి వచ్చిన మహిళలు, ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు, కుటుంబంతో, సమాజంతో పోరాడి మరీ తమ స్వంత దారులు ఏర్పాటు చేసుకున్న ఆ  నలభైలు,యాభైలలో పుట్టిన మా ముందు తరపు మహిళలు ఇచ్చిన స్ఫూర్తి ఇంతా అంతా కాదు. వారి ధైర్యసాహసాలతో పోలిస్తే మాకు సగం కూడా లేవు. అయినా వారు చూపించిన బాటలోనే ముందుకు సాగాము.

ఈ రోజున ఇవన్నీ అత్యంత సాధారణమైన విషయాలు కావచ్చు. ఈనాటి అమ్మాయిలు వీటికోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. మాలాగా వారికోసం వారు దృఢంగా నిలబడాల్సిన సందర్భాలు లేకపోవచ్చు. అందుకే సమాజం వారికి చూపించిన దారిలో నడవడమే తప్ప వారికంటూ కొత్త దారులు ఏర్పాటు చేసుకోవాలి అనుకునే స్ఫూర్తి ఈ తరం అమ్మాయిలలో కొరవడింది అనిపిస్తుంది. అప్పట్లో మేము కొత్త దారులలో నడిచినందుకు చెడ్డవారిమి అనిపించుకున్నాం. అయితే ఈ రోజు ఆ దారిలో నడవమనే సమాజం సూచిస్తుంది. ఆ దారులలో నడిచిన వారినే మంచివారు అంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కొత్త తరపు అమ్మాయిలు కూడా కొత్త దారులు కనుగొనాలనీ, నూతన శిఖరాలు అందుకోవాలనీ నా ఆకాంక్ష.

బహుశా ప్రతి తరం ఇలా తమ తరవాతి తరం వారిని విమర్శించడం అనేది అత్యంత పురాతనమైన విషయం కావచ్చు. అయినప్పటికీ ఇదే నా ఆకాంక్ష

–Translated by Bharathi Kode, based on a piece by Meena Raghunathan

నూలు నేసిన చరిత్ర (Fabrics for Freedom, Khadi and Beyond’)

దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఖద్దర్ కి ఉన్న విశిష్టత మనందరికి తెలిసిందే!

ఖాదీ ధరించడం కేవలం బ్రిటిషర్ల దిగుమతులని  ధిక్కరించడానికి జరిగిన  స్వేచ్చా  పోరాటం మాత్రమే కాదు. కొన్ని లక్షలమంది జీవనోపాధికి, ఆర్ధిక స్వాతంత్ర్యానికి, ఒక దృఢమైన చిహ్నం.  

దివ్య జోషి మాటల్లో: ‘ఖాదీని గాంధీజీ ఈ దేశ జాతీయవాదనికి, సమానత్వానికి మరియు స్వాలంబనకు ప్రతీకగా నిలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని పాటించి ఈ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఖాదీ పాత్ర ముఖ్యమైనదని అని వారు బలంగా విశ్వసించారు. ఒకప్పుడు పేదరికానికి మరియు వెనకబాటుతనానికి ప్రతీకగా నిలిచిన రాట్నాన్ని స్వాలంబనకు, అహింసకు చిరస్మరణీయమైన గుర్తుగా మలిచారు గాంధీజీ.’

ఐతే! స్వాతంత్ర్య సాధనలో వస్త్రాలు నూలడం-నేయడం కేంద్ర భాగమై జరిగిన పోరాటాలు భారత్ లోనే కాకుండ మరెన్నో దేశ చరిత్రలలో కనిపిస్తుంది. అలా, బ్రిటిష్ ని ఎదురిస్తూ, వస్త్రాన్ని ఆయుధంగా మలచుకున్న ఉద్యమ చరిత్రల్లో అమెరికాది కూడా ఒకటి.        

  అమెరికాతో సహా తాము పాలించిన కాలనీలను బ్రిటన్ దేశం ప్రధానంగా తమ ముడి పదార్ధాల సరఫరాదారులుగా భావించారు. పత్తి ఇతరాత్రా ముడి సరుకుని తమ దేశానికి ఎగుమతి చేసుకుని, తయారైన బట్టలను రెట్టింపు పన్నులతో మళ్ళీ అవే కాలనీలలో విక్రయించేవారు. ఈ ప్రక్రియను ధిక్కరిస్తు బ్రిటన్ కు వ్యతిరేకంగా అమెరికా కాలనీ ప్రజలు 1760-1770 మధ్య కాలంలో తమ దేశభక్తిని చాటుతూ చరఖా/రాట్నం సహయంతో, ఒక శక్తిగా కదిలి వారి వస్త్రాల్న్ని వారే తయారు చేసుకోవడం జరిగింది. విధిగా ఇదే రాట్నం 20వ శతాబ్దం భారత దేశ స్వాతంత్ర్య చరిత్రలోను కీలకమైన పాత్ర పోషించింది.

అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో కీలకంగా నిలిచిన రాట్నం/స్పిన్నింగ్ ఉద్యమాల్ని మహిళలు ముందుండి నడిపించారు. ఆ ఉద్యమానికి ఊపిరి పోస్తూ బ్రిటిష్ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి మహిళ తమ ఇళ్లలోనే నూలు నూయడం, వస్త్రాల్ని నేయడం జరిగింది. ఆ విధంగా నేసిన వస్త్రాలు ‘హోంస్పన్’ గా ప్రసిద్ధి చెందాయి. అలా హోంస్పన్ వస్త్రాలు ధరించడం దేశభక్తికి చిహ్నంగా నిలిచింది.

కొన్ని కాలనీలలో మహిళలు, సామాజిక నిరసన వ్యక్తపరుస్తూ, కలిసి రాట్నాలు ఏర్పరుచుకొని నూలే వారు. అలా ఏర్పరుచుకున్న సామూహిక ప్రదేశాలు ‘స్పిన్నింగ్ బీస్’ గా ప్రసిద్ధి చెందాయి. మార్చి 1768 లో మొదలుకొని 32 నెలల పాటు హార్ప్స్వెల్ నుంచి, మైనె నుంచి, హంటింగ్టన్, లాంగ్ ఐలండ్ వంటి కాలనీలలో విస్తృతంగా 60 స్పిన్నింగ్ మీటింగ్స్ జరుపుకున్నారని ప్రసిద్ధి.

అమెరికా సమాజంలో ఈ స్పిన్నింగ్ బీస్ సృష్టి-ప్రేరణలో, రాజకీయ అసమ్మతివాదుల సంఘం ‘డోటర్ ఆఫ్ లిబర్టీ’ కీలకమైన పాత్ర పోషించింది. ఒకవైపు బ్రిటిష్ వారు తమ దేశంలోకి దిగుమతి చేసే వస్తువులు ముఖ్యంగా టీ, బట్టలు మొదలగు వాటి సంఘ బహిష్కరణను ప్రొత్సహించడం మరోవైపు ప్రత్యామ్నయాలని గుర్తించి సొంతంగా తయారుచేసుకునే భాద్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించింది.

అమెరికాలో ధ్వనించిన తీరుగనే భారత దేశంలో కూడా స్వాతంత్ర్య సమరయోధుల ప్రచారాల్లో, ర్యాలీలలో, పిలుపులో స్పిన్నింగ్ అనేది పోరాట స్ఫూర్తి రగిలించడంలో  కేంద్ర అంశంగా నిలిచింది. హోంస్పన్ వస్త్రాలలో జరుగుతున్న ప్రతి చిన్న అభివృద్దిని, పురోగతులను పత్రికలు నివేదించేవి. అలానే స్పిన్నింగ్ పాఠశాలలు స్థాపించబడ్డాయి, వాటి ద్వారా బాగా/ఎక్కువ మొత్తాలలో నేసేవారిని గుర్తించి పురస్కారాలు అందించడం చేసేవారు. అలా ప్రేరణతో చిన్నా-పెద్దా  తేడా  లేకుండా ప్రతి ఒక్కరూ వస్త్రాలు నెయ్యడానికి ముందుకు రావడం జరిగింది, అదే విషయాన్ని గుర్తిస్తూ న్యూపొర్ట్ కి చెందిన 70 ఏళ్ళ ముసలావిడ తన జీవింతంలోనే మొదటిసారి రాట్నం తిప్పడం నేర్చుకొని వస్త్రాన్ని నేసిందని అప్పటి పత్రికలు నివేదికలు ఇచ్చాయి.

పోరాట స్ఫూర్తి ని మరింత రగిలిస్తూ 1769 సమయంలోనే ఏన్నో స్పిన్నింగ్ పోటీలు విధిగా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న సభ్యులు పోటా-పోటీగా గెలిచారని అప్పటి నివేదికలు తెలియజేసాయి.

వీటన్నిటి పర్యావసానం, అమెరికాకు బ్రిటిష్ చేసే దిగుమతులు తీవ్రంగా పడిపొయాయి, ఒక సంస్థ ప్రచూరించిన లెక్క ప్రకారం 1769 ముందు సంవత్సరంతో పోలిస్తే ఆ ఏడు దిగుమతులు 4,20,000 నుంచి 2,08,000 పౌండ్ కి పడిపోయాయి.

 ఆ విధంగా ఈ ప్రపంచంలోని ఏన్నో  దేశాల్లో ‘స్వదేశీ’ అనేది సామ్రాజ్యవాదుల నిరంకుశ పాలన పట్ల తిరుగుబాటుకు ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది.

ఇదే స్ఫూర్తి 150 ఏళ్ళ తరువాత, భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో కనిపిస్తుంది. అదే మన ఆత్మ విశ్వాసం, మనోబలం, గుర్తింపుగా నిలిచింది, నిలుస్తుంది.

-మీన

ఇలాబెన్ భట్ (1933 – 2022) 

గాంధేయ వాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, ఉమెన్ వరల్డ్ బ్యాంక్ సహ-స్థాపకురాలు, గుజరాత్  విద్యాపీఠం గౌరవాధ్యక్షురాలు, గాంధీ ఆశ్రమ ట్రస్టీ, రామన్ మెగసెసే – ది రైట్ లైవ్లీహూడ్, పద్మ విభూషణ్  వంటి ఎన్నో విలక్షణ పురస్కారాల గ్రహీత. అన్నింటికీ మించి తనదైన నిరాడంబరతకు, అసాధరణ స్ఫూర్తికి చెరగని ప్రతీక. డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసేవారికి ఎంతో సుపరిచితమైన పేరు. 

ఇలా తో ఒక్కసారి మాట్లాడిన ఎవరైనా ఇట్టే మంత్రముగ్ధులు అవుతారు. ఆమె వ్యక్తిత్వంలోని సరళత, ముక్కుసూటితనం, పని పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి ఇందుకు ప్రధాన కారణాలు. అసంఘటిత రంగంలోని మహిళల ఆర్థిక సాధికారతకై వారు చేసిన కృషి, పాటించిన నిబద్ధత ఆమెను ఆ దిశలో నడిచిన ఒక అనంతమైన తారగా ఎల్లపుడు నిలబెడతాయి. ఒక మృదుభాషి ఈ ప్రపంచంలో నింపిన వెలుగుకి తెచ్చిన మార్పుకి ఇంకో పేరే ఇలా.   

ఇలా తో సంభాషణల  సారాన్ని, వి రఘునాథన్ గారు వారి పుస్తకం “డోంట్ స్ప్రింట్ ది మారథాన్” లో చర్చించటం జరిగింది. అందులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనందరి కోసం;

Ela Bhatt

‘ఇలా తన స్కూల్లో కాని, కాలేజీలో కాని మొదటి ర్యాంకు విద్యార్థి ఏమి కాదు, ఒక 10 పర్సెంటైల్ విద్యార్థుల్లో ఒకరిగా నిలిచేవారామె. కేవలం మార్కుల కోసం చదివే మార్గంలో తనను ఎవరు నడపాలనుకొలేదు కూడా. ఇలా భాషా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఆమె తండ్రి వేసవి సెలవుల్లో చదవడానికి వివిధ రకాల పుస్తకాలు ఇష్టంగా కొనిపెట్టేవారు, వాటిని తను అంతే ఆసక్తిగా చదివేవారు. తనలో విలక్షణంగా కనిపించే విలువలు-సిద్ధాంతాలకు రూపురేఖ, కేవలం తన హైలీ ప్రిన్సిపల్డ్ నాన్న నుంచే కాకుండ అప్పుడు నెలకొన్న జాతీయవాద వాతావరణం నుంచి ఆమె గ్రహించారు. బ్రిటిష్ పాలనా చెరలనుండి విముక్తి కోసం పోరాడుతూ గెలుపు కోసం వేచి చూస్తున్న హృదయాలలో గాంధీజీ బోధన, సందేశాలకి, జీవనశైలికి, పిలుపుకి స్పందిస్తున్న భారత దేశ నీడలో పెరిగారు ఇలా.  

చిన్నతనంలోనే ఇలా న్యాయ-అన్యాయాల పట్ల విచక్షణ కలిగిఉండి  వెనుకబడిన వారి పై జరిగే దోపిడిని సహించేది కాదు.

మహిళా ఉద్యమాల్లో తన తల్లి పోషించిన పాత్ర చిన్నారి ఇలా మనసులో బలంగా నిలిచిపొయింది. మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె నేరుగా గ్రహించారు. మహిళలు దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడుతున్నపటికీ వ్యవస్థలో ఎదుర్కొంటున్న  వేతన మరియు ఎన్నో రకాల అసమానతల్ని పరిశీలిస్తూ వచ్చింది. వ్యవసాయ రంగం లో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నా వారిని రైతులుగా గుర్తించకుండా, రుణాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోటు పాట్లని గమనిస్తూ వచ్చింది.

అసమానతల పట్ల నిత్యం అవగాహన కలిగి ఉండే దృష్టికోణం దానికి బలంగా ముడిపడున్న తన వ్యక్తిత్వం, భవిష్యత్తు రెండూ తన తల్లిదండ్రుల నుంచి అలవడి ఉంటాయి. ఇలా వ్యక్తిత్వాన్ని చూసిన ఎవరికైనా తెలుసు వారు నిర్భలులకు ఒక దృఢమైన గొంతుక అని.’

ఇలా లోని వినయం, సున్నితతత్వం చూపే ఒక చిన్ని ఉదాహరణ వారు రచించిన పుస్తకం ‘వి ఆర్ పూర్, బట్ సో మెనీ లోని పరిచయ వాక్యాలలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తన వాక్యాలలో: 

“స్వయం ఉపాధి పనులు చేసే పేద మహిళల జీవితాల గురించి రాసే క్రమంలో నేను ఎంతో కొంత అహంకారాన్ని ప్రదర్శించాను. నేను వారి గురించిన రాసిన విషయాలను చదవలేని మహిళల గురించి ఈ పుస్తకం రాసాను. అదే కాక నాకున్న అవగాహన చాలా పరిమితమైనది, అది నేను ఉన్న ఆర్ధిక-సామాజిక వర్గాల నుంచి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను రాసిన మహిళల కోసం పూర్తిగా మాట్లాడుతున్నానని ఎన్నటికీ చెప్పలేను, ఎందుకంటే నేను నా కోసమే మాట్లాడగలను.” స్వయం ఉపాధితో జీవనం గడిపే మహిళల కోసం తన జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను, ప్రశంసలను అందుకున్న ఇలా ఈ విధంగా మాట్లాడటం ఆమెలోని వినమ్రతకు నిదర్శనం..    

ఆమె ఒక నిరంతర స్ఫూర్తి.

ఓం శాంతి.

– మీనా 

Based on a piece by Meena Raghunathan

తొలితరం మహిళా ఇంజనీర్: లలిత: Engineer A. Lalitha

దేశంలోని అత్యున్నత ఇంజనీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి అయిన సెప్టెంబర్ 15 ను ఇంజనీరింగ్ డే గా దేశమంతటా ఘనంగా జరుపుకున్నారు. దేశంలో ఇంజనీరింగ్ విద్య, ఇంజనీరింగ్ రంగంలో ఎంతో కృషి చేసిన విశ్వేశ్వరయ్య వరదలను అరికట్టే నిర్మాణాలకు రూపకల్పన చేయడం, డాం లు రిసర్వాయిర్ ల నిర్మాణం చేయడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజనీరింగ్ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఆయన ప్రారంభించిన గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతం యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గా పిలువబడుతుంది.

ఈ రోజు దేశంలో వేల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల నుండి ప్రతి ఏటా వందలు, వేల సంఖ్యలో యువతీ యువకులు బయటకి వస్తున్నారు. ఆడపిల్లలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం ఈ రోజుల్లో వింత కాదు కానీ కొన్నేళ్ల క్రితం వరకూ అది ఆడపిల్లలకు సంబంధించిన రంగం కాదు. ఏ ఆడపిల్లా నడవడానికి సాహసించని ఈ దారిలో నడిచిన తొలితరం అమ్మాయిలలో ఎ. లలిత ఒకరు. ఈ ఇంజనీరింగ్ డే ఆమెను గుర్తు చేసుకోవడానికి సరైన సందర్భం.

1919 ఆగస్టు 27 న ఒక మధ్యతరగతి తెలుగు కుటుంబంలో ఏడుగురు పిల్లలలో ఒకరిగా లలిత జన్మించారు. ఆమె తండ్రి ఇంజనీర్. కొంత విశాల దృక్పధం కలిగిన వాడైనప్పటికీ పిల్లల పెంపకం విషయంలో సమాజ కట్టుబాట్లను మీరడానికి ధైర్యం చేసేవాడు కాదు. ఆ కుటుంబంలో అబ్బాయిలు అంతా ఉన్నత చదువులకు వెళితే అమ్మాయిలకు మాత్రం ప్రాధమిక స్థాయి వరకు చదువుకోగానే పెళ్ళిళ్ళు చేసేసేవారు. లలితకు కూడా 15 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. కాకపోతే ఆమె పెళ్ళి తర్వాత కూడా పదవ తరగతి వరకు చదువుకునేందుకు ఆమె తండ్రి ఏర్పాట్లు చేశారు.

అయితే దురదృష్టవశాత్తూ ఆమె వివాహ జీవితం ఎంతో కాలం సాగలేదు. ఆమెకు 18 సంవత్సరాల వయసులో భర్త మరణించారు. అప్పటికే ఆమెకు చిన్న పాప ఉంది. నాలుగు నెలల పాపతో చిన్న వయసులోనే విధవగా మారిందామె. ఆ రోజుల్లో విధవల పట్ల సమాజం ఎంతో వివక్ష చూపించేది. అయితే లలితలోని పోరాట గుణం ఆమె ఎన్నో అడ్డంకులను అధిగమించేలా చేసింది.

పుట్టింటికి తిరిగి వచ్చిన ఆమె పెద్ద చదువులు చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలి అనుకుంది. ఆమె తండ్రి అందుకు మద్దతు ఇచ్చారు. మద్రాస్ లోని క్వీన్ మేరీ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది లలిత. ఆ తరువాత ఇక ఆమె వెనుకడుగు వేయలేదు.

ఆ రోజుల్లో స్త్రీలు చాలామంది మెడిసిన్ చదువుతున్నారు. అయితే ఆ మెడికల్ రంగంలోకి వెళితే తాను తన కూతురికి తగిన సమయం ఇవ్వలేనేమో అని లలిత అనుకుంది. తన కుటుంబంలో అనేకమంది ఇంజినీర్లు ఉండడంతో తాను కూడా ఇంజనీర్ అయితే అనే ఆలోచన వచ్చింది. అయితే అప్పటికి మనదేశంలో ఇంజనీరింగ్ విద్య ఇంకా తొలిదశలోనే ఉంది. మహిళలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం అనేది అసలు కలలో కూడా ఊహించని విషయం. ఏ యూనివర్సిటీ మహిళలకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చేది కాదు. ఈ విషయంలో మళ్ళీ ఆమె తండ్రి పప్పు సుబ్బారావు ఆమెకు సహకరించారు. గుండీ లోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ కేసీ చాకో ను ఒప్పించి ఆమెకు ఇంజనీరింగ్ లో ప్రవేశం కల్పించారు. డైరెక్టర్, ఇన్స్ట్రుక్షన్ కు కూడా దరఖాస్తు పంపి అనుమతి తీసుకున్నారు. ఆ విధంగా ఆ కాలేజీ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చారు. లలిత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ ను ఎంపిక చేసుకున్నారు.

ఆ విధంగా వందలాది మంది అబ్బాయిలు మాత్రమే ఉన్న కళాశాలలో ఒకే ఒక్క మహిళా విద్యార్థిగా లలిత చేరారు. అయితే ఆమెకు అది ఎప్పుడూ అసౌకర్యంగా అనిపించలేదు. ఆమెకోసం ఒక ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆమె కూతురిని తన అన్న ఇంటిలో వదిలి వచ్చారు. ప్రతి వారాంతం వెళ్లి కూతురిని చూసుకుని వచ్చేవారు. ఆమె కళాశాల జీవితం, విద్యాభ్యాసం మొదట బాగానే ఉన్నా కొన్నిరోజులకి తాను అక్కడ ఒంటరిదానిని అనే భావన ఆమెలో మొదలయ్యింది. అదే సమయంలో ఆమె తండ్రి మరింత మంది మహిళలకు ఇంజనీరింగ్ లో ప్రవేశం ఇవ్వమని కళాశాల అధికారులను ఒప్పించారు. కళాశాల వారిచ్చిన ప్రకటన చూసి తర్వాత ఏడాది సివిల్ ఇంజనీరింగ్ లో లీలమ్మ జార్జ్, పికె త్రెసియా అనే మరో ఇద్దరు మహిళలు చేరారు.

అప్పటి నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ విద్య నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ ఒక సంవత్సరం పాటు ప్రాక్టికల్ విద్యను అభ్యసించవలసి ఉంటుంది. లలిత జమల్పూర్ రైల్వే వర్కుషాప్ లో తన ఏడాది అప్రెంటిస్ షిప్ ను పూర్తి చేసుకుని 1943 లో ఇంజనీరింగ్ పట్టా పొందింది. ఆ తర్వాత ఏడాది అప్రెంటిస్ షిప్ నిబంధన ఎత్తివేయడంతో ఆమె జూనియర్ మహిళా ఇంజినీర్లు  ఇద్దరూ కూడా అదే ఏడాది పట్టా పొందారు.

అప్పటికే ఎన్నో అవరోధాలను దాటుకుంటూ వచ్చిన లలిత ఇక ప్రొఫెషనల్ గా కొత్త జీవితం ప్రారంభించింది. అయితే తన కుమార్తె శ్యామల తన మొదటి ప్రాధాన్యతగా భావించిన లలిత ఆమె సంరక్షణకు ఇబ్బందికలగని విధంగా ఉండే ఉద్యోగం కోసం వేట ప్రారంభించింది. సిమ్లా లోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజషన్స్ ఆఫ్ ఇండియా లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందింది. రెండేళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాక తన తండ్రికి పరిశోధనలలో సహాయం చేసేందుకు గానూ చెన్నై కు మారింది. ఆ పరిశోధనలు తన మేధస్సును పెంపొందించుకునేందుకు ఉపయోగపడ్డాయి కానీ ఆర్ధిక ఒత్తిడుల కారణంగా వాటిని మధ్యలో వదిలి మళ్ళీ ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టింది. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వారి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేందుకు కలకత్తా వెళ్ళింది. మళ్ళీ ఆమె కూతురి సంరక్షణ బాధ్యత వాళ్ళ అన్న తీసుకున్నారు.

అక్కడ తాను నేర్చుకున్న విద్యనంతా పనిలో ప్రదర్శించే అవకాశం లలితకు కలిగింది. భాక్రానంగల్ ప్రాజెక్ట్ తో సహా అనేక భారీ ప్రాజెక్ట్ లకు ఆమె పని చేశారు. ట్రాన్స్మిషన్  లైన్లు, సబ్ స్టేషన్ లేఔట్, రక్షణ పరికరాలు డిజైన్ చేయడం లలిత పని. ఆమె మేధస్సు, శక్తీ సామర్ధ్యాలు ఈ సమయంలో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.

1953 లో లండన్ కు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆమెను అసోసియేట్ మెంబెర్ గా తన కౌన్సిల్ లోకి ఆహ్వానించారు. చక్కని చీరకట్టులో లండన్ లోని ఫ్యాక్టరీ ని సందర్శించిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 1964 లో న్యూయార్క్ లో జరిగిన తొలి ఇంజినీర్లు, శాస్త్రవేత్తల అంతర్జాతీయ సదస్సుకు కూడా ఆమెకు ఆహ్వానం అందింది. ఇటువంటి సదస్సుకు హాజరయిన తొలి భారతీయ మహిళా ఇంజనీర్ ఆమె. ఆ తర్వాత కాలంలో ఆమె ఎన్నో మహిళా ఇంజినీర్ల సంస్థలలో సభ్యురాలిగా కొనసాగారు. లండన్ లోని విమెన్ ఇంజనీరింగ్ సొసైటీ లో కూడా 1965 లో సభ్యత్వం పొందారు.

1977 లో పదవీ విరమణ చేసేవరకు లలిత అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ అసోసియేట్స్ (తర్వాత కాలంలో దీనిని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ టేకోవర్ చేసింది) లోనే కొనసాగారు. మహిళలకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగాలలోకి బాట వేసిన తొలి తరం మహిళలలో లలిత ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆమె కూతురు శ్యామల కూడా తల్లి లాగానే సైన్స్, మాథెమాటిక్స్ చదువుకుని మాథెమాటిక్స్ టీచింగ్ లో స్థిరపడ్డారు. తన తల్లి జీవితం, పని నుండి తాను ఏమి నేర్చుకున్నదో శ్యామల ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు. “ఆమె జీవితం నుండి నేను నేర్చుకున్నది అంతులేని ఓర్పు. ఊరికే మాటలు చెప్పడం కాకుండా నాణ్యమైన పని చేయడంపై దృష్టి. ఇతరులు మన జీవితంలోకి ఏదో ఒక కారణంతోనే వస్తారు, ఆ వచ్చిన ప్రయోజనం నెరవేరగానే మన జీవితం నుండి వెళ్ళిపోతారు అనే వారు ఆమె” .

రిటైర్ అయిన కొద్దికాలానికే 1979 లో తన అరవై ఏళ్ళ వయసులో అనారోగ్యంతో లలిత మరణించారు. ఈ రోజున ఎంతో మంది అమ్మాయిలు ఇంజనీరింగ్ కెరీర్ చేపడుతున్నప్పటికీ అందుకు దారి వేసిన ఇటువంటి మహిళల దీక్ష, పట్టుదల గురించి చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తల్లిగా తన బాధ్యతలను ఒంటి చేత్తో లాగుతూనే అటు చదువులో ప్రతిభను కనపరచడమే కాకుండా ఉద్యోగ జీవితంలోనూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందిన లలితను ఈ సందర్భంలో స్మరించుకోవడం ఎంతైనా అవసరం.

Based on a piece by Mamata

జవాజా ప్రాజెక్ట్

అకాడెమిక్ సంస్థల పట్ల తరచుగా వినిపించే ఒక ఫిర్యాదు ఏమిటంటే ఆ సంస్థలు సాధారణ ప్రజా జీవితానికి దూరంగా ఉండి సామాజిక వాస్తవాలను అర్ధం చేసుకోలేవు. అందువల్లనే సామాజిక సమస్యలకు ఈ సంస్థలు సూచించే పరిష్కారాలు కూడా ఎంతో డొల్లగా ఉంటాయి అని.

Jawaja bag
A prized Jawaja bag

అయితే అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కలిసి అమలు చేసిన జవాజా ప్రాజెక్ట్ మాత్రం ఇందుకు ఒక మినహాయింపు అనే చెప్పాలి.

1975 లో ఐఐఎం, అహ్మదాబాద్ తొలి ఫుల్ టైం డైరెక్టర్ అయిన రవి మత్తయి భారతదేశం ఎదుర్కుంటున్న పేదరిక సమస్యను కార్పొరేట్ మేనేజ్మెంట్ సూత్రాలను ఉపయోగించి ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకునేందుకు ఒక చిన్న ప్రయోగం మొదలుపెట్టారు. అప్పటికే ఆయన డైరెక్టర్ గా పదవి నుండి తప్పుకుని ఉండడంతో తన పూర్తి సమయాన్ని ఈ ప్రాజెక్ట్ కు కేటాయించారు.

రాజస్థాన్ లోని కరువు పీడిత జిల్లా అయిన జవాజాను ఈ ప్రయోగానికి వేదికగా ఎంచుకున్నారు.మొత్తం 200 గ్రామాలు, 80000 జనాభా. బీడు భూములు, నీటి కరువు తో పాటు ఇతర భౌతిక వనరులేమీ లేని ఈ జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. అందరి దృష్టిలో ఏ వనరులూ లేని ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యం. కానీ రవి మత్తాయి దృష్టి అందుకు భిన్నమైంది. ఆయన దృష్టిలో మానవ వనరులను మించిన వనరు లేదు.    

ఆ ప్రాంతాన్ని అర్ధం చేసుకునే క్రమంలో అక్కడ దాదాపు మూడువందల ఏళ్లుగా తోళ్ళతో హస్తకళా ఉత్పత్తులు చేసే సంప్రదాయం ఉన్నదని తెలిసింది. అక్కడి ప్రజలకు నేతపనిలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యాలను ఉపయోగించి వారికి సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే ప్రొఫెసర్ మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను రంగంలోనికి తీసుకువచ్చారు. జవాజా ప్రజల జీవనోపాధులపై పని చేసి వారి సాధికారత వైపు కృషి చేయాలనేది ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం. ఈ ప్రయత్నంలో మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు చెందిన అశోక్ ఛటర్జీ తో పాటు రెండు సంస్థలకు చెందిన అనేకమంది ఇతర సిబ్బందితో కలిసి పనిచేశారు. 

హస్తకళాకారులకు సమకాలీన సంస్కృతికి తగిన డిజైన్ లను, నిర్వహణా నైపుణ్యాలను అందివ్వడం, అందుకు అవసరమైన సంస్థలతో వారిని కలపడం ఈ ప్రాజెక్ట్ చేసిన ముఖ్యమైన పని. ఈ ప్రాజెక్ట్ కొన్ని ముఖ్యమైన విలువల ఆధారంగా నిర్వహించబడింది. పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనేవి వాటిలో ముందు వరసలో నిలిచే విలువలు. అక్కడి ప్రజలు ఈ సంస్థలకు చెందిన నిపుణుల నుండి కొత్త విషయాలను నేర్చుకోవడం ఒక ఎత్తైతే ఆ నిపుణులకు కూడా తమ నైపుణ్యాలను సామాజిక సమస్యల పరిష్కారాలకు వినియోగించేందుకు ఒక అవకాశం దొరికింది. ఆ హస్తకళాకారులు తయారుచేసే వస్తువుల విలువగొలుసు లో వీలైనంత ఎక్కువభాగంపై ఆ కళాకారులు, ప్రజలకే నియంత్రణ ఉండేలా చేయడం ఈ ప్రాజెక్ట్ లోని మరొక ముఖ్యమైన అంశం. మారుతున్న మార్కెట్ ప్రాధాన్యతలకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తులను తయారుచేయడం, వాటికి సంబంధించిన ఉత్పత్తి మరియు మార్కెట్ అంశాలలో ఆ కళాకారులకే అధికారం ఉండేలా చూడడం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగింది. కళాకారులంతా ఎవరికి వారు వ్యక్తిగతంగా కాకుండా బృందంగా కలిసి పనిచేయడం ద్వారా ప్రాజెక్ట్ కు మరింత బలం చేకూరింది.

జవాజా బ్యాగ్:

మొదట తోళ్లతో స్కూల్ బాగ్స్, ఫ్లోర్ మాట్ లు వంటి సాధారణ, సంప్రదాయ ఉత్పత్తులతో ప్రారంభించినా చిన్నగా ఆఫీస్ లకు అవసరమైన వస్తువులు, వినూత్నమైన బ్యాగ్లు, ఖరీదైన అలంకరణ వస్తువుల వైపు ప్రాజెక్ట్ మలుపు తిరిగింది.

ఈ ప్రక్రియలో ఎదుర్కున్న సమస్యలు తక్కువేమీ కాదు. పాత నైపుణ్యాలతో, సాంకేతిక పరికరాలు, పనిముట్లతో అధునాతన ఉత్పత్తులు తయారుచేయాల్సి రావడం ఒక సమస్య అయితే వాటి నాణ్యతను నియంత్రించడం మరొక ముఖ్యమైన సమస్య. 

కొత్త డిజైన్ లకు వచ్చేసరికి ముందుగా కమ్యూనిటీ లోనుండి కొంతమందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారితో మిగిలిన వారికి శిక్షణ ఇప్పించాలి అనుకున్నారు కానీ అది అంతగా విజయవంతం కాలేదు. నాణ్యత నియంత్రణకు వచ్చేసరికి, మొదటగా ఈ క్వాలిటీ కంట్రోల్ ను ఆయా సంస్థలకు చెందిన నిపుణులు నిర్వహించినా తర్వాత కాలంలో కళాకారుల బృందాలే ఆ బాధ్యత తీసుకుంటాయి అనేది ప్రాజెక్ట్ ఉద్దేశం. అది కూడా అనుకున్నంత వేగంగా సాగలేదు. కొత్త ఉత్పత్తులను రూపొందించేందుకు, వాటికి తగిన ముడి పదార్ధాలు కొనుగోలు చేసేందుకు తగిన నిధులు, వనరుల కొరత అయితే నిరంతరం ఉండేది.

ఇన్ని సమస్యల మధ్య అమలు జరిగినా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ విజయం సాధించడమే కాదు సుస్థిరంగా కొనసాగింది కూడా.

ఈ ప్రాజెక్ట్ సాధించిన విజయాలలో మొదటిది ఆర్టిసన్స్ యలయన్సు ఆఫ్ జవాజా అనే స్వయంప్రతిపత్తి గల సంస్థను, దాని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం. ప్రాజెక్ట్ కు సంబంధించిన ముడిపదార్ధాలు కొనుగోలు, బ్యాంకు వ్యవహారాలు, ఆర్ధిక లావాదేవీలు, సాంకేతిక అంశాలు, మార్కెటింగ్ విషయాలు అన్నీ ఈ సంస్థలే స్వయంగా నిర్వహించుకునేవి. ఈ సంస్థలు ఈ నాటికీ ఎంతో చురుకుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వినూత్న ఉత్పత్తులను తయారుచేస్తూ, మార్కెట్ చేస్తున్నాయి. ఈ సంస్థల ఉత్పత్తులకు సంబంధిత మార్కెట్లలో ఎంతో విలువ ఉంది.

ఇక రెండవ విజయం అభివృద్ధి రంగంపైన ఈ ప్రాజెక్ట్ చూపించిన ప్రభావం. ఈ గ్రాస్ రూట్ సంస్థ నుండి నేర్చుకున్న పాఠాల నుండే రూరల్ మానేజ్మెంట్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ ఉండాలి అనే ఆలోచనకు తద్వారా ఆనంద్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మానేజ్మెంట్ ఏర్పాటుకు బీజం పడింది. ఈ సంస్థకు రవి మతాయి తో పాటు ఐఐఎం, అహ్మదాబాద్ కు చెందిన మరొక ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ కమల చౌదరి, డాక్టర్ మిచెల్ హల్సే లు ఒక రూపాన్ని ఇచ్చారు. 

పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనే విలువల ఆధారంగా ప్రజా సంస్థలను నిర్వహించడం, వారి జీవనోపాధులకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం ద్వారా జవాజా ప్రయోగం అభివృద్ధి రంగంలో ఒక నూతన ఆలోచనా దృక్పధాన్ని ప్రవేశపెట్టి ఎంతో ప్రభావవంతమైన ప్రయోగంగా నిలిచిపోయింది.

ఇటువంటి ప్రయత్నాల గురించి మరింత మంది తెలుసుకోవాలి, అర్ధం చేసుకోవాలి, చర్చ చేయాలి.

–Based on a piece by Meena

యుద్ధం-శాంతి: War and Peace

మరొక యుద్ధం మొదలయ్యింది. ఆఫ్ఘనిస్థాన్ దృశ్యాలు ఇంకా కళ్ళముందు నుండి పూర్తిగా చెదరకముందే ఉక్రెయిన్ నుండి హృదయవిదారకమైన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు తమ బలాబలాలు తేల్చుకునేందుకు తలపడతుండగా మనలాంటి సాధారణ ప్రజలు మాత్రం తమ జీవితాలు తల్లకిందులై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలుముకున్న పొగ, ధూళి వెనుక అనిశ్చితితో, భయంతో బిక్కచచ్చిపోయిన మనుషులు కనిపిస్తున్నారు. వారిది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ.

ఇటువంటి నిరాశానిస్పృహలు అలుముకున్న సందర్భాలలోనే మనకు ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు, గొంతులు అవసరమవుతాయి. అయితే అటువంటి రెండు శక్తివంతమైన గొంతులను ఇటీవల కాలంలో కోల్పోవడం మన దురదృష్టం. వాటిలో ఒకటి ఆర్చిబిషప్ డెస్మండ్ టూటూ ది. ఆయన డిసెంబర్ 2021 లో మరణించారు. మరొకరు పోయిన నెలలో తన 95 వ ఏట మరణించిన థిచ్ న్హాట్ హాన్.

థిచ్ వియత్నాంకు చెందిన బౌద్ధ భిక్షువు. రచయిత, కవి, గురువు, శాంతిదూత. మధ్య వియత్నాంలోని హ్యూ పట్టణంలో 1926 అక్టోబర్ 11 న జన్మించిన ఆయన అసలు పేరు న్యూయెన్ దిన్ లాంగ్. పదహారేళ్ళ ప్రాయంలోనే ఒక జెన్ ఆశ్రమంలో భిక్షువుగా చేరారు. 1949 లో సన్యాసం స్వీకరించాక తన పేరు థిచ్ న్హాట్ హాన్ గా మార్చుకున్నారు. తర్వాత ఆయన థాయ్ అనే పేరుతో ప్రపంచప్రసిద్ధి చెందారు థాయ్ అంటే గురువు అని అర్ధం.

1950 లలో తన యుక్త వయసులోనే థిచ్ వియత్నాం లో బౌద్ధాన్ని పునరుద్ధరించే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సైగన్ యూనివర్సిటీ లో లౌకికత మీద అధ్యయనం చేసిన మొదటి భిక్షువులలో ఆయన ఒకరు. సైకిల్ తొక్కిన మొదటి ఆరుగురు భిక్షువులలో కూడా థిచ్ ఒకరు.  

1950 ల మధ్యలో వియత్నాం యుద్ధ సమయంలో తమ ధ్యాన మందిరాలలో ధ్యానం చేసుకుంటూ తమదైన సన్యాస జీవితాన్ని ఆచరించాలా లేక యుద్ధంలో, బాంబు దాడులలో దెబ్బతిని బాధపడుతున్నవారికి ఆపన్నహస్తం అందించాలా అనేది అక్కడి భిక్షువులు, సన్యాసినులు ఎదుర్కున్న అతి పెద్ద సమస్య. థిచ్ ఈ రెండు పనులూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు బౌద్ధమత ఆచారాలను ఎంతో లోతుగా అవగాహన చేసుకుని ఆ ఆచారాలకి అనుగుణంగా జీవనం గడుపుతూనే మరొకవైపు తన దేశం, అక్కడి ప్రజలపై యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకు తనవైన ప్రయత్నాలు ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ యూత్ అండ్ సోషల్ సర్వీస్ పేరుతో సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక సంస్థను స్థాపించారు. అందులో యువ భిక్షువులతో సహా దాదాపు 10000 మంది స్వచ్చంద కార్యకర్తలు తమ సేవలందించారు. వీరంతా యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి గాయపడిన వారికి సేవలందివ్వడమే కాకుండా శరణార్ధులకు పునరావాస వసతుల ఏర్పాట్లు, వారికోసం పాఠశాలలు, ఆసుపత్రులు వంటివి ఏర్పాటు చేశారు. ఇందులో యువత కేవలం సామాజిక కార్యకర్తలు మాత్రమే కాదు.బౌద్ధ సూత్రాలైన అహింస, కరుణ లను శ్రద్ధగా ఆచరించే అభ్యాసకులు కూడా.

1961 లో అమెరికా లోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ లో తులనాత్మక మత అంశాలపై బోధించేందుకు థిచ్ అమెరికా కు వెళ్లారు. ఆ తరువాత ఏడాది  బుద్ధిజం పై పరిశోధన, బోధన చేసేందుకు  కొలంబియా యూనివర్సిటీ కు వెళ్లారు. 1963 లో అమెరికా-వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా బౌద్ధులు చేస్తున్న ఉద్యమంలో భాగస్వామ్యాలయ్యేందుకు గానూ ఆయన వియత్నాం తిరిగి వచ్చారు. అప్పటికే ఎంతో మంది బౌద్ధ సన్యాసులు ఈ ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకుని ఉండడంతో ఈ ఉద్యమం ప్రపంచ దేశాలన్నిటి దృష్టినీ ఆకర్షించింది. ఆయన మరొక సారి అమెరికాలో, యూరప్ లో పర్యటించి వియత్నాంలో నెలకొని ఉన్న భయానక పరిస్థితుల గురించి వివరించి అక్కడ శాంతి నెలకొల్పవసిందిగా కోరారు. 1960 ల మధ్యలో వియత్నాం యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఆయన మానవ హక్కుల నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ ను కలిసి ఈ ఘర్ణణ వాతావరణానికి వ్యతిరేకంగా మాట్లాడవలసిందిగా ఆయనను ఒప్పించారు.

1964 లో థిచ్ ఒక బౌద్ధుల వారపత్రికలో యుద్ధానికి వ్యతిరేకంగా ఒక కవిత రాశారు. దానిలో కొంతభాగం ఇలా ఉంది.

ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారంతా సాక్షులుగా ఉండండి.

నేను ఈ యుద్ధాన్ని అంగీకరించలేను

ఎప్పటికీ, ఏనాటికీ

నేను మరణించేలోగా ఈ మాట కొన్ని వేల సార్లు చెప్పవలసి రావచ్చు

తన జంటపక్షి కోసం మరణానికైనా సిద్ధపడే పక్షి లాంటి వాడిని నేను

విరిగిన ముక్కు నుండి రక్తం ఓడుతున్నా ఇలా అరుస్తూనే ఉంటాను

“జాగ్రత్త, వెనుకకు తిరుగు

వాంఛ,  హింస, ద్వేషం, దురాశ అనే అసలైన శత్రువులతో పోరాడు.

ఈ కవిత ఆయనకు యుద్ధ వ్యతిరేక కవి అనే పేరుతో పాటు కమ్యూనిస్ట్ భావజాలంగల వ్యక్తి అనే ముద్ర కూడా తీసుకువచ్చింది. ఆయన ఇలా అమెరికా, యూరప్ లలో తన గళాన్ని వినిపిస్తూ మరొక వైపు అటు ఉత్తర, దక్షిణ వియత్నాంల మధ్య జరుగుతున్నా ఘర్షణలో ఏ వర్గం వైపు నిలబడకపోవడంతో అటు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, ఇటు కమ్యూనిస్ట్ లు కానీ ప్రభుత్వాలు కూడా ఆయనకు 39 సంవత్సరాల పాటు  దేశ బహిష్కరణను విధించాయి. దానికి స్పందిస్తూ ఆయన ఇలా అన్నారు “నేను పాశ్చాత్త్య దేశాలలో ఎక్కువకాలం ఉండాలనుకోలేదు. వారు నన్ను వివిధ అంశాలపై ప్రసంగించేందుకు ఆహ్వానించారు. నేను దానిని యుద్ధానికి వ్యతిరేకంగా నా గొంతు వినిపించేందుకు అవకాశంగా మలుచుకున్నాను. లేకుంటే వియత్నాం కు బయట ఉన్న ప్రజలకు వియత్నాం ప్రజల ఆకాంక్షలు అర్ధం కావు. వియత్నంలో బౌద్ధులం అత్యధిక సంఖ్యలో ఉన్నాం. మేము యుద్ధం జరుపుతున్న ఏ ఒక్క వర్గం వైపూ నిలబడే వారిమి కాదు. మాకు కావాల్సింది యుద్ధంలో గెలవడం కాదు. యుద్ధం జరగకుండా ఉండడం. అందుకే వియత్నంలో యుద్ధం జరుపుతున్న ఏ ఒక్క వర్గానికీ నా మాటలు రుచించలేదు. అందుకే నన్ను నా ఇంటికి రాకుండా నిషేధించారు”

తన దేశ బహిష్కరణ కాలంలోనే థిచ్ అనేక దేశాలు పర్యటించి యుద్ధం, హింసలకు వ్యతిరేకంగా తన గళం విప్పి ప్రపంచ శాంతిదూతగా మారారు. ఏడు భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన విస్తృతంగా రాశారు కూడా. అంతేకాక మైండ్ఫుల్ నెస్ ఆర్ట్, శాంతియుత జీవన విధానాలపై కూడా ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడమే కాక ఎన్నో వ్యాసాలు రాశారు. 1970 లో యూనివర్సిటీ అఫ్ సోర్బోన్, పారిస్ లో బుద్ధిజం పై ఉపన్యాసకులు, పరిశోధకులుగా పనిచేశారు. 1975 లో పారిస్ లో స్వీట్ పొటాటో కమ్యూనిటీ ని స్థాపించారు. తర్వాత 1982 లో ఫ్రాన్స్ లోని నైరుతి భాగంలో ఒక విశాలమైన భూభాగంలో ఒక బౌద్ధ ఆరామాన్ని స్థాపించారు. ప్లమ్ విలేజ్ అని పిలవబడే ఈ ఆరామంలో దాదాపు 200 మంది బౌద్దులు నివసించేవారు. అంతేకాక ప్రతిఏటా ప్రపంచంలోని నలుమూలలనుండి ఎనిమిది వేల మందికిపైగా ఈ ఆరామానికి మైండ్ ఫుల్ లివింగ్ కు సంబంధించిన అంశాలు నేర్చుకునేందుకు వచ్చేవారు.

2005 లో వియత్నాం లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆయనను దేశంలో ప్రవేశించేందుకు, ప్రయాణించేందుకు, బోధన చేసేందుకు అనుమతి ఇచ్చింది. తన యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన కొనసాగిస్తూనే వచ్చారు. 2014 లో తన 88 వ ఏట వచ్చిన గుండె నొప్పి కారణంగా శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైనప్పటికీ ఆయన తన నిర్మలమైన వ్యక్తిత్వంతో అందరికీ స్ఫూర్తినిస్తూనే వచ్చారు. 2022 జనవరి 22 న తన 95 ఏళ్ళ వయసులో వియత్నాం లోని హ్యూ ప్రాంతంలో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు.

యుద్ధమేఘాలు అలుముకుని ఉన్న ఈ సమయంలో ఆయనే కనుక ఉండి ఉంటే మరొక యుద్ధాన్ని చూసి ఎంతో దుఃఖించి ఉండేవారు. అన్ని సమస్యలకు యుద్ధం మాత్రమే పరిష్కారం కాదనీ, నమ్మకం, సహానుభూతి, సోదరభావం అనే మార్గాల ద్వారా కూడా పరిష్కారాలు సాధించవచ్చనీ ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసేవారు. ఆయన మాటలను ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుందాం “చెడు ఆలోచనలను, అభిప్రాయాలను క్షిపణులు, తుపాకులు, బాంబులు నాశనం చేయలేవని మనకు తెలుసు. ప్రేమపూర్వకమైన సంభాషణ, సహానుభూతితో అవతలి వారి ఆలోచనలను వినడం ద్వారా మాత్రమే చెడు ఆలోచనలను సరిచేసుకోగలము. కానీ ఈ పద్ధతిపై మన నాయకులెవరికీ శిక్షణ లేదు. అందుకే వారు తీవ్రవాదాన్ని అణచడానికి ఆయుధాలపై ఆధారపడతారు”

ఈ సందర్భంలో ఆయన మరొక మాటను కూడా గుర్తు చేసుకోవాలి. “ఆశ అన్నిటికన్నా ముఖ్యం. అది ఉండడం వలన ప్రస్తుతం ఎంత కఠినంగా ఉన్నా భరించగలం. భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ ఉన్నప్పుడే ఈ రోజు ఎదురైన కష్టాన్ని ఓర్చుకునేందుకు సిద్ధపడతాం”

భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో. …

–Based on a piece by Mamata

.

అదా లవ్ లేస్ : శాస్త్ర సాంకేతిక రంగంలో మార్గదర్శి: Ada Lovelace

నేను చదివే వార్తా పత్రికలో ప్రతి బుధవారం టెక్నాలజీ కి సంబంధించిన వార్తల కోసం కొన్ని పేజీలు కేటాయించబడి ఉంటాయి. అందులో టెక్నాలజీ రంగంలో విజయాలు సాధించిన యువత గురించి, ముఖ్యంగా యువతుల గురించి వార్తలు వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా నాకు అదా లవ్ లేస్ గుర్తువస్తూ ఉంటుంది. ఈ రోజు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాలలో ఆడపిల్లలను ప్రోత్సహించాలని అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడో 19 వ శతాబ్దపు తొలినాళ్లలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ లో తనదైన ముద్ర వేసింది లవ్ లేస్.

ఈ రోజు మనందరం విరివిగా ఉపయోగిస్తున్న కంప్యూటింగ్ సైన్స్ కు పునాది వేసింది దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం అనీ, అందునా ఒక స్త్రీ అనీ ఎంతమందికి తెలుసు? అదా లవ్ లేస్ కంప్యూటర్ ల గురించి, భవిష్యత్తు ప్రపంచంలో వాటి ప్రాముఖ్యతను గురించీ ఎన్నో ఏళ్ళ క్రితమే అంచనా వేసిన దార్శనికురాలు. అదా లవ్ లేస్ అని పిలవబడే అగస్టా అదా బైరన్ 1815 డిసెంబర్ 10 న లండన్ లో జన్మించింది. అద్భుతమైన కవిగా మనందరికీ తెలిసిన జార్జ్ గోర్డాన్ అలియాస్ లార్డ్ బైరన్, ప్రముఖ గణితవేత్త అన్నబెల్లా మిల్బంకే ల కూతురే అదా.

గొప్ప కవే అయినా పిచ్చివాడిగా పేరు తెచ్చుకున్న బైరన్ కూ గణిత మేధావి అయిన అతని భార్యకూ మధ్య వివాహ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. అదా పుట్టిన నెలరోజులకు అన్నబెల్లా లండన్ లోని బైరన్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. తన కూతురి మీద అతని ప్రభావం పడకూడదని, అతని కవిత్వ వారసత్వం, అతని పిచ్చి లక్షణాలు ఆ అమ్మాయికి కూడా అంటకూడదనీ, ఈ ఊహాత్మక కళాజీవనానికి భిన్నంగా ఆ అమ్మాయి గణితం, సంగీతం, సైన్స్ లలో రాణించాలని ఆ తల్లి కోరిక.

అదా తండ్రి బైరన్ కూడా ఆ అమ్మాయి చాలా చిన్న వయసులో ఉండగానే లండన్ వదిలి వెళ్ళిపోయాడు. అదాకు ఎనిమిదేళ్ల వయసు ఉండగా గ్రీస్ లో ఆయన చనిపోయాడు. అదా కు ఆయనతో పరిచయమే లేదు. తన అమ్మమ్మ పెంపకంలో పెరిగింది. ప్రైవేట్ టీచర్లు తనకు వ్యక్తిగతంగా చదువు చెప్పేవారు. చిన్నతనం నుండీ ఆ అమ్మాయి అనారోగ్యాలతో బాధపడేది. దానితో ఇంటిలోనే చదువు కొనసాగింది.

అదా కు చిన్నప్పటి నుండే యంత్రాలంటే ఆసక్తి. సైన్స్ పత్రికలు విపరీతంగా చదివేది. అయితే తన తండ్రికి ఉన్నట్లు ఊహాశక్తి కూడా ఎక్కువే. తన 12 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి ఎగరాలి అనే కోరిక కలిగింది. అది కలగా మిగిలిపోలేదు. చాలా పద్ధతిగా పక్షులు, వాటి రెక్కల మీద పరిశోధనలు చేసి రకరకాల పదార్ధాలతో రెక్కలను తయారు చేసేది. తాను చేసిన పరిశోధనకు ‘ఫ్లయాలజీ’ అని పేరు పెట్టింది. ఈ పరిశోధనంతటికి గానూ తన తల్లి నుండి ఎన్నో చివాట్లు కూడా తింది.

1833 లో లండన్ లో జరిగిన ఒక పార్టీ లో ఆమెను ప్రముఖ గణిత మేధావి చార్లెస్ బాబేజ్ కు ఎవరో పరిచయం చేశారు. బాబేజ్ తాను కొత్తగా సృష్టించిన పరికరాన్ని గురించి ఆమెకు వివరించారు. దానిలో అంకెలు వేసి ఉన్న చక్రాన్ని ఒక హేండిల్ సహాయంతో ఖచ్చితమైన లెక్కలు చేయవచ్చు. దీనిని ఆయన ‘డిఫరెన్స్ మెషిన్” అని పిలిచారు. కొన్ని రోజుల తర్వాత ఆ పరికరాన్ని స్వయంగా చూసేందుకు గానూ అదా తల్లి ఆ అమ్మాయిని బాబేజ్ ఇంటికి తీసుకుని వెళ్ళింది. అయితే అది అసంపూర్తిగా ఉన్నట్లు అదా గ్రహించింది. దానిని ఇంకా ఎలా మెరుగ్గా చేయవచ్చో సూచిస్తూ బాబేజ్ తో అనేక చర్చలు జరిపింది. అలా మొదలైన వారిద్దరి స్నేహం జీవితాంతం కొనసాగింది. బాబేజ్ కు అప్పటికే నలభై సంవత్సరాలు. భార్యను కోల్పోయారు. అదా ఉత్సాహవంతమైన యువతి. ఆ అమ్మాయిలోని ప్రతిభను గుర్తించిన బాబేజ్ ఆమెను ఎంతో ప్రోత్సహించారు.

తన 19 ఏళ్ళ వయసులో అదా ధనిక కుటుంబానికి చెందిన విలియం కింగ్ ను వివాహమాడింది. వారికి ముగ్గురు పిల్లలు. 1838 లో అదా అతని లవ్ లేస్ కుటుంబ వారసురాలిగా లేడీ అదా కింగ్ గా హోదా పొందింది. అప్పటి నుండి ఆమెను అదా లవ్ లేస్ అని పిలిచేవారు.

ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరొక వైపు అదా తన గణిత పరిశోధనలపైన కూడా ద్రుష్టి పెట్టింది. మరొక మహిళా గణిత మేధావి మేరీ తో ఆమెకు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి అనేక గణిత విషయాలతో పాటు చార్లెస్ బాబేజ్ రూపొందించిన డిఫరెన్స్ మెషిన్ గురించి కూడా చర్చించుకునేవారు. 1841 లో లండన్ యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ అయినా ఆగస్టస్ డెమోర్గన్ ఆమెకు ఒక ఉన్నతమైన ప్రాజెక్ట్ అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ చేస్తూనే మేరీ తో కలిసి అడ్వాన్సుడ్ మాథెమాటిక్స్ నేర్చుకుంటూనే ఉండేది. డిఫరెన్స్ మెషిన్ ఎప్పుడూ ఆమె ఆలోచనలలోనే ఉండేది.

ఆ సమయంలో బాబేజ్ అనలిటికల్ ఇంజిన్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. అదా దానిలో కీలక పాత్ర పోషించింది. ఆ ఇంజిన్ కు సంబంధించి అదా ఒక పేపర్ కూడా రాసింది. అందులో దాని పనితీరును సోదాహరణంగా క్లుప్తంగా వివరించింది. మెషిన్ కోడ్ ద్వారా బాబేజ్ తయారు చేసిన యంత్రం ఎలా ఒక వరుసలో పనులు చేసుకుంటూ వెళ్లిపోతుందో ఆమె అందులో వివరించింది. ఈ పేపర్ లోనే ప్రపంచంలోనే తొలిసారిగా అల్గోరిథం లేదా కంప్యూటర్ ప్రోగ్రాం ను ఆమె పరిచయం చేసింది. ఆ విధంగా చూస్తే ఆమె తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ అనుకోవచ్చు.

కంప్యూటింగ్ లో ఒక కొత్త అంశాన్ని పరిచయం చేసి అదా లవ్ లేస్ నూతన శకానికి తెరతీసింది. అనలిటికల్ ఇంజిన్ కేవలం అంకెలు, లెక్కలకు సంబంధించినది కాదు అని తాను గుర్తించింది. అది కేవలం కాలిక్యులేటర్ కాదు అని గణితానికి మించి ఎన్నో విషయాలలో మనిషికి తోడ్పడగలదని గుర్తించింది. ఉదాహరణకు మ్యూజిక్ కంపోసింగ్ లో కూడా అది సహాయపడగలదు.

1852 లో తన 36 ఏళ్ళ వయసులో అదా మరణించింది. ఆ తర్వాత వందేళ్లకు గానీ ఆమె అనలిటికల్ ఇంజిన్ పై రాసిన నోట్స్ బయటపడలేదు. 1940 లో ఆధునిక కంప్యూటర్లపై అలాన్ టూరింగ్ చేసిన కృషికి స్ఫూర్తి లవ్ లేస్ రాసిన నోట్స్ అంటే ఆమె ఎంత దార్శనికురాలో అర్ధం అవుతుంది. 1979 లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వారు కొత్తగా రూపొందించిన కంప్యూటర్ లాంగ్వేజ్ కు అదా గౌరవార్ధం ఆమె పేరునే పెట్టారు.

సైన్స్, టెక్నాలజీ రంగాలలోకి అడుగుపెట్టేందుకు ఇప్పటికీ అమ్మాయిలు వెనుకంజ వేస్తున్న ఈ సమయంలో అదా వంటి తొలితరం శాస్త్రవేత్తలను గుర్తు చేసుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తుంది.

Post 44

–Based on a piece by Mamata

నేచురల్ హిస్టరీ మ్యూజియంల రూపశిల్పి డాక్టర్ నాయర్ కు నివాళి: Dr. SM Nair

కొన్ని రంగాలలో మార్గదర్శకులుగా చెప్పుకోదగిన వారు కొందరే ఉంటారు. ఎస్.యం. నాయర్ అటువంటి అరుదైన మార్గదర్శకులలో ఒకరు. మ్యూజియాలజీ అనేది ఇప్పటికీ అంతగా ఆదరణ లేని రంగమే. 1950 లలో పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ఆ రోజుల్లోనే కేరళలోని త్రివేండ్రంలో బి.ఎస్సీ పూర్తిచేసిన ఒక కుర్రవాడు బరోడా వరకు వెళ్ళి యం.ఎస్. యూనివర్సిటీ లో ఈ సబ్జెక్టు లో యం.ఎస్సీ చేయడానికి సిద్ధపడ్డాడంటే ఆశ్చర్యమే మరి. 

డాక్టర్ నాయర్ బరోడాలో తాను చదువుకున్న విద్యాసంస్థలోనే అధ్యాపకునిగా పని చేయడం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బిట్స్ పిలానీలో మ్యూజియం స్టడీస్ శాఖకు మారారు.

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన యూరప్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలను చూసి ఎంతో మెచ్చుకున్నారు. దానికి తోడు ఆమెకు సహజంగానే పర్యావరణం పట్ల ఆసక్తి ఎక్కువ. అటువంటి ప్రదర్శనశాలలు మన దేశంలో కూడా ఏర్పాటు చేయాలని ఆమె ఆలోచన చేశారు. ఢిల్లీ లో ఒకటి, భోపాల్ లో ఒకటి నెలకొల్పేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక ను అమలు చేసేందుకు కొంతమంది మ్యూజియం ప్రొఫెషనల్స్, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా 1974 లో కేవలం 37 ఏళ్ళ వయసుకే ఈ వినూత్న ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా డాక్టర్ ఎస్.యం నాయర్ ఎంపిక కావడం జరిగింది.

Dr. Nair and Mrs. Gandhi at NMNH
Dr. Nair and Mrs. Gandhi at NMNH

తర్వాత నాలుగు సంవత్సరాలు ఆ మ్యూజియంల గురించిన ప్రణాళిక రూపకల్పన, అమలుతో ఎంతో ఒత్తిడితో గడిచిపోయాయి. శ్రీ డిపి సింగ్, ఎస్.కె. సరస్వత్, బి. వేణుగోపాల్, ఇంకెంతో మంది అంకితభావం కల ప్రొఫెషనల్స్ ఈ ప్రాజెక్ట్ పై ఎంతో కృషి చేశారు. డాక్టర్ నాయర్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలను సందర్శించారు. ప్రపంచంలోని అత్యుత్తమైన సంస్థలలో తన బృంద సభ్యులకు శిక్షణ ఇప్పించారు. మొత్తానికి 1978 జూన్ ఐదు (ప్రపంచ పర్యావరణ దినోత్సవం) నాడు జాతీయ ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాల తలుపులు ప్రజల కోసం తెరుచుకున్నాయి. తర్వాత కాలంలో డాక్టర్ నాయర్ మార్గదర్శకత్వంలో మైసూర్, భోపాల్, భువనేశ్వర్ లలో ప్రాంతీయ ప్రదర్శనశాలలు కూడా ప్రారంభమయ్యాయి.  

ఢిల్లీ లో ఈ జాతీయ ప్రదర్శనశాల ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఖడ్గమృగం ఢిల్లీ లో పెరిగిన పిల్లలందరి జ్ఞాపకాలలో తప్పకుండా ఉంటుంది. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో సహజంగా మరణించిన ఖడ్గమృగ కళేబరాన్ని తెచ్చి అది పాడవుకుండా రసాయనాలు వాడి ఈ ప్రదర్శనశాలలో ఉంచారు.

జాతీయ ప్రదర్శన శాల ప్రారంభమయిన నాటి నుండీ బడి పిల్లలకోసం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించింది. మిగిలిన అన్ని మ్యూజియంలు వస్తువులు ప్రదర్శనకు పెట్టి ఊరుకుంటే అందుకు భిన్నంగా ఈ ప్రదర్శన శాల స్వయంగా ప్రజలలోకి, పిల్లలలోకి వెళ్లి వారిని మ్యూజియం కార్యక్రమాలలో భాగమయ్యేలా చేసేది. అప్పటిలో ఎన్నో పాఠశాలలో ఉపాధ్యాయులకు పర్యావరణం పట్ల ఎన్నో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది.   

మ్యూజియం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో డాక్టర్ నాయర్ స్వయంగా పాల్గొనేవారు. తొంభైలలో ఉద్యోగ విరమణ చేసే వరకు ఆయన తన ఉద్యోగ తొలినాళ్లలో ఉన్న ఉత్సాహాన్నే కొనసాగిస్తూ పనిచేశారు. 2016 ఏప్రిల్ 26 న మ్యూజియంలో అగ్నిప్రమాదం జరిగి అందులో పొందుపరచిన జంతు, జీవజాలాల శిలాజాలన్నీ తగలబడిపోయాయన్న వార్త ఆయనను ఎంత బాధ పెట్టి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

డాక్టర్ నాయర్ తన ఉద్యోగ విరమణ తర్వాత కూడా పర్యావరణ విద్య మీద చురుకుగా పనిచేస్తూనే వచ్చారు. డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్-ఇండియా, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వంటి ప్రఖ్యాత సంస్థలలో పనిచేశారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన ఎంతో గౌరవాన్ని, గుర్తింపును పొందారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ లో నాచురల్ హిస్టరీ మ్యూజియం కమిటీ చైర్మన్ గా, ఇండో-యు.ఎస్. సబ్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ లోని జాయింట్ మ్యూజియం కమిటీ సభ్యునిగా కూడా ఆయన తన సేవలు అందించారు.

‘అంతరించిపోతున్న జంతుజాలం, వాటి సంరక్షణ’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించగా ఆగం కళా ప్రకాశన్ సంస్థ ఆయన మరొక పుస్తకం ‘బయో డీటీరియరేషన్ ఆఫ్ మ్యూజియం మెటీరియల్స్’ ను ప్రచురించింది. 

భారతదేశంలో పర్యావరణ విద్యను ఒక ఉద్యమంగా రూపొందించిన తొలితరం మార్గదర్శకులుగా డాక్టర్ నాయర్ మాకు ఎనభైల కాలం నుండి తెలుసు.

నేను పని చేసిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ లో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా, తర్వాత సీనియర్ కొలీగ్ గా ఆయన మాకు చూపించిన దారి మరువలేనిది. ఒక చిన్న స్వచ్చంద సంస్థగా ప్రారంభమయిన తొలినాళ్లలో ఈ సంస్థలో  పనిచేసిన వారందరికీ ఆయన అన్నా, ఆయన నెలకొల్పిన మ్యూజియం అన్నా అపారమైన గౌరవం ఉంది. వేరే ఏ ప్రాజెక్ట్ లు లేని తొలినాళ్లలో ఈ సంస్థ యొక్క, అక్కడి సిబ్బంది యొక్క సామర్ధ్యాన్ని గుర్తించి మ్యూజియంకు సంబంధించి ఎక్సిబిట్లు తయారు చేసే పనిని వారికి అప్పగించడం ద్వారా వారిలో ఎంతో స్ఫూర్తిని, ఆశను కలిగించారు. కొన్ని నెలల పాటు సిబ్బంది జీతభత్యాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా సమకూరడమే కాకుండా మొదటిసారి ఒక జాతీయ స్థాయి సంస్థకు పనిచేసిన అనుభవం కూడా సంస్థకు కలిగింది. అది సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

మాతో పనిచేసిన మీనా తండ్రిగా కూడా మాకు ఆయనతో పరిచయం ఉంది. ఆమె కూడా తండ్రి బాటలోనే పర్యావరణ పరిరక్షణ రంగంలోనే తన కెరీర్ ను ఎంపిక చేసుకుంది. 

ఒక తరం పిల్లలలో ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచిన జాతీయ మ్యూజియం ఇప్పుడు లేదు. కానీ డాక్టర్ నాయర్ స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 1937 నుండి 2021 వరకు జీవించిన డాక్టర్ నాయర్ గత వారం మరణించారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ

Post 39

–Based on a piece by Meena

మరపురాని మహాకవి: సుబ్రమణ్య భారతి: Subramania Bharathi

చేగువేరా అనగానే కొంచెం పొడవుగా భుజాలను తాకుతున్న జుట్టుతో, కెమెరా వంక సూటిగా చూస్తున్న కళ్ళతో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన విప్లవ యోధుడి రూపం కళ్ళముందు మెదులుతుంది.  

Poet Subramania Bharathi
Mahakavi Bharathi

తమిళనాడు ప్రజలకు ఎంతో ప్రియమైన కవి సుబ్రమణ్య భారతి రూపం కూడా అలాగే ఒక ప్రత్యేకతతో ఉండి ఆయన పేరు వినగానే కళ్ల ముందు మెదులుతుంది. తలపై నుండి మెడ చుట్టూ చుట్టిన తలపాగాతో, పెద్ద మీసాలతో, నేరుగా ఆత్మ లోకి ప్రవహించేలా గుచ్చే చూపులతో ఆయనది ఒక ప్రత్యేకమైన రూపం. ఆయన కవిత్వం, ఆశయాలు కూడా ఆయన రూపంలాగే ప్రత్యేకమైనవి.

ఈ సెప్టెంబర్ నెలకి మహాకవి సుబ్రమణ్య భారతి మరణించి సరిగ్గా వందేళ్ళు. కేవలం 39 ఏళ్ళ వయసులో చెన్నైలోని ట్రిప్లికేన్ వద్ద ఉన్న పార్ధసారధి గుడిలో ప్రమాదవశాత్తూ ఏనుగు కింద పడి తొక్కిసలాటలో మరణించారు ఆయన. సుబ్రమణ్య భారతి, ఆ ఏనుగు నిజానికి స్నేహితులే. ఆయన రోజూ దానికి ఆహారం తినిపించేవారు. ఆ రోజు అనుకోని ప్రమాదం జరిగి ఆయన మరణించడం నిజంగా దురదృష్టం. ఆయన జీవితంలాగే ఆయన మరణం కూడా అసాధారణం.

ఆయన మరణించి వందేళ్ళయినా ఆయన ముద్ర తమిళ ప్రజలపై చెరిగిపోలేదు. దేశభక్తి, సామాజిక మార్పు, విప్లవం, శృంగారం, భక్తి ఇలా ప్రతి సందర్భానికి తనదైన ముద్రతో ఆయన చేసిన రచనలు ప్రజల మనసులపై చెరగని ముద్ర వేసాయి.

తమిళనాడులో ఆయన కవితలు, రచనల గురించి తెలియని బడి పిల్లలు ఉండరు. భారతి పాటలను సంప్రదాయ రాగాలలోనో, సినిమా పాటలుగానో, పాప్ పాటలుగానో ఏదో ఒక రూపంలో కంపోజ్ చేయని సంగీతకారుడు లేడు. తమ సినిమాలలో ఆయన పాటనో, పద్యాన్నో, రచననో ఏదో ఒక రూపంలో వినియోగించని సినిమా దర్శకుడు లేడు. ఆయన కవితలకు స్పందించని, ప్రశంసించని తమిళుడు లేడు. వీటన్నిటిలోనూ అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు.

తన కవిత్వ ప్రతిభకు గానూ బాల మేధావిగా గుర్తింపు పొందిన ఆయనకు తన పన్నెండేళ్ళ వయసులోనే ఎట్టయాపురం రాజుగారు ‘భారతి’ అనే బిరుదునిచ్చి (సరస్వతీ దేవి ఆశీర్వాదం పొందినవాడు) సత్కరించారు.

ఆయన తన రచనలన్నీ తమిళంలోనే చేసినా 14 భాషలలో ఆయనకు ప్రవేశం ఉంది. సుబ్రమణ్య భారతి ఉపాధ్యాయునిగా, విలేకరిగా, కవిగా, రచయితగా, స్వాతంత్ర సమరయోధునిగా బహుముఖ ప్రజ్ఞను కనపరచారు. ఎంతో ఆధ్యాత్మికత నింపుకున్న వ్యక్తి. సిక్కులను చూసి వారి మీద తనకున్న అభిమానంతో వారిలాగే తలపాగా చుట్టడం మొదలుపెట్టారు.

ఆయన కలానికి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద అరెస్ట్ వారంట్ జారీ చేసింది. కారాగారవాసాన్ని తప్పించుకునేందుకుగానూ 10 ఏళ్ళ పాటు పాండిచ్చేరి లో అజ్ఞాతవాసంలో ఉన్నారు.

మహిళా విముక్తిని ఆకాంక్షిస్తూ ఎన్నో రచనలు చేశారు. స్వాతంత్ర సమరంలో, దేశాభివృద్ధిలో చేయి చేయి కలిపి నడవాల్సిందిగా మహిళలకు పిలుపునిచ్చారు. అప్పటి మద్రాస్ రాష్ట్రంలో ఒక సందర్భంలో అనేక మంది జనం మధ్యలో సుబ్రమణ్య భారతి తన భార్య చేయి పట్టుకుని నడిచి వెళితే జనం నోరు వెళ్ళబెట్టుకుని ఆశ్చర్యంతో చూసారు.

కవిత్వం నిజానికి అనువాదాలలో అంత గొప్పగా ఒదగదు. అయినా ఆలోచనలను, ఆకాంక్షలను, ఆశయాలను విస్తృతంగా అనేక మందికి చేరువ చేసేందుకు గానూ ఆయన కవిత్వం ఎన్నో భాషలలోకి అనువదించబడింది. ఇంగ్లీష్ లోకి అనువదించబడిన ఆయన ఒక కవితను ఇక్కడ ఇస్తున్నాను.

‘With the name of Bharat Desh on our lips

Let us shake off our fears and poverty

And overcome our sorrows and enemies.

We shall stroll on the snow-clad silver heights of the Himalayas

Our ships shall sail across the high seas

We shall set up schools—scared temples for us.

We shall span the sea to reach Sri Lanka

And raise the level of the Sethu and pave a road on it

We shall water Central India with the bounteous rivers of Bengal.

We shall have such devices that sitting at Kanchi

We will listen to the discourses of scholars in Varanasi.

We shall make tools and weapons

We shall produce paper

We shall open factories and schools

We shall never be lazy or weary

We shall ever be generous

We shall always speak the truth.

Both scriptures and sciences we shall learn

The heavens and oceans we will explore

The mysteries of the moon we shall unravel

The art of street-sweeping too, we shall learn.’

మీకు తమిళ పదాలు అర్ధం కాకున్నా భారతి పాటలు, కవితలను విని చూడండి. మీకు అవి ఖచ్చితంగా ఆనందం కలిగిస్తాయనీ, స్ఫూర్తినిస్తాయనీ అనుకుంటాను. ఇక్కడ ఇచ్చిన అనువాదం NCERT 1984 లో తీసుకువచ్చిన ఒక పుస్తకంలోనిది. ఒకవిధంగా ఇది ఆయన జీవిత సారాంశం. NCERT చేసిన అనేక అద్భుతమైన పనులలో ఇది కూడా ఒకటి అనిపిస్తుంది నాకు.

https://archive.org/stream/in.ernet.dli.2015.231768/2015.231768.Poems-Subramania_djvu.txt)

ఒక ఉపాధ్యాయుని పగటికల: Divaswapna

మొన్ననే మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం. ఈ సందర్భంగా విద్య, పాఠశాలలు, గురువుల పాత్ర వంటి ఎన్నో అంశాల మీద విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అనే అంశంపై ఎన్నో కాల్పనిక కథలు, నిజజీవిత గాధలు, విధాన పత్రాలు, మరెన్నో పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఉపాధ్యాయుడే కీలకం. నూతన జాతీయ విద్యా విధానం 2020 కూడా “విద్యా వ్యవస్థలో ఎటువంటి ప్రాధమిక సంస్కరణలు చేపట్టాలన్నా ఉపాధ్యాయులే కేంద్రంగా ఉండాలి. రాబోయే తరాలను తీర్చిదిద్దే గురువులకు సమాజంలో తగినంత గౌరవం, గుర్తింపు ఉండేలా అన్ని స్థాయిలలో ఉపాధ్యాయుల పాత్రను మెరుగుపరచాల్సి ఉంది” అని అభిప్రాయపడింది. 

ఈ నూతన విద్యా విధానం ప్రకారం “ఒక మంచి విద్యా సంస్థ అంటే అందులోని ప్రతి విద్యార్థి తాను ముఖ్యమైనవారిగా, తమకు తగినంత భద్రత, సంరక్షణ ఉన్నట్లు భావించగలగాలి. నేర్చుకునేందుకు తగిన వాతావరణం ఉండాలి. అనేకరకాల అనుభవాలను పాఠశాల విద్యార్థులకు అందించగలగాలి. విద్యార్థులు మెరుగ్గా నేర్చుకునేందుకు తగిన మౌలిక వసతులు, వనరులు పాఠశాలలో ఉండాలి” .

విద్యా విధానం కొత్తదే కానీ ఈ కల ఈ నాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా విద్యావేత్తలు మన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను కోరుకుంటూ ఎన్నో కలలు కంటూనే ఉన్నారు. ఈ కలే దాదాపు వందేళ్ళ క్రితం గుజరాత్ కు చెందిన ఒక యువ ఉపాధ్యాయుడిని ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దింది. అతనే గిజుభాయ్ బధేక.

విద్యా బోధనలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసిన గిజుభాయ్ పిల్లలు వాటికి ఎలా స్పందిస్తున్నారో నిశితంగా పరిశీలించేవారు. ఉపాధ్యాయులు, తల్లిదండులు పిల్లలతో వ్యవహరించే పద్ధతులు ఒకే విధంగా ఉన్నట్లయితే తాను ప్రయత్నించిన బోధనా విధానాలు మరింత మెరుగ్గా పనిచేస్తాయని కూడా ఆయన అర్ధం చేసుకున్నారు. ఆయన చేసిన ప్రయోగాలు, పరిశీలనలు, ఆయన కన్న కలలు అన్నీ “దివాస్వప్న” అనే పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం తెలుగులో పగటికల పేరుతో అనువదించబడింది. 1931 లో తొలిసారిగా ప్రచురించబడిన ఈ దివాస్వప్న పుస్తకం లక్ష్మిశంకర్ అనే ఉపాధ్యాయుడు విద్యా బోధనలో చేసిన వినూత్న ప్రయత్నాలను వివరించే కాల్పనిక కథ. నిజానికి ఇది గిజుభాయ్ స్వానుభవాల ఆధారంగా రాసిన కథే.

కథాకాలం చూస్తే దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న కాలం. నిర్దేశించిన పాఠ్యప్రణాళికతో, సరైన మార్కులు పొందని వారికి దారుణమైన శిక్షలు అమలు జరుగుతూ బ్రిటిష్ అధికారుల పర్యవేక్షణలో మూసపద్ధతిలో బోధన జరుగుతూ ఉండేది. కానీ ఎటువంటి పరిస్థితులలో అయినా లక్ష్మిశంకర్ వంటి దార్శనికులు పుడుతూనే ఉంటారు. ఈ యువ ఉపాధ్యాయుడు విద్యా బోధనలో తాను చేసిన నూతన ప్రయత్నాలను స్వయంగా వివరించే పుస్తకమే దివాస్వప్న.

లక్ష్మిశంకర్ యువకుడు. మంచి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో ఆదర్శవంతమైన ఆలోచనలు కలవాడు. బ్రిటిష్ అధికారిని కలిసి తన ఆలోచనలను అమలు చేసేందుకు ఏదైనా ఒక పాఠశాలలో వినూత్నంగా బోధించే అవకాశం ఇవ్వమని కోరాడు.

అతని ఆలోచనలు విన్న ఆ అధికారి మొదట నవ్వుతాడు. కానీ తర్వాత కొద్దిగా సంకోచిస్తూనే ఒక పాఠశాలలో నాలుగవ తరగతి పిల్లలకు తాను అనుకున్న పద్ధతిలో బోధన చేసేందుకు అనుమతిస్తాడు. అయితే ఏడాది చివరిలో లక్ష్మిశంకర్ విద్యార్థులు కూడా మిగిలిన అందరు పిల్లలలాగే పరీక్షకు హాజరయ్యి మంచి ఫలితాలు సాధించాల్సి ఉంటుందని షరతు విధిస్తాడు.

లక్ష్మిశంకర్ ఆ సవాలును స్వీకరిస్తాడు. అనేక ఆలోచనలు, కలలతో నాలుగవ తరగతిలో అడుగుపెడతాడు. అరుచుకుంటూ, కొట్టుకుంటూ, పరుగులు పెడుతూ రౌడీలలా ప్రవర్తిస్తున్న పిల్లలతో చేపల మార్కెట్ లా ఉన్న ఆ తరగతిని చూసి నిర్ఘాంతపోతాడు. తన పగటికలను నిజం చేసుకోవాలంటే ముందుగా ఏదైనా చేసి ఈ పిల్లల మనసులలో స్థానం సంపాదించుకోవాలి అనుకుంటాడు.

తర్వాత రోజు తన తొలి తరగతిని పిల్లలకు ఒక కథ చెప్పడంతో ప్రారంభిస్తాడు. కథ ఆసక్తిగా ఉండడంతో పిల్లలు చాలా శ్రద్ధగా, నిశ్శబ్దంగా వినడం మొదలు పెడతారు. నిజానికి వారు కథలు ఆపేసి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. తర్వాత పది రోజులూ ఆయన తరగతులు కథలతోనే గడిచిపోతాయి. పాఠ్యఅంశాలు బోధించకుండా ఇలా కథలతో కాలక్షేపం చేస్తున్నందుకు అధికారులు అతనిని ప్రశ్నిస్తే ఈ కథల ద్వారా ముందు పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చి క్రమశిక్షణను అలవాటు చేస్తున్నాను. వారికి చదువు పట్ల ఆసక్తి కలిగేలా స్ఫూర్తినిస్తున్నాను. వారికి సాహిత్యం, భాషానైపుణ్యాలను పరిచయం చేస్తున్నాను అని చెబుతాడు.

అతను ఆశించనట్లుగానే పిల్లలలో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తాము విన్న కథలను వారు ఇతరులతో పంచుకునేవారు. తర్వాత లక్ష్మిశంకర్ తన తరగతిలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తాడు. తమ పాఠ్య పుస్తకాలు తప్ప వేరే పుస్తకాల మొహం చూడని పిల్లలు వాటిని ఆసక్తిగా తిరగేయడం మొదలుపెడతారు.

పిల్లలలో మరింత క్రమశిక్షణ, పద్ధతి, జట్టుగా ఉండే గుణాలను అలవాటు చేసేందుకు లక్ష్మిశంకర్ వారిని క్రీడల వైపు ప్రోత్సహిస్తాడు.

అయితే పిల్లలను ఉతికిన బట్టలతో, తల చక్కగా దువ్వి, గోళ్లు కత్తిరించి శుభ్రంగా బడికి పంపించమని తల్లిదండ్రులను ఒప్పించడం అతనికి సవాలుగా మారుతుంది. తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పాఠశాలకు సంబంధించిన విషయం కాదని అతనిని విమర్శిస్తారు. అయితే శుభ్రంగా, పద్దతిగా ఉండడమే పిల్లలు నేర్చుకోవాల్సిన తొలిపాఠం అని లక్ష్మిశంకర్ విశ్వాసం.

అతని ఆశయాలు, ఆదర్శాలు, పిల్లలపట్ల అతని నిబద్ధత ఇతరుల కన్నా భిన్నమైనవి. తన ప్రయత్నాలలో అన్ని వర్గాల వారి నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. విద్యార్థులతో, తోటి ఉపాధ్యాయులతోనే కాదు. పిల్లల తల్లితండ్రులతో కూడా అతను ఇబ్బందులు ఎదుర్కొంటాడు. “పిల్లలకు పుస్తకాలలో ఉన్న చదువు మాత్రమే చెప్పాలి అనేది వారి ఉద్దేశం. నేను ఇచ్చే సంజాయిషీలు వారికి రుచించేవి కాదు” అంటాడు లక్ష్మిశంకర్.

తోటి ఉపాధ్యాయులు కూడా అతనిని దారితప్పిన వ్యక్తిగా భావించేవారు. “నా సహోద్యోగులు నా మీద విశ్వాసం లేదు. నా ఆలోచనలు అన్నీ ఆచరణ సాధ్యమైనవి కాదని వారి అభిప్రాయం. అంతేకాక నాకున్న అనుభవం తక్కువ. నాకు వారు బోధిస్తున్న పద్ధతులు, విధానాలపై విశ్వాసం లేదు. నేను పిల్లలను పాడు చేస్తున్నాను అనేవారు. నేను వాళ్లకి కథలు చెప్పడం తప్ప బోధన చేయననీ, ఆటలు ఆడుకోమని వారి విలువైన పఠన సమయాన్ని వృధా చేస్తున్నానని విమర్శించేవారు”

“అయితే నేను సరైన దారిలోనే ఉన్నానని నా నమ్మకం. ఈ కథలూ, ఆటలే సగం చదువు. మిగిలిన సగాన్ని ఎలా బోధించాలో నాకు తెలుసు”

“పై అధికారులకు ఫలితాలు వెంటనే కనపడాలి. లక్ష్మిశంకర్ కు అనుమతి ఇచ్చిన అధికారి కొంచెం అసహనం వ్యక్తం చేస్తాడు. అతని సమస్యలు అతనివి. అతను తన పై అధికారులకు సంజాయిషీ ఇవ్వాలి. వారి మెప్పు పొందాలంటే ఫలితాలు తొందరగా చూపించాలి. నాకు ఎంత మద్దతు ఇవ్వాలనుకున్నా అతని పరిమితులు అతనికి ఉన్నాయి”

ఈ సమస్యలు వేటికీ వెరవకుండా లక్ష్మిశంకర్ మొదటి మూడునెలలు ఇదే పద్ధతి కొనసాగిస్తాడు. మూడవ నెలలో చిన్నగా తరగతి పాఠ్య ప్రణాళిక పైన దృష్టి పెడతాడు. పిల్లలు అన్ని సబ్జెక్టు లలో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కో సబ్జెక్టు కు ఒక్కో పద్ధతి అవలంభిస్తాడు. భాషా  నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు రకరకాల కథల పుస్తకాల నుండి డిక్టేషన్ ఇవ్వడం; చరిత్రను కథల రూపంలో చెప్పడం; బట్టీ చదువులు కాకుండా నేర్పినవి గుర్తు పెట్టుకునేందుకు వాటిని నాటకాల రూపంలో ప్రదర్శించడం; పదాలతో చిన్న చిన్న ఆటలు ఆడించడం ద్వారా గ్రామర్ నేర్పించడం; పజిల్స్, పొదుపు కథల ద్వారా విషయాలను పరిచయం చేయడం; క్షేత్ర పర్యటనలు, సందర్శనల ద్వారా భూగోళ శాస్త్రం, జీవశాస్త్రాల పరిచయం వంటివి లక్ష్మిశంకర్ అవలంభించిన విధానాలు.

ఏడాది గడిచేకొద్దీ లక్ష్మిశంకర్ ఇంకా ఎన్నో కొత్త పద్ధతులను ప్రయత్నిస్తాడు. టెర్మినల్ పరీక్షలలో అతని విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. తోటి ఉపాధ్యాయులు కూడా మార్పును గమనిస్తారు కానీ ఇంకా వారి సందేహాలు వారికున్నాయి. లక్ష్మిశంకర్ కు డబ్బు అవసరం లేదనీ, అతని ఆలోచనలన్నీ అతను చదివే ఇంగ్లీష్ పుస్తకాలలోవి  అనీ, ఇటువంటి ప్రయోగాలు చేసేందుకు అతనికి తగిన తీరిక, సమయం ఉన్నాయి కాబట్టి అతను ఇవన్నీ చేయగలుగుతున్నాడనీ వాళ్ళ అభిప్రాయం. అయితే లక్ష్మిశంకర్ అందుకు అంగీకరించడు. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రానే విజయం రాదని చెబుతాడు. అది కేవలం ఒక సాకు మాత్రమే అనీ, కొత్త మార్గాన్ని అవలంభించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అనీ అంటాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తికి మార్గం తప్పకుండా దొరుకుతుందని అంటాడు.

ఏడాది చివరికి వచ్చేసరికి విద్యాశాఖాధికారి నాలుగవ తరగతి పిల్లలలో మార్పును చూడగలుగుతాడు. వారి మార్కులలోనే కాదు, వారి ప్రవర్తన, శుభ్రత వంటి అంశాలలో కూడా. మొత్తం తరగతిని తర్వాత తరగతికి ప్రమోట్ చేయమంటాడు. అయితే లక్ష్మిశంకర్ మాత్రం అందుకు ఒప్పుకోడు. కొంతమంది పిల్లలలో ఇంకా తాను ఆశించిన మార్పు రాలేదనీ, అందుకు కారణం వారికి చదువు రాకపోవడం కాదనీ, వారికి వచ్చే చదువును పాఠశాల బోధించలేకపోవడమే అనీ అంటాడు. వారికి ఆసక్తి ఉన్న విషయాలను పాఠశాల బోధించడం లేదు అని అతని అభిప్రాయం.

ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఏటా ఇచ్చే 125 రూపాయిల ప్రోత్సాహక బహుమతిని ఆ ఏడాది పాఠశాల లైబ్రరీ కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తారు.

పాఠశాల వార్షికోత్సవంలో విద్యాశాఖాధికారి ఇలా అంటాడు. “ఈ టీచర్ గతసంవత్సరం తన అభ్యర్ధనతో నా దగ్గరకి వచ్చినప్పుడు, నేను ఇతనిని ఒక మూర్ఖుడు అనుకున్నాను. చాలా మందికి కొత్త ఆలోచనలు ఉంటాయి కానీ అవి ఆచరణలో పెట్టాల్సి వచ్చేసరికి అమలు చేయలేక పారిపోతారు. ఆ ఉద్దేశంతోనే నేను అతనికి అనుమతి ఇచ్చాను తప్ప అతను చెప్పినవాటిపై నమ్మకంతో కాదు. అయితే అతను సాధించిన విజయం చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అతను నా ఆలోచనలను మార్చాడు.”

మన విద్యావ్యవస్థ ఎలా ఉండాలి, మన పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి అని మనం కలలు కంటామో వాటికి ప్రతిరూపమే ఈ దివాస్వప్న. ఆ కలలను నిజంచేసి చూపించిన ఒక ఉపాధ్యాయుడి కథ. గత శతాబ్ద కాలంలో విద్యా బోధనా విధానాలపై వచ్చిన పుస్తకాలలో దివాస్వప్న ఎప్పడూ ముందు స్థానంలో నిలుస్తుంది. 1931 లో గుజరాతీ భాషలో మొదటి సారి ప్రచురించబడిన ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ 11 భారతీయ భాషలలోకి అనువాదం చేసి ప్రచురించింది.

Post 34

Based on a piece by Mamata